![Minister Sridhar Babu meets with World Bank team](/styles/webp/s3/article_images/2025/02/13/sridhar%20babu.jpg.webp?itok=q9vtXUXN)
ప్రపంచ బ్యాంకు బృందంతో మంత్రి శ్రీధర్‌బాబు భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 93 లక్షల గృహాలను డిజిటల్ కనెక్టివిటీ పరిధిలోకి తీసుకువస్తున్నట్లు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu) వెల్లడించారు. టీ ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించామన్నారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు(World Bank representatives) బుధవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యారు. డిజిటల్ కనెక్టివిటీలో భాగంగా పైలట్ ప్రాజెక్టును చేపట్టిన నాలుగు గ్రామాల్లో ఇటీవల ప్రపంచ బ్యాంకు బృందం పర్యటించింది.
ఈ భేటీలో తమ క్షేత్రస్థాయి పర్యటన అనుభవాలను మంత్రితో పంచుకుంది. హాజిపల్లి (రంగారెడ్డి జిల్లా), మద్దూర్ (నారాయణ్‌పేట), సంగుపేట (సంగారెడ్డి), అడవి శ్రీరాంపూర్ (పెద్దపల్లి) గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీతో స్థానికులకు కలిగిన ప్రయోజనాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నట్టు బృందం సభ్యులు వైజయంతీ దేశాయ్, కింబర్లీ జాన్స్.. మంత్రికి వివరించారు.
వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు డిజిటల్ కనెక్టివిటీ విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు శ్రీధర్‌బాబు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికే 32 వేల కి.మీ. పొడవున ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌ను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేశ్ మిశ్రా, టీ ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్, ప్రపంచబ్యాంకు ప్రతినిధులు ఇషిరా మెహతా, అరుణ్ శర్మ, స్యూ సంజ్ ఎంగ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment