
హైబిజ్ టీవీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
మాదాపూర్: వాణిజ్యం, వ్యాపారం లేకుండా ప్రభుత్వాలు, వ్యవస్థలు నడవలేవని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో గురువారం హైబిజ్ టీవీ బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2వ ఎడిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కీలక రంగాలలో అమూల్యమైన సేవలు అందించిన వారికి అవార్డులను అందజేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏడాదికాలంలో ప్రభుత్వం వ్యాపారరంగ అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించిందని తెలిపారు.
2023లో తెలంగాణ అభివృద్ధి 2ఎక్స్‌గా ఉందని, రాబోయే నాలుగు సంవత్సరాలలో దాన్ని 10ఎక్స్‌కు చేరుస్తామన్నారు. తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో రూ.1.7 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రం సాధించడమే అందుకు నిదర్శనమని చెప్పారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అలాంటి వారిని గుర్తించి ప్రోత్సహిస్తున్నందుకు హర్షం వ్యక్తంచేశారు.
పారిశ్రామిక రంగానికి ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 11 మందికి లెజెండ్ పురస్కారాలను అందజేశారు. సీఎస్‌ఆర్ కేటగిరీలలో ఉత్తమ గ్రూప్‌గా ఐటీసీకి అవార్డు దక్కింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, టీజీఐఐసీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, సుచిరిండియా సీఈఓ డాక్టర్ లయన్ వై.కిరణ్, భారతీ సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, హైబిజ్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment