
కేరళకు రెండుపర్యాయాలు సీఎంగా పని చేసిన కాంగ్రెస్ దిగ్గజం..
తిరువనంతపురం: కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ దిగ్గజ నేత ఊమెన్ చాందీ(79) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులో చికిత్స పొందుతూ మంగళవారం వేకువఝామున తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు చాందీ ఊమెన్ తన ఫేస్‌బుక్ ద్వారా ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఊమెన్ చాందీ రెండుసార్లు కేరళకు సీఎంగా పని చేశారు. కేరళ అసెంబ్లీకి పన్నెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఏకైక రికార్డు సైతం ఈయన సొంతం. ఆయన పార్థీవ దేహాన్ని తిరువనంతపురానికి ప్రజా సందర్శనార్థం తరలించారు. స్వస్థలం కొట్టాయంలోనే ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. కేరళ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కే సుధాకరన్‌తో పాటు జాతీయ స్థాయిలోని కాంగ్రెస్ నేతలు పలువురు ఊమెన్ చాందీ మృతికి సంతాపం ప్రకటించారు. విపక్షాల భేటీ నేపథ్యంలో బెంగళూరులోనే ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలు ఉన్నారు. దీంతో అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశాలూ కనిపిస్తున్నాయి.
► 1943 అక్టోబర్ 31వ తేదీన ఊమెన్ చాందీ కొట్టాయం జిల్లా పుతుప్పల్లిలో జన్మించారు.
► విద్యార్థి దశ నుంచే ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టారు. కాంగ్రెస్ యువ విభాగం కేరళ స్టూడెంట్స్ యూనియన్‌లో క్రియాశీలక సభ్యుడిగా వ్యవహరించారు.
► కొట్టాయం, చంగనసెర్రీలో ఆయన ఉన్నత విద్యను అభ్యసించారు. ఎర్నాకులం ప్రభుత్వ న్యాయ కళాశాలలో న్యాయ విద్యను పూర్తి చేశారు.
► కేఎస్‌యూ ప్రెసిడెంట్‌గా పని చేసిన అనంతరం నేరుగా ఆయన ఎమ్మెల్యేగా పుతుప్పల్లి స్థానం నుంచి పోటీ చేసి నెగ్గారు. 1970 నుంచి పుతుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయనే ఎమ్మెల్యే. 1970, 1977, 1980, 1982, 1987, 1991, 1996, 2001, 2006, 2011, 2016, 2021లో 12సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు.
► 2004-2006 మద్య, ఆపై 2011-16 మధ్య రెండు పర్యాయాలు ఆయన కేరళకు ముఖ్యమంత్రిగా పని చేశారు. 2006-11 మధ్య కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
► సీఎంగానే కాదు.. మంత్రిగా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గానూ ఆయన పని చేశారు. కరుణాకరణ్, ఏకే ఆంటోనీ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో.. లేబర్, హోం, ఆర్థిక శాఖ మంత్రిగా ఊమెన్ చాందీ పని చేశారు.
► కేరళ అసెంబ్లీకి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పని చేసిన వ్యక్తి మాత్రమే కాదు.. ఐక్యరాజ్య సమితి నుంచి ప్రజా సేవలకు గానూ అవార్డు అందుకున్న వ్యక్తి కూడా ఊమెన్ చాందీ కావడం గమనార్హం.
► ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు, అలాగే తిరువనంతపురాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే ప్రయత్నాలు.. ఇలా తన హయాంలో చెప్పుకోదగ్గ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారాయన.
► అయితే.. 2013 కేరళ సోలార్ ప్యానెల్ స్కామ్, విళింజమ్ పోర్ట్ అవినీతి ఆరోపణలు, పట్టూర్ భూముల కేసు, పల్మోలెయిన్ ఆయిల్ ఇంపోర్ట్ స్కామ్.. ఊమెచ్ చాందీ హయాంలో కుదిపేశాయి.
► 2018 జూన్ 6వ తేదీన అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఏఐసీసీ(ఆల్ ఇండియా కాంగ్రెస కమిటీ) ఇన్‌ఛార్జీగా ఆంధ్రప్రదేశ్ బాధ్యతలను ఊమెన్ చాందీకి అప్పగించారు.
► చివరి రోజుల్లో ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్‌గా ఉన్నారు.
► ఊమెన్ చాందీ భార్య పేరు మరియమ్మా, ముగ్గురు సంతానం వీళ్లకు.
There Lived a Chief Minister once... 💔🙏🏻
— #Abu (@AbuThahir2044) July 18, 2023
Heartfelt Condolences 🌹
Sri Oomen Chandy 🤍#oomenchandy #ChiefMinister #Kerala #Trending #Condolences pic.twitter.com/mkm9gt15E9