ఐసీయూలో సోనియా గాంధీ!
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు! మంగళవారం నాడు వారణాసి రోడ్డుషోలో పాల్గొన్న తర్వాత మధ్యలోనే వెనుదిరిగిన సోనియా ప్రస్తుతం న్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. తొలుత ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స చేయించగా, అక్కడి నుంచి ఎస్ఆర్‌జీహెచ్‌కి తరలించారు. ఇమె ఇప్పటికీ డీహైడ్రేషన్, ఎలక్ట్రొలైట్‌ల అసమతౌల్యంతో బాధపడుతున్నారు.
వారణాసి ర్యాలీలో పాల్గొన్న సమయంలో సోనియాగాంధీ పడిపోవడంతో ఆమె మోచేయి కూడా విరిగినట్లు చెబుతున్నారు. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఆమెను సర్ గంగారాం ఆస్పత్రికి తీసుకొచ్చారని, పల్మనాలజిస్టు డాక్టర్ అరూప్ బసు, ఆయన బృందం ఆమెకు చికిత్స చేస్తున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని, పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆస్పత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో చెప్పారు.
అయితే, ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న సోనియాగాంధీ ఈ వారంలో మాత్రం ఆస్పత్రి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. ప్రత్యేక విమానంలో ఆమెను వారణాసి నుంచి ఢిల్లీకి తరలించినప్పటి కంటే ఇప్పుడు ఆమె పరిస్థితి చాలా మెరుగుపడిందని, ఆర్మీ ఆస్పత్రికి తీసుకొచ్చేసరికి ఆమె బాగా మత్తుగా ఉన్నారని.. అసలు మాట కూడా రాలేదని తెలిసింది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ కూడా సోనియా వెంటే ఉంటున్నారు. అల్లుడు రాబర్ట్ వాద్రా కూడా ఆస్పత్రికి వచ్చి అత్తను పలకరించి వెళ్లారు.