రేపే తుది దశ పోలింగ్
యూపీలో 40, మణిపూర్‌లో 22 స్థానాలకు
లక్నో/ఇంఫాల్: హోరెత్తించిన మైకులు... ప్రత్యర్థులే లక్ష్యంగా ఎక్కుపెట్టిన మాటల తూటాలు... వ్యూహాలు... ప్రతివ్యూహాలతో రెండు నెలలకు పైగా వాడి వేడిగా సాగిన ఉత్తరప్రదేశ్, మణిపూర్ శాసనసభ ఎన్నికల ప్రచారానికి సోమవారంతో తెరపడింది. యూపీలో ఏడు దశల్లో, మణిపూర్‌లో రెండు దశల్లో పోలింగ్ జరుగుతోంది. రెండు రాష్ట్రాల్లో బుధవారం జరగనున్న ఆఖరి దశ పోలింగ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
ఉత్తర యూపీలోని మొత్తం 40 స్థానాలకు, మణిపూర్‌లోని 22 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. వారణాసిలో కాశీ విశ్వనాథుడు, కాళభైరవ తదితర ఆలయాల సందర్శన, రోడ్‌షోలు, ర్యాలీలు నిర్వహించిన మోదీ... ఎన్నో ప్రజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు, బీజేపీ వెటరన్ నాయకులు వారణాసికి క్యూకట్టారు. ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలు మోదీకి దీటుగా ఓటర్లను ఆకర్షించేందుకు నియోజకవర్గాల్లో ముమ్మర ప్రచారం సాగించారు. ఈనెల 11న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.