varanasi rally
-
రాహుల్ - అఖిలేష్ ర్యాలీకి చుక్కెదురు
మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసిలో రోడ్ షో చేయాలనుకున్న రాహుల్ గాంధీ - అఖిలేష్ యాదవ్ జోడీకి మరోసారి చుక్కెదురైంది. వాళ్లు పెట్టుకున్న ముహూర్తం బాగోలేదేమో గానీ.. వారణాసి మునిసిపల్ యంత్రాంగం వాళ్ల ర్యాలీకి అనుమతి నిరాకరించింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీ నేతలిద్దరూ కలిసి వారణాసిలో భారీగా రోడ్ షో చేయాలని భావించారు. అయితే, సరిగ్గా రవిదాస్ జయంతి రోజునే వాళ్లు ర్యాలీ పెట్టుకోవడం, దానికి వారణాసిలో భారీ మొత్తంలో ప్రజలు వచ్చే అవకాశం ఉండటంతో.. ఇలాంటి సమయంలో ర్యాలీకి అనుమతిస్తే అది ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా ఉంటుందని వారణాసి మునిసిపల్ అధికారులు తెలిపారు. దాంతో రాహుల్ - అఖిలేష్ ర్యాలీకి అనుమతి నిరాకరించారు. వాస్తవానికి వారణాసిలో ర్యాలీకి ఎటూ అనుమతి రాదని భావించారో ఏమో గానీ, అఖిలేష్ యాదవ్ ఇదేరోజు బరేలీ, రాంపూర్ ప్రాంతాల్లో కూడా ర్యాలీలు చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ప్రధానంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో అడుగుపెట్టేందుకు సమాజ్‌వాదీ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. అక్కడ ఈ వారంలో అఖిలేష్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాహుల్ - అఖిలేష్ కలిసి లక్నో, ఆగ్రాలలో రెండు రోడ్ షోలు నిర్వహించారు. -
సర్జికల్ స్ట్రైక్స్‌పై మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడులపై ప్రధాని నరేంద్రమోదీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వాటిని ఆయన 'చిన్న దీపావళి'గా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ''మనం సెప్టెంబర్ 29వ తేదీన చిన్న దీపావళి సంబరాలు చేసుకున్నాం'' అన్నారు. సరిగ్గా అదేరోజు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద లాంచ్ప్యాడ్లపై భారత సైన్యం విరుచుకుపడి పెద్దసంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చింది. మన సైన్యం సరిహద్దుల్లో తమ ధీరత్వాన్ని ప్రదర్శించినప్పుడు వారణాసి మొత్తం ఆనందం వెల్లువెత్తందని, అందుకు అందరికీ కృతజ్ఞతలని ఆయన అన్నారు. సైన్యం చూపించిన ధైర్యసాహసాలకు దేశం మొత్తం అభినందనలతో పాటు అపార మద్దతు కూడా తెలిపిందని, జాతికి వాళ్లు చేస్తున్న సేవలను కొనియాడిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. జవాన్లకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేయాలని దేశవాసులను ఆయన కోరారు. రోజులో ప్రతి నిమిషం మనం వారిపట్ల గర్వంగా ఉన్నామన్న విషయాన్ని తెలియజేయాలన్నారు. వాళ్లు పగలు, రాత్రి మనకోసం పోరాడుతున్నారు కాబట్టి దీపావళి రోజున మన భద్రతాదళాలకు సందేశం పంపుదామన్నారు. రెండేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 80 స్థానాలకు గాను 71 స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. సుదీర్ఘ కాలం తర్వాత మరోసారి ఆ రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తోంది. గత 15 ఏళ్లుగా సమాజ్‌వాదీ పార్టీయే అక్కడ రాజ్యమేలుతోంది. -
ఐసీయూలో సోనియా గాంధీ!
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు! మంగళవారం నాడు వారణాసి రోడ్డుషోలో పాల్గొన్న తర్వాత మధ్యలోనే వెనుదిరిగిన సోనియా ప్రస్తుతం న్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. తొలుత ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స చేయించగా, అక్కడి నుంచి ఎస్ఆర్జీహెచ్కి తరలించారు. ఇమె ఇప్పటికీ డీహైడ్రేషన్, ఎలక్ట్రొలైట్ల అసమతౌల్యంతో బాధపడుతున్నారు. వారణాసి ర్యాలీలో పాల్గొన్న సమయంలో సోనియాగాంధీ పడిపోవడంతో ఆమె మోచేయి కూడా విరిగినట్లు చెబుతున్నారు. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఆమెను సర్ గంగారాం ఆస్పత్రికి తీసుకొచ్చారని, పల్మనాలజిస్టు డాక్టర్ అరూప్ బసు, ఆయన బృందం ఆమెకు చికిత్స చేస్తున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని, పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆస్పత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో చెప్పారు. అయితే, ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న సోనియాగాంధీ ఈ వారంలో మాత్రం ఆస్పత్రి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. ప్రత్యేక విమానంలో ఆమెను వారణాసి నుంచి ఢిల్లీకి తరలించినప్పటి కంటే ఇప్పుడు ఆమె పరిస్థితి చాలా మెరుగుపడిందని, ఆర్మీ ఆస్పత్రికి తీసుకొచ్చేసరికి ఆమె బాగా మత్తుగా ఉన్నారని.. అసలు మాట కూడా రాలేదని తెలిసింది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ కూడా సోనియా వెంటే ఉంటున్నారు. అల్లుడు రాబర్ట్ వాద్రా కూడా ఆస్పత్రికి వచ్చి అత్తను పలకరించి వెళ్లారు.