
జిల్లాలో ప్రయోగాత్మకంగా అటల్ పింఛన్
విజయవాడ : ప్రపంచబ్యాంకు సహకారంతో పేద ప్రజలకు లబ్ధిచేకూరేలా అటల్ పింఛన్ యోజన (ఏపీవై)ను జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలుచేస్తామని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రపంచబ్యాంకు సీనియర్ కన్సల్టెంట్లు పారుల్ సే«ద్ ఖన్నా, గౌతమ్ భరద్వాజాతో ఏపీవై పథకం అమలుపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఏపీవై అమలుకు ప్రపంచబ్యాంకు ముందుకురావడంతో పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలో అమలుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజాసాధికారిక సర్వేలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రన్న బీమా పథకంలో కోటీ 80 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారని వివరించారు. జిల్లాలో ఈ పథకం సమర్థంగా అమలవుతోందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు కలెక్టర్ వివరించారు. జిల్లాలో ఈపోస్ విధానంలో నగదు రహిత కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నాయని తెలిపారు. అటల్ పెన్షన్ యోజనను నగదు, కాగిత రహితంగా అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందించినట్లు వరల్డ్ బ్యాంకు కన్సల్టెంట్లు పారుల్ సే«ద్ ఖన్నా, గౌతమ్ భరద్వాజా కలెక్టర్‌కు తెలిపారు. జిల్లాలో ప్రతి పీడీఎస్ పరిధిలో బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా 20 శాతం లబ్ధిదారులను ఈ పథకంలో చేర్పించడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ పథకం కింద 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి, బ్యాంకు ఖాతాలు ఉన్నవారు అర్హులని వివరించారు. వయసును బట్టి నెలకు రూ.1000 నుంచి రూ.5000 వరకు పింఛన్ పొందే అవకాశం ఉందన్నారు. దీనికోసం గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నట్లు కన్సల్టెంట్లు కలెక్టర్‌కు వివరించారు. ఏపీవై నమోదు చాలా సులభతర రీతిలో కాగిత రహితంగా ఆంధ్రాబ్యాంకు, ఐడీఎఫ్‌సీ బ్యాంకుల ద్వారా అమలుచేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ డి.చంద్రశేఖరరాజు, ఎల్‌డీఎం వెంకటేశ్వరరెడ్డి, డీపీవో అనంతకృష్ణన్ పాల్గొన్నారు.