ఆయనవి చిన్న పిల్లల చేష్టలు
కావాలంటే కంప్యూటర్‌లో శోధించండి..తనపైనే ఎక్కువ జోకులు
► యూపీ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌పై ప్రధాని మోదీ పరోక్ష విసుర్లు
బిజ్నూర్: మాజీ ప్రధాని మన్మోహన్ ను ఉద్దేశించి చేసిన రెయిన్ కోట్ వ్యాఖ్యలపై దుమారం రేగుతుండగానే.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ జోకులు పేల్చారు. ‘కాంగ్రెస్‌లో ఓ నాయకుడు ఉన్నాడు. ఆయన చర్యలన్నీ చిన్న పిల్లల చేష్టలే. మీరు కంప్యూటర్‌లో శోధిస్తే.. ఆయనపై ఉన్నన్ని జోకులు మరే నేతపైనా మనకు కనిపించవు’ అని రాహుల్‌పై పరోక్షంగా వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఆయనతో జతకట్టిన అఖిలేశ్ జ్ఞానం పైనా అనుమానాలు కలుగుతున్నాయంటూ ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా శుక్రవారం బిజ్నూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్–సమాజ్‌వాదీ పార్టీ పొత్తుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ‘
ఆ రెండు కుటుంబాలు విడిగా ఉన్నప్పుడే రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేశాయి. ఇప్పుడా రెండు చేతులు కలిపాయి. యూపీని కాపాడాలంటే ఆ రెండు కుటుంబాలను దూరం పెట్టాలి’ అని ఎస్పీ, కాంగ్రెస్‌లను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. యూపీ సీఎం అఖిలేశ్‌యాదవ్ గురించి తనకు పెద్దగా తెలియదని, కొన్ని సమావేశాల్లో మాత్రమే కలిశానని, ఆయన అందించిన నివేదికలు చూసిన తర్వాత చదువుకున్న యువకుడిగా.. కొత్త విషయాలు తెలుసుకునే ఔత్సాహికునిగా కనిపించారని.. అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకులే దూరంగా ఉండే నేతతో జతకట్టడం చూస్తోంటే ఆయన జ్ఞానంపైనే అనుమానం కలుగుతోందన్నారు. కాంగ్రెస్, ఎస్‌పీలు ప్రభుత్వాలను నడిపించడం తమ కుటుంబ హక్కుగా భావిస్తున్నాయని, సామాన్యులు పదవులు దక్కించుకుంటే చూసి ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు.
శనివారం జరగనున్న తొలి విడత, 15న జరగనున్న రెండో విడత ఎన్నికల్లో జాట్ సామాజికవర్గం ఓట్లే కీలకం కావడంతో వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు మోదీ. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే జాట్ నాయకుడు చరణ్‌సింగ్ పేరిట రైతు సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని, చెరకు రైతుల బకాయిలు చెల్లిస్తామని, చిన్న, మధ్య తరగతి రైతుల రుణాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.
దేవభూమి పవిత్రతను దెబ్బ తీశారు
హరిద్వార్: ఉత్తరాఖండ్‌లోనూ మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హరిద్వార్‌లోని రిషికుల్ మైదాన్ లో బీజేపీ విజయ్ సంకల్ప్ ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవభూమి పవిత్రతను దెబ్బ తీసిన ప్రభుత్వానికి చరమగీతం పాడి.. అటల్‌బిహారీ వాజ్‌పేయి కలలుగన్న ప్రభుత్వానికి పట్టం కట్టాలని ఉత్తరాఖండ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఉత్తరాఖండ్ ఏర్ప డి పదహారేళ్లు అయ్యిందని, 16 ఏళ్ల వయసు ప్రతి వ్యక్తి జీవితంలోనూ కీలకమైన సమయమని, రానున్న ఐదేళ్లు రాష్ట్రం భవిష్యత్తును నిర్ణయించే కాలమని చెప్పారు. ఉత్తరాఖండ్‌లో అవినీతి కోర్టుల్లో నిరూపణ కాకపోయి నా.. దేశమంతా టీవీల్లో చూసిందని చెప్పారు. ఉత్తరాఖండ్ గౌరవాన్ని కాపాడేందుకు.. వాజ్‌పేయి దార్శనికతను నిజం చేసేందుకు బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేయాలని కోరారు.