అఖిలేష్, రాహుల్ జోడిపై పాట
న్యూఢిల్లీ:
భారతీయులకు సినిమాలు, పాటలంటే సహజంగానే ఇష్టం. ఆ ఇష్టాన్ని తమవైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాటలనే ఆయుధంగా చేసుకోని ఎన్నికల ప్రచారాన్ని అదరగొడుతున్నారు. ‘యే దిల్ హై ముష్కిల్’లో హిట్ పాటలు పాడిన అమిత్ మిశ్రాతో ఎన్నికల ప్రచారం టైటిల్ సాంగ్ ‘యే హు నా బాత్’ పాడించారు.
‘తను వెడ్స్ మను’ సినిమాకు పాటలు రాసిన రాజశేఖర్‌తో ఈ టైటిల్ సాంగ్‌ను రాయించారు. ఎందుకు వీరిద్దరు కలిశారు? వీళ్లను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షానికి ఎందుకు కష్టం అంటూ సాగే వీడియో పాటలో ఒకే వేదికపై రాహుల్, అఖిలేష్ చేతులు కలుపుకోవడం, ప్రజలకు అభివాదం చేయడం, సభలకు హాజరైన అశేష జనాన్ని ఉద్దేశించి ప్రసంగించడం లాంటి చిత్రాలను జోడించారు. సల్మాన్ ఖాన్ నటించిన ‘సుల్తాన్’ సినిమాలోని ‘బేబీ కో బస్ పసంద్ హై’ పాటను స్ఫూర్తిగా తీసుకొని రాసిన మరో పాట‘సైకిల్ కో హాత్ పసంద్ హై, యూపీ కో ఏ సాత్ పసంద్ హై’ను కూడా ఎన్నికల ప్రచారంలో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు పాటలు యూట్యూబ్‌లో చక్కెర్లు కొడుతున్నాయి.
ఇంతకుముందు ‘యూపీకో అఖిలేష్ పసంద్ హై’ అంటూ పాట కొనసాగగా ఇప్పుడు దానికి రాహుల్ కాంబినేషన్‌ను కలిపారు. మొదటి నుంచి కూడా సమాజ్‌వాది పార్టీ పాటల ద్వారా ఎన్నికల ప్రచారం సాగించేది. గతంలో ‘మన్‌సే హై ములాయం’ అనే పాట బహుళ ప్రాచుర్యం పొందింది. ‘వియ్ డిడంట్ స్టార్ట్ ది ఫైర్’ అనే బిల్లి జోయల్ పాడిన పాటను స్ఫూర్తిగా తీసుకొని ఆ పాటను రాశారు.