అన్నయ్య ఏం చెబితే అది చేస్తా..
న్యూఢిల్లీ: తన సోదరుడు, సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములయాం సింగ్ యాదవ్ ఏం చెబితే, అది చేస్తానని ఉత్తరప్రదేశ్ మంత్రి శివపాల్ సింగ్ యాదవ్ చెప్పారు. ములయాంపై తనకు పూర్తి నమ్మకముందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీలో ములయాంను వ్యతిరేకించే ధైర్యం ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. అన్న కుమారుడు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్తో విబేధాల నేపథ్యంలో శివపాల్ బుధవారం ఢిల్లీ వెళ్లి ములయాంతో సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై సోదరుడితో చర్చించారు. కాగా అఖిలేష్ కూడా ఢిల్లీకి వెళ్లి ములయాంను కలవనున్నారు.
ఉత్తరప్రదేశ్లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. శివపాల్ యాదవ్కు అత్యంత సన్నిహితుడైన యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపక్ సింఘాల్ను మంగళవారం అఖిలేష్ తొలగించడంతో బాబాయ్, అబ్బాయ్ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇదే రోజు ములాయం.. యూపీ ఎస్పీ అధ్యక్ష పదవి నుంచి అఖిలేష్ను తొలగించి, శివపాల్ను నియమించారు. దీంతో రగిలిపోయిన అఖిలేష్.. బాబాయ్ శివపాల్ దగ్గర నుంచి కీలక శాఖలను తొలగించారు. దీంతో వీరిద్దరి పంచాయతీ ములయాం దగ్గరకు వెళ్లింది.