world bank team
-
93 లక్షల గృహాలకు డిజిటల్ కనెక్టివిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 93 లక్షల గృహాలను డిజిటల్ కనెక్టివిటీ పరిధిలోకి తీసుకువస్తున్నట్లు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu) వెల్లడించారు. టీ ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించామన్నారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు(World Bank representatives) బుధవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యారు. డిజిటల్ కనెక్టివిటీలో భాగంగా పైలట్ ప్రాజెక్టును చేపట్టిన నాలుగు గ్రామాల్లో ఇటీవల ప్రపంచ బ్యాంకు బృందం పర్యటించింది. ఈ భేటీలో తమ క్షేత్రస్థాయి పర్యటన అనుభవాలను మంత్రితో పంచుకుంది. హాజిపల్లి (రంగారెడ్డి జిల్లా), మద్దూర్ (నారాయణ్‌పేట), సంగుపేట (సంగారెడ్డి), అడవి శ్రీరాంపూర్ (పెద్దపల్లి) గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీతో స్థానికులకు కలిగిన ప్రయోజనాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నట్టు బృందం సభ్యులు వైజయంతీ దేశాయ్, కింబర్లీ జాన్స్.. మంత్రికి వివరించారు.వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు డిజిటల్ కనెక్టివిటీ విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు శ్రీధర్‌బాబు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికే 32 వేల కి.మీ. పొడవున ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌ను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేశ్ మిశ్రా, టీ ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్, ప్రపంచబ్యాంకు ప్రతినిధులు ఇషిరా మెహతా, అరుణ్ శర్మ, స్యూ సంజ్ ఎంగ్ పాల్గొన్నారు. -
ప్రపంచబ్యాంకు బృందంతో చంద్రబాబు భేటీ
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు మంగళవారం సచివాలయంలో ప్రపంచబ్యాంకు ప్రతినిధులతో సమావేశమయ్యారు. సుమీల గుల్యాని, జూప్ స్టౌట్ జెస్డిజిక్, డాక్టర్ రాజగోపాల్సింగ్తో సమావేశమైనట్లు చంద్రబాబు ఎక్స్‌లో తెలిపారు. నీటిపారుదల ప్రాజెక్టులు, డ్యాముల భద్రత, రివర్ మేనేజ్మెంట్, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్యం అంశాలపై సహకరించాలని వారిని కోరినట్లు తెలిపారు. ప్రపంచబ్యాంకు బృందం ఇందుకు సమ్మతి తెలిపిందని పేర్కొన్నారు. -
ఏపీకి ప్రపంచ బ్యాంక్ బృందం రాక
సాక్షి, అమరావతి: ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందం మంగళవారం రాష్ట్రంలో పర్యటించనుంది. తూర్పు ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో ఆర్బీకే తరహాలో సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ ఆర్థిక చేయూత అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్యతో పాటు కేంద్ర ప్రభుత్వం, వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల బృందం గత నెలలో ఇథియోపియాలో పర్యటించింది. ఏపీ వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న వినూత్న విధానాలను అధ్యయనం చేసేందుకు వరల్డ్ బ్యాంక్‌లోని అగ్రికల్చర్ అండ్ ఫుడ్ గ్లోబల్ ప్రాక్టీస్ సీనియర్ కన్సల్టెంట్ హిమ్మత్ పటేల్ నేతృత్వంలోని ఈ బృందం ఢిల్లీ నుంచి మంగళవారం ఉదయం 8.45 గంటలకు విజయవాడ చేరుకోనుంది. గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, ఆర్బీకే చానల్‌ను సందర్శిస్తారు. అక్కడ నుంచి పెనమలూరు మండలం వణుకూరు చేరుకుని ఆర్బీకే కేంద్రాన్ని సందర్శించి రైతులతో భేటీ అవుతారు. అనంతరం ఘంటసాలలోని కేవీకేని సందర్శిస్తారు. అనంతరం విజయవాడ చేరుకుని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో భేటీ అవుతారు. వ్యవసాయ, అనుబంధ శాఖల ద్వారా అమలవుతున్న వివిధ కార్యక్రమాలను పరిశీలిస్తారు. -
వత్తి నుంచి వత్తికి
సునీతా గాంధీ ప్రపంచబ్యాంకులో ఆర్థికవేత్తగా పనిచేశారు. అప్పటికే ఆమె మన విద్యా విధానం మీద పి.హెచ్డి. చేశారు. దానికొక ప్రయోజనం ఉండాలి కదా! ఉత్తరప్రదేశ్‌లోని మహిళలను విద్యా వంతులుగా తీర్చిదిద్దాలనుకున్నారు. అందుకోసం ప్రపంచ బ్యాంకులో తన ఉద్యోగాన్నే విడిచిపెట్టారు. ఇప్పటివరకు సుమారు వెయ్యి మంది మహిళల్ని వేలి ముద్రలు వేసే స్థితి నుంచి సంతకాలు పెట్టే స్థాయికి తీసుకువచ్చారు. ఆమె పెట్టిన చదువు దీపం వత్తి్త నుంచి వత్తికి వెలుగును వ్యాప్తి చేస్తూనే ఉంది. కొన్ని వారాల క్రితం గుడ్డీ (35) తన భర్తతో కలిసి కొన్ని డాక్యుమెంట్లు తీసుకోవడం కోసం తాసీల్దారు ఆఫీసుకి వెళ్లింది. అవి తీసుకున్నాక, భర్త వంగి వేలిముద్ర వేయబోతుంటే అతడిని వారించి, పక్కనే ఉన్న పెన్ను తీసుకుని రిజిస్టర్లో తన పూర్తి పేరును సంతకం చేసింది గుడ్డీ. అది చూసి ఒక్కసారిగా షాకైన భర్త ముఖం చూసింది. ఆమెకు చదవడం, రాయడం వచ్చన్న విషయం ఆ క్షణం వరకు అతడికి తెలియదు. తను బాగా చదువుకుని, తన భర్తకు కూడా చదువు నేర్పాలన్నది ఇప్పుడు గుడ్డీ ధ్యేయం. ఈ సంఘటన గుడ్డీ స్నేహితురాలైన ద్రౌపది (47)లో కొత్త ఆశలు రేపింది. ఆమె పంచాయతీ సభ్యురాలు. ఆఫీసుకి సంబంధించిన కాగితాలలో ఒక్క పదం కూడా అర్థం కాకుండానే కళ్లు మూసుకుని సంతకం పెట్టే ద్రౌపది ఇప్పుడు అక్షరాలు, పదాలు, వాక్యాలు నేర్చుకోవడంతో అన్నీ అర్థం చేసుకోగలుగుతోంది. కలల బోయీలు : టూల్ కిట్ వలంటీర్లు ఒకరిని చూసి ఒకరు ఉత్తరప్రదేశ్‌లోని కరౌనీ గ్రామంలో ఇలా ఒకర్నుంచి ఒకరుగా చదువుకున్న మహిళలు ఎనిమిది వందల మందికి పైగానే ఉన్నారు. ఇదంతా ‘గ్లోబల్ డ్రీమ్ లిటరసీ మిషన్’ కృషి ఫలితమే. ఇంత ఫలవంతమైన అక్షరాస్యతా కార్యక్రమాన్ని సునీతా గాంధీ అనే విద్యావేత్త నాలుగు సంవత్సరాల క్రితమే ప్రారంభించారు. ‘దేవీ సంస్థాన్’ అనే ఎన్జీవోని కూడా నెలకొల్పి, దాని ద్వారా ఈ ప్రాజెక్టుకి ఆర్థిక సహకారం అందచేస్తున్నారు సునీత. కలల పెట్టె నిరక్షరాస్యులలో చదువుకోవాలన్న ఆసక్తి కలిగించడం కోసం సునీత ఒక టూల్ కిట్‌ను రూపొందించారు. ఒక చిన్న కార్డ్‌బోర్డు ఉంటుంది. ఆ బాక్స్ మీద ‘గ్లోబల్ డ్రీమ్ టూల్ కిట్, కేవలం 50 రూపాయలు మాత్రమే’ అని రాసి ఉంటుంది. దానిని గ్రామాలలోకి తీసుకెళ్లి విక్రయిస్తుంటారు విద్యా వలంటీరు. ఆ కిట్‌లో పలక, బలపం, డస్టర్, 30 కథల పుస్తకాలు, ప్లాస్టిక్ అక్షరాలు, బొమ్మల కార్డులు, వీటితోపాటు కూర్చోవడానికి ఒక రగ్గు ఉంటాయి. కరౌనీలో విద్యావ్యాప్తికి ఈ కిట్ బాక్సు ఎంతగానో తోడ్పడింది. ప్రస్తుతం కరౌనీతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని మరిన్ని గ్రామాలలో అక్షరాస్యులను పెంచే యోచనలో ఉన్నారు సునీతా గాంధీ. ప్రేరణ.. ఎర్నాకులం సునీత యు.కె.లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్డి. పట్టా పొందారు. ప్రపంచ బ్యాంకులో ప్రాజెక్టు మేనేజర్‌గా పది సంవత్సరాలు పనిచేశారు. అనంతరం బయటికి వచ్చి, పద్నాలుగు దేశాలలోని ప్రధాన పాఠశాలల మీద స్టడీ చేశారు.ఆమె తండ్రి జగదీశ్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరంలో ‘సిటీ మాంటిస్సోరీ’ స్కూల్ వ్యవస్థాపకులలో ఒకరు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో విద్యార్థులు చదువుతున్న పాఠశాల ఇది. అయితే సునీతకు స్ఫూర్తిని ఇచ్చింది తండ్రి స్థాపించిన ఈ స్కూలు కాదు. కేరళలోని ఎర్నాకులం జిల్లా కేవలం ఒక సంవత్సర కాలంలోనే నూరు శాతం అక్షరాస్యతను సాధించడం.. సునీతకు ఇవన్నీ చేయడానికి ప్రేరణను ఇచ్చింది. –డా. వైజయంతి -
ప్రపంచ బ్యాంకు తనిఖీ బృందం నివేదిక మాయం
-
ప్రపంచ బ్యాంకు తనిఖీ బృందం నివేదిక మాయం
సాక్షి, అమరావతి: ప్రపంచ బ్యాంకు అధికారిక వెబ్సైట్ నుంచి ఏపీ రాజధాని ప్రాంతంపై తనిఖీ బృందం నివేదిక మాయం అయింది. ఆదివారం రాత్రి వరకు వెబ్సైట్లో తనిఖీ బృందం సిఫార్సులతో కూడిన నివేదిక అందుబాటులో ఉండింది. సోమవారం ఉదయం నుంచి అది కనిపించడం లేదు. ప్రభుత్వ పెద్దలే ఢిల్లీలోని ప్రపంచ బ్యాంకు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి తనిఖీ బృందం నివేదికను వెబ్సైట్ నుంచి తీయించారని అధికార వర్గాలు, రాజధాని ప్రాంత రైతులు అభిప్రాయపడుతున్నారు. తనిఖీ బృందం పూర్తి స్థాయి నివేదిక అందుబాటులో ఉంటే ప్రభుత్వం చెబుతున్న అంశాలకు, తనిఖీ బృందం పేర్కొన్న అంశాల మధ్య వ్యత్యాసాలు, వాస్తవ పరిస్థితులు అందరికీ తెలిసిపోతాయని, తద్వారా అంతర్జాతీయంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఒత్తిడి తెచ్చి తొలగించారని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ప్రపంచ బ్యాంకు తనిఖీ బృందం నివేదిక పబ్లిక్ డిస్కోలజర్ పేరుతోనే వెబ్సైట్లో ఉంచారు. అంటే ప్రజలందరికీ ఆ నివేదిక అందుబాటులో ఉండాలనేది బ్యాంకు అభిమతం. పత్రికల్లో తనిఖీ నివేదిక సారాంశం గురించి వార్తలు రావడంతో నివేదిక వెబ్సైట్లో కనిపించడం లేదంటే కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పెద్ద స్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు అర్థం అవుతోందని ఆ అధికారి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు న్యూఢిల్లీ విభాగం ఆ నివేదిక స్థానంలో పత్రికా ప్రకటనను వెబ్సైట్లో ఉంచింది. అమరావతి సుస్థిర కేపిటల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై ప్రపంచ బ్యాంకు తనిఖీ బృందం నివేదిక తమ అంతర్గత వ్యవహారమని, ఈ నివేదిక ఆధారంగా బ్యాంకు బోర్డు తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. బ్యాంకు విధానాల్లో తనిఖీ తప్పనిసరి ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టులను తనిఖీ బృందం పరిశీలించడం తప్పనిసరి అని, దీని వల్ల అమరావతి ప్రాజెక్టు ప్రతిపాదనలపై ఎటువంటి ప్రభావం ఉండదని బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో వివరించింది.బ్యాంకు బృందం రాష్ట్ర ప్రభుత్వంతో పని చేస్తుందని, ప్రతిపాదనలు, డిజైన్లు, బ్యాంకు ఆర్థిక సాయం అంగీకరించిన షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుందని పేర్కొంది. -
సర్కారి మాట అసత్యాల మూట!
-
సర్కారి వారి మాట అసత్యాల మూట!
సాక్షి, అమరావతి: రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పేవన్నీ అసత్యాలేనని ప్రపంచబ్యాంక్ తనిఖీ బృందం నిర్ధారణకు వచ్చింది. భూసమీకరణ(ల్యాండ్ పూలింగ్) స్వచ్ఛందమంటూ రాష్ట్రప్రభుత్వం, సీఆర్డీఏ చెప్పినదాంట్లో వాస్తవం లేదని గ్రహించింది. ఈ విషయంలో ఇన్నాళ్లుగా సీఆర్డీఏ చెప్పినదానికి, క్షేత్రస్థాయిలో పరిస్థితికి పొంతన లేకుండా ఉందని పేర్కొంది. భూసమీకరణ సందర్భంగా తమను బెదిరించినట్టు, భయోత్పాతానికి గురిచేసినట్టు రైతులు తమ తనిఖీల సందర్భంగా వెల్లడించినట్టు బృందం స్పష్టం చేసింది. అంతేగాక సామాజిక, ఆర్థిక, పర్యావరణం అంశాలతోపాటు ఆహారభద్రతపైనా సర్కారు చెప్పిన మాటల్లోనూ నిజం లేదన్న భావనను వ్యక్తం చేసింది. ప్రపంచబ్యాంక్ రాజధానిలో ప్రాజెక్టుకు అందించే ఆర్థిక సాయం 93 శాతం ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించిందేనంటూ.. ఈ ప్రాజెక్టు వల్ల సామాజిక, ఆర్థిక, పర్యావరణం అంశాలతోపాటు ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం పడుతుందన్న రైతులు, సామాజిక, పర్యావరణవేత్తల అభిప్రాయాలను తన నివేదికలో క్రోడీకరించింది. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో భూములు, జీవనోపాధి కోల్పోతున్న రైతులు, రైతుకూలీల నుంచి వచ్చిన తీవ్ర ఆరోపణలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. ముఖ్యంగా సామాజిక అంశాలు, జీవనోపాధి, ఆహార భద్రతపైన తీవ్ర ఆరోపణలున్నందున, వాటన్నింటిపైన పునర్విచారణ చేసిన తరువాతనే రాజధానిలో ప్రాజెక్టుకు రుణం మంజూరుపై నిర్ణయం తీసుకోవాలని ప్రపంచబ్యాంక్ తనిఖీ బృందం బ్యాంకు డైరెక్టర్లకు సలహా ఇచ్చింది. రాజధానికోసం ల్యాండ్ పూలింగ్‌లో భూములిచ్చిన రైతులతోపాటు జీవనోపాధి కోల్పోతున్న భూమిలేని రైతుకూలీలు, అలాగే పర్యావరణ, సామాజికవేత్తల ఫిర్యాదు మేరకు ప్రపంచబ్యాంక్ తనిఖీ బృందం ఆగస్టు 29, 30 తేదీల్లో రెండు రోజులపాటు రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాల్లో పర్యటించడం తెలిసిందే. ఆ పర్యటనకు ముందు సీఆర్డీఏ అధికారులతో సమావేశమై వివరాలు తీసుకుంది. ఆ వివరాల ప్రకారం పలు గ్రామాల్లోని రైతులతో సమావేశమై వారి అభిప్రాయాల్ని నేరుగా తెలుసుకుంది. పర్యటన సందర్భంగా రైతులనుంచి వ్యక్తమైన అభిప్రాయాలతోపాటు తనిఖీ సందర్భంగా తాము గమనించిన అంశాలతో నివేదికను ప్రపంచబ్యాంక్ బోర్డు డైరెక్టర్లకు సమర్పించింది. భూసమీకరణ స్వచ్ఛందమంటున్నా భూసమీకరణ స్కీము స్వచ్ఛందమని తొలినుంచీ సీఆర్డీఏ చెబుతోందని, అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని నివేదికలో తనిఖీ బృందం పేర్కొంది. కొంతమంది భూసమీకరణకు స్వచ్ఛందంగా భూములిచ్చామని పేర్కొన్నారని, అయితే మరికొందరు తమ నుంచి బలవంతంగా, భయోత్పాతానికి గురిచేసి తీసుకున్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని తెలిపింది. భూసమీకరణలోకి రాకుంటే మీ కుటుంబాలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ అధికారులతోపాటు, గుర్తు తెలియనివారు బెదిరించారని రైతులు చెప్పినట్టు పేర్కొంది. అదే సమయంలో ల్యాండ్‌పూలింగ్‌లో స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపింది. పూలింగ్ సమయంలో ప్రభుత్వం చెప్పినదానికి, వాస్తవంగా చేస్తున్నదానికి పొంతన లేదని ఆరోపించారని పేర్కొంది. పదేళ్ల కౌలుతోపాటు ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యబీమా, రుణమాఫీ చేస్తామని చెప్పినా ఇప్పటివరకు అమలు చేయలేదని తనిఖీలో వెల్లడైందని తెలిపింది. అలాగే ప్లాటు సైజు తగ్గించి ఇచ్చారని, మ్యాప్‌లో ప్లాటుకు, క్షేత్రస్థాయిలో ప్లాటుకు పొంతన లేదని పూలింగ్ రైతులు తెలిపినట్టు వివరించింది. సారవంతమైన భూముల్ని మెట్టభూములుగా చూపిస్తూ ప్లాటు విస్తీర్ణాన్ని తగ్గించారని, ఏడాదికివ్వాల్సిన కౌలు సొమ్ము ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల వారికి ప్లాట్ల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని పలువురు ఫిర్యాదు చేసినట్లు బృందం తెలిపింది. మరోవైపు భూసమీకరణకు భూములివ్వనివారి పొలాలకు విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడంతోపాటు బెదిరింపులకు పాల్పడ్డారని, విద్యుత్ కనెక్షన్ లేకపోవడంతో పంటలు వేయలేక నష్టపోయామని రైతులు స్పష్టం చేసినట్లు పేర్కొంది. కూలీల జీవనోపాధి దారుణం... ఇక భూమి లేని కూలీల పరిస్థితి దారుణంగా ఉందని తనిఖీ బృందం గుర్తించింది. భూమిలేని కూలీలు రాజధాని ప్రాంతంలో 20,259 మంది ఉన్నారని, వారికి నెలకు రూ.2,500 చొప్పునే పింఛన్ ఇస్తున్నారని, ఇది ఏమాత్రం జీవనోపాధికి సరిపోవట్లేదని పలువురు పేర్కొన్నారని తెలిపింది. రాజధాని ప్రాంత పొలాల్లో ఇంతకుముందు కూలీచేస్తే రోజుకు రూ.800 చొప్పున సంపాదించేవారమని, నెలకు రూ.19,000 ఆదాయం వచ్చేదని, ఇప్పుడు పనుల్లేక నెలకు కేవలం రూ.8,476లే వస్తోందని, దీంతో జీవనం కష్టంగా మారిందని వారు తెలిపినట్టు వివరించింది. ఆహారభద్రతపై సీఆర్డీఏ ఇచ్చిన నివేదికకు, క్షేత్రస్థాయి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని, రోజువారీ అవసరాలకు ఉపయోగపడే 120 రకాల పంటలు పండుతున్నాయని బృందం పేర్కొంది. రాజధాని ప్రాంత గ్రామాల్లో ప్రాజెక్టు కారణంగా శ్మశానాలు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు పోతున్నాయని, ఇది తమ మనోభావాలను దెబ్బతీస్తోందని పలువురు గ్రామస్తులు పేర్కొన్నారని, ఈ విషయాన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని తెలిపింది. అలాగే తనిఖీ సందర్భంగా రైతులు లిఖితపూర్వకంగా ఫిర్యాదులిస్తామన్నారని, కానీ కొందరు గొడవ సృష్టించి అరగంటలో ముగించేశారని, ఇలా ఎందుకు జరిగిందో అర్థం కాలేదని తన నివేదికలో వెల్లడించింది. మొత్తంగా ప్రపం చబ్యాంక్ విధానాలపై తీవ్ర ప్రతి కూల ప్రభావం చూపే అంశాలు న్నందున మరింత లోతుగా విచారణ చేశాకనే రుణం మం జూరుపై నిర్ణయం తీసుకోవాలని బృందం స్పష్టం చేసింది. పూర్వాపరాలివీ.. రాజధాని ప్రాంతంలో సీడ్ యాక్సెస్ రోడ్డుతోపాటు మరో ఏడు రహదారుల నిర్మాణం, రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రపంచబ్యాంక్ నుంచి రుణం తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. అయితే తొలుత రూ.ఏడువేల కోట్లు ప్రపంచబ్యాంక్ నుంచి రుణం పొందేందుకోసం కేంద్రానికి రాష్ట్ర సర్కారు ప్రతిపాదనలు పంపింది. అయితే ఈ మొత్తాన్ని కేంద్రం రూ.3,400 కోట్లకు కుదించింది. ఈ రుణమిచ్చేందుకు ప్రపంచబ్యాంక్ ఇంకా అంగీకారం తెలపలేదు. పర్యావరణ, సామాజిక ప్రభావ అంచనా, సామాజిక ఆర్థిక సర్వే నివేదికల రూపకల్పనలో ప్రస్తుత ప్రాజెక్టు ఉంది. అయితే తమ జీవితాల్ని నాశనం చేసి భూములు తీసుకున్నారని, ప్రపంచబ్యాంక్ విధానాల మేరకు సహాయ, పునరావాసం అమలు చేయట్లేదంటూ రాజధాని ప్రాంత రైతులు బ్యాంక్‌కు ఫిర్యాదు చేశారు. గతేడాది చేసిన ఫిర్యాదులను తిరస్కరించిన ప్రపంచబ్యాంక్ తనిఖీ బృందం ఈ ఏడాది జూన్‌లో మాత్రం క్షేత్రస్థాయి తనిఖీలకు అంగీకరించింది. ఆ మేరకు ఆగస్టు నెలలో రాజధాని ప్రాంతంలో పరిశీలించింది. తమ జీవనోపాధి దెబ్బ తిన్నదని రాజధాని ప్రాంత రైతు కూలీలు, కౌలు రైతులు చెప్పినట్లు పేర్కొన్న ప్రపంచ బ్యాంకు కమిటీ ఆహార పంటలు పండించడం లేదని సీఆర్డీఏ చెప్పిందన్న కమిటీ ల్యాండ్ పూలింగ్ స్వచ్ఛందమని చెప్పలేమని నివేదికలో పేర్కొన్న భాగం ఆహార భద్రత, పర్యావరణ ప్రభావంపై రైతుల అభిప్రాయాలను క్రోడీకరించిన భాగం -
మైక్రో ఏటీఎంల ద్వారా పింఛన్ల పంపిణీ : కలెక్టర్
విజయవాడ : మైక్రో ఏటీఎం ద్వారా జిల్లాలో 3.30 లక్షల మంది పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ బాబు.ఏ, ప్రపంచబ్యాంకు బృందానికి వివరించారు. నగరంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రపంచ బ్యాంక్ ప్రతినిదులు విలియం ప్రైస్, వర్గామరాథే, గౌతమ్ బరద్వాజ్ తూరుల్కన్నా, శశి, ఇంగ్టాండ్ ప్రతినిధి డారిన్, రైడర్లు కలెక్టర్‌తో బుధవారం సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అమలు జరుగుతున్న నగదు రహిత లావాదేవీలు, ఆధార్‌తో పింఛన్లు, ఫెర్టిలైజర్స్, ప్రజాపంపిణీ ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీపై ప్రపంచè బ్యాంకు సభ్యులకు వివరించారు. 1250 మందికి బిజినెన్ కరస్పాండెంట్ల ద్వారా ప్రతీ గ్రామం, ప్రతీ వార్డులోనూ బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో 40 వేల వాణిజ్య వ్యాపార సంస్థల్లో స్వైపింగ్ మిషన్లు ఏర్పాటుపై 120 బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ కుటుంబంలో కనీసం ఒకరికి బ్యాంకు ఖాతా, ఆధార్, ఎన్పీసీఐతో అనుసంధానం కలిగి ఉన్నాయని బృందానికి తెలిపారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్ రాజు, డీడీవో అనంతకృష్ణ పాల్గొన్నారు. -
జిల్లాలో ప్రయోగాత్మకంగా అటల్ పింఛన్
విజయవాడ : ప్రపంచబ్యాంకు సహకారంతో పేద ప్రజలకు లబ్ధిచేకూరేలా అటల్ పింఛన్ యోజన (ఏపీవై)ను జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలుచేస్తామని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రపంచబ్యాంకు సీనియర్ కన్సల్టెంట్లు పారుల్ సే«ద్ ఖన్నా, గౌతమ్ భరద్వాజాతో ఏపీవై పథకం అమలుపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఏపీవై అమలుకు ప్రపంచబ్యాంకు ముందుకురావడంతో పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలో అమలుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజాసాధికారిక సర్వేలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రన్న బీమా పథకంలో కోటీ 80 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారని వివరించారు. జిల్లాలో ఈ పథకం సమర్థంగా అమలవుతోందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు కలెక్టర్ వివరించారు. జిల్లాలో ఈపోస్ విధానంలో నగదు రహిత కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నాయని తెలిపారు. అటల్ పెన్షన్ యోజనను నగదు, కాగిత రహితంగా అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందించినట్లు వరల్డ్ బ్యాంకు కన్సల్టెంట్లు పారుల్ సే«ద్ ఖన్నా, గౌతమ్ భరద్వాజా కలెక్టర్‌కు తెలిపారు. జిల్లాలో ప్రతి పీడీఎస్ పరిధిలో బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా 20 శాతం లబ్ధిదారులను ఈ పథకంలో చేర్పించడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ పథకం కింద 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి, బ్యాంకు ఖాతాలు ఉన్నవారు అర్హులని వివరించారు. వయసును బట్టి నెలకు రూ.1000 నుంచి రూ.5000 వరకు పింఛన్ పొందే అవకాశం ఉందన్నారు. దీనికోసం గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నట్లు కన్సల్టెంట్లు కలెక్టర్‌కు వివరించారు. ఏపీవై నమోదు చాలా సులభతర రీతిలో కాగిత రహితంగా ఆంధ్రాబ్యాంకు, ఐడీఎఫ్సీ బ్యాంకుల ద్వారా అమలుచేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ డి.చంద్రశేఖరరాజు, ఎల్డీఎం వెంకటేశ్వరరెడ్డి, డీపీవో అనంతకృష్ణన్ పాల్గొన్నారు. -
లేపాక్షి ఆలయంలో ప్రపంచ బ్యాంక్ బందం
లేపాక్షి : లేపాక్షి దేవాలయాన్ని శుక్రవారం మధ్యాహ్నం ప్రపంచ బ్యాంక్ బృందం అధికారులు ఢిల్లీ నుంచి అనిజైగబ్‌మ్యాచు, సబ్జార్ మహమ్మద్ షేక్, రాష్ట్రం నుంచి నరసింహరావు, జిల్లా నుంచి సుధాకర్ సందర్శించారు. ఆలయంలోని అపురూపమైన శిల్పాలు, చిత్రలేఖనాలు తిలకించి ఆనందించారు. ఏడు శిరస్సుల నాగేంద్రుడు, 70 స్తంభాల్లో చెక్కిన లేపాక్షి డిజైన్లు, కల్యాణ మండపం, నాట్యమండపం, అంతరిక్ష స్తంభం చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ అర్చకులు సూర్యప్రకాష్‌రావు ద్వారా ఆలయ విశిష్టతను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని దుర్గాదేవి, వీరభధ్రస్వాముల వారికి విశేషంగా పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచ బ్యాంక్ బృందంలో భాగంగా ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ను బలోపేతం చేయడానికి ఇస్ని ప్రాజెక్ట్ ఉందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన దశలవారి శిక్షణ కార్యక్రమాలు, సామూహిక సీమంతాలు, అన్నప్రాశన తదితర కార్యక్రమాలపై ఆరా తీశామన్నారు. హిందూపురం సీడీపీఓ నాగమల్లేశ్వరీ, ఏసీడీపీఓ సునిత ఆయన వెంట ఉన్నారు. అదేవిధంగా కర్ణాటకలోని లా కమిషన్ చైర్మన్ ఎస్ఆర్ నాయక్ శుక్రవారం ఉదయం లేపాక్షి ఆలయం సందర్శించారు. ఆలయ విశిష్టతను గురించి ఆలయ అర్చకులు సూర్యప్రకాష్‌రావును అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు.