ఓటుకు కోట్లు కేసులో శిక్ష ఖాయం | ap cm should punished in Cash-for-vote scam case | Sakshi
Sakshi News home page

ఓటుకు కోట్లు కేసులో శిక్ష ఖాయం

Published Wed, Apr 19 2017 1:20 AM | Last Updated on Mon, Sep 17 2018 8:21 PM

ఓటుకు కోట్లు కేసులో శిక్ష ఖాయం - Sakshi

ఓటుకు కోట్లు కేసులో శిక్ష ఖాయం

కొమ్మినేని శ్రీనివాసరావుతో తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబేకాదు.. ఓటుకు కోట్లు కేసులో భాగమై ఉన్న ప్రతి ఒక్కరికి ఏ విధమైన శిక్ష పడాలో అది పడే తీరుతుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి, తెరాస సీనియర్‌ నేత పోచారం శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పారు. ఈ కేసులో ప్రభుత్వానికి భాగస్వామ్యం లేదని, అధికారులు వారి పనివారు చేసుకుపోతున్నారని, విచారణ ముగిసేసరికి ఎవరూ శిక్షనుంచి తప్పించుకోలేరని మంత్రి స్పష్టం చేశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు అని కేసీఆర్‌ అన్నప్పటికీ బాబు నింపాదిగా ఉన్నారు కదా అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ నేరం చేసిన వారిపై అధికారులు చట్టపరిధిలో ఏ చర్య తీసుకోవాలో ఆ చర్యను తప్పకుండా తీసుకుంటారంటున్న పోచారం శ్రీనివాసరెడ్డి అభిప్రాయాలను ఆయన మాటల్లోనే..

ఎరువులను పూర్తిగా ఫ్రీగా ఇవ్వాలనే ఆలోచన ఎలా వచ్చింది?
రైతుపట్ల కేసీఆర్‌కి ఉన్న అభిమానమే దానికి కారణం. పూర్తిగా కేసీఆర్‌ ఆలోచనే ఇది. వేసవిలో, వర్షాకాలంలో ఎంత పరిమాణంలో అంటే ఎన్ని లక్షల టన్నుల ఎరువులు అవసరం అవుతాయి అని మమ్మల్ని అడిగారు. దీనిపై ఎవరూ సూచనలు, సలహాలు ఇవ్వలేదు. కేసీఆర్‌ మనసులోంచి వచ్చిన ఆలోచన ఇది. దాన్నే విధానంగా ప్రకటించారు.

ఉచిత ఎరువుల ఆలోచనను కేసీఆర్‌ వాడుకున్నారన్న కాంగ్రెస్‌ ఆరోపణ?
కేసీఆర్‌ రైతు పక్షపాతి అనేది అందరికీ తెలుసు. రైతుల పరిస్థితిని బాగు చేయాలని, బంగారు తెలంగాణలో వారిని భాగస్వాములను చేయాలని, ఈ అప్పులనుంచి బయటకు రావాలని ఆలోచించే వ్యక్తి కాబట్టి ఎవరో చెబితే ఆ పాఠాలు తీసుకోవలసిన అవసరం లేదు. రైతులకు ఉచిత ఎరువులందిస్తామని దేశ చరిత్రలో ఇంతవరకు ఏప్రభుత్వమూ ప్రకటించలేదు. మొత్తం పంట పండించే భూమి విస్తీర్ణానికి ఎరువులు అందించే బాధ్యత నాది.. ఒక రూపాయి కూడా రైతు ఎరువుల కోసం పెట్టాల్సిన పనిలేదు అని దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.

రైతులందరికీ ఉచిత ఎరువులు ఇస్తారా?
గ్రామ రైతుసభలను ఏర్పాటు చేస్తాం. గ్రామ రైతు సంఘం అధ్వర్యంలో మా అధికారులు కలిసి గ్రామంలో ఉన్న రైతుల వివరాలను సేకరిస్తారు. రైతులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఎకరాలు ఉన్నాయి అని లెక్కపెడతారు. రైతుల భూమి పెరగదు. చేతులు మారుతుంది. భూమి రికార్డులను కంప్యూటర్లో ఎక్కించి ఏ గ్రామంలో ఎంతమంది రైతులున్నారో డేటా తీసుకుంటాం. ఉదా: ఒక గ్రామంలో రెండు వేల ఎకరాలుంది. ఒక ఎకరాకు నాలుగు వేల చొప్పున మొత్తం 80 లక్షల రూపాయలు వారికి ఆన్‌లైన్‌లో పంపిస్తాం.

పదెకరాలు, వందెకరాలు ఉన్న రైతుకు కూడా ఉచితంగా ఇస్తారా?
తెలంగాణలో మొత్తం 55 లక్షల మంది రైతులున్నారు. వీరందరికీ కలిపి ఒక కోటీ 5 లక్షల ఎకరాల భూమి ఉంది. అంటే తెలంగాణలో ఎకరం నుంచి రెండెకరాల భూమి ఉన్న సన్నకారు, చిన్నకారు రైతులే 95 శాతం పైగా ఉన్నారు. 5 శాతం మంది మాత్రమే పెద్ద రైతులున్నారు. చిన్నా, పెద్దా అందరికీ ఈ ప్రయోజనం వస్తుంది. రైతుల్లో మెజారిటీ చిన్నకారు, సన్నకారు కాబట్టి చిన్నా పెద్దా తారతమ్యాల్లేకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకీ ఈ విధానం అమలు చేస్తాం. రైతుకు నాలుగెకరాలు ఉంటే 16 వేల రూపాయలను మే నెలకు ముందే అతడి ఖాతాలో వేస్తాం.

రుణమాఫీ ఫెయిలైనందుకే ఈ ఎరువుల స్కీమ్‌ తెస్తున్నారని విమర్శపై?
భారతదేశంలో 17 వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వ పైకంతో రైతులకు రుణమాఫీ చేసిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే. రుణ మాఫీ వైఫల్యం కానే కాదు. 10 శాతం బ్యాంకులు సకాలంలో మద్ధతు ఇవ్వకపోవడమే మొదట్లో కాస్త ఇబ్బంది పెట్టిందంతే.

నిజంగా తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారా?
సంతోషంగా ఉన్నారు. ఒక సంవత్సరం కొంత ఆలస్యమై బాధపడ్డారు. తొలి సంవత్సరం అనుకున్న ప్రకారం వారి ఖాతాలోకి జమ చేశాం. తెలంగాణలో రాజకీయ నాయకులు సంతోషంగా లేరు కానీ రైతులయితే ప్రభుత్వంపట్ల సంతోషంగానే ఉన్నారు.

రాజకీయంగా వీక్‌ అవుతున్నందుకే ఉచిత ఎరువులు ఇస్తున్నారా?
రాజకీయంగా మేం వీక్‌ అవుతున్నామా? ఈ మధ్య కాలంలో జరిగిన ఏ ఎన్నికల్లో అయినా సరే డిపాజిట్లు రాకుండా పోయింది ఎవరికి? ప్రజల తీర్పు ఏవిధంగా ఉందనేది స్పష్టమైపోయింది.

ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను లాగేసుకోవడం అనైతికం కాదా?
శాసనసభలో హోదా ఉన్న వ్యక్తులు బలవంతంగా ఫిరాయింపులకు రారు. ప్రభుత్వ పరిపాలనకు ఆకర్షితులయ్యే వస్తారు. పార్టీ పట్ల ప్రేమ, నాయకుడి పట్ల విశ్వాసం, అభిమానం ఇవే ఇతరులు టీఆర్‌ఎస్‌లోకి రావడానికి కారణం. ప్రభుత్వ పరిపాలన ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంది. ప్రజల సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థవంతంగా చేస్తుంది అనే నమ్మకమే ఇతర పార్టీ నేతలను ఆకర్షిస్తోంది.

తెలంగాణలో విస్తరణకు బీజేపీ ప్రయత్నిస్తోంది కదా?
హైదరాబాద్‌లో వారికున్న ఆ అయిదు సీట్లు దక్కించుకుంటే వాళ్లకంటే గొప్పవాళ్లు ఉండరు. బీజేపీ కేంద్రనాయకులే వచ్చి ఊరూరా తిరిగినా ఇక్కడ వారికి ఒరిగేదేమీ ఉండదు. గ్రామగ్రామానా గట్టిగా పునాదిని పెంచుకున్న పార్టీ టీఆర్‌ఎస్‌. ప్రస్తుతం అసెంబ్లీలో 119 స్థానాలు ఉన్నాయికదా. వచ్చే ఎన్నికల్లో రెండు మూడు స్థానాలు తప్పితే 110 సీట్లను ఢంకా మోగించి మరీ మేమే గెలుస్తామని చెబుతున్నాను. నేను చెబుతున్న సంఖ్యను ఈరోజు మీరు రాసుకోండి. అంత విశ్వాసం మాకు ప్రజలపై ఉంది.

తెలంగాణను పాకిస్తాన్‌ చేస్తారా అని వెంకయ్యనాయుడే అనేశారు?
కులాల మీద, మతాలమీద రిజర్వేషన్‌ చేయవద్దు, సామాజిక ఆర్థిక స్థితిగతులపై ఆధారపడి రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయనే అన్నారు. తాను చెప్పిందే మేం చేస్తున్నాం. తేడా ఎక్కడుంది?

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరిస్థితి?
ఇప్పుడున్న సీట్లలో సగం సీట్లు కాపాడుకుంటే చాలు. అదే గొప్ప వారికి. మాకు 110 సీట్లు వస్తాయన్నాను. మిగతా పది స్థానాల్లో రెండు, మూడు మజ్లిస్‌కి వెళితే ఆ మిగిలిన ఆరేడు స్థానాలే కాంగ్రెస్‌కు వస్తాయి. హైదరాబాద్‌లో కూర్చుని మాట్లాడితే కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల వద్దకు వెళ్లి చూస్తేనే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతుంది.

ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని కోదండరామ్‌ అంటున్నారు?
పాదయాత్ర చేసినంత మాత్రాన, నాలుగూళ్లు తిరిగినంత మాత్రాన ప్రజ లకు విశ్వాసం కలగాలి కదా. నాయకుడి పట్ల, ప్రభుత్వం పట్ల, పరిపాలన పట్ల ప్రజలకు విశ్వాసం కలిగితే మీకు ఎన్ని చెప్పినా ప్రయోజనం లేదు. ప్రజలకు టీఆర్‌ఎస్‌ పట్ల, కేసీఆర్‌ పట్ల అచంచల విశ్వాసం ఉంది. ఈ నేపథ్యంలో ఎవ్వరూ ఏమీ చేయలేరు. మాకు జరిగే నష్టమూ లేదు.

ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు అని కేసీఅర్‌ అన్నారు. కానీ బాబు నింపాదిగా పనిచేసుకుంటున్నారు.?
చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దీంట్లో ప్రభుత్వం భాగస్వామ్యం లేదు. అధికారులు వారి పని వారు చేసుకుని పోతున్నారు. ఈ కేసులో ఎవరికి ఏ విధమైన శిక్ష పడాలో  అది పడే తీరుతుంది. ఇంతకుమించి నేను వివరించలేను కూడా.

ప్రతినిత్యమూ తెలంగాణ బిడ్డలు 15మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. తెలంగాణ వ్యక్తులుగా మేం దీన్ని భరించలేకపోతున్నాం. దయచేసి మీ నోటి నుంచి జై తెలంగాణ అని ఒక్క మాట అనండి చాలు. నేను ఎక్కడికీ పోను టీడీపీలోనే ఉంటాను అని చంద్రబాబుతో అన్నాను. ఆమాట అనడానికి బాబు ఒప్పుకోలేదు. బిడ్డల ఆత్మబలిదానం భరించలేకపోతున్నాను. నేను పార్టీ మారతాను అని చెప్పి రాజీనామా లేఖ రాసి మరీ 2010లో బయటకు వచ్చాను.
 

(పోచారం శ్రీనివాసరెడ్డితో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)
https://goo.gl/5o46Xk


https://goo.gl/0UDV02

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement