సాక్షి, హైదరాబాద్/అమరావతి/తెనాలి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) శనివారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన.. శనివారం ఉదయం అచేతనంగా కనిపించడంతో కుటుంబ సభ్యులు బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే రోశయ్య తుదిశ్వాస విడిచారని వైద్యులు నిర్ధారించారు. రోశయ్యను శనివారం ఉ.8:20 గంటల సమయంలో అచేతన స్థితిలో ఆస్పత్రికి తీసుకువచ్చారని.. అప్పటికే ఆయన మరణించారని స్టార్ ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ ప్రకటించారు. రోశయ్య మరణవార్త తెలియడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాదం నెలకొంది. ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఇతర నేతలు సంతాపం ప్రకటించారు.
రోశయ్య పార్థివదేహాన్ని సందర్శించిన ప్రముఖులు
రోశయ్య పార్థివదేహాన్ని శనివారం మధ్యాహ్నం అమీర్‌పేటలోని ధరమ్‌కరమ్ రోడ్డులో ఉన్న ఆయన స్వగృహానికి తీసుకెళ్లారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, దేవదాయ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు, కేవీపీ రామచంద్రరావు, తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, తలసాని, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తదితరులు అక్కడికి చేరుకుని పార్థివదేహం వద్ద నివాళులు అర్పించారు. ఇక రోశయ్యను కడసారి చూసేందుకు అభిమానులు, రాజకీయ నాయకులు, సినీ, వివిధ రంగాల ప్రముఖులు తరలివచ్చారు.
నేటి ఉదయం గాంధీభవన్‌కు..
రోశయ్య పార్థివదేహాన్ని ఆదివారం ఉదయం కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయమైన గాంధీభవన్‌కు తీసుకెళ్లనున్నారు. కొంతసేపు ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఉంచి.. తర్వాత హైదరాబాద్ శివార్లలోని దేవరయాంజాల్‌లో ఉన్న వ్యవసాయ క్షేత్రానికి తరలించనున్నారు. మధ్యాహ్నం అక్కడ రోశయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
‘బడ్జెట్ల’ రోశయ్య
దేశ చరిత్రలోనే అత్యధికంగా పదిహేనుసార్లు రాష్ట్ర బడ్జెట్లు ప్రవేశపెట్టిన రికార్డు రోశయ్యదే. అంతేకాదు.. ఇందులో వరుసగా ఏడుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం గమనార్హం. విషయ పరిజ్ఞానం గల వ్యక్తిగా రోశయ్య ఎన్నోసార్లు ప్రశంసలు అందుకున్నారు. ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లడమంటే పక్కింటికి వెళ్లి పంచదార అరువు తెచ్చుకోవడమేనని చెప్పే ఆయన.. ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన హయాంలో ఉమ్మడి ఏపీ ఏనాడూ ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లలేదు.
వైఎస్ మరణానంతరం సీఎంగా..
నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూయడంతో.. కాంగ్రెస్ అధిష్టానం రోశయ్యకు ఉమ్మడి ఏపీ సీఎంగా బాధ్యతలు అప్పగించింది. 2009 సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 2010 నవంబర్ 24 వరకు రోశయ్య ఈ బాధ్యతలను నిర్వర్తించారు. తర్వాత పలు పరిణామాల కారణంగా పదవిని వదిలిపెట్టారు. ఆయన సేవలకు గుర్తింపుగా యూపీఏ ప్రభుత్వం గవర్నర్ గిరీ అప్పగించింది. 2011 ఆగస్టు 31న తమిళనాడు గవర్నర్‌గా రోశయ్య బాధ్యతలు స్వీకరించారు. అదే సమయంలో కొన్నాళ్లు కర్ణాటక ఇన్‌చార్జి గవర్నర్‌గా పనిచేశారు. 2016 ఆగస్టు 30 వరకు గవర్నర్ హోదాలో సేవలు అందించారు. తర్వాత హైదరాబాద్‌లోని తన స్వగృహంలో విశ్రాంత జీవితాన్ని గడిపారు.
ఆయనంటే అందరికీ గౌరవం
ఎవరినైనా కలుపుకొనిపోయే స్వభావం, అపార అనుభవం, విషయాలపై స్పష్టమైన అవగాహన, చక్కని భాష, దీనికితోడు సమయస్ఫూర్తి వంటివన్నీ రోశయ్యను ఉన్నత శ్రేణిలో నిలబెట్టాయి. ఆయనకు 2007లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. 2018 ఫిబ్రవరిలో లలిత కళాపరిషత్ ఆయనకు జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేసింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా స్వర్ణ కంకణాన్ని బహూకరించింది.
కుటుంబానికీ ప్రాధాన్యమిస్తూ..
రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా కుటుంబం బాగోగులను చూసుకోవడంలోనూ, కుటుంబ సభ్యులకు ఆప్యాయత పంచడంలోనూ రోశయ్య ముందుండేవారు. రోశయ్యకు 17 ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది. ఆయనకు భార్య శివలక్ష్మి, కుమారులు శివసుబ్బారావు, త్రివిక్రమ్, శ్రీమన్నారాయణమూర్తి, కుమార్తె రమాదేవి ఉన్నారు.
వనభోజనాలంటే ఇష్టం
1992లో రోశయ్య ఆరు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో తులసి, రుద్రాక్ష, నేరేడు, వేపతోపాటు అనేక రకాల మొక్కలను రోశయ్య స్వయంగా నాటారని అక్కడి పనివారు తెలిపారు. రోశయ్యకు వనభోజనాలంటే ఇష్టమని, అక్కడికి ఎప్పుడొచ్చినా చెట్ల కిందే కూర్చుని భోజనం చేసేవారని సైట్ ఇన్‌చార్జి రమేశ్ వెల్లడించారు. వ్యవసాయ క్షేత్రంలో పందిరిని రోశయ్య ప్రత్యేకంగా కట్టించుకున్నారని.. ఎక్కువ సమయం అక్కడే గడిపేవారని తెలిపారు.
ఎన్జీ రంగా స్ఫూర్తితో..
గుంటూరు జిల్లా వేమూరులో 1933 జూలై 4న ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు రోశయ్య జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ డిగ్రీ చేశారు. ప్రముఖ స్వాతంత్య్రయోధుడు, రైతు నాయకుడు ఎన్జీ రంగా స్ఫూర్తితో రాజకీయాల్లోకి ప్రవేశించారు. తొలిసారిగా 1968లో ఉమ్మడి ఏపీ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1974, 1980లోనూ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1979లో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఆర్ అండ్ బీ, రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నేదురుమల్లి జనార్దనరెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గాల్లో వివిధ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. 1995–97 మధ్య ఏపీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004లో చీరాల నుంచి అసెంబ్లీకి ఎన్నికై ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2009లో రోశయ్య ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. వైఎస్సార్ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి ఆర్థికశాఖను అప్పగించారు.
3 రోజులు సంతాప దినాలు
మాజీ సీఎం రోశయ్య మృతికి సంతాప సూచకంగా ఏపీ ప్రభుత్వం డిసెంబర్ 4 నుంచి 6 వరకు సంతాప దినాలను ప్రకటించింది. ఈమేరకు సాధారణ పరిపాలన శాఖ(ప్రొటోకాల్) శనివారం ఉత్తర్వులిచ్చింది. తెలంగాణ సర్కారు కూడా మూడ్రోజులు సంతాపదినాలు ప్రకటించింది. అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది.
ఆయన కృషి గుర్తుండిపోతుంది
రోశయ్య మరణం బాధాకరం. మేం ఇద్దరం సీఎంలుగా పనిచేసినప్పుడు, తర్వాత రోశయ్య గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆయనతో నేను చేసిన సంప్రదింపులు గుర్తుకువచ్చాయి. ప్రజాసేవ కోసం రోశయ్య చేసిన కృషి గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నా..’’
– ప్రధాని నరేంద్ర మోదీ
తెలుగు ప్రజలకు తీరని వేదన
ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పాలనాదక్షుడిగా పేరు పొందిన రోశయ్య మృతి తెలుగు వారికి తీరనిలోటు. రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా కలిసి మెలసి ఉండాలని, తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో విలసిల్లాలని రోశయ్య కోరుకునేవారు.
– సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
అంకిత భావం ఉన్న నేత
రోశయ్య నాకు చిరకాల మిత్రుడు. రాష్ట్రంతోపాటు జాతీయ రాజకీయాల్లో అంకితభావం, నిబద్ధతతో పనిచేశారు. ఆయన ఇకలేరనే వార్త బాధాకరం. రోశయ్య ఆత్మకు శాంతి కలగాలి. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నా
– ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఆయనది రాజీలేని పోరాటం
రోశయ్య ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేశారు. అధికారం ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్నారు. ఆర్ధికం అంటే అర్ధంకాని పరిస్ధితుల్లో ఆర్థిక వ్యవస్థకు నూతన మార్గనిర్దేశం చేశారు. ఆయనను తెలుగు జాతి మరువబోదు.
– టీడీపీ అధినేత చంద్రబాబు
పదవులకే వన్నె తెచ్చారు
మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా రోశయ్య పదవులకే వన్నె తెచ్చారు. సౌమ్యుడిగా, సహనశీలిగా నిలిచారు. రాజకీయాల్లో తనదైన ప్రత్యేక శైలితో హూందాగా వ్యవహరించారు. ఆయన మృతి తీరని లోటు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నా..
– తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు
నాన్న నిరాడంబరుడు
దొండపర్తి (విశాఖ దక్షిణ): ‘నాన్న నిరాడంబరుడు. రాజకీయాల్లో ఎన్ని కీలక పదవులు అధిరోహించినా ఆ హోదాను ఎప్పుడు ప్రదర్శించేవారు కాదు. సింపుల్ లైఫ్ స్టైల్‌నే ఇష్టపడేవారు. అమ్మా, నాన్నలకు నేను ఏకైక కుమార్తెను కావడంతో అల్లారుముద్దుగా చూసుకునేవారు. నేను నాన్న కూతురినే. నన్ను విలువలతో పెంచారు. నా వంట అంటే నాన్నకు చాలా ఇష్టం. ఆయన లేరన్న నిజాన్ని తట్టుకోలేకపోతున్నాను’ అంటూ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కుమార్తె రమాదేవి కన్నీరుమున్నీరుగా విలపించారు. రోశయ్య మృతితో విశాఖ బాలాజీ నగర్‌లో నివాసముంటున్న అతని ఏకైక కుమార్తె రమాదేవి నివాసం వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి.
రమాదేవి మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అంటే ఎనలేని అభిమానమని చెప్పారు. ఆయన తన జీవితంలో అనేక ఉన్నత పదవులు నిర్వర్తించినా ఏరోజూ రాజకీయాలను ఇంట్లో ప్రస్తావించే వారు కాదని చెప్పారు. తనను రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ ప్రోత్సహించలేదన్నారు. రాజకీయ జీవితంలో కొన్నిసార్లు మంచిచేసినా నిందలు భరించాల్సి వస్తుందని, తన తండ్రికి చెడ్డపేరు రాకూడదన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు. తన తండ్రి లేని లోటు తీరనిదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రిని కడసారి చూసేందుకు రమాదేవి, అల్లుడు పైడా కృష్ణప్రసాద్ విశాఖ నుంచి హైదరాబాద్‌కు పయనమయ్యారు.
అంత్యక్రియలకు ముగ్గురు మంత్రులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశం
సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ముగ్గురు మంత్రుల బృందాన్ని పంపిస్తోంది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ శనివారం ఆదేశించగా సాధారణ పరిపాలన శాఖ (ప్రొటోకాల్) ఉత్తర్వులు జారీచేసింది. దీంతో హైదరాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం జరిగే ఆయన అంత్యక్రియల కార్యక్రమానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, వెలంపల్లి శ్రీనివాసరావు హాజరుకానున్నారు.
అజాత శత్రువు రోశయ్య
రోశయ్య గారితో నాకు 40 ఏళ్లకు పైగా అనుబంధముంది. ఆయన, నేను పలుమార్లు కేబినెట్లో బాధ్యతలు నిర్వర్తించాం. ఆయన సీఎంగా ఉన్నప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా కూడా చేశాను. ఆయనకు ట్రబుల్‌షూటర్ అనే పేరు. చక్కని చమత్కారాలతో, వాక్చాతుర్యంతో అందరితో కలివిడిగా ఉంటూ అజాత శత్రువుగా ఉన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను.
– ధర్మపురి శ్రీనివాస్, సీనియర్ నేత, మాజీమంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు
మంచి స్నేహితుడ్ని కోల్పోయా
ఆరు శాఖలను నేను రోశయ్య గారు ఒకేసారి నిర్వహించాం. అసెంబ్లీలో కూడా ఆయన చాలా సమర్థంగా సమయస్ఫూర్తితో ప్రభుత్వానికి ఎలాంటి సమస్య ఎదురుకాకుండా చూసేవారు. విపక్షాలను ధీటుగా ఎదుర్కొనేవారు. రాజ్యసభ పదవి తప్ప ఇంచుమించు అన్ని పదవులు ఆయన సమర్ధంగా నిర్వహించారు. ప్రభుత్వానికి, పార్టీకి అనేక సేవలందించారు. మంచి స్నేహితుడిని కోల్పోయాను.
– డీకే సమరసింహారెడ్డి, సీనియర్ నేత, మాజీమంత్రి
56 ఏళ్ల స్నేహం మాది
రోశయ్యగారు, నేను ఇంచుమించు ఒకేసారి రాజకీయ ప్రస్థానం ప్రారంభించాం. విజయభాస్కరరెడ్డి, రాజశేఖరరెడ్డి కేబినెట్లలో ఇద్దరం పనిచేశాం. 56 ఏళ్ల స్నేహం మాది. కాంగ్రెస్‌లో దాదాపు అందరు సీఎంల కేబినెట్లో ఉండడమే కాకుండా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 15సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నాపట్ల చాలా అభిమానంతో ఉండేవారు. ఆయన మరణం వ్యక్తిగతంగా మాకు తీరని లోటే.
– గాదె వెంకటరెడ్డి, సీనియర్ నేత, మాజీమంత్రి
చీరాల నుంచే రాజకీయ అరంగేట్రం
చీరాల: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు ప్రకాశం జిల్లా చీరాలతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన అకాల మరణంతో చీరాలలో విషాదఛాయలు నెలకొన్నాయి. రోశయ్య సొంత ఊరు గుంటూరు జిల్లా వేమూరు అయినా.. ఆయన రాజకీయ స్వస్థలం చీరాల అని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. 1967లో అక్కడ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి 2004 వరకు నాలుగు పర్యాయాలు పోటీచేసి రెండుసార్లు గెలుపొంది అనేక మంత్రి పదవుల్లో పనిచేశారు. 1967లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన ప్రగడ కోట య్య స్వతంత్ర అభ్యర్థి రోశయ్యపై గెలుపొందారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థిగా రోశయ్య టీడీపీ అభ్యర్థి చిమటా సాంబుపై గెలుపొందారు. ఆ దఫా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఐదేళ్లపాటు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1994లో టీడీపీ అభ్యర్థి పాలేటి రామారావుపై పోటీచేశారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా కొణిజేటి రోశయ్య.. టీడీపీ అభ్యర్థి పాలేటి రామారావుపై విజయం సాధించి ఆర్థిక మంత్రిగా పనిచేశారు.
విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీక
మాజీ సీఎం రోశయ్య మృతికి గవర్నర్ హరిచందన్ సంతాపం
సాక్షి, అమరావతి/నెట్‌వర్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. ఈ మేరకు రాజ్‌భవన్ నుంచి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నాటి తరం నాయకునిగా విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా రోశయ్య నిలిచారని కొనియాడారు. ఉదయం అస్వస్థతకు గురైన రోశయ్య ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందడం విచారకరమన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. అలాగే, పలువురు మంత్రులు, ఇతర ప్రముఖులు కూడా రోశయ్య మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తంచేసి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
► పీసీసీ అధ్యక్షుడిగా, ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా, గవర్నర్‌గా అనేక ఉన్నత పదవులను రోశయ్య సమర్థంగా నిర్వహించారు. ఆయన మృతికి నా ప్రగాఢ సానుభూతి.
– తమ్మినేని సీతారాం, స్పీకర్
► రోశయ్య మృతితో రాష్ట్రం సుదీర్ఘ రాజకీయ అనుభవజ్ఞుడ్ని కోల్పోయింది. ఆయన ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆర్థిక నిపుణుడిగా రాష్ట్రానికి విశిష్ట సేవలందించారు. ఒక మంచి మనిషి మనమధ్య లేకపోవడం నిజంగా బాధాకరం.
– మంత్రి బొత్స సత్యనారాయణ
► వైఎస్సార్‌తో కలిసి ఆయన పనిచేసిన రోజులు మర్చిపోలేనివి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
– డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
► రోశయ్య మరణం రెండు తెలుగు రాష్ట్రాలకూ తీరనిలోటు. రాజకీయంగా ఎంతోమందికి ఆయన ఆదర్శనీయుడు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఎంతో ప్రీతిపాత్రుడు.
– మంత్రి మేకతోటి సుచరిత
► ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు, రాజకీయ చతురత కలిగిన నాయకుడు రోశయ్య మరణం అత్యంత బాధాకరం.
– మంత్రి ఆళ్ల నాని
► రోశయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన మృతి రాష్ట్రానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.
– మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు
► రోశయ్య మరణం నన్ను ఎంతో కలచివేసింది. ఆయనకు శ్రీ శారదా పీఠంతో ఎంతో అనుబంధం ఉంది. ఆరోగ్యకరమైన రాజకీయాల కోసం ఆయన తపించేవారు. రోశయ్య రాజకీయ ప్రస్థానం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.
– విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ
► పెద్దలు, మచ్చలేని సీనియర్ నాయకులు రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరనిలోటు. ఆయన మృతికి నా ప్రగాఢ సంతాపం.
– మంత్రి అనిల్‌కుమార్ యాదవ్
► సుదీర్ఘకాలం పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం రోశయ్య సొంతం. సీఎంలు ఆయన నిర్ణయాలకు విలువ ఇచ్చేవారు.
– మంత్రి సీదిరి అప్పలరాజు
► రాజకీయాల్లో అజాత శత్రువు రోశయ్య మృతి జీర్ణించుకోలేనిది. విద్యార్థి సంఘ నాయకుడి నుంచి గవర్నర్ వరకు అంచలంచెలుగా ఎదిగారు. ఆయన ఆత్మకు సద్గతులు కలగాలి.
– ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు
► రోశయ్య మరణం ఆంధ్ర రాష్ట్రానికి తీరని లోటు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆయన ప్రజలకు ఎనలేని సేవలు అందించారు.
– మల్లికార్జునరెడ్డి, ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్
► ఏ సీఎం దగ్గరైనా రోశయ్య తనకంటూ ఒక గుర్తింపును పొందారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన నిర్వర్తించిన పాత్ర కీలకం. రోశయ్య మరణం సమకాలిక రాజకీయాలకు తీవ్రమైన నష్టం
– సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
► ఆపత్కాలంలో రోశయ్య 14 నెలలపాటు సీఎంగా సేవలు అందించారు. ఆయన నిష్కళంక రాజకీయ యోధుడు. ఆయన విజ్ఞతను ఎవరూ మరచిపోలేరు.
– పవన్‌కల్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షుడు
► ఉమ్మడి రాష్ట్రానికి నాలుగుసార్లు ఆర్థిక మంత్రిగా.. సీఎంగా, తమిళనాడు గవర్నర్‌గా పనిచేశారు. వారి ఆకస్మిక మృతి దిగ్భ్రాంతి కలిగించింది.
– మధు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
► ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీడీపీ గ్రాంటును పునరుద్ధరించి ఆయా నియోజకవర్గాల అభివృద్ధికి రోశయ్య ఎంతో సహకరించారు.
– జల్లి విల్సన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు
Comments
Please login to add a commentAdd a comment