న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో విమర్శలు ప్రతివిమర్శలు జోరుగా సాగుతున్నాయి. నాయకులు రాజకీయ విమర్శలు దాటి.. వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ విషయంలో పార్టీలన్ని ఒక దాన్ని మించి మరొకటి పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో బీఎస్పీ అధ్యక్షురాలు.. మాయావతి ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కోసం మోదీ తన భార్యను వదిలేశాడు.. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న మహిళా నేతలు తమకు కూడా ఇదే గతి పడుతుందేమేనని భయపడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆల్వార్ గ్యాంగ్‌రేప్ సంఘటనపై మోదీ ఇంతవరకూ స్పందించలేదు. ఈ నేపథ్యంలో మాయావతి మోదీపై విమర్శల వర్షం కురిపించారు.
ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ.. ‘బీజేపీలో ఉన్న మహిళా నేతలు.. మోదీ, తమ భర్తలను కలవకూడదని కోరుకుంటున్నారు. ఎందుకంటే రాజకీయాల కోసం మోదీ తన భార్యను వదిలేశాడు. అలాంటి వ్యక్తి తమ భర్తలను కలిస్తే.. వారికి కూడా అదే సలహా ఇస్తాడేమో అని పాపం వారంతా భయపడుతున్నారు’ అని పేర్కొన్నారు. అంతేకాక ‘ఆల్వార్ గ్యాంగ్ రేప్ సంఘటనపై మోదీ ఇంతవరకూ స్పందించలేదు. ఈ విషయంలో ఆయన చెత్త రాజకీయాలు చేసి.. ప్రయోజనం పొందాలని భావిస్తున్నారు. అయినా భార్యను వదిలేసిన వ్యక్తి ఇతరుల అక్కాచెల్లళ్లను, భార్యలను ఎలా గౌరవిస్తాడ’ని ఆమె ప్రశ్నించారు. అంతేకాక ఈ ఎన్నికల్లో దళితుల ఓట్లు కోసం.. మోదీ వారిపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారని మాయావతి ఆరోపించారు. కానీ దేశవ్యాప్తంగా దళితులపై జరిగిన దాడులను వారు మర్చిపోరన్నారు. వేముల రోహిత్, షహరాన్‌పూర్ సంఘటనను దళితులు మర్చిపోరు.. మోదీని క్షమించరని మాయావతి స్పష్టం చేశారు.
అయితే మాయావతి వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఒడిషా పూరి బీజేపీ అభ్యర్థి సంబీత్ పాత్ర మాట్లాడుతూ.. ‘మాయావతి వ్యాఖ్యలను టీవీల్లో చూశాను. మోదీని ఉద్దేశించి ఆమె మాట్లాడిన మాటలు చాలా దారుణంగా ఉన్నాయి. ఆమె మనస్తత్వం ఎలాంటిదో అర్థం కావడం లేదు. ఎందుకంటే మోదీ తన కుటుంబాన్ని సైతం కాదనుకుని.. దేశాన్నే తన ఇల్లుగా భావిస్తున్నారు. మాయావతి జీ.. మీకు మీ సోదరుడే ఎక్కువ కావచ్చు.. కానీ మోదీకి దేశమే ఎక్కువ’ అంటూ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment