అందరూ కలిసే కొంపముంచారు..! | kommineni srinivasarao interviews Sridhar babu | Sakshi
Sakshi News home page

అందరూ కలిసే కొంపముంచారు..!

Published Wed, Nov 30 2016 1:22 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

అందరూ కలిసే కొంపముంచారు..! - Sakshi

అందరూ కలిసే కొంపముంచారు..!

మనసులో మాట

వైఎస్సార్ చనిపోవడం చాలా దురదృష్టకరమైన ఘటన. ఆంధ్రప్రదేశ్ చరిత్రనే అది మార్చిపడేసింది. ఆయన మరణం తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలను, రగులుతున్న తెలంగాణ ఉద్యమాన్ని ఎలా పరిష్కరించాలనే విషయంలో కాంగ్రెస్ పార్టీ అనేక నిర్ణయాలు చేసింది. ఆ నిర్ణయాల వల్లే మేం ఇవ్వాళ ఇలా ఉన్నాం.
 
ఏపీలో, తెలంగాణలో కాంగ్రెస్ కొంప మునగడానికి అందరూ కారణమేనంటున్నారు మాజీ స్పీకర్ శ్రీపాదరావు తనయుడు, మాజీమంత్రి, మాజీ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు. అధిష్టానం చాలా ఆలస్యంగా తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం, సీఎం పదవిలో ఉండికిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించడం.. రాజకీయంగా ఏ రకంగా లబ్ధిపొందుతాం అనే వ్యూహంపై పార్టీలో జరిగిన లోపం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు.. ఇలా అన్నీ కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగాయని చెప్పారు.

రాజశేఖరరెడ్డి తనయుడిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉండి మరింత బాధ్యతాయుత స్థానాన్ని చేపట్టాలని అందరం అనుకున్నా ఘటనలు మరోరకంగా పరి ణమించాయన్నారు. జగన్, తెలంగాణ వంటి అంశాల్లో కొంతమంది సీనియర్ల అభిప్రాయం తీసుకున్నప్పుడు అధిష్టానం తనవంతుగా ఆలోచించి ఒక వ్యూహాన్ని చేపట్టలేదని వాపోయారు. తెలంగాణ ఇచ్చేదీ, తెచ్చేదీ కాంగ్రెస్ పార్టీనే అనే విషయం పక్కకు వెళ్లి, కేసీఆర్ కాంగ్రెస్ మెడలు విరిచి తెలంగాణను తెస్తున్నాడు అనే అభిప్రాయం ముందుకు రావడమే కాంగ్రెస్ పరాజయానికి కారణం అంటున్న దుద్దిళ్ల శ్రీధర్ బాబు అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..
 
నక్సలైట్లు నాన్నపై ఆకస్మికంగా ఎందుకు దాడి చేశారు?
ఆ ఘటన గురించి ఆలోచిస్తుంటే అయన్ని ఎందుకు చంపారన్నది ఈరోజుకు కూడా మాకు షాకింగ్ గానే ఉంటుంది. ఎవరేం మాట్లాడుకున్నా, నాన్న ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేవారు. మానవత్వంతో వ్యవహరించేవారు. ప్రత్యేకించి మా ప్రాంతం చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంటుంది. పైగా అటవీప్రాంతం. అక్కడి సామాజిక పరిస్థితులు, నక్సల్ ప్రభావం, ఏదైనా కావచ్చు...ఆ ప్రాంత సమస్యలు వేరే విధంగా ఉంటాయి. అక్కడ ఉన్నవారికే అవి తెలుస్తాయి. నాన్న విషయంలో తాము చేసింది పొరపాటే అనే అభిప్రా యాన్ని కూడా వారు వ్యక్తపరిచినట్లు పేపర్లలో చదివాం.

వైఎస్‌ఆర్‌తో మీ అనుబంధం గురించి చెప్పండి?
రాజకీయ జీవితం మొదలైంది వారితోనే. నాన్న చనిపోయాక వైఎస్సార్ మా ఇంటికి వచ్చినప్పుడు కుటుంబంలోంచి ఎవరో ఒకరు రాజ కీయంలోకి రావాలి అని చెప్పారు. సీనియర్ నేతలు ప్రోత్సహించారు. అలా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ నన్ను చాలా బాగా చూసుకునేవారు. యువ రాజకీయ నేతలను ప్రోత్సహించడం ఆయన ప్రాథమ్యం. ఆయన మంత్రి వర్గంలో పనిచేయడం గొప్ప అనుభవం. డైనమిక్ నిర్ణయాలు తీసుకునేవారు. ఇవ్వాళ ఉదయం ఒక కార్యక్రమం తీసుకుంటే దానికి ఒక గంటలో పరిష్కారం వచ్చేలా చూసే వారు. పార్టీ వ్యవహారాల్లో కాని, అసెంబ్లీలో వ్యవహారాలను ఎలా సజావుగా నిర్వహిం చాలి అనే విషయంలో కాని ఆయనలో ఎప్పుడూ ఒక సానుకూల దృక్పథం కనిపించేది.
 
జగన్‌మోహన్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ ప్రజాస్వామికంగా వ్యవహరించిందా?
వైఎస్‌ఆర్ మరణం తర్వాత ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేయాలి అంటూ 140 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. కారణాలేవయినా సరే అధిష్టానం వ్యతిరేకించింది. మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. ఆ సమయంలో జగన్‌పై కొందరు వ్యతిరేకంగా చెప్పడం నిజం. జగన్ యువకుడు. కొద్దిగా సర్దుకుని పోతే మంచిదని మేమనుకున్నాం. తనపై మేం చాలా పాజిటివ్ గానే ఉన్నాము. అరుుతే అధిష్టానం ఏ నిర్ణయాలు తీసుకున్నా, మేం తప్పకుండా దాన్ని పాటించాల్సిందే. అంత కష్టమైన సమయంలో ఒక సీనియర్ నేతను సీఎంగా పెట్టాలన్న నిర్ణయం తీసుకున్నప్పుడు మాలాంటి యువకులం కూడా ఓపికతో ఉండాలి.

కాంగ్రెస్ మునిగిపోవడానికి కారణం ఎవరు? అధిష్టానమా, కిరణా, లేక మీరందరూనా?
అందరి ప్రమేయం ఉండి ఉండొచ్చండి. అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత  కిరణ్ దాన్ని వ్యతిరేకించకూడదు. అధిష్టానం తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ‘అది ఫైనల్. అది ఆగే ప్రసక్తి లేదన్నా’ అని మేము ఆయనకు చెప్పాం. కానీ కిరణ్ తన అభిప్రాయం మాకు తెలుపలేదు. ఆ తర్వాత మాకు చాలా గ్యాప్ వచ్చేసింది. రాజకీయంగా ఏవిధంగా లబ్ధి పొందుతాం అనే స్ట్రాటజీ లోపం వల్ల కాంగ్రెస్ దెబ్బతినింది. పైగా రాష్ట్రంలో మేం పదేళ్లు అధికారంలో ఉన్నాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది కూడా దానికి జతకూడింది.

కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేసినా మీరు భయపడిపోయారా?
తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నప్పుడు నాలుగేళ్లపాటు ఏపీలోనూ సెంటి మెంట్ పెరిగిపోయింది. కిరణ్‌పై ఏదైనా చర్య తీసుకుంటే ఏపీలో సెంటిమెంటు ఇంకా రెచ్చిపోయే ప్రమాదం ఉందని కూడా అనుకున్నాం. ఏం చేద్దాం అనే విషయంపై కొంతమంది సీనియర్ల అభిప్రాయం తీసుకున్నప్పుడు అధిష్టానం చాలా ఆలోచన చేసి ఒక వ్యూహాన్ని చేపట్టవలసింది. కాని అలా జరగలేదు.

జగన్‌పై, కొందరు కాంగ్రెస్ మంత్రులపై కేసులు పెట్టడం కరెక్టేనా?
ఆరోజు జరిగిన సంఘటనలు బాధాకరం. అలా జరగకుండా ఉండాల్సింది. అవన్నీ కాంగ్రెస్ పార్టీపైనే ప్రభావం చూపారుు. దేశ చరిత్రలోనే అత్యంత గొప్ప ప్రజా నేత వైఎస్‌ఆర్. కాంగ్రెస్ రాష్ట్రంలో పటిష్టం కావడానికి ఆయన పాత్ర చాలా ఉంది. ఆయన చనిపోయిన తర్వాత ఆ సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. అదే సమయంలో సోదరులు జగన్ కూడా కొద్దిగా ఓపిక పట్టాల్సి ఉండె. కేసులు ఎందుకు పెట్టారు, ఎలా పెట్టారు, ఎవరి ప్రమేయమయినా ఉందా అని తెలీదు కాని అలా జరగకుండా ఉండాల్సింది.

జగన్ ఓదార్పుయాత్రకు వెళతానంటే కూడా వ్యతిరేకించడం ఏమిటి?
ఓదార్పుయాత్రపై అధిష్టానానికి వ్యతిరేకంగా చెప్పినప్పుడు తాను పార్టీకోసమే చేస్తున్నాను కానీ వ్యక్తిగతంగా కాదని జగన్ కూడా అధిష్టానానికి నచ్చచెప్పాల్సింది. కాని ఆయన ఆ మార్గంలో వెళ్లలేదు. మా వైఎస్సార్ తనయుడాయన. మాతోనే ఉండాల్సింది. ఇవాళ ఆయన ప్రధాన పాత్రలో ఉంటే చూసి ఉండేవాళ్లం. అది చూడలేకపోయామన్నదే బాధ.

కిరణ్ సీఎం అయిన తర్వాత జరుగుతున్న పరిణామాలను చక్కదిద్దలేకపోయారా?
చక్కదిద్దడానికి వీల్లేనంతగా ఉద్యమం తీవ్ర స్థాయికి వెళ్లింది. ముఖ్యమైన విష యం ఏమిటంటే వైఎస్సార్ లాంటి స్ట్రాంగ్ లీడర్ ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. పాలనాపరంగా కిరణ్ స్ట్రాంగ్. కానీ రాజకీయంగా కాదు. రాష్ట్ర విభజన చేయ వద్దు అనే ఆలోచనతో ఒక సీఎంగా ఆయన బయట పడకూడదు. రెండు ప్రాంతాలకు ఆయన ముఖ్యమంత్రి. ఆ స్థానంలో ఉండి ఒక ప్రాంతానికి అనుకూలంగా అసలు రావద్దు.

తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ ఎవరికి దక్కింది?
సోనియా గాంధీ పూనుకోకపోయి ఉంటే ఈరోజుకీ ప్రత్యేక రాష్ట్రం రాకపోయి ఉండేదని తెలంగాణ ప్రజల్లో ఇప్పటికీ బలంగానే అభిప్రాయం ఉంది. ప్రజానీకం మొత్తంగా ఆరోజు టీవీల చుట్టూనే ఉన్నారు. తెలియనిది ఎవరికి?

ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఈ రెండు పాత్రల్లో వైఎస్సార్, చంద్రబాబుపై మీ అంచనా?
ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు వైఎస్సార్ ప్రజాసమస్యలను బలంగా ఎత్తిచూపారు. విద్యుత్ చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా పార్టీ నేతలందరం నిరాహార దీక్ష చేశాం. అది ప్రజలందరికీ మేలు కలిగించే అంశం. ఇక సీఎంగా ఉన్నప్పుడు ఆయన తీసుకున్న విధానాలు ఎంతోమందికి ఉపయోగపడు తున్నాయి. ఈ రోజు పల్లెల్లోకి మీరెళ్లినా ఈ విషయం బోధపడుతుంది. బాబు పాలనలో జన్మభూమి సభలకు వెళ్లినప్పుడు మేం చూశాం. రూ. 200ల పించను తీసుకోవాలంటే అర్హులలో కొందరు చనిపోతే ఇతరు లకు ఆ అవకాశం వస్తుంది అనే అభిప్రాయం సృష్టించారు. వైఎస్‌ఆర్ హయాంలో అలాంటి పరిస్థితే లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికీ వృద్ధాప్యం పించన్ ఇచ్చేవారు.

మోదీ పెద్దనోట్ల రద్దుపై మీ అభిప్రాయం?
ఇది చాలా ఇబ్బందికరమైన కార్యక్రమం. గ్రామీణ ప్రాంతంలో నేటివరకూ నోట్ల చలామణి లేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పెద్ద నిర్ణయం గోప్యంగానే ఉండాలి. ముందుగా ఎవరికీ తెలియకూడదు. కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ప్రజ లను ఇబ్బంది పెట్టే ఆస్కారం ఉన్నప్పుడు ఇది నిజంగానే ఆర్థిక ఎమర్జెన్సీ లాంటిదే. కష్టపడి సంపాదించిన సొంత డబ్బును కూడా తీసుకోవడానికి సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారంటే ఇది ఒకరకంగా ఎమర్జెన్సీయే.
(దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకులో చూడండి)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement