ఇంకా ఆస్పత్రిలోనే సోనియాగాంధీ
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆమెకు జ్వరం ఎక్కువగా ఉండటంతో మరికొన్నాళ్ల పాటు ఆమెను ఆస్పత్రిలోనే ఉంచుతామని వైద్యులు చెప్పారు. వారణాసిలో రోడ్‌షో నిర్వహించిన అనంతరం ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. అదేసమయంలో ఆమె కింద పడటంతో భుజానికి కూడా గాయమైంది. భుజం గాయంతో పాటు జ్వరం, డీహైడ్రేషన్ తదితర సమస్యలతో ఆమెను తొలుత ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రికి.. అక్కడి నుంచి సర్ గంగారామ్ ఆస్పత్రికి తరలించారు.
శరీరంలో ఇన్ఫెక్షన్ కారణంగా జ్వరం వచ్చిందని, అందువల్ల మరికొన్నాళ్ల పాటు సోనియాగాంధీ ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని, ఆమెకు ప్రస్తుతం యాంటీబయాటిక్స్ ఇస్తున్నామని ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ డీఎస్ రాణా తెలిపారు. ఆస్పత్రిలోని పల్మనాలజీ, చెస్ట్ మెడిసిన్ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అరూప్ బసు నేతృత్వంలోని బృందం ఆమెకు చికిత్సలు అందిస్తోంది. ఆగస్టు మూడో తేదీన సోనియాగాంధీ ఎడమ భుజానికి శస్త్రచికిత్స జరిగింది. దాన్నుంచి ఆమె కోలుకున్నట్లు వైద్యులు చెప్పారు.