
సమాజ్‌వాదీ తన్నులాట
ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ సంక్షోభాల ముట్టడిలో కొట్టుమిట్టాడు తోంది. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండగా కుటుంబ కలహాలతో అది బజారు కెక్కి నగుబాటు పాలవుతోంది. రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి పాతికేళ్లు కావ స్తున్నా, విశేష పాలనానుభవం ఉన్నా ఆ పార్టీకి అవన్నీ ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి. రెండు నెలలక్రితం తన కుమారుడు, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి, సోదరుడు శివ్‌పాల్ యాదవ్‌ను ములాయం సింగ్ యాదవ్ ఆ స్థానంలో ప్రతిష్టించినప్పుడు ముదిరిన విభేదాలు ప్రస్తుతం తారస్థాయికి చేరుకున్నాయి. పాలన సక్రమంగా లేదని, ఎవరూ పని చేయడం లేదని అంతక్రితం ఒకటి రెండుసార్లు ములాయం అఖిలేష్‌ను వివిధ వేదికలపై మందలించిన సందర్భాలున్నా అవి అక్కడితో ముగిసిపోయాయి. అందుకు కారణాలేమిటని మీడియాలో కథనాలు రావడం తప్ప ఎవరూ నోరు మెదపలేదు. కానీ బాబాయ్ శివ్‌పాల్ అనుచరుడిగా ఉంటున్న మంత్రి ప్రజాపతిని అఖిలేష్ కేబినెట్‌నుంచి తొలగించడం, ఆ వెంటనే ములాయం అఖిలేష్‌ను పార్టీ బాధ్యతలనుంచి తప్పించడం, అఖిలేష్ కూడా జాప్యం చేయకుండా శివ్‌పాల్‌నుంచి ముఖ్య శాఖలు తొలగించడం చకచకా పూర్తయ్యాయి.
ములాయం జోక్యంతో మళ్లీ ఆయన శాఖలు ఆయనకిచ్చినట్టే కనబడిన అఖిలేష్ ఆ మర్నాడే శివ్‌పాల్‌ను కేబి నెట్‌నుంచి సాగనంపారు. ఆ తర్వాత రాజీకొచ్చి ఎవరి పదవులు వారికి వచ్చినా అది మూన్నాళ్ల ముచ్చటే అయింది. మళ్లీ తొలగింపుల పర్వం మొదలైంది. పరస్పర అనుమానాలతో, కుట్ర జరగొచ్చునన్న సందేహాలతో ప్రత్యర్థి శిబి రాలు పథకాలు రచించుకుంటున్నాయి. మరి కొన్ని నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు పదునైన వ్యూహాలను ఖరారు చేసుకోవాల్సిన పార్టీ కాస్తా ఇలా తన కొంపకు తానే నిప్పంటించుకునే స్థితికి చేరింది. అయినవాళ్లే తన్నులాడుకోవడంతో పార్టీ శ్రేణుల సంగతలా ఉంచి ఎమ్మెల్యేలే దిక్కుతోచకుండా ఉన్నారు. బుధవారం హఠాత్తుగా గవర్నర్ రాంనాయక్‌తో భేటీ అయిన అఖిలేష్ తనకు 205మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ లేఖను అందజేశారంటున్నారు. అఖిలేష్‌ను సీఎం పదవినుంచి తప్పించే ఉద్దేశం లేదని తండ్రి ములాయం చెప్పిన మాటల్ని ఆయన విశ్వసించడం లేదని దీన్నిబట్టి అర్ధమవుతుంది. అటు అఖిలేష్ కొత్త పార్టీ పెట్టబోతున్నాడని ములాయం అనుమానిస్తున్నారు. అందుకే వచ్చే నెల 3 నుంచి ఆయన తలపెట్టిన వికాస్ రథ యాత్రను అడ్డుకోవడమెలా అన్న మథనంలో పడ్డారు. కుటుంబ పాలన అయితే కంటి నిండా నిద్ర పోవచ్చునని, బయటి వారితో ఇబ్బందులుంటాయని చాలామంది అనుకుంటారు. యూపీలో అందుకు భిన్నంగా జరుగుతోంది. తండ్రీ కొడుకులే ఒకరినొకరు నమ్మడం లేదు. మిగిలిన బంధుగణమంతా చెరో శిబిరంలో చేరడంతో కథ అంతులేని మలుపులు తిరుగుతోంది. సహజంగానే ఇదంతా ప్రధాన ప్రత్యర్థి పక్షాలు బీజేపీ, బీఎస్‌పీలకు లాభిస్తోంది.
తర్వాత సంగతేమైనా ఇప్పటికైతే ఏదో రకంగా రాజీ కుదిర్చి సోదరుడు శివ్ పాల్, మిత్రుడు అమర్‌సింగ్‌లపై ఈగ వాలనివ్వకుండా చూడాలని ములాయం తాపత్రయపడటం అడుగడుగునా కనిపిస్తూనే ఉంది. మూడురోజులక్రితం లక్నోలో పార్టీ సదస్సు నిర్వహించింది అందుకే. కానీ అది బెడిసికొట్టింది. సగటు సినిమాలో కనబడే అన్ని దృశ్యాలకూ అది వేదికైంది. తిట్లు, శాపనార్ధాలు, హెచ్చరికలు, కన్నీళ్లు, భావోద్వేగాలు, కుస్తీలు, ముష్టిఘాతాలు... సర్వం అక్కడ దర్శన మిచ్చాయి. సహనం కోల్పోయి ‘నువ్వు తప్పుకో... నేను ప్రభుత్వాన్ని నడుపుతా’ అని ములాయం హెచ్చరిస్తే అఖిలేష్ దాన్ని ఖాతరు చేయలేదు. చివరకు కంటతడి పెట్టి పుట్టినరోజుకు ఆశీర్వదించమంటూ తండ్రికి మొక్కితే, ముందు బాబాయ్ ఆశీర్వాదం పొందమని ఆయన సలహా ఇచ్చారు. అఖిలేష్ ఆ పని చేసినట్టే కనబడినా ఆ వెంటనే మైక్ తీసుకుని అమర్‌సింగ్ ఈ మొత్తం వివాదానికి కారకు డంటూ నిందించారు. అక్కడితో కథ మొదటికొచ్చింది. అఖిలేష్‌నుంచి మైక్ లాక్కొని ఆయన్ను అబద్ధాలకోరని శివ్‌పాల్ ఆరోపించాక గొడవ ముదిరింది. అక్కడి నుంచి పార్టీ శ్రేణులు బాహాబాహీ తలబడటంతో ఆగక, దాన్ని బయట కూడా కొనసాగించి చానెళ్ల కెమెరాలకు కావలసినంత పని కల్పించారు.
తరాలు మారినప్పుడు ఇలాంటి తిప్పలు ఎక్కడైనా తప్పవు. 2012లో యూపీలో సమాజ్‌వాదీకి జనం భారీ మెజారిటీతో అధికారం కట్టబెట్టినప్పుడు కుమారుడు అఖిలేష్‌కు ములాయం పగ్గాలు అప్పగించారు. యువకుడికి అధికారం ఇచ్చారు గనుక పాలన కొత్త పుంతలు తొక్కుతుందని అందరూ ఆశించారు. కానీ పాత తరం నేతలు, వారి పోకడలు అఖిలేష్‌కు శాపంగా మారాయి. తనను కాదని అఖిలేష్‌కు ఆ పదవి కట్టబెట్టడంపై ఆగ్రహంతో ఉన్న శివ్‌పాల్ మరికొందరితో కలిసి ముఠా కట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. కట్టడి చేద్దామని చూసినప్పుడల్లా ములాయంకు ఫిర్యాదు చేయడం, ఆయన అఖిలేష్‌ను మందలించడం రివాజైంది. అఖిలేష్ పగ్గాలు చేపట్టిన నాలుగు నెలలకే పాలన బాగోలేదంటూ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ములాయం దుయ్య బట్టారు. అప్పటికైతే నేతాజీని సంతోషపెడతామని అఖిలేష్ బదులిచ్చి ఊరుకున్నా రాను రాను ఆ విభేదాలు ముదిరిపోయాయి. వర్తమాన సమాజ్‌వాదీ సంక్షోభం ఇందిరాగాంధీ 60వ దశకం చివరిలో వృద్ధ తరం నుంచి ఎదుర్కొన్న సంక్షోభాన్ని గుర్తుకు తెస్తుంది. అప్పట్లో అచ్చం ఆమె చేసినట్టే అఖిలేష్ కొత్త పార్టీతో జనం ముందుకు రావాలని ఆయన అనుచర గణం కోరుకుంటోంది. ఆ సంగతెలా ఉన్నా ఇలాగే పరస్పర కలహాలతో కాలక్షేపం చేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీకి పట్టుమని పాతిక సీట్లు కూడా చేజిక్కే అవకాశం లేదు. మత కలహాల కట్టడిలో అఖిలేష్ సర్కారు విఫలమైందన్న విమర్శలున్నా అనేక జనాకర్షక పథకాల ద్వారా ఆయన పేద, మధ్యతరగతి వర్గాలకు సన్నిహితమయ్యారు. తాడో పేడో తేల్చు కోవడానికే అఖిలేష్ వికాస్ రథయాత్ర తలపెట్టినట్టు కనబడుతోంది. కనుక రాగల నెలల్లో యూపీ మరిన్ని ఆసక్తికర పరిణామాలకు వేదిక అవుతుంది.