కొమ్మినేని శ్రీనివాసరావుతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి
సీఎం హోదాలో ఉండి కోదండరాం సర్పంచ్ కూడా కాలేదు అన్నాడు కేసీఆర్. మరి సర్పంచ్ కూడా కాని వాడిని జేఏసీ చైర్మన్‌గా ఎందుకు పెట్టినావు? ఉద్యమకాలంలో ఆయనను అందలం ఎక్కించావు. ఈరోజు అదే కోదండరాంని వాడు వీడు అని మాట్లాడి సీఎం హోదా పరువు తీశావు. కోదండరాం తప్పేమిటి? ప్రతి ఊరూ తిరిగిండాయన. కేసీఆర్ కంటే ఎక్కువ మీటింగులు పెట్టాడు. ఆయన రాజకీయ నేత కాకపోవచ్చు. కానీ తెలంగాణ అవసరాన్ని విప్పి చెప్పాడు.
ముఖ్యమంత్రిగా ఉంటూనే ప్రతిపక్ష నేతలాగా ప్రజల్లోనే తిరుగుతూ, ప్రజల కష్టాలను పట్టించుకున్న నిజమైన జననేత దివంగత సీఎం వైఎస్సారేనని మాజీ మంత్రి, టీ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. సంక్షేమ కార్యక్రమాలను ప్రతిరోజూ సచివాలయంలో ఉదయం 10 గంటలనుంచి గడియారం చూసుకుని మరీ పర్యవేక్షించిన అసలైన నేత వైఎస్సార్ అని ప్రశంసించారు. ఉదయం ఎనిమిదన్నర నుంచి తొమ్మిదన్నర వరకు రోజుకు 5 వేల మందిని కలుస్తూ వచ్చిన అరుదైన నాయకుడు వైఎస్సార్ కాగా, కేసీఆర్ ఈ మూడున్నరేళ్ల కాలంలో 500 మందిని కూడా కలిసి ఉండరని, తెలంగాణలో మళ్లీ గడీలు గుర్తుకొస్తున్నాయని అన్నారు. చంద్రబాబు కానీ, కేసీఆర్ కానీ ప్రజానుకూల పాలన విషయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి దరిదాపుల్లో కూడా నిలబడలేరని అంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...
తెలంగాణకోసం నాడు సాగించిన పోరాటంపై ఇప్పుడు మీరేమనుకుంటున్నారు?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సీఎం అయినప్పుడు చాలా సంతోషపడ్డాం. ఎవరైతేనేం.. తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. నిరుద్యోగులు, రైతుల కష్టాలు ఇకనైనా తొలగిపోతాయి అని వ్యక్తిగతంగా చాలా సంతోషపడ్డాను. కానీ తెలంగాణకోసం పోరాడిన వ్యక్తిగా, ఒక ఎమ్మెల్యేగా తెలంగాణ సీఎంని నేరుగా కలవలేని పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. రెండేళ్లనుంచి కేసీఆర్ అప్పాయింట్‌మెంట్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ప్రభుత్వాన్ని ఏర్పర్చిన కొత్తలో కేసీఆర్‌ని కలిశాను. దాదాపు 2 గంటలు మాట్లాడారు. జిల్లాకు మెడికల్ కాలేజీ కావాలని, మరిన్ని అవసరాలను చెబితే అన్నీ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత రెండు మూడుసార్లు అసెంబ్లీలో కనిపించి అభ్యర్థిస్తే స్పందనే లేదు. తర్వాత నియోజకవర్గంలో పెండింగులో ఉన్న పనుల కోసం వారం రోజులపాటు ప్రతిరోజూ ఫోన్ చేసినా కేసీఆర్ ఫోనెత్తలేదు. దీన్ని చెప్పాలంటేనే నాకు గలీజుగా అనిపిస్తోంది. కానీ ప్రజలకు వాస్తవం తెలపాలనే మీద్వారా, ‘సాక్షి’ ద్వారా చెబుతున్నాను.
వారం తర్వాత నేను మళ్లీ ఫోన్ చేస్తే ‘మీతో మాట్లాడనని సీఎం చెప్పారండీ, మీరిక ఫోన్ చేయవద్దు’ అని సీఎం పేషీ నుంచి నాకు బదులిచ్చారు. తెలంగాణ ఉద్యమం ప్రతి దశ లోనూ కేసీఆర్‌తో మేం టచ్‌లో ఉండేవాళ్లం. అలాంటిది సీఎం అయ్యాక నాతో కలవడం, మాట్లాడటం ఆయనకు ఇష్టం లేదన్న సమాధానం విని చాలా బాధపడ్డాను. బాబుతో, వైఎస్సార్‌తో నాకెప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు. వైఎస్సార్‌తో అయితే ఎంత చిన్నా, పెద్ద విషయమైనా సరే ఫోన్‌లోనే మాట్లాడుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకు సీఎం అప్పాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం అవమానమండి. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఎమ్మెల్యేగా మీముందు కూర్చుని ఇవ్వాళ ఇలా చెప్పుకోవడమే చాలా బాధాకరం.
తెలంగాణ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందనుకుంటున్నారు?
ప్రభుత్వం గురించి చెప్పాలంటే మా తెలంగాణ పరువు మేం తీసుకుంటున్నట్లే అని చెప్పాలి. డీఎస్సీకి సంబంధించి దాదాపు వందసార్లు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో రేపు నోటిఫికేషన్ తెస్తున్నాం అని సీఎం చెప్పి ఉంటారు. లక్షలమంది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన ముఖ్యమైన విషయంపై ఇన్నిసార్లు ప్రకటించాల్సిన అవసరం ఏ ప్రభుత్వానికైనా ఉందా? నెలకు ఒక్కో విద్యార్థి వేలాది రూపాయలు ఖర్చుపెట్టి హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటున్నారు. వాళ్ల తల్లిదండ్రులు కూలి నాలి చేసుకుని ఒక పూట ఉపవాసముండి మరీ డబ్బు పంపిస్తుంటే డీఎస్సీ ఎప్పుడొస్తుందో తెలియని అగమ్యగోచర పరిస్థితుల్లో పిల్లలు బాధపడుతున్నారు. ప్రాణత్యాగాలు చేసి తెలంగాణను తెచ్చుకున్న యువతీ యువకుల భవిష్యత్తుకు సంబంధించిన విషయంపై కూడా ప్రభుత్వం ఇంత మజాక్ చేసుకుంటోందే? వాళ్ల జీవితాల్తో ఆడుకోవడం కాదా ఇది.
సింగరేణి ఎన్నికల తర్వాత కూడా ప్రతిపక్షాలకు బుద్ధిరావడం లేదని సీఎం అన్నారే?
సింగరేణి ఎన్నికలలో ప్రభుత్వం ఏం పొడిచినట్లు? గెలిచిన అధికార పార్టీ సంఘానికి, ఓడిపోయిన యూనియన్లకు మధ్య తేడా కేవలం 3 వేల ఓట్లు. ఫలితం ఏమిటో అక్కడే తేలిపోలేదా. అది గెలుపు కాదు. సింగరేణినే మీకు రాసిస్తానని చెప్పారు కేసీఆర్. మామూలు వాగ్దానాలు కాదు. మీ ఖాతాలో రేపే డబ్బులు అంటూ ప్రలోభ పెట్టారు. సింగరేణి లాభాల్లో కార్మికుల వాటా 16 శాతం ఉంటే దాన్ని 25 శాతంకి పెంచారు. ఇన్ని రోజులు చేయనిది ఎన్నికలు కాబట్టి పెంచారు. వారసత్వ ఉద్యోగాలను కోర్టు అడ్డుకుంది కాబట్టి కారుణ్య ఉద్యోగాలను ఇస్తానని మాట మార్చారు. అన్నీ చేస్తాననడమే కానీ చేసిందెప్పుడు. గనికార్మికుల యూనియన్ ఎన్నికలకు ఇంత ప్రాధాన్యతను ఇచ్చిన సీఎంని నా జీవితంలోనే చూడలేదు.
వైఎస్సార్, కేసీఆర్ పాలనను ఎలా పోలుస్తారు?
పోలికే లేదు. పోలికలు కాదుకదా.. వైఎస్సార్ దరిదాపులకు కూడా రాలేడు కేసీఆర్. వైఎస్ జలయజ్ఞంపై కొన్ని పత్రికలు ఆరోజు ఏవేవో ఆరోపణలు చేశాయి కానీ ఈరోజు కేసీఆర్ చేస్తున్న అవకతవక పనులను ఏ పత్రిక కూడా ప్రస్తావించడం లేదు. ప్రజల ముఖం చూడటానికి కూడా ఇష్టపడని సీఎంని ఇప్పుడే చూస్తున్నాం. సెక్రటేరియట్‌కు రాని సీఎంని గతంలో ఎన్నడూ చూడలేదు. అదే వైఎస్సార్ ఉంటే జిల్లాల్లో లేకుంటే సెక్రటేరియట్‌లో ఉండేవారు. ఉదయం 8.30 నుంచి 9.30కి ఇంటివద్ద సామాన్య ప్రజలను కలిసేవారు. ప్రజలు ఎవరైనా వెళ్లి ఆయనతో చెప్పుకోవచ్చు. వారి సమస్యలపై ప్రత్యేక కార్యదర్శులను పెట్టి వెంటనే సమాధానం పంపేవారు. వారం రోజుల్లో పరిష్కారం చేసేవారు. 9.30 నుంచి 10 గంటల వరకు క్యాంప్ ఆఫీసులో జనంని కలిసేవారు. నాయకులం మేం వెళ్లి కలిసినా వాట్ సార్, ఏంటి విషయం అని పరామర్శించేవారు. వైఎస్ ప్రజలను పరామర్శించే తీరే వేరు.
చంద్రబాబుకు, వైఎస్సార్‌కు మధ్య తేడా ఏమిటి?
ఏ సీఎంని కూడా రాజశేఖరరెడ్డితో పోల్చలేము. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం దేశంలోనే లేదు. 108 అంబులెన్స్ పథకం అమెరికాలో ఉండేది. దాన్ని మొదటగా ఏపీలో తీసుకొచ్చింది వైఎస్సార్. తర్వాత కర్ణాటక వంటి రాష్ట్రాలు అమలు చేశాయి. ఇలాంటి పథకాలు పేదవాళ్లకు ఎప్పటికయినా వస్తాయా అని అనుకునేవారు. పేదవాళ్లకు గుండెజబ్బు వస్తే రెండు లక్షల రూపాయలు వైద్యానికి చెల్లించడం అసాధ్యం. చావు తప్ప వారికి మరో మార్గం ఉండేది కాదు. 20 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు వరకు ఎవరైనా సరే గుండె జబ్బు అంటే తెలిసి తెలిసీ చనిపోయేవారే తప్ప వైద్యం అందుబాటులో ఉండేది కాదు. కూలీ చేసుకునేటోడు హైదరాబాద్‌కు పోయి ఆపరేషన్ చేసుకోలేడు. ఎవరూ వాడికి అప్పివ్వరు. అలాంటివారికి ఆరోగ్యశ్రీ కార్డు చూపి, వాళ్లే తీసుకువచ్చి, ఆపరేషన్ చేసి, తర్వాత ఆరునెలల వరకు మందులు కూడా వాళ్లే ఇచ్చి ఎక్కడినుంచి వచ్చారో అక్కడికే వాహనంలో తీసుకెళ్లి దింపేవారు. పదిలక్షల మంది పేదవాళ్లను బతికించాడు వైఎస్సార్. అలాంటి ఆరోగ్యశ్రీ కూడా ఇవ్వాళ నీరుగారిపోయింది.
ఓటుకు కోట్లు కేసు వ్యవహారంపై మీ అభిప్రాయం?
పరిటాల రవి కుమారుడి పెళ్లికి కేసీఆర్ వెళ్లి బాబును కలిసి ఇద్దరూ మాట్లాడుకుని తిరిగి వచ్చిన తర్వాత ఇక ఓటుకు కోట్లు కేసు విషయం ఏమిటి? దాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆ విషయంలో ఇద్దరు సీఎంలూ రాజీ పడిపోయినట్లే. ఇద్దరికి ఎక్కడో అవగాహన కుదిరినట్లే ఉంది.
(కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)
https://goo.gl/HekhpK
https://goo.gl/ifzwgQ
Comments
Please login to add a commentAdd a comment