రాజకీయాల్లో ఉత్తర పర్వం | Rasheed Kidwai Article On Uttar Pradesh Politics | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లో ఉత్తర పర్వం

Published Fri, Dec 3 2021 12:18 AM | Last Updated on Fri, Dec 3 2021 12:18 AM

Rasheed Kidwai Article On Uttar Pradesh Politics - Sakshi

ఢిల్లీ పీఠానికి మార్గం లక్నో అని చెబుతుంటారు. దేశంలో అత్యధిక నియోజక వర్గాలు కలిగిన ఉత్తర ప్రదేశ్‌లో జెండా పాతడమంటే కేంద్రంలో అధికారానికి దగ్గరవ్వడమే. అయితే, ఈ రాష్ట్రంలో స్వాతంత్య్ర కాలం నుంచీ రాజకీయ అస్థిరతే. ఎన్నోమార్లు రాష్ట్రపతి పాలన విధించిన సందర్భాలున్నాయి. పెద్ద పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ తరఫున ఐదేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న ముఖ్యమంత్రి ఇంతవరకూ లేకపోవడం దీనికి బలమైన నిదర్శనం.

అయితే, యోగి ఆదిత్యనాథ్‌ ఇంకొన్ని నెలల్లో ఈ రికార్డు సృష్టించ నున్నారు. ఇంతే విశేషం కాదు, రానున్న శాసనసభ ఎన్నికల్లో బీజేపీని తిరిగి అధికారంలోకి తెస్తే గనక యోగి భవిష్యత్తులో ప్రధానమంత్రి పదవి రేసులో కూడా ఉంటారు.

ఉత్తర ప్రదేశ్‌లో పార్టీ పునాదులను పటిష్ఠపరిచేందుకు బీజేపీ 2017 నుంచి గట్టి ప్రయత్నమే చేస్తోంది. కానీ రైతు ఆందోళనల రూపంలో ఇప్పుడు పశ్చిమ యూపీలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు నష్టం చేస్తాయని భావిస్తున్న మూడు వ్యవ సాయ చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ బీజేపీకి ఈ ప్రాంతంలో అంత అనుకూలమైన వాతావరణమైతే లేదు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ ప్రతికూల పరిస్థితులన్నింటినీ తట్టుకుని మరోసారి విజయం సాధించగలరా? భావి భారత ప్రధాని పదవికి తానూ పోటీదారునే అని నిరూపించుకోగలరా?

ఉత్తరప్రదేశ్‌లో ఐదేళ్ల పరిపాలన కాలం పూర్తి చేసుకున్న తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ ఇంకొన్ని నెలల్లో రికార్డు సృష్టించనున్నారు. దేశంలోనే అత్యధిక జనాభా, రాజకీయ ప్రాము ఖ్యత కలిగిన రాష్ట్రంలో ఈ ఘనత సాధించడం ఆషామాషీ వ్యవహారం కాదు. మాయావతి (బీఎస్పీ), అఖిలేశ్‌ యాదవ్‌(ఎస్పీ) ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నారు.  

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఉత్తర ప్రదేశ్‌ఎన్నికల్లో 49 ఏళ్ల యోగి ఆదిత్యనాథ్‌ ఇబ్బందులేవీ లేకుండా గెలిచేస్తే... నరేంద్ర మోదీ తరువాత ప్రధాని పదవికి ఒక పోటీదారు అవుతారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఎనభై లోక్‌సభ స్థానాలున్న యూపీలో 2019 నాటి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 62 సీట్లలో విజయం సాధించింది. 2017 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాల్లో 312 గెలుచుకుని రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. 

2024 లేదా 2025లో (మోదీకి  75 ఏళ్ల వయసు వచ్చినప్పుడు) ప్రధాని పదవికి వారసుడు ప్రస్తుత హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్న అంచనా బీజేపీలో ఉంది. అయితే రెండోస్థానంలో ఉండి... ప్రధానిగా మారిన వారు దేశంలో తక్కువ మందేనన్నది చరిత్ర చెప్పే నిజం. ఇప్పటివరకూ సర్దార్‌ వల్లభ్‌భాయ్‌  పటేల్, మోరార్జీ దేశాయి, చరణ్‌ సింగ్, జగ్జీవన్‌ రామ్, వైబీ చవాన్, దేవీలాల్, అద్వానీ వంటి ఏడు గురు ఉప ప్రధానులను చూడగా ఇందులో మొరార్జీ, చరణ్‌సింగ్‌ మాత్రమే ప్రధానులు కాగలిగారు.

2012 నాటికి యూపీ సీఎంగా మాయావతి ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె మాజీ సీఎం జీబీ పంత్, కమలాపతి త్రిపాఠీ, సంపూర్ణానంద్, సుచేతా కృపలానీ, ఎన్‌డీ తివారీ, ములాయం సింగ్, కళ్యాణ్‌ సింగ్‌ మీద ఆధిక్యత సాధించారు. యూపీలో నిరాటంకంగా ఐదేళ్లు పాలించిన తొలి సీఎం కూడా ఆమే. 

స్వాతంత్య్రం రాకముందే 1937లో యునైటెడ్‌ ప్రావిన్స్‌ ముఖ్య మంత్రిగా పదవి చేపట్టిన స్వాతంత్య్ర సమరయోధుడు గోవింద్‌ బల్లభ్‌ పంత్‌ స్వాతంత్య్రం తరువాత కూడా రెండుసార్లు అదే పదవిలో కొనసాగారు. స్వాతంత్య్రానికి ముందు రెండు సార్లు, తరువాత రెండు సారు సీఎంగా ఉన్న చరిత్ర ఆయనది. అయితే 1955లో దేశ హోం మంత్రి పదవి ఆయన చేపట్టిన తరువాత సంపూర్ణానంద్‌కు యూపీ పగ్గాలు దక్కాయి. బాబూజీ అని పిలుచుకునే సంపూర్ణానంద్‌ 1954 డిసెంబరు 28 నుంచి 1960 డిసెంబరు ఏడు వరకూ సీఎంగా కొనసాగారు. జ్యోతిషంపై నమ్మకం ఎక్కువగా ఉన్న సంపూర్ణా నంద్‌ చివరకు పార్టీ అంత ర్గత వివాదాల కార ణంగా 

పదవి వదులుకోవాల్సి వచ్చింది. కమలాపతి త్రిపాఠి, చంద్ర భానూ ప్రతాప్‌ రాజేసిన వివాదాల పుణ్యమా అని సంపూ ర్ణానంద్‌ 1960లో గవర్నర్‌గా జైపూర్‌ రాజ్‌భవన్‌కు వెళ్లాల్సి వచ్చింది. సంపూర్ణానంద్‌ స్థానంలో వచ్చిన చంద్రభానుకూ ఇందిరా గాంధీకీ మధ్య అంత సఖ్యత ఉండేది కాదు. కమలాపతి త్రిపాఠీ, హేమ్‌వతీ నందన్‌ బహుగుణా గిల్లికజ్జాల పుణ్యమా అని యూపీలో తొలిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటైంది. 1967లో చరణ్‌ సింగ్‌ సీఎం అయ్యారు. 1962–67 మధ్య యూపీలో చాలామంది సీఎంలు వచ్చారు. పోయారు కూడా.

సుచేతా కృపలానీ 1967 వరకూ యూపీ కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కష్టపడాల్సి వచ్చింది. చంద్రభాను ముఖ్యమంతి అయినప్పటికీ ఆయన ప్రభుత్వం 18 రోజులు మాత్రమే మనగలిగింది. కొద్దికాలం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన నడిచిన తరువాత మరోసారి చంద్రభాను సీఎం అయ్యారు. ఎనిమిది నెలల తరువాత మరోసారి చరణ్‌సింగ్‌ నేతృత్వంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటైంది. 1970లు మొత్తం చరణ్‌ సింగ్, నారాయణ్‌సింగ్, హెచ్‌ఎన్‌ బహుగుణ, ఎన్‌డీ తివారీ, రామ్‌ నరేశ్‌ యాదవ్, బనారసీ దాస్‌ ప్రభుత్వాలు నడిపినా... అవి ఎక్కువ కాలం మనలేదు. 

1980లో కాంగ్రెస్‌ విజయం సాధించిన తరువాత ఇందిరాగాంధీ తనయుడు సంజయ్‌గాంధీ ఉత్తర ప్రదేశ్‌ సీఎంగా వీపీ సింగ్‌ను ఎంపిక చేశారు. అయితే సంజయ్‌ మరణం... బహుగుణతో ఇందిరకు ఉన్న విభేదాల కారణంగా వీపీ సింగ్‌కు 1982లో కేంద్ర కేబినెట్‌కు స్థానం లభించగా... ఈ సమయంలోనే శ్రీపత్‌ మిశ్రా, ఎన్‌డీ తివారీ వంటి వారి ఉత్థాన పతనాలు రెండూ నమోదయ్యాయి. 

కాంగ్రెస్‌తో కుదిరిన ఒక ఒప్పందం సాయంతో జనతాదళ్‌ తరఫున యూపీ సీఎం అయ్యారు ములాయం సింగ్‌ (1989–1991). అయితే 1991 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో కళ్యాణ్‌సింగ్‌ గద్దెనెక్కినా 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం నేప థ్యంలో ఆయన పదవీకాలం ఒక ఏడాది 165 రోజులకు పరిమిత మైంది. 1993 డిసెంబర్‌ వరకూ రాష్ట్రపతి పాలన కొనసాగిన తరు వాత అధికార పంపిణీ సూత్రంపై చరిత్రలో మొదటిసారి ములాయం, మాయావతిల సంయుక్త ప్రభుత్వం ఏర్పాటైంది. ములాయం డిసెం బర్‌ 1993 నుంచి జూన్‌ 1995 వరకూ పదవిలో కొనసాగారు. 

దళితులు, మైనార్టీలు, వెనుకబడిన తరగతుల వారందరినీ ఒక ఛత్రం కిందకు తేవాలని కాన్షీరామ్‌ నేతృత్వంలో జరిగిన ఒక ప్రయత్నం అనతికాలంలోనే నీరుగారిపోయింది. ములాయం తరువాత అధికార పంపిణీ ఒప్పందంలో భాగంగా మాయావతి పగ్గాలు చేపట్టగా... పదవీ కాలం సగం కూడా పూర్తికాక ముందే ములాయం తెగతెంపులకు సిద్ధమయ్యారు.

కాన్షీరామ్, మాయావతి బీజేపీ సాయంతో ములాయం వర్గం ఎమ్మెల్యేలను తమవైపు తిప్పు కునే ప్రయత్నం చేశారు. మాయావతి తన మద్దతుదారులైన ఎమ్మె ల్యేలతో కలిసి లక్నోలోని గెస్ట్‌హౌస్‌లో మకాం వేసి... బల పరీక్ష పిలుపు కోసం వేచి చూస్తూ ఉన్న సమయంలో ములాయం తన మద్దతుదారులతో గెస్ట్‌హౌస్‌పై దాడి చేయడం, బీఎస్పీ ఎమ్మెల్యేలను కిడ్నాప్‌ చేసినట్లు ఆరోపణలు రావడం తెలిసిందే.

ఈ కల్లోల పరిస్థి తుల్లో మరోసారి రాష్ట్రపతి పాలన విధించారు. ఆ తరువాతి కాలంలో మాయావతి బీజేపీతో జట్టుకట్టి రెండుసార్లు సీఎం అయ్యారు కూడా. ప్రతిసారీ పదవీకాలం కొంత కాలమే ఉండింది. ములాయం, కళ్యాణ్‌ సింగ్, ఒక్కరోజు ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందిన జగదంబికా పాల్‌ అలా వచ్చారు.. ఇలా దిగి పోయారు! 1997–2002 వరకూ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభు త్వంలో కళ్యాణ్‌సింగ్, ప్రకాశ్‌గుప్తా, రాజ్‌ నాథ్‌సింగ్‌ సీఎం పదవిలో కొనసాగారు.

2002 తరువాత బీజేపీ సాయంతో మాయావతి, ఆ తరువాత బీఎస్పీ తిరుగుబాటు దారుల సాయంతో ములాయం సింగ్‌ సీఎం గద్దెనెక్కారు. ములాయం తన పదవీ కాలంలో కొంత రాజకీయ స్థిర త్వాన్ని తీసుకురాగలిగారు. 2007 మేలో అందరి అంచనాలను తారు మారు చేస్తూ మాయావతి మరోసారి యూపీలో ఘన విజయం సాధించారు. 2017లో ఉత్తర ప్రదేశ్‌లో తన కాషాయ జెండాను దిగ్వి జయంగా ఎగరేసిన బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందా? ప్రస్తుత ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్‌ పార్టీని తిరిగి గెలిపించి భవిష్యత్‌ ప్రధాని అభ్యర్థి అవుతారా అన్నది వేచి చూడాలి. – రషీద్‌ కిద్వాయ్‌, సీనియర్‌ జర్నలిస్ట్, రచయిత 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement