ఒదిగి బతకటం తెలిసినవాణ్ణి..!
మనసులో మాట
కొమ్మినేని శ్రీనివాసరావుతో మాజీ సీఎం, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య
సమైక్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ మరణానంతరం ఏర్పడిన వెలితిని పూరించడానికే తనను ఉన్నపళాన ముఖ్యమంత్రిని చేశారని మాజీ సీఎం, మాజీ గవర్నరు కొణిజేటి రోశయ్య పేర్కొన్నారు. తెలంగాణను కేసీఆర్ తెచ్చాడనేకంటే కాంగ్రెస్ గ్రాంటుగా ఇచ్చిందనడమే వాస్తవమన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టు, తదనం తర పరిణామాలు పూర్తిగా కాంగ్రెస్ వ్యవహార శైలిలో భాగంగానే జరిగాయన్నారు. రాష్ట్ర విభజన, ఏపీ రాజధాని, ప్రత్యేక హోదా, పోలవరం వంటి సీరియస్ అంశాల్లోనూ ఆచితూచి మాట్లాడటమే కాదు.. రేపటి పరిణామాలపై జోస్యం చెప్పలేనంటున్న కొణి జేటి రోశయ్య ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
మీ రాజకీయ ప్రస్థానం ఏమేరకు సంతృప్తినిచ్చింది?
ఒక డిజైన్ పెట్టుకుని, దానిప్రకారం పనిచేసి నేను సాధించుకున్నదేమీ లేదు. పరిస్థితుల ప్రభావంతో రాజకీయాల్లో అడుగుపెట్టాను. కాబట్టే అసంతృప్తి అనేది నాకె ప్పుడూ లేదు. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగే మనస్తత్వం కానీ, అధికారం కోల్పోయినపుడు విచారవదనంతో కూర్చుని దిగాలుపడటం కానీ లేవు.
మీ రాజకీయ కెరీర్‌లో మీకు బాగా సంతృప్తి ఇచ్చినది ఏది?
ఆర్థిక నిర్వహణ నాకు బాగా ఇష్టమైన విషయం. రాష్ట్రం అప్పులపాలైపోయి లోటు బడ్జెట్‌లో పడిపోయి ఇబ్బందులకు గురికావడం నాకు ఇష్టం ఉండేది కాదు. సాధారణ కుటుంబం నుంచి వచ్చినవాడిని. ఆ నేపథ్యమే నాకు అలవాటైపోయింది. మనవద్ద ఏముంది? ఏ మేరకు ఖర్చుపెట్టవచ్చు? అప్పు అవసరమైతే ఏ మేరకు తీసుకు రావచ్చు? శ్రుతి మించకుండా అప్పు చేయాలి అని ఆలోచించేవాడిని.
మీ రాజకీయ జీవితంలో మీకు బాగా సహకరించిందెవరు?
విద్యార్థిగా ఉన్నప్పుడు ఎన్జీ రంగా మా నాయకుడు. అప్పట్లో గౌతు లచ్చన్న రైతు నాయకుడు. తర్వాత చెన్నారెడ్డి, ఎన్ జనార్దనరెడ్డి, విజయభాస్కర రెడ్డి అందరూ బాగా సహకరించేవారు. పరిస్థితులకు తగినట్లు నడచుకోవటం రంగాగారివద్ద నేర్చుకున్నా.
జగన్‌కి అత్యధిక ఎమ్మెల్యేల మద్దతున్నా, సీఎంగా మీ పేరే ఎందుకు ప్రతిపాదించారు?
వైఎస్ అనూహ్యంగా గతించడంతో ఒక వెలితి ఏర్పడింది. అధిష్టానం నుంచి ప్రణబ్ ముఖర్జీ తదితరులు వచ్చి, ఇక్కడి వారి అభిప్రాయం తెలుసుకుని ముఖ్య మంత్రిగా నన్ను బాధ్యత తీసుకోమన్నారు. నాకు షాక్ కలిగింది. ఎన్నడూ నేను సీఎంని అవుతానని కాని, కావాలని కాని కలగన్నవాడిని కాదు. గెస్ట్ హౌస్‌కి వచ్చిన తర్వాత దీనిపై మళ్లీ ఆలోచించండి అని ప్రణబ్‌ను అడిగాను. ‘అధిష్టానంతో మాట్లాడే ఈ నిర్ణయం తీసుకున్నాము. ఆ నిర్ణయాన్ని అమలు చేయాలి’ అన్నారాయన.
ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని మీరు చెప్పారట?
అలా నేను చెప్పలేదు. జగన్ నాకు శత్రువూ కాదు. మిత్రుడూ కాదు. రాజశేఖరరెడ్డి కుమారుడిగా గౌరవించేవాడిని. ఆ గౌరవం అతడి పట్ల ఆ రోజూ ఉంది. ఈ రోజూ ఉంది. ఎప్పుడూ ఉంటుంది. తర్వాత కాంగ్రెస్‌ని వదిలి సొంత పార్టీ పెట్టుకున్నాడు. సొంత పార్టీతో ఈ రాష్ట్రంలో అధికారానికి రావచ్చనుకున్నాడు. గట్టి గానే ప్రయత్నం చేశాడు.
వైఎస్సార్, జగన్ మధ్య తేడా ఏమిటి?
రాజశేఖరరెడ్డికి సొంత ఆలోచన ఉన్నా, నలుగు రితో మాట్లాడే తన నిర్ణయం తీసుకునేవాడు. జగన్‌తో నేను కలిసి పనిచేయలేదు కాబట్టి ఎలా చెప్పగలను?
ప్రత్యేక తెలంగాణ సమస్య మీ హయాంలోనే బలపడింది కదా?
రాష్ట్ర విభజనను ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ నేనెప్పుడూ ప్రోత్సహించలేదు. ఆ రోజుల్లోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సమైక్యవాదిగా ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరించాను. సడెన్‌గా ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదని హైకమాండ్‌కు చెప్పాం. అధిష్టానం నిర్ణయానికి యస్ అని తలూపలేకపోయాం.
తెలంగాణను తెచ్చిన క్రెడిటా, లేక ఇచ్చిన క్రెడిటా.. ఏది కరెక్ట్?
డిమాండ్ చేసింది కేసీఆర్. గ్రాంట్ చేసింది హైకమాండ్. ప్రయోజనం లేకపోయి ఉండవచ్చు కానీ, తెలంగాణను ఇచ్చింది మాత్రం అధిష్టానమే.
వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని అంటున్నారు?
పరిణామాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని అధిష్టానం వ్యవహరించింది. జగన్ కాంగ్రెస్‌వాదిగా ఉండి, కాంగ్రెస్‌లోనే కొనసాగితే మంచిదనే భావన నాలో ఆనాడూ, ఈనాడూ ఉంది. కానీ ఆయన వేరే పార్టీ పెట్టుకుని నడుపుకుంటున్నాడు, కాంగ్రెస్‌లోనే కొనసాగితే మంచి భవిష్యత్తు ఉండేదని చెప్పగలను.
ఓటుకు కోట్లు కేసుపై మీరేమనుకుంటున్నారు?
నిన్నటివరకు గవర్నరుగా ఉంటూ.. రాజకీయాలకు దూరంగా, అన్ని పార్టీలకూ సమానమైన రీతిలో ఉన్నాను. అప్పుడే నేను లైన్ గీసుకుని మాట్లాడటం భావ్యం కాదు.
చంద్రబాబు పాలనపై చాలా విమర్శలు వస్తున్నాయి.. మీ అభిప్రాయం?
నాకు కొంచెం సమయం ఇవ్వండి. చూద్దాం ఏమవుతుందో..
సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్‌లు.. తమ పాత్ర సజావుగా పోషిస్తున్నారా?
ఎవరి పాత్ర వారు నిర్వహిస్తున్నారు. కానీ నేను తీర్పు చెప్పలేను.
ప్రత్యేక హోదా అవసరమని మీరు నమ్ముతున్నారా?
దాంట్లోని చిక్కులు ఏమిటో కూడా నాకు పూర్తిగా అర్థం కాలేదు. ప్రత్యేక హోదా వద్దని నేను అనడంలే దు. దీనిపై లోతుగా అధ్యయనం చేయవలసి ఉంది.
కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపట్ల మీ అంచనా ఏమిటి?
సానుకూల పరిస్థితి వస్తే ప్రజలు మళ్లీ ఆదరించవచ్చు. లేకపోతే ప్రతిపక్షంగా ఉండాలి. దానిని కాలమే నిర్ణరుుంచాలి.
కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య చేసుకుందా, లేదా ఎవరైనా దాన్ని హత్య చేశారా?
పరిస్థితుల ప్రభావంతో గెలుపు, ఓటమి వస్తుంటాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మొదటిసారి ఓటమి చెంది ప్రజలకు దూరం కాలేదు. గతంలో ఓడిపోయినా మళ్లీ దూసుకొచ్చింది కూడా. ఏపీలో ప్రజలకు ఆగ్రహం కలిగింది. దూరంగా పెట్టారు. కొంతకాలం తర్వాత వాళ్ల మనసుల్లో ఎలాంటి విశ్లేషణ వస్తుందో వేచి చూడాలి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జగన్ భవిష్యత్తు ఎలా ఉంటుందని అనుకుంటున్నారు?
నేను జ్యోతిష్యం చెప్పే శక్తి ఉన్నవాడిని కాదు. కష్టపడుతున్నారు. తిరుగుతున్నారు. పని చేస్తున్నారు. ప్రజలను సమీకరించుకోవడానికి చేతనైనంత మేరకు కృషి చేస్తున్నారు. వారి కృషి ఎంతవరకు ఫలిస్తుంది అనేది రాబోయే రోజుల్లో చూడాలి. దాని కోసం అందరితో పాటు నేను కూడా వేచి చూస్తుంటాను.