లంచగొండి మంత్రిని వెనకేసుకొచ్చిన సీఎం
లంచాలు తీసుకున్నారంటూ ఆరోపణలు వచ్చిన కేరళ ఆర్థికమంత్రి కేఎం మణిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ వెనకేసుకొచ్చారు. హోటళ్లలో బార్లు కలిగి ఉన్న ఓ వ్యాపారవేత్త.. తనవద్దనుంచి ఆర్థికమంత్రి మణి లంచం తీసుకున్నారంటూ ఆరోపించారు. అయితే, అవి నిరాధార ఆరోపణలని, ఆయన తన వద్దకు కూడా ఈ ఆరోపణలతో వచ్చారని చాందీ అన్నారు. అసలు ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం లేదని, అసలు ఎప్పుడు, ఎక్కడ ఆయన్ను ఎలా కలిశారో చెప్పాల్సిందిగా కోరానని సీఎం చెప్పారు.
కేరళలో తనకు చెందిన 418 బార్లు నడవాలంటే 5 కోట్ల రూపాయల లంచం ఇవ్వాల్సిందిగా ఆర్థికమంత్రి మణి డిమాండ్ చేసినట్లు బార్ యజమాని బిజు రమేష్ ఓ టీవీ ఛానల్ వద్ద ఆరోపించారు. తమ అసోసియేషన్ సభ్యులంతా కలిసి కోటి రూపాయలు రెండు వాయిదాల్లో ఇచ్చారని.. దాన్ని కొట్టాయంలోని మణి ఇంటివద్దే ఇచ్చామని ఆయన అన్నారు. తన ఆరోపణలు తప్పని రుజువైతే తన ఆస్తులన్నింటినీ కేరళ ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నానని, ఆత్మాహుతి చేసుకోడానికీ సిద్ధమేనని అన్నారు.