వైఎస్ పథకాలను నీరుగార్చే యత్నం
వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి
వ్యక్తిగత మైలేజీ కోసమే ఇద్దరు సీఎంల ప్రయత్నం
పోలవరం ప్రాజెక్టును పక్కన పెట్టి బాబు హడావుడి
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కుదిస్తామంటున్న కేసీఆర్
హైదరాబాద్: ఏపీ, తెలంగాణ ముఖ్య మంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌లు తమ వ్యక్తిగత మైలేజీ కోసం.. ప్రజల గుండెల్లో దైవంగా నిలిచిపోయిన దివంగత వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీఎంగా ఉండగా పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుల కోసం ఎంతో కృషిచేశారని, ఇప్పుడు ఇద్దరు సీఎంలు వాటిని నీరుగారుస్తున్నారని విమర్శించారు. జాతీయ హోదా లభించిన పోలవరాన్ని చంద్రబాబు పక్కనపెట్టి పట్టిసీమ ఎత్తిపోతల అంటూ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు ప్రతిష్టాత్మకమైన ప్రాణహిత-చేవెళ్ల పథకాన్ని కేవలం 4 జిల్లాలకు పరిమితం చేస్తామని కేసీఆర్ ప్రకటించడం సరికాదన్నారు. ఇటీవల ఆదిలాబాద్ సభలో దివంగత వైఎస్సార్‌ను ఉద్దేశించి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. మరణించిన వ్యక్తిని వ్యక్తిగతంగా విమర్శించొద్దనే ఆలోచన సీఎంకు ఉందో లేదోనని వ్యాఖ్యానించారు. మంగళ వారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
‘‘సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు తెలుగువారికి బాధ కలిగించాయి. చేసిన విమర్శలపై ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. చనిపోయిన వ్యక్తిపై ఆరోపణలు, అపనిందలు వేస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. ప్రాణహిత-చేవెళ్ల ద్వారా 16.4 లక్షల ఎకరాలకు నీటిని అందించేందుకు, హైదరాబాద్‌కు శాశ్వత నీటివనరులను అందించేందుకు 2008 మేలో వైఎస్ ప్రణాళిక రూపొందించారు. ఇన్నేళ్ల కాలంలో టీఆర్‌ఎస్ ఏనాడూ అది కరెక్ట్ కాదు, డిజైన్ మార్చాలని ఎందుకు డిమాండ్ చేయలేదు. ఇన్నేళ్ల తర్వాత డి జైన్ సరిగ్గా లేదని, నాలుగు జిల్లాలకే పరిమితం చేస్తామని చెప్పడం దురదృష్టకరం’’ అని అన్నారు. గతంలో టీఆర్‌ఎస్ ఎంపీలు ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలంటూ పార్లమెంట్‌లో డిమాండ్ చేయలేదా అని ప్రశ్నించారు. ఆనాడు దీన్ని జాతీయ ప్రాజెక్టు చేయాలని ఎందుకు అడిగారో సీఎం కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. వైఎస్సార్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివిధ రూపాల్లో తిప్పి చేపడుతున్నారే తప్పించి, రెండు రాష్ట్రాల సీఎంలు కొత్తగా చేసింది ఏమీ లేదన్నారు. ఏడాది పాలనలో ఏమి చేశారన్న దానిపై చంద్రబాబు, కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలని పేర్కొన్నారు. రైతుల రుణమాఫీ, ఉచిత విద్యుత్, బోర్లు వేయడం వంటి ఎన్నో కార్యక్రమాలను వైఎస్సార్ చేపట్టార ని, ఇవన్నీ రైతులకు ఎంతో ప్రయోజనం కలిగించాయన్నారు. వైఎస్ కన్నా మెరుగైన పథకాలు ప్రవేశపెట్టి అధిగమించే ప్రయత్నం చేయాలే తప్పించి, వాటిని తగ్గించే ప్రయత్నం చేయడం మంచిదికాదన్నారు. ప్రజల గుండెల్లో కొలువైన వైఎస్‌ను రూపుమాపడం సాధ్యం కాదన్నారు.
రుణమాఫీ ఏమైంది?
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించిన రైతుల రుణమాఫీ ఏమైందని పొంగులేటి ప్రశ్నించారు. వైఎస్సార్ సీఎంగా 6 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును కల్పించి, 44 వేల ఎకరాల మేర స్థిరీకరించారని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు వేటినీ అమలు చేయలేదని విమర్శించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేసి, మెట్ట ప్రాంత ప్రజలను ఆదుకునే ందుకు తమతో కలిసొచ్చే అన్ని పార్టీలతో కలిసి పోరాడతామని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రాజెక్టుకు తూట్లు పొడవడాన్ని సహించబోమన్నారు. ప్రజలకు మంచిచేస్తే టీఆర్‌ఎస్ సర్కారుకు మద్దతు తెలుపుతామని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే పోరాటంలో ముందుంటామని పేర్కొన్నారు. రాజకీయ సమీకర ణల్లో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చామన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడంపై కేసు పెట్టామని, న్యాయపరంగా పోరాడతామని వివరించారు. స్థానిక ఎమ్మెల్సీ , జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు.