![World Bank Economist Sunitha Gandhi Special Story - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/27/sunitha.jpg.webp?itok=yMjiU9a1)
ఉద్యోగం వదలి.. విద్యా ఉద్యమ సారథ్యం డాక్టర్ సునీతా గాంధి
సునీతా గాంధీ ప్రపంచబ్యాంకులో ఆర్థికవేత్తగా పనిచేశారు. అప్పటికే ఆమె మన విద్యా విధానం మీద పి.హెచ్‌డి. చేశారు. దానికొక ప్రయోజనం ఉండాలి కదా! ఉత్తరప్రదేశ్‌లోని మహిళలను విద్యా వంతులుగా తీర్చిదిద్దాలనుకున్నారు. అందుకోసం ప్రపంచ బ్యాంకులో తన ఉద్యోగాన్నే విడిచిపెట్టారు. ఇప్పటివరకు సుమారు వెయ్యి మంది మహిళల్ని వేలి ముద్రలు వేసే స్థితి నుంచి సంతకాలు పెట్టే స్థాయికి తీసుకువచ్చారు. ఆమె పెట్టిన చదువు దీపం వత్తి్త నుంచి వత్తికి వెలుగును వ్యాప్తి చేస్తూనే ఉంది.
కొన్ని వారాల క్రితం గుడ్డీ (35) తన భర్తతో కలిసి కొన్ని డాక్యుమెంట్లు తీసుకోవడం కోసం తాసీల్దారు ఆఫీసుకి వెళ్లింది. అవి తీసుకున్నాక, భర్త వంగి వేలిముద్ర వేయబోతుంటే అతడిని వారించి, పక్కనే ఉన్న పెన్ను తీసుకుని రిజిస్టర్‌లో తన పూర్తి పేరును సంతకం చేసింది గుడ్డీ. అది చూసి ఒక్కసారిగా షాకైన భర్త ముఖం చూసింది. ఆమెకు చదవడం, రాయడం వచ్చన్న విషయం ఆ క్షణం వరకు అతడికి తెలియదు. తను బాగా చదువుకుని, తన భర్తకు కూడా చదువు నేర్పాలన్నది ఇప్పుడు గుడ్డీ ధ్యేయం. ఈ సంఘటన గుడ్డీ స్నేహితురాలైన ద్రౌపది (47)లో కొత్త ఆశలు రేపింది. ఆమె పంచాయతీ సభ్యురాలు. ఆఫీసుకి సంబంధించిన కాగితాలలో ఒక్క పదం కూడా అర్థం కాకుండానే కళ్లు మూసుకుని సంతకం పెట్టే ద్రౌపది ఇప్పుడు అక్షరాలు, పదాలు, వాక్యాలు నేర్చుకోవడంతో అన్నీ అర్థం చేసుకోగలుగుతోంది.
కలల బోయీలు : టూల్ కిట్ వలంటీర్‌లు
ఒకరిని చూసి ఒకరు
ఉత్తరప్రదేశ్‌లోని కరౌనీ గ్రామంలో ఇలా ఒకర్నుంచి ఒకరుగా చదువుకున్న మహిళలు ఎనిమిది వందల మందికి పైగానే ఉన్నారు. ఇదంతా ‘గ్లోబల్ డ్రీమ్ లిటరసీ మిషన్’ కృషి ఫలితమే. ఇంత ఫలవంతమైన అక్షరాస్యతా కార్యక్రమాన్ని సునీతా గాంధీ అనే విద్యావేత్త నాలుగు సంవత్సరాల క్రితమే ప్రారంభించారు. ‘దేవీ సంస్థాన్’ అనే ఎన్‌జీవోని కూడా నెలకొల్పి, దాని ద్వారా ఈ ప్రాజెక్టుకి ఆర్థిక సహకారం అందచేస్తున్నారు సునీత.
కలల పెట్టె
నిరక్షరాస్యులలో చదువుకోవాలన్న ఆసక్తి కలిగించడం కోసం సునీత ఒక టూల్ కిట్‌ను రూపొందించారు. ఒక చిన్న కార్డ్‌బోర్డు ఉంటుంది. ఆ బాక్స్ మీద ‘గ్లోబల్ డ్రీమ్ టూల్ కిట్, కేవలం 50 రూపాయలు మాత్రమే’ అని రాసి ఉంటుంది. దానిని గ్రామాలలోకి తీసుకెళ్లి విక్రయిస్తుంటారు విద్యా వలంటీరు. ఆ కిట్‌లో పలక, బలపం, డస్టర్, 30 కథల పుస్తకాలు, ప్లాస్టిక్ అక్షరాలు, బొమ్మల కార్డులు, వీటితోపాటు కూర్చోవడానికి ఒక రగ్గు ఉంటాయి. కరౌనీలో విద్యావ్యాప్తికి ఈ కిట్ బాక్సు ఎంతగానో తోడ్పడింది. ప్రస్తుతం కరౌనీతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని మరిన్ని గ్రామాలలో అక్షరాస్యులను పెంచే యోచనలో ఉన్నారు సునీతా గాంధీ.
ప్రేరణ.. ఎర్నాకులం
సునీత యు.కె.లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్‌డి. పట్టా పొందారు. ప్రపంచ బ్యాంకులో ప్రాజెక్టు మేనేజర్‌గా పది సంవత్సరాలు పనిచేశారు. అనంతరం బయటికి వచ్చి, పద్నాలుగు దేశాలలోని ప్రధాన పాఠశాలల మీద స్టడీ చేశారు.ఆమె తండ్రి జగదీశ్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరంలో ‘సిటీ మాంటిస్సోరీ’ స్కూల్ వ్యవస్థాపకులలో ఒకరు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో విద్యార్థులు చదువుతున్న పాఠశాల ఇది. అయితే సునీతకు స్ఫూర్తిని ఇచ్చింది తండ్రి స్థాపించిన ఈ స్కూలు కాదు. కేరళలోని ఎర్నాకులం జిల్లా కేవలం ఒక సంవత్సర కాలంలోనే నూరు శాతం అక్షరాస్యతను సాధించడం.. సునీతకు ఇవన్నీ చేయడానికి ప్రేరణను ఇచ్చింది. –డా. వైజయంతి
Comments
Please login to add a commentAdd a comment