oomen chandy
-
కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ కన్నుమూత
తిరువనంతపురం: కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ దిగ్గజ నేత ఊమెన్ చాందీ(79) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులో చికిత్స పొందుతూ మంగళవారం వేకువఝామున తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు చాందీ ఊమెన్ తన ఫేస్బుక్ ద్వారా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఊమెన్ చాందీ రెండుసార్లు కేరళకు సీఎంగా పని చేశారు. కేరళ అసెంబ్లీకి పన్నెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఏకైక రికార్డు సైతం ఈయన సొంతం. ఆయన పార్థీవ దేహాన్ని తిరువనంతపురానికి ప్రజా సందర్శనార్థం తరలించారు. స్వస్థలం కొట్టాయంలోనే ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. కేరళ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కే సుధాకరన్‌తో పాటు జాతీయ స్థాయిలోని కాంగ్రెస్ నేతలు పలువురు ఊమెన్ చాందీ మృతికి సంతాపం ప్రకటించారు. విపక్షాల భేటీ నేపథ్యంలో బెంగళూరులోనే ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలు ఉన్నారు. దీంతో అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశాలూ కనిపిస్తున్నాయి. ► 1943 అక్టోబర్ 31వ తేదీన ఊమెన్ చాందీ కొట్టాయం జిల్లా పుతుప్పల్లిలో జన్మించారు. ► విద్యార్థి దశ నుంచే ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టారు. కాంగ్రెస్ యువ విభాగం కేరళ స్టూడెంట్స్ యూనియన్‌లో క్రియాశీలక సభ్యుడిగా వ్యవహరించారు. ► కొట్టాయం, చంగనసెర్రీలో ఆయన ఉన్నత విద్యను అభ్యసించారు. ఎర్నాకులం ప్రభుత్వ న్యాయ కళాశాలలో న్యాయ విద్యను పూర్తి చేశారు. ► కేఎస్‌యూ ప్రెసిడెంట్‌గా పని చేసిన అనంతరం నేరుగా ఆయన ఎమ్మెల్యేగా పుతుప్పల్లి స్థానం నుంచి పోటీ చేసి నెగ్గారు. 1970 నుంచి పుతుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయనే ఎమ్మెల్యే. 1970, 1977, 1980, 1982, 1987, 1991, 1996, 2001, 2006, 2011, 2016, 2021లో 12సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. ► 2004-2006 మద్య, ఆపై 2011-16 మధ్య రెండు పర్యాయాలు ఆయన కేరళకు ముఖ్యమంత్రిగా పని చేశారు. 2006-11 మధ్య కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ► సీఎంగానే కాదు.. మంత్రిగా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గానూ ఆయన పని చేశారు. కరుణాకరణ్, ఏకే ఆంటోనీ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో.. లేబర్, హోం, ఆర్థిక శాఖ మంత్రిగా ఊమెన్ చాందీ పని చేశారు. ► కేరళ అసెంబ్లీకి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పని చేసిన వ్యక్తి మాత్రమే కాదు.. ఐక్యరాజ్య సమితి నుంచి ప్రజా సేవలకు గానూ అవార్డు అందుకున్న వ్యక్తి కూడా ఊమెన్ చాందీ కావడం గమనార్హం. ► ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు, అలాగే తిరువనంతపురాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే ప్రయత్నాలు.. ఇలా తన హయాంలో చెప్పుకోదగ్గ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారాయన. ► అయితే.. 2013 కేరళ సోలార్ ప్యానెల్ స్కామ్, విళింజమ్ పోర్ట్ అవినీతి ఆరోపణలు, పట్టూర్ భూముల కేసు, పల్మోలెయిన్ ఆయిల్ ఇంపోర్ట్ స్కామ్.. ఊమెచ్ చాందీ హయాంలో కుదిపేశాయి. ► 2018 జూన్ 6వ తేదీన అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఏఐసీసీ(ఆల్ ఇండియా కాంగ్రెస కమిటీ) ఇన్ఛార్జీగా ఆంధ్రప్రదేశ్ బాధ్యతలను ఊమెన్ చాందీకి అప్పగించారు. ► చివరి రోజుల్లో ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్‌గా ఉన్నారు. ► ఊమెన్ చాందీ భార్య పేరు మరియమ్మా, ముగ్గురు సంతానం వీళ్లకు. There Lived a Chief Minister once... 💔🙏🏻 Heartfelt Condolences 🌹 Sri Oomen Chandy 🤍#oomenchandy #ChiefMinister #Kerala #Trending #Condolences pic.twitter.com/mkm9gt15E9 — #Abu (@AbuThahir2044) July 18, 2023 -
‘ఏపీ ప్రత్యేక హోదాపైనే రాహుల్ తొలి సంతకం’
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చిన తొలిరోజే రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై సంతకం చేస్తారని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఊమెన్ చాందీ తెలిపారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉండి కూడా టీడీపీ ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోయిందని ఆయన విమర్శించారు. యూపీఏతోనే ఏపీ ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలను సమానంగా వ్యతిరేకిస్తున్నామన్న ఉమెన్ చాందీ.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే అవకాశం లేదన్నారు. అయితే పార్టీ అజెండా, పొత్తులపై ఇప్పుడే చర్చించడం తొందరపాటు నిర్ణయం అవుతుందన్నారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేయడమే తమ ముందున్న లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పార్టీని విడిచి వెళ్లినవారు తిరిగి వస్తే తప్పక స్వాగతిస్తామని తెలిపారు. -
బాబు ప్రభుత్వంపై చార్జీషీట్ విడుదల చేస్తాం..
సాక్షి, ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై చార్జీషీట్ విడుదల చేస్తామని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల(జూన్) 12న సీనియర్ నేతలతో ఉమెన్ చాందీ సమావేశమవుతారని తెలిపారు. అంతేకాక జూన్ 13న జనరల్ బాడీ సమావేశం, జూన్ 8 నుంచి 15 వరకు వంచన వారం నిర్వహిస్తామని రఘువీరా పేర్కొన్నారు. త్వరలోనే కాంగ్రెస్‌కు మంచి రోజులు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జిగా ఉమెన్ చాందీని నియమించిన విషయం తెలిసిందే. ఇదోక చాలెంజింగ్ జాబ్ అని అన్నారు.. ఏపీ ప్రజలు ఎప్పుడూ కాంగ్రెస్‌తోనే ఉన్నారని ఏసీసీసీ చీఫ్ చెప్పారు. పీవీ నరసింహారావు దేశానికి నాయకత్వం వహించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నాయకులు, కార్యకర్తలు కలిసి కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని రఘువీరా కోరారు. అంతేకాక దేశానికి లౌకిక ప్రజాస్వామ్య కూటమి అవసరమని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి సూచించారు. -
‘కర్ణాటక ఫలితాలు కాంగ్రెస్‌కి ఓపెనింగ్స్’
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ ధీమా వ్యక్తం చేశారు. కన్నడలో పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఊమెన్ చాందీ ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా చాందీ శనివారం ఓ వార్తా ఛానల్‌తో మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎక్కువ సీట్లు సాధిస్తుందన్నారు. 2019లో కేంద్రంలో అధికారంలోకి రావడానికి కర్ణాటక ఎన్నికలు ఎంతో కీలకమైనవిగా పేర్కొన్నారు. కన్నడ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై పూర్తి విశ్వాసం ఉందని, ఆ విశ్వాసమే పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తుందని తెలిపారు. కర్ణాటక, కేరళ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, కేరళ ప్రజలు లక్షలాది మంది కర్ణాటకలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారని తెలిపారు. కర్ణాటక ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఓపెనింగ్స్ లాంటివని, త్వరలో జరగనున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. 2019లో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్నారు. గత 70 ఏళ్ళుల్లో కాంగ్రెస్ పార్టీ దేశ అభివృద్ధికి ఎంతో చేస్తే... మోదీ తన స్వార్ధ రాజకీయం కోసం దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. -
ఇంత భారీ ఓటమి ఊహించలేదు: సీఎం
ఇంత దారుణమైన, భారీ ఓటమిని తాము ఊహించలేదని కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయమే ఫైనల్ అని, ఎన్నడూ ఊహించని ఓటమిని అంగీకరిస్తున్నామని పుత్తుపల్లిలోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మళ్లీ అధికారంలోకి వస్తామనే తాము భావించాము గానీ అలా జరగలేదన్నారు. ఎందుకిలా జరిగిందన్న విషయాన్ని అంచనా వేసేందుకు చర్చించుకుంటామన్నారు. ప్రస్తుత అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ఇప్పుడు మాత్రం కేవలం 23 మంది మాత్రమే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూడీఎఫ్ కూటమి మొత్తానికి 46 సీట్లు వచ్చేలా ఉన్నాయి. సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కటమికి 92 స్థానాలు వచ్చేలా ఉన్నాయి. బీజేపీ కేవలం ఒక్కచోట గెలిచింది. అయినా.. ఆ పార్టీ కేరళలో బోణీ కొట్టడం ఇదే మొదలు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన పీసీ జార్జి కూడా గెలిచారు. యూడీఎఫ్ చైర్మన్‌గా కూడా తాను ఈ పరాజయానికి పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు ఊమెన్ చాందీ చెప్పారు. -
డబ్బులు ఎవరికి ఇచ్చారు.. ఎవరిచ్చారు: సుష్మా
విదేశాల నుంచి కేరళీయులను విడిపించడానికి తాము డబ్బులు చెల్లించామన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ వ్యాఖ్యలను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్రంగా ఖండించారు. ఆయా దేశాల నుంచి తాము వేలాది మంది కేరళీయులను విడిపించి తీసుకొచ్చామని, వాళ్లందరికీ డబ్బులు ఎవరు, ఎవరికి చెల్లించారని ఆమె ప్రశ్నించారు. లిబియా నుంచి 29 మంది భారతీయులను విడిపించడానికి తాము డబ్బులు చెల్లించామంటూ చాందీ చేసిన వ్యాఖ్యలను ఆమె గుర్తుచేశారు. తనకైతే ఎవరూ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని స్పష్టం చేశారు. భారతదేశ పౌరుల పట్ల ఇది తమ ప్రాథమిక బాధ్యత కాబట్టి తాము ఇదంతా చేస్తున్నాము తప్ప.. ఇందులో డబ్బులకు సంబంధించిన ప్రశ్న లేనే లేదని అన్నారు. ఈనెల 16వ తేదీన కేరళలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ రాజకీయాలు వేడెక్కాయి. రాజకీయాలకు సంబంధం లేని అంశాలను కూడా నేతలు వాడుకుంటున్నారు. Mr.Chandy - We evacuated thousands of Indians from Kerala from Iraq, Libya and Yemen. Who paid for them ? — Sushma Swaraj (@SushmaSwaraj) 12 May 2016 Mr.Chandy - You said 'Kerala paid for 29 Indians evacuated from Libya.' — Sushma Swaraj (@SushmaSwaraj) 12 May 2016 Mr.Chandy - You started this debate - as to Who paid ? Not me. We always did this because this is our pious duty towards our citizens. — Sushma Swaraj (@SushmaSwaraj) 12 May 2016 -
కాంగ్రెస్ పెద్దలు నన్ను వాడుకున్నారు: సరిత
కాంగ్రెస్ పెద్దలు తనను ఒక పావులా వాడుకున్నారని, కొచ్చిన్ పోర్టు ట్రస్టుకు చెందిన ఒక భూమి డీల్‌లో తాను మధ్యవర్తిగా కూడా వ్యవహరించానని కేరళ సోలార్ స్కాంలో కీలక నిందితురాలు సరితా నాయర్ చెప్పింది. ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, ఆయన కొడుకు, కొందరు కేబినెట్ మంత్రులపై తన ఆరోపణలకు సంబంధించిన డిజిటల్ సాక్ష్యాలను ఆమె బుధవారం నాడు విచారణ కమిషన్‌కు సమర్పించింది. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 5 రోజుల సమయం ఉందనగా సరితా నాయర్ తన తాజా అస్త్రాన్ని బయటకు తీయడం గమనార్హం. తాను రెండు పెన్ డ్రైవ్‌లు, కొన్ని పత్రాలను కమిషన్‌కు ఇచ్చానని, తాను రాసిన లేఖలోని అంశాలకు, కొందరు కాంగ్రెస్ పెద్దల పేర్లు బయటపెడుతూ ఏషియా నెట్ చానల్ ప్రసారం చేసిన కథనానికి అవి ఆధారాలని సరితా నాయర్ చెప్పింది. శుక్రవారం మరికొన్ని ఆధారాలు సమర్పిస్తానని ఇంకో బాంబు పేల్చింది. కాగా, సరితా నాయర్‌పైన, ఏషియానెట్ చానల్‌పైన సీఎం ఊమెన్ చాందీతో పాటు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ కూడా పరువునష్టం దావా వేశారు. సరితా నాయర్ మీద, ఆమె సహజీవన భాగస్వామి బిజు రాధాకృష్ణన్ మీద సోలార్ స్కాంలో దాదాపు 30 వరకు కేసులు ఉన్నాయి. వాళ్లు పలువురు పెట్టుబడిదారులను దాదాపు రూ. 6 కోట్ల మేర ముంచేశారని పోలీసులు అంచనా వేస్తున్నారు. సరిత బెయిల్ పొంది బయటకు రాగా, రాధాకృష్ణన్ మాత్రం తన మొదటి భార్య హత్య కేసులో ఇంకా జైల్లోనే ఉన్నారు. -
'నా కంపెనీ ఎదుగుదల, పతనానికి సీఎం కారణం'
కోచి: కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీపై సోలార్ స్కాం నిందితురాలు సరితా నాయర్ ఆరోపణల పర్వాన్ని కొనసాగిస్తోంది. కోచిలో జ్యుడిషియల్ కమిషన్ ఎదుట మరోసారి హాజరైన సరిత.. ఉమెన్ చాందీపై తీవ్ర ఆరోపణలు చేసింది. తన కంపెనీ ఎదుగుదలకు, పతనానికి ముఖ్యమంత్రే కారణమని చెప్పింది. సరిత వ్యాపార భాగస్వామి, సహ నిందితుడు బిజూ రాధాకృష్ణన్ కూడా ఇవే ఆరోపణలు చేశాడు. సరిత ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ.. ఉమెన్ చాందీకి తాను లంచం ఇచ్చానని మరోసారి చెప్పింది. 'ముఖ్యమంత్రి చాందీకి 1.9 కోట్ల రూపాయల చెక్‌లను ఇచ్చాను. నేను ఇచ్చింది సీఎం సహాయక నిధికి కాదు. ఇది లంచంగా ఇచ్చింది' అని వెల్లడించింది. సోలార్ స్కాం కేసును విచారిస్తున్న రిటైర్డ్ జడ్జి ఎదుట తాను ఇదే విషయం చెప్పినట్టు ఇటీవల పేర్కొంది. రిటైర్డ్ జడ్జి ఎదుట సీఎం ఊమెన్ చాందీ కూడా హాజరైన సంగతి తెలిసిందే. దాదాపు 11 గంటల పాటు చాందీ తన వాదన వినిపించారు. సోలార్ స్కాంలో 2013లో అరెస్టయిన సరిత.. బెయిల్ మీద విడుదలైనప్పటి నుంచి సీఎం మీద ఆరోపణలు గుప్పిస్తోంది. ఉమెన్ చాందీకి రూ. 2 కోట్ల లంచం ఇచ్చానని సరిత ఆరోపించడం కేరళ రాజకీయాలను కుదిపేసింది. -
మంత్రి రాజీనామా.. అంతలోనే తూచ్!
తిరువనంతపురం: కేరళను కుదిపేస్తున్న బార్ స్కాం, సోలార్ స్కాం పలు మలుపులు తిరుగుతున్నాయి. బార్లకు అనుమతి ఇచ్చేందుకు రూ. 50 లక్షల లంచం తీసుకున్నారన్న కేసులో కోర్టు విచారణకు ఆదేశించడంతో ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె. బాబు రాజీనామా చేశారు. అయితే.. కాంగ్రెస్ నేతృత్వంతోని యూడీఎఫ్ నేతల నుంచి ఒత్తిడి రావడంతో రాజీనామాను అంతలోనే ఉపసంహరించుకున్నారు. అయితే ఇదంతా సీఎం ఊమెన్ చాందీ పక్కాగా రచించిన స్క్రిప్టు ప్రకారమే జరిగిందని విపక్ష సీపీఐ-ఎం ఆరోపించింది. బార్ ఓనర్ల నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో గతంలో ఆర్థికమంత్రి కేఎం మణి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయనకు కూడా కోర్టులో ఊరట లభించడంతో తిరిగి పదవి చేపట్టాలని యూడీఎఫ్ వర్గాలు అంటున్నా, తాను మళ్లీ వచ్చేందుకు తొందరేమీ లేదని మణి అంటున్నారు. మంత్రి పదవి చేపట్టాలని కోరిన యూడీఎఫ్‌కు కృతఙ్ఞతలు తెలిపిన ఆయన ఈ అంశంపై పార్టీలో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని శనివారం తెలిపారు. అయితే ఈ ఇద్దరు నేతలకు హైకోర్టు క్లీన్చిట్ ఇవ్వలేదని, కేవలం కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై రెండు నెలలు స్టే మాత్రమే విధించిందని సీపీఐ-ఎం నేత కొడియేరి బాలకృష్ణన్ తెలిపారు. హైకోర్టు ఈ కుంభకోణంలో వాదనలు కూడా వినబోతున్న నేపథ్యంలో అప్పుడే క్లీన్చిట్ దొరికిందని నేతలు చెప్పడం ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ పక్కాగా నడిపిస్తున్న డ్రామాగా అభివర్ణించారు. -
'కాంగ్రెస్‌కు మరో ఆభరణం దొరికింది'
న్యూఢిల్లీ: సోలార్ కుంభకోణంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ లక్ష్యంగా బీజేపీ విమర్శనాస్త్రలు ఎక్కుపెట్టింది. అవినీతి విషయంలో కాంగ్రెస్ పార్టీకి చాందీ మరో ఆభరణంగా మారిపోయారంటూ ఎద్దేవా చేసింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు శనివారం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్, కరప్షన్ పర్యాయపదాలుగా మారిపోయాయని ఆరోపించారు. సోలార్ స్కాంలో చాందీ బాధ్యుడని తెలుస్తోందని ఆయన అన్నారు. 'కాంగ్రెస్ విముక్త కేరళ'ను ఆ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్‌ను అధికారం నుంచి వేరుచేస్తే తప్ప ఆ పార్టీని అవినీతి నుంచి దూరం చేయలేమని మండిపడ్డారు. సోలార్ కుంభకోణంలో కేరళ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత ఊమెన్ చాందీకి కూడా ప్రమేయముందని వెలుగుచూడటం ఆ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. -
రాష్ట్రాన్ని కుదిపేస్తున్న మహిళా సునామీ!
సాక్షాత్తు ముఖ్యమంత్రికి రూ. 2 కోట్ల లంచం ఇచ్చానని చెప్పడానికి ఎన్నో గట్స్ కావాలి. అలాంటిది ఓ మహిళ ఎంతో సాహసం చేసి.. కేరళ ముఖ్యమంత్రి మీద ఆరోపణల సునామీ గుప్పించింది. చివరకు దాదాపు ముఖ్యమంత్రి మీద కేసు నమోదయ్యేంత పరిస్థితి ఏర్పడింది. అయితే చివరి నిమిషంలో కేరళ హైకోర్టు జోక్యం చేసుకుని ఎఫ్ఐఆర్ దాఖలు మీద రెండు నెలల స్టే విధించడంతో ఊమెన్ చాందీ ఊపిరి పీల్చుకున్నారు. ఆ మహిళ పేరు సరితా నాయర్. సోలార్ స్కాం నిందితులలో ఒకరు. 2013లోనే ఆమె ఈ కేసులో అరెస్టయినా.. మళ్లీ బెయిల్ మీద విడుదలై, అప్పటి నుంచి సీఎం మీద ఆరోపణలు గుప్పిస్తోంది. అసలే త్వరలో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఇదంతా సీఎం తలకు భారంగా చుట్టుకుంటోంది. రాబోయే పదేళ్లలో కేరళను సంపూర్ణ మద్యరహిత రాష్ట్రంగా చేయాలనుకున్న తమ ప్రభుత్వ నిర్ణయం కారణంగా బార్ యజమానులు ఆగ్రహించి, సరితా నాయర్‌ను తమమీద ప్రయోగించారని సీఎం చాందీ ఆరోపిస్తున్నారు. కాగా, పారిశ్రామిక వేత్తలకు చవగ్గా సోలార్ ప్యానళ్లు సరఫరా చేస్తామని సరితా నాయర్ చెప్పింది గానీ, ఆమె అసలు సరఫరా చేయలేదని మంత్రులు ఆరోపిస్తున్నారు. కానీ ఆమె మాత్రం సోలార్ స్కాం కేసును విచారిస్తున్న రిటైర్డ్ జడ్జి ఎదుట కూడా తాను సీఎంకు రూ. 1.90 కోట్ల లంచం ఇచ్చినట్లు చెప్పేశారు. కాగా, గత సోమవారం నాడు రిటైర్డ్ జడ్జి ఎదుట సీఎం ఊమెన్ చాందీ దాదాపు 11 గంటల పాటు తన వాదన వినిపించారు. అవతలి వాళ్లు ఆయనను క్రాస్ ఎగ్జామిన్ కూడా చేశారు. అయితే ఇప్పటివరకు కేరళలో ఒక ముఖ్యమంత్రిని జ్యుడీషియల్ కమిషన్ విచారించడం మాత్రం ఇదే మొదటిసారి. దీనికి తోడు కేరళ కాంగ్రెస్ నాయకుడు ఒకరు సరితా నాయర్‌తో మాట్లాడుతున్నట్లుగా చెబుతున్న ఆడియో టేప్ లీకవ్వడం కూడా సర్కారు కష్టాలకు మరింత ఆజ్యం పోసింది. -
ముఖ్యమంత్రికి భారీ ఊరట
కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి భారీ ఊరట లభించింది. ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సిందిగా విజిలెన్సు కోర్టు ఇచ్చిన తీర్పుపై కేరళ హైకోర్టు రెండు నెలల స్టే విధించింది. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రి అరయదాన్ మహ్మద్‌పై సోలార్ స్కాంలో ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశిస్తూ విజిలెన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సస్పెండ్ చేసింది. విజిలెన్స్ కోర్టు తన అధికారాల విస్తృతి, కేసు తీరు గురించి తెలుసుకోకుండా మెకానికల్‌గా ప్రవర్తించిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రైవేటు సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతించేందుకు సీఎం ఊమెన్ చాందీకి తాము భారీ మొత్తంలో లంచాలు ఇచ్చినట్లు సరితా నాయర్ తదితరులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ కేసులోనే సీఎంపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని కేరళ విజిలెన్స్ కోర్టు ఆదేశించింది. -
విచారణ కమిటీ ముందుకు వెళ్లనున్న సీఎం
దాదాపు 7 కోట్ల రూపాయల సోలార్ స్కాంపై విచారణ జరుపుతున్న జస్టిస్ జి.శివరాజన్ ఏకసభ్య కమిటీ ముందు విచారణకు కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ హాజరు కానున్నారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న చాందీ.. ఇప్పటికే కమిషన్‌కు లిఖిత వాంగ్మూలం ఇచ్చారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కమిటీ ఎదుట హాజరవుతానని చెప్పారు. చాందీ ప్రకటనను రికార్డు చేసేందుకు కమిటీ తిరువనంతపురం రానుంది. 2013 జూన్ నెలలో సోలార్ స్కాం వెలుగుచూసిన తర్వాత.. దానిపై విచారణ కోసం కేరళప్రభుత్వం 2013 అక్టోబర్ నెలలో జస్టిస్ శివరాజన్ కమిటీని నియమించింది. సోలార్ ప్యానళ్లు ఇప్పిస్తామంటూ డబ్బు తీసుకుని చాలామంది పెట్టుబడిదారులను ఓ జంట మోసం చేసింది. ఆ జంటతో సీఎం కార్యాలయంలోని ఉన్నతాధికారులకు సంబంధాలు ఉండటంతో, వాళ్లను వెంటనే ఆ పదవుల నుంచి తప్పించారు. ఈ కేసులో సరితా నాయర్, ఆమె సహజీవన భాగస్వామి బిజు రాధాకృష్ణన్ ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం సరితా నాయర్ బెయిల్ మీద బయటకు రాగా, రాధాకృష్ణన్ ఇంకా కస్టడీలోనే ఉన్నారు. ఆయన తన మొదటి భార్యను హత్య చేసిన విషయం తర్వాత వెలుగులోకి వచ్చింది. దీనిపై సభలోను, బయట కూడా భారీ స్థాయిలో నిరసనలు వ్యక్తం కావడంతో ఈ ఘటనపై చాందీ జ్యుడీషియల్ విచారణకు ఆదేశించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఎలాంటి విచారణ ఎదుర్కొనేందుకైనా సిద్ధమేనని చాందీ అంటున్నారు. -
ఓ మహిళతో సీఎం.. ఆ వీడియో ఉంది!
► కేరళ సోలార్ స్కాం ప్రధాన నిందితుడి ఆరోపణ ► విచారణ కమిషన్ ముందు రాధాకృష్ణన్ వెల్లడి ► సీఎం ఊమెన్ చాందీ సహా ఆరుగురు నేతలపై ఆరోపణలు కొచ్చి కేరళ సోలార్ ప్యానల్ స్కాం సరికొత్త మలుపులు తిరుగుతోంది. ఏకంగా ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ సహా ఆరుగురు ప్రముఖ నేతలంతా ఓ మహిళతో కలిసి ఉండగా కెమెరాకు పట్టుబడ్డారని ఈ స్కాంలో ప్రధాన నిందితుడు బిజు రాధాకృష్ణన్ ఆరోపించారు. సరితా నాయర్ అనే ఆ మహిళతో వాళ్లు విడివిడిగా ఉన్నప్పటి వీడియోలన్నీ తన దగ్గర ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే, సరితా నాయర్ మాత్రం రాధాకృష్ణన్ ఆరోపణలను ఖండించారు. దమ్ముంటే వీడియోలు చూపించాలని డిమాండ్ చేశారు. సరితా నాయర్ ఆ నాయకులెవ్వరికీ తెలియకుండా ఈ వీడియోలు తీసిందని, అవి బ్లాక్ మెయిల్ కోసమో, లేదా ఆత్మరక్షణ కోసం తీసిందో తనకు తెలియదని సోలార్ స్కాంను విచారిస్తున్న జస్టిస్ శివరాజన్ కమిషన్ వద్ద రాధాకృష్ణన్ చెప్పారు. ఆమె అరెస్టు కావడానికి రెండు వారాల ముందు ఆ వీడియోలు తనకు ఇచ్చిందని, వాటిలో ఐదింటిని తాను సీఎం ఊమెన్ చాందీకి చూపించానని, ఆరోది మాత్రం స్వయంగా ఆయనే ఉండబట్టి చూపించలేదని అన్నారు. కమిషన్ అవసరం అనుకుంటే వాటిని అందిస్తానని చెప్పారు. అయితే సీఎం, ఇతర నాయకులెవ్వరూ ఇంతవరకు దీన్ని ఖండించలేదు కూడా. చాందీ లంచం తీసుకున్నారని రాధాకృష్ణన్ గతంలో ఆరపించారు. తాను స్వయంగా రూ. 5.5 కోట్లు ఇచ్చానని, రాష్ట్రంలో రెండు పెద్ద సోలార్ ప్రాజెక్టులు పెట్టడానికి ఈ మొత్తం ఇచ్చానని అన్నారు. నిందితుడికి సహకరించారన్న ఆరోపణలతో చాందీ కార్యాలయంలో వ్యక్తిగత సహాయకులను అరెస్టు చేయడంతో సోలార్ స్కాం కాస్తా బాగా పెద్దదైంది. రాధాకృష్ణన్ తాజా ఆరోపణల నేపథ్యంలో సీఎం చాందీ రాజీనామా చేయాలని విపక్ష నేత వీఎస్ అచ్యుతానందన్ డిమాండ్ చేశారు. -
లంచగొండి మంత్రిని వెనకేసుకొచ్చిన సీఎం
లంచాలు తీసుకున్నారంటూ ఆరోపణలు వచ్చిన కేరళ ఆర్థికమంత్రి కేఎం మణిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ వెనకేసుకొచ్చారు. హోటళ్లలో బార్లు కలిగి ఉన్న ఓ వ్యాపారవేత్త.. తనవద్దనుంచి ఆర్థికమంత్రి మణి లంచం తీసుకున్నారంటూ ఆరోపించారు. అయితే, అవి నిరాధార ఆరోపణలని, ఆయన తన వద్దకు కూడా ఈ ఆరోపణలతో వచ్చారని చాందీ అన్నారు. అసలు ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం లేదని, అసలు ఎప్పుడు, ఎక్కడ ఆయన్ను ఎలా కలిశారో చెప్పాల్సిందిగా కోరానని సీఎం చెప్పారు. కేరళలో తనకు చెందిన 418 బార్లు నడవాలంటే 5 కోట్ల రూపాయల లంచం ఇవ్వాల్సిందిగా ఆర్థికమంత్రి మణి డిమాండ్ చేసినట్లు బార్ యజమాని బిజు రమేష్ ఓ టీవీ ఛానల్ వద్ద ఆరోపించారు. తమ అసోసియేషన్ సభ్యులంతా కలిసి కోటి రూపాయలు రెండు వాయిదాల్లో ఇచ్చారని.. దాన్ని కొట్టాయంలోని మణి ఇంటివద్దే ఇచ్చామని ఆయన అన్నారు. తన ఆరోపణలు తప్పని రుజువైతే తన ఆస్తులన్నింటినీ కేరళ ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నానని, ఆత్మాహుతి చేసుకోడానికీ సిద్ధమేనని అన్నారు. -
భారత్ చేరుకున్న కేరళ నర్సులు, తెలుగువారు
ఇరాక్‌లో సున్నీ ఉగ్రవాదుల చెరలో చిక్కుకుని.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపి.. ఎట్టకేలకు వారి చెరవీడిన కేరళ నర్సులు ముంబై చేరుకున్నారు. ఉదయం 8.43 గంటలకు వీరు బయల్దేరిన ప్రత్యేక విమానం ముంబైలో దిగింది. ఇందులో 46 మంది నర్సులతో పాటు మరో 137 మంది ఇతరులు కూడా ఉన్నారు. ఉదయం 11.55 గంటలకు ఇది కొచ్చి చేరుకుంటుంది. అక్కడినుంచి మధ్యాహ్నం 2.25 గంటలకు హైదరాబాద్ వెళ్తుంది. చిట్టచివరకు సాయంత్రం 5.40 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. కాగా, కొచ్చి విమానాశ్రయంలో కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ స్వయంగా వెళ్లి వారిని మాతృభూమికి ఆహ్వానిస్తారు. నర్సుల కోసం ప్రత్యేకంగా ఒక ఇమ్మిగ్రేషన్ డెస్కును ఏర్పాటు చేశారు. భారతీయ దౌత్యాధికారుల చొరవతో విడుదలైన నర్సులంతా కుర్దిస్థాన్ రాజధాని ఎర్బిల్ నుంచి బయల్దేరిన విమానంలో భారత్ చేరుకున్నారు. ఇరాక్‌లో చిక్కుకున్న మరికొందరు భారతీయులు కూడా ఇదే విమానంలో ఉన్నారు. మొత్తం 183 మంది ప్రయాణికులుండగా వారిలో 23 మంది విమాన సిబ్బంది, ముగ్గురు ప్రభుత్వాధికారులు ఉన్నారు. 46 మంది కేరళ నర్సులు కాక మిగిలినవారిలో వంద మంది తెలుగువారని ఎయిరిండియా వర్గాలు తెలిపాయి. -
కేరళలో భారీ వర్షాలు: 16 మంది మృతి
కేరళలో రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఇడుక్కి జిల్లాలో 14 మంది వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఎర్నాకుళం జిల్లాలో మరో ఇద్దరు మరణించారు. పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉండే ఇడుక్కి జిల్లాపై వర్షాల ప్రభావం ఎక్కువగా ఉందని రెవెన్యూ మంత్రి అదూర్ ప్రకాశ్ తెలిపారు. ఆయన స్వయంగా ఆ జిల్లాకు వెళ్లి ప్రభావిత ప్రాంతాలలో జరుగుతున్న సహాయ, పునరావాస కార్యకలాపాలను పరిశీలించారు. మున్నార్ సమీపంలోని చీయపర ప్రాంతంలో భారీ కొండచరియ విరిగిపడింది. రోడ్డుపక్కనే వాహనాలు పార్కింగ్ చేసి ఉన్న సమయంలో ఇది పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీన్ని తీసిన తర్వాత గానీ కింద ఎన్ని వాహనాలున్నాయో చెప్పలేమన్నారు. భారత నావికా దళానికి చెందిన సిబ్బంది ఇప్పటికే సహాయ కార్యక్రమాల కోసం అక్కడకు చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం పరిస్థితి తీవ్రత గురించి చర్చించేందుకు ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అత్యవసర కేబినెట్ సమావేశం ఏర్పాటుచేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఇడుక్కి ప్రాంతానికి ప్రత్యేక వైద్య బృందాలను పంపారు. కొచ్చిలో 40 విమాన సర్వీసులు రద్దు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం పార్కింగ్ ప్రాంతంతో పాటు టాక్సీ మార్గంలోకి కూడా నీళ్లు ప్రవేశించడంతో దాదాపు 40 విమాన సర్వీసులు రద్దుచేశారు. ఈ విమానాశ్రయం 1999లో ప్రారంభం కాగా, అప్పటినుంచి ఇలా జరగడం ఇదే మొదటిసారని విమానాశ్రయ డైరెక్టర్ ఏసీకే నాయర్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా డ్యాం షట్టర్లు తెరవాల్సి రావడంతో విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరుకుందని, లోపలకు కూడా నీళ్లు రావడంతో ఉదయం పదిన్నర గంటలకు మొత్తం ఆపరేషన్లన్నింటినీ సస్పెండ్ చేశామని ఆయన తెలిపారు. సాయంత్రానికి మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని నాయర్ చెప్పారు. గడిచిన రెండు రోజులుగా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇడుక్కి, ఎర్నాకుళం జిల్లాలపై వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది.