యాదవ్ కుటుంబంలో మళ్లీ చిచ్చు!
సమాజ్‌వాదీ పార్టీలోను, ఆ పార్టీ పెద్దలు యాదవ్ కుటుంబంలోను మళ్లీ మరో చిచ్చు మొదలైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన శివపాల్ యాదవ్.. ఆ వెంటనే తమ మరో సోదరుడు రాంగోపాల్ యాదవ్‌కు సమీప బంధువైన ఓ వ్యక్తిని పార్టీ నుంచి తొలగించారు. భూ ఆక్రమణలకు పాల్పడుతున్నాడన్న ఆరో్పణలతో అతడిని పార్టీ నుంచి తప్పించడంతో కుటుంబంలో మళ్లీ కలహాలు మొదలయ్యాయి. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే రాంగోపాల్ యాదవ్ సమీప బంధువైన అరవింద్ ప్రతాప్ యాదవ్ అనే ఎమ్మెల్సీని, ఆయనతో పాటు ఇటావా గ్రామ మాజీ సర్పంచ్ అఖిలేష్ కుమార్ యాదవ్‌ను పార్టీ నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీళ్లిద్దరి మీద భూ ఆక్రమణలతో పాటు మరికొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి.
పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో అతడిని బహిష్కరించినట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ఆర్ఎస్ యాదవ్ చెప్పారు. పార్టీ కార్యాలయానికి తొలిసారి వెళ్లే ముందు విమానాశ్రయంలో తన అన్న ములాయం సింగ్ యాదవ్‌ను శివపాల్ కలిశారు. బహిష్కరణ వేటుకు గురైన ఇద్దరూ రాంగోపాల్ యాదవ్‌కు సమీప బంధువులే కావడంతో యాదవ్ కుటుంబంలో ఇప్పుడు మరో చిచ్చు మొదలయ్యేలా ఉంది. శివపాల్ - అఖిలేష్ మధ్య పోరు జరిగినప్పుడు ములాయం సోదరుల్లో ఒకరైన రాంగోపాల్ యాదవ్.. తన మద్దతును అఖిలేష్‌కే తెలిపారు. దాంతో ఇప్పుడు అఖిలేష్ వర్గం బలాన్ని క్రమంగా తగ్గించే చర్యలను శివపాల్ యాదవ్ మొదలుపెట్టారని అంటున్నారు. ఇంతకుముందు అఖిలేష్‌కు అనుకూలంగా కొందరు కార్యకర్తలు నినాదాలు చేసినప్పుడు కూడా.. ''మీరు నినాదాలు ఇవ్వాలనుకుంటే, ముందు పార్టీకి అనుకూలంగా, తర్వాత నేతాజీకి అనుకూలంగా, ఆ తర్వాత ముఖ్యమంత్రికి అనుకూలంగా ఇవ్వండి. అంతే తప్ప పార్టీలో గ్రూపిజానికి చోటులేదు'' అని హెచ్చరించారు.