'నా కంపెనీ ఎదుగుదల, పతనానికి సీఎం కారణం'
కోచి: కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీపై సోలార్ స్కాం నిందితురాలు సరితా నాయర్ ఆరోపణల పర్వాన్ని కొనసాగిస్తోంది. కోచిలో జ్యుడిషియల్ కమిషన్ ఎదుట మరోసారి హాజరైన సరిత.. ఉమెన్ చాందీపై తీవ్ర ఆరోపణలు చేసింది. తన కంపెనీ ఎదుగుదలకు, పతనానికి ముఖ్యమంత్రే కారణమని చెప్పింది. సరిత వ్యాపార భాగస్వామి, సహ నిందితుడు బిజూ రాధాకృష్ణన్ కూడా ఇవే ఆరోపణలు చేశాడు.
సరిత ఓ జాతీయ చానెల్తో మాట్లాడుతూ.. ఉమెన్ చాందీకి తాను లంచం ఇచ్చానని మరోసారి చెప్పింది. 'ముఖ్యమంత్రి చాందీకి 1.9 కోట్ల రూపాయల చెక్లను ఇచ్చాను. నేను ఇచ్చింది సీఎం సహాయక నిధికి కాదు. ఇది లంచంగా ఇచ్చింది' అని వెల్లడించింది. సోలార్ స్కాం కేసును విచారిస్తున్న రిటైర్డ్ జడ్జి ఎదుట తాను ఇదే విషయం చెప్పినట్టు ఇటీవల పేర్కొంది. రిటైర్డ్ జడ్జి ఎదుట సీఎం ఊమెన్ చాందీ కూడా హాజరైన సంగతి తెలిసిందే. దాదాపు 11 గంటల పాటు చాందీ తన వాదన వినిపించారు. సోలార్ స్కాంలో 2013లో అరెస్టయిన సరిత.. బెయిల్ మీద విడుదలైనప్పటి నుంచి సీఎం మీద ఆరోపణలు గుప్పిస్తోంది. ఉమెన్ చాందీకి రూ. 2 కోట్ల లంచం ఇచ్చానని సరిత ఆరోపించడం కేరళ రాజకీయాలను కుదిపేసింది.