‘మాయ’మేనా!
► బీఎస్పీ మనగలదా? l
► ఐదు శాతం సీట్లు కూడా రాని దుస్థితి
ఉత్తరప్రదేశ్‌కు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం. రెండున్నర దశాబ్దాలుగా యూపీ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న ఘనత ఆమె సొంతం.. వరుసగా వచ్చిన రెండు ‘నమో (నరేంద్ర మోదీ) సునామీ’ల్లో బెహన్ జీ మాయావతి ఉనికిని, బీఎస్పీ మనుగడను ప్రశ్నార్థకం చేశాయి. శనివారం వెలువడ్డ యూపీ అసెంబ్లీ ఫలితాలు మాయావతికే కాకుండా దేశవ్యాప్తంగా దళిత అస్తిత్వ రాజకీయాలకు ఎదురుదెబ్బ.
అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ... దళితులకు రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రారంభమైన బీఎస్పీ 1993లో తొలిసారి యూపీ (ఉమ్మడి రాష్ట్రం) అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి 11.1 శాతం ఓట్లతో 67 సీట్లు సాధించింది. తర్వాతి ఎన్నికల్లో క్రమేపీ ఓట్ల శాతం తగ్గింది. అగ్రవర్ణాలపై తీవ్ర ద్వేషాన్ని వెళ్లగక్కిన బీఎస్పీ క్రమేపీ తమ పంథా మార్చుకుని ఇతర వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేసింది. 2007లో దళితులు– బ్రాహ్మణుల కలయిక ఫార్ములాతో బీఎస్పీ 30.4 ఓట్ల శాతం సాధించి 206 సీట్లు గెలుచుకుని యూపీలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అధికారంలోకి వచ్చాక మాయావతి జీవనశైలిలో వచ్చిన మార్పుతో పాటు చుట్టూ ఉన్న కోటరీ ఆమెకు, పార్టీ శ్రేణులకు మధ్య నేరుగా సంబంధాలు లేకుండా చేయడంతో 2012లో ప్రతిపక్షానికే పరిమితం అవ్వాల్సివచ్చింది . 2012 అసెంబ్లీ ఎన్నికల్లో 25.9 ఓట్ల శాతంతో బీఎస్పీ 80 స్థానాలు మాత్రమే గెలుపొందింది. 4.5 శాతం ఓట్లు తగ్గాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 19.8 శాతం ఓట్లు సాధించినా బీఎస్పీ ఒక్క సీటూ నెగ్గలేదు. 17 రిజర్వుడు నియోజకవర్గాల్లోను బీజేపీనే గెలిచింది. మోదీ హవాతో పాటు జాటవేతర దళితుల్లో బీజేపీకి మద్దతు పెరగడం మాయవతి ఘోర ఓటమికి కారణాలుగా నిర్ధారించారు. యూపీలోని 40 లోక్‌సభ నియోజకవర్గాల్లో దళితులు 25 శాతానికి మించి ఉన్నా... 2014 ఎన్నికల్లో 11 స్థానాల్లో మాత్రమే బీఎస్పీ రెండో స్థానంలో నిలిచింది.
ప్రముఖ నేతల నిష్క్రమణ...
ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్(బ్రాహ్మణ నేత), ఆర్‌కే చౌదరి(పాసీ, జాటవేతర దళితుల్లో ప్రముఖుడు), జుగల్ కిశోర్(దళిత ఎంపీ) 2014 తర్వాత బీఎస్పీని వీడి బీజేపీలో చేరారు. ఈసారి ముస్లిం–దళిత ఫార్ములా తెరపైకి తెచ్చిన మాయ అందరి కంటే ముందే ప్రచారంలోకి దూకారు. 99 మంది ముస్లిం లకు టికెట్లు ఇచ్చారు. ఈ లెక్కలేమీ పనిచేయలేదు. ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో బీఎస్సీకి 60–80 స్థానాలు వస్తాయని మెజారిటీ సంస్థలు చెప్పడంతో.. హంగ్ వస్తుందని.. దాంతో మాయావతి కింగ్ మేకర్‌గా అవుతారని అందరూ భావించారు. అయితే పాపం బెహన్ జీది .. ఇప్పుడు తెరమరుగయ్యే పరిస్థితి. ఉన్న కొద్దిమంది ఎమ్మెలేలను కాపాడుకోవటమూ ఇబ్బందే. ఇక ఆ పార్టీకి లోక్‌సభలో ఒక్క సభ్యుడు కూడా లేడు. రాజ్యసభలో ఆరుగురు సభ్యులున్నారు. మరో ఏడాదిలో ఆమె రాజ్యసభ పదవీకాలం ముగియనుంది. తిరిగి రాజ్యసభకు ఎన్నికవడం సాధ్యం కాకపోవచ్చు.
ఏ మీట నొక్కినా బీజేపీకే ఓట్లు మాయావతి సంచలన ఆరోపణలు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల టాంపరింగ్ జరిగిందని బీఎస్పీ అధినేత్రి మాయావతి సంచలన ఆరోపణలు చేశారు. ఓటర్లు ఏ పార్టీ గుర్తుపై మీట నొక్కినా బీజేపీకే ఓట్లు పడ్డాయని ఆరోపించారు. శనివారం యూపీ ఎన్నికల ఫలితాల సరళి భారీగా బీజేపీవైపు మొగ్గడం మొదలవగానే మాయావతి లక్నోలో హడావిడిగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. యూపీ, ఉత్తరాఖండ్‌లో ఫలితాలు అందరికీ ఆశ్చర్యం కలిగించాయని.. బీజేపీకి తప్ప ఏ పార్టీకి ఓటు వేసినా ఈవీఎంలు అంగీకరించని పరిస్థితి కనిపిస్తున్నట్లుందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ ఫలితాలు తనను తీవ్ర విస్మయానికి గురిచేశాయన్న మాయావతి... కేంద్ర ఎన్నికల కమిషన్ యూపీలో ఎన్నికల ఫలితాలను నిలుపుదల చేసి సంప్రదాయ బ్యాలట్ పద్ధతిలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ‘‘యూపీలో 20 శాతం ముస్లింల ఓట్లు ఉన్నప్పటికీ బీజేపీ ఒక్క టికెట్‌ను కూడా ముస్లింలకు కేటాయించలేదు. అయినప్పటికీ ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లోనూ బీజేపీ గెలవడం అసమంజసంగా ఉంది’’ అన్నారు. ఈ అంశంపై ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసినట్లు చెప్పారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్