రాష్ట్రాన్ని కుదిపేస్తున్న మహిళా సునామీ!
సాక్షాత్తు ముఖ్యమంత్రికి రూ. 2 కోట్ల లంచం ఇచ్చానని చెప్పడానికి ఎన్నో గట్స్ కావాలి. అలాంటిది ఓ మహిళ ఎంతో సాహసం చేసి.. కేరళ ముఖ్యమంత్రి మీద ఆరోపణల సునామీ గుప్పించింది. చివరకు దాదాపు ముఖ్యమంత్రి మీద కేసు నమోదయ్యేంత పరిస్థితి ఏర్పడింది. అయితే చివరి నిమిషంలో కేరళ హైకోర్టు జోక్యం చేసుకుని ఎఫ్ఐఆర్ దాఖలు మీద రెండు నెలల స్టే విధించడంతో ఊమెన్ చాందీ ఊపిరి పీల్చుకున్నారు. ఆ మహిళ పేరు సరితా నాయర్. సోలార్ స్కాం నిందితులలో ఒకరు. 2013లోనే ఆమె ఈ కేసులో అరెస్టయినా.. మళ్లీ బెయిల్ మీద విడుదలై, అప్పటి నుంచి సీఎం మీద ఆరోపణలు గుప్పిస్తోంది. అసలే త్వరలో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఇదంతా సీఎం తలకు భారంగా చుట్టుకుంటోంది.
రాబోయే పదేళ్లలో కేరళను సంపూర్ణ మద్యరహిత రాష్ట్రంగా చేయాలనుకున్న తమ ప్రభుత్వ నిర్ణయం కారణంగా బార్ యజమానులు ఆగ్రహించి, సరితా నాయర్‌ను తమమీద ప్రయోగించారని సీఎం చాందీ ఆరోపిస్తున్నారు. కాగా, పారిశ్రామిక వేత్తలకు చవగ్గా సోలార్ ప్యానళ్లు సరఫరా చేస్తామని సరితా నాయర్ చెప్పింది గానీ, ఆమె అసలు సరఫరా చేయలేదని మంత్రులు ఆరోపిస్తున్నారు. కానీ ఆమె మాత్రం సోలార్ స్కాం కేసును విచారిస్తున్న రిటైర్డ్ జడ్జి ఎదుట కూడా తాను సీఎంకు రూ. 1.90 కోట్ల లంచం ఇచ్చినట్లు చెప్పేశారు. కాగా, గత సోమవారం నాడు రిటైర్డ్ జడ్జి ఎదుట సీఎం ఊమెన్ చాందీ దాదాపు 11 గంటల పాటు తన వాదన వినిపించారు. అవతలి వాళ్లు ఆయనను క్రాస్ ఎగ్జామిన్ కూడా చేశారు. అయితే ఇప్పటివరకు కేరళలో ఒక ముఖ్యమంత్రిని జ్యుడీషియల్ కమిషన్ విచారించడం మాత్రం ఇదే మొదటిసారి. దీనికి తోడు కేరళ కాంగ్రెస్ నాయకుడు ఒకరు సరితా నాయర్‌తో మాట్లాడుతున్నట్లుగా చెబుతున్న ఆడియో టేప్ లీకవ్వడం కూడా సర్కారు కష్టాలకు మరింత ఆజ్యం పోసింది.