యూపీకి దత్తపుత్రుడు అక్కర్లేదు
► ఇక్కడ సమర్థులైన యువకులు ఉన్నారు
► బయటి వారి సహాయం వారికి అక్కర్లేదు
► ప్రధాని మోదీపై ప్రియాంకా వాద్రా విమర్శలు
► రాహుల్‌తో కలసి రాయ్‌బరేలీలో ప్రచారం
రాయ్‌బరేలీ: ఉత్తరప్రదేశ్‌కు దత్తపుత్రుని అవసరం లేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకాగాంధీ వాద్రా స్పష్టం చేశారు. యూపీలో చాలా మంది సమర్థులైన యువకులు ఉన్నారని, బయటి నుంచి వచ్చిన నాయకుడు యూపీకి అవసరం లేదని పేర్కొన్నారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లో సోదరుడు రాహుల్‌గాంధీతో కలసి తన తల్లి ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ప్రియాంక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యూపీ ఎన్నికల సందర్భంగా తన తొలి ప్రసంగంలో ఆమె కొద్దిసేపే మాట్లాడినా.. అందరినీ ఆకట్టుకున్నారు. తాను ఉత్తరప్రదేశ్‌కు దత్త పుత్రుడినని ప్రధాని మోదీ ప్రకటించుకోవడంపై ప్రియాంక విమర్శలు గుప్పించారు.
‘‘గతంలో ప్రధాని మోదీ వారణాసి తనను దత్తత తీసుకుందని, వారణాసికి తాను దత్త పుత్రుడినని చెప్పారు. వారణాసిని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. నా ఉద్దేశం ప్రకారం.. బయటి నుంచి వచ్చిన నాయకుడు యూపీకి అవసరమా’’ అని సభికులను ప్రియాంక ప్రశ్నించారు. ‘‘మోదీజీ.. బయటి వారిని దత్తత తీసుకోవాల్సిన పరిస్థితి యూపీకి ఉందా..? ఇక్కడ సమర్థులైన యువకులు లేరా? అలాంటి సామర్థ్యం కలిగిన రాహుల్, అఖిలేశ్ మీ ముందు ఉన్నారు. వారి హృదయంలోనూ.. ఆలోచనల్లోనూ యూపీయే ఉంది.
యూపీలోని ప్రతి ఒక్క యువకుడు రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడి పనిచేయగలరు. ఇక్కడ ప్రతి వ్యక్తి ఒక నాయకుడిగా ఎదగగలరు. ఇదే రాహుల్, అఖిలేశ్ కోరుకుంటున్నారు’’ అని పేర్కొన్నారు. ఇప్పటికే మోదీ అనేక శుష్క వాగ్దానాలు చేశారని, చాలా సంవత్సరాలు గడిచిపోయాయని, వీటి గురించి వారణాసి ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. మూడేళ్లుగా ప్రధానిగా ఉన్నా మోదీ సొంత నియోజకవర్గం వారణాసికి ఏమీ చేయలేదని, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఏం చేశారో అమేథీ ప్రజలను అడిగితే ఇప్పటికీ చెపుతారని వివరించారు.
మహిళలను మోదీ సోదరీమణులు, అమ్మలు అని సంబోధించడంపై ప్రియాంక స్పందిస్తూ.. వారిని బంధుత్వంతో దగ్గర చేసుకోవాలని ప్రయత్నించక్కర్లేదని, వారికి ఏం కావాలో తెలియాలంటే వారి కళ్లల్లో చూస్తే చాలని పేర్కొన్నారు. నోట్ల రద్దు నిర్ణయంపై ఆమె స్పందిస్తూ.. పేద మహిళల కష్టం వృ«థాగా మారిపోయిందని, డబ్బుల కోసం వారు బ్యాంకుల వద్ద క్యూ కట్టాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్‌పీ కూటమికి ఘన విజయం కట్టబెట్టాలని, ప్రజల కోసం ఎవరు పనిచేస్తారో గుర్తించి వారికే ఓట్లేయాలని ప్రియాంక ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఆయన షారూక్ కాదు.. గబ్బర్‌సింగ్: రాహుల్
కాంగ్రెస్–ఎస్‌పీ బంధాన్ని సినిమాతో పోలుస్తూ మోదీ విమర్శలు చేయడంతో ఆయనకు అదే తరహాలో బదులిచ్చారు రాహుల్. బాలీవుడ్ సూపర్‌హిట్ మూవీ దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాలో హీరో షారుఖ్ మాదిరి మోదీ అచ్చేదిన్ వస్తాయని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు ఆయన షోలే సినిమాలో విలన్ గబ్బర్‌సింగ్‌లా మారారన్నారు. యూపీ అభివృద్ధిపై శూన్య వాగ్దానాలు చేస్తూ.. తనను తాను హీరోగా మోదీ భ్రమపడుతున్నారన్నారు.
మోదీ ఎక్కడికి వెళితే అక్కడ సంబంధాలు కలుపుకుంటారని, వారణాసి వెళితే.. గంగ తన తల్లి అని, తాను వారణాసికి కుమారుడినని చెపుతారని, 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వారణాసిని మారుస్తానని హామీ ఇచ్చారని, క్లీన్ గంగ, క్లీన్ ఘాట్స్, రింగ్‌రోడ్, ఫ్రీ వైఫై, భోజ్‌పురి ఫిల్మ్‌సిటీ ఇలా అనేక హామీలు ఇచ్చారని, కానీ తన తల్లికి ఇచ్చిన ఒక్క వాగ్దానాన్ని కూడా మోదీ పూర్తి చేయలేదని విమర్శించారు.