2019లో జగనే ఏపీ సీఎం | Jagan Will Be CM: Superstar Krishna | Sakshi
Sakshi News home page

2019లో జగనే ఏపీ సీఎం

Published Fri, Jun 1 2018 2:56 AM | Last Updated on Thu, Jul 26 2018 7:14 PM

Jagan Will Be CM: Superstar Krishna - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎండ, వాన, చలి లెక్కచేయకుండా ప్రజల కోసం వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తుండటం నిజంగా చాలా గొప్ప విషయమని సినీ నటుడు కృష్ణ అభిప్రాయపడ్డారు.  గురువారం తన జన్మదినోత్సవం సందర్భంగా సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాస్‌రావుతో సాక్షి ‘మనసులో మాట’ కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణ, దివంగత సీఎం వైఎస్‌తోనూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనూ తన అనుబంధాన్ని ఈ సందర్భంగా పంచుకున్నారు.

గతంలో వైఎస్‌ను కలిసేందుకు వారింటికి వెళ్లేవాణ్ని. అప్పటినుంచీ వైఎస్‌ జగన్‌తో నాకు సత్సంబం ధాలున్నాయని వెల్లడించారు. ప్రజలకు ఏదో చేయాలి, వారి కష్టాలను తీర్చాలన్న పట్టుదల ఉన్న వ్యక్తి జగన్‌ అని కృష్ణ అభిప్రాయపడ్డారు.

ఇసుకేస్తే రాలనంతగా...
ఏ ఊళ్లో చూసినా జగన్‌ కోసం జనాలు ఇసుకేస్తే రాల నంతగా రావడం నిజంగా గర్వించదగ్గ విషయమని అన్నారు. ‘‘ఎండాకాలం. పైగా మే నెల. ఎంత ఇబ్బందో అందరికీ తెలుసు. అయినా జగన్‌ ప్రజల్లోనే ఉంటూ, వారికోసం అంతగా కష్టపడటం గొప్ప విషయం’’ అని కొనియాడారు. 2019లో వైఎస్‌ జగన్‌ ఏపీ ముఖ్యమంత్రి అవుతారని కృష్ణ స్పష్టం చేశారు.

మాట మీద నిలబడే వైఎస్‌
‘‘ఇచ్చిన మాటకు కట్టుబడిన, చేసిన వాగ్దానాలు అమలు చేసిన నాయకున్ని ఒక్క వైఎస్‌ను మాత్రమే చూశాను. ఆయన మాట మీద నిలబడిన తీరు, ప్రజలకు చేసిన సేవ ఎనలేనివి’’ అంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని సినీ హీరో కృష్ణ కొనియాడారు.

ఎంపీగా ఇద్దరం...
తాను ఎంపీగా ఉన్న సమయంలో వైఎస్‌ కూడా ఎంపీయేనని కృష్ణ గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి చివరిదాకా మంచి మిత్రులుగా కొనసాగామని తెలిపారు. వైఎస్‌ను చరిత్రాత్మక పాదయాత్ర సందర్భంగా జనం ఎంతగా రిసీవ్‌ చేసుకున్నారో ఇప్పుడు వైఎస్‌ జగన్‌ను కూడా పాదయాత్ర పొడవునా అదే మాదిరిగా ఆశీర్వదిస్తున్నారని అన్నారు.

వైఎస్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ప్రతి ఒక్కటీ జనాలకు ఎంతగా ఉపయోగపడ్డాయో అందరికీ తెలుసునన్నారు. ‘‘ఒక్క పథకమని కాదు, వైఎస్‌ తీసుకొచ్చిన అన్ని పథకాలూ నాకు ఇష్టమైనవే. అందుకే నాకు ఇష్టమైన ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాత్రమే’’ అని కృష్ణ స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement