పలు అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘రైతుల మీద మమకారం ఉన్న పాలకుడు ఉంటే దేవుడి కరుణ కూడా ఉంటుంది. వర్షాలు కూడా బాగా కురుస్తాయి. పాడి పంటలు బాగుంటాయి. వర్షాలు లేని సంవత్సరాల్లో రైతులకు అండగా నిలబడే మనసే లేకపోతే రాబందులకు, నక్కలకు విందు భోజనం దొరుకుతుంది. అలా జరగకుండా మనకు పాడి పంటలు పుష్కలంగా ఉండే నాయకత్వం కావాలా? లేక నక్కలు, తోడేళ్లు ఉండే పాలన కావాలా? అన్నది మీరే ఆలోచించండి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను కోరారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శనివారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహించిన రైతు దినోత్సవంలో ఆయన మాట్లాడారు.
రాబోయే రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని, ఎవరిని గెలిపించాలో ఆలోచించాలని ప్రతి రైతును, అక్కచెల్లెమ్మను, పేద వాడిని, నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద వర్గాలను కోరుతున్నానన్నారు. ఇప్పటికే మీ బిడ్డ జగన్ బటన్ నొక్కుతూ ఎలాంటి లంచాలకు తావులేకుండా రూ.2.25 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా డీబీటీ ద్వారా జమ చేశారన్నారు. ఇలాంటి ప్రభుత్వం కావాలా? లేక చంద్రబాబు ప్రభుత్వంలో మాదిరిగా రైతుల్ని, పేదల్ని, సామాజిక వర్గాల్ని మోసం చేసి దోచుకోవడం, పంచుకోవడం, తినుకొనే డీపీటీ పద్ధతి కావాలా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
వారికి మంచి చేసిన చరిత్రే లేదు
► మనకు రైతు రాజ్యం కావాలా? లేక రైతును మోసం చేసే.. వ్యవసాయం దండగ అన్న పాలన కావాలా? రైతుకు తోడుగా ఉండే ఆర్బీకే, సచివాలయ, వలంటీర్ వ్యవస్థ కావాలా? గత ప్రభుత్వంలో మాదిరిగా దళారీ వ్యవస్థ కావాలా? మారుతున్న స్కూళ్లు, ఇంగ్లిష్ మీడియం.. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న పేదల ప్రభుత్వం కావాలా? లేక పెత్తందార్ల ప్రభుత్వం కావాలా? మనకు దేవుడి దయతో వర్షాలు కావాలా? లేక చంద్రబాబు ఐరెన్ లెగ్‌తో కరువు కావాలా? మాట తప్పని ప్రభుత్వం కావాలా? వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు పాలన కావాలా?
► పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని సుప్రీంకోర్టుకు వెళ్లి పైశాచిక ఆనందం పొందే పెత్తందార్లు కావాలా? ఆరోగ్యశ్రీ, 104, 108, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్ట, 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన అందించే మనందరి ప్రభుత్వం కావాలా? పేదలకు ఇలాంటి మంచి చేసిన చరిత్ర ఎక్కడా టార్చ్ లైట్ వేసి చూసి వెతికినా కనిపించని పెత్తందార్ల ప్రభుత్వం కావాలా?
► అప్పుడు, ఇప్పుడు అదే రాష్ట్రం, అదే బడ్జెట్, పైగా అప్పులు అప్పుడే ఎక్కువ. అయితే అప్పుడు ఇన్ని కార్యక్రమాలు, పథకాలు ఎందుకు లేవు? ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లింది? ఇవాళ మీ బిడ్డ ఏ విధంగా మీ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాడు? ఎలాంటి ప్రభుత్వం కావాలో ఆలోచించండి.
► వాళ్ల దగ్గర ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఓ దత్తపుత్రుడు ఉన్నాడు. వీళ్లంతా కలిసి తోడేళ్ల మాదిరి ఏకమై ఒక్క అబద్ధాన్ని వందసార్లు చెప్పిందే చెప్పి మోసం చేసే ప్రయత్నాలు చేస్తారు. నాకు వీళ్ల మాదిరి అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం చేత కాదు. నేను నమ్ముకుంది దేవుడి దయను, మీ చల్లని దీవెనలను. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి.
డాక్టర్ వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లు ప్రారంభం
విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తదితర వ్యవసాయ ఉత్పాదకాల నాణ్యత నిర్ధారణ కోసం రూ.213.27 కోట్ల వ్యయంతో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో 147, జిల్లా స్థాయిలో 10 పరీక్ష ల్యాబొరేటరీలు, 4 రీజనల్ కోడింగ్ సెంటర్ల నిర్మాణానికి వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ఇందులో భాగంగా మొదటి దశలో 75 ల్యాబ్‌లను ప్రారంభించారు.
శనివారం కళ్యాణదుర్గం సభావేదికగా మరో 52 ల్యాబ్‌లకు సీఎం జగన్ ప్రారంభోత్సవం చేశారు. దీంతో మొత్తం 127 ల్యాబ్‌లను రైతులకు అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ప్రారంభించిన 52 టెస్టింగ్ ల్యాబ్‌లకు రూ.63.96 కోట్లు ఖర్చు చేశారు. అలాగే 1,238 బహుళ ప్రయోజనాల గోదాముల నిర్మాణం కోసం రూ.777.04 కోట్లు వెచ్చించనున్నారు. రైతు భరోసా కేంద్రాల స్థాయిలోనే వీటిని నిర్మిస్తారు. వీటికి కూడా సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు.
మీరు చల్లగా ఉండాలి
సర్.. నాకు 10 ఎకరాల పొలం ఉంది. ఐదు ఎకరాల్లో వేరుశనగ, ఐదు ఎకరాల్లో మామిడి పంటలు సాగుచేస్తున్నా. పంటలకు ఈ క్రాప్, ఈ కేవైసీ చేయించాను. ప్రభుత్వమే ఉచితంగా బీమా ప్రీమియం కట్టింది. ఇప్పుడు నాకు రూ.57,500 పరిహారం మంజూరైంది. గత ఏడాది ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే నెలలోపే ఇన్‌పుట్ సబ్సిడీ రూ.52,500 వచ్చింది.
టీడీపీ హయాంలో రైతులు దారుణంగా మోసపోయారు. ఇప్పుడు మీరు (సీఎం) చెప్పిన దాని కంటే ఎక్కువగా లబ్ధి చేకూరుస్తున్నారు. ఆర్బీకేలు, వైఎస్సార్ యంత్రసేవా పథకం వల్ల రైతులకు కష్టాలు తప్పాయి. మీ నాలుగేళ్ల పాలనలో నా కుటుంబానికి రూ.7 లక్షల లబ్ధి చేకూరింది. మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలి.
– కురబ భీమేష్, రైతు, రాళ్ల అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment