ఉత్తరప్రదేశ్‌లో వ్యవహారం నిన్న మొన్నటివరకు అంతా సమిష్టి కుటుంబంలా ఉండేది. ప్రభుత్వంలో కూడా అందరూ బంధువులే కనిపించేవాళ్లు. పార్టీ పెద్దాయన 'నేతాజీ' ములాయం సింగ్ యాదవ్.. ఆయన తమ్ముడు శివపాల్ సింగ్ యాదవ్ ప్రభుత్వంలో ఒకానొక కీలక మంత్రి, నేతాజీ కొడుకు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి. వీళ్లందరికీ సన్నిహితుడైన ఆజంఖాన్ కూడా మంత్రివర్గంలో కీలక సభ్యుడు. ఇలా అంతా 'మనవాళ్లే' అనుకునేవారు. కానీ ఉన్నట్టుండి.. ముసలం పుట్టింది. బాబాయ్ - అబ్బాయ్ మధ్య గొడవలు మొదలయ్యాయి. పెద్దాయన కలగజేసుకోవాల్సి వచ్చింది. బాబాయ్‌కి కావల్సిన వాళ్లను అబ్బాయ్ తప్పిస్తూ వెళ్లాడు. దాంతో అబ్బాయికి ఉన్న కీలక పదవుల్లో ఒకదానికి పెద్దాయన కత్తెర వేశారు. దాన్ని తమ్ముడికి గిఫ్టుగా ఇచ్చారు.