graft allegations
-
పాకిస్తాన్కు చైనా బిగ్ షాక్
న్యూఢిల్లీ : అత్యంత నమ్మకమైన మిత్రదేశంగా భావించే పాకిస్తాన్కు చైనా ఊహించని షాక్ ఇచ్చింది. చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్లో భాగంగా పాకిస్తాన్లో నిర్మించే మూడు రహదారి ప్రాజెక్టులకు నిధులు నిలిపివేస్తున్నట్లు చైనా మంగళవారం ప్రకటించింది. సీపీఈసీ ప్రాజెక్ట్ను చైనా 50 బిలియన్ డాలర్లతో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్లో నిర్మించే మూడు రహదారి ప్రాజెక్టుల నిర్మాణానం మూడు నెలలుగా నత్తనడకన సాగుతోంది. పనుల్లో వేగం లేకపోవడంతోనే చైనా ఈ నిర్ణయం తీసుకుందని పాకిస్తాన్ పత్రిక డాన్ పేర్కొంది. చైనా ప్రభుత్వ నిర్ణయంతో పాకిస్థాన్ నేషనల్ హైవే అథారిటీ (ఎన్హెచ్ఏ) చేపట్టిన ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇదిలా ఉండగా.. సీపీఈసీ ప్రాజెక్ట్ నిధులకు సంబంధించి నూతన విధివిధానాలు ఖరారు అయ్యే వరకూ నిధులను నలిపేస్తున్నట్లు చైనా ఉన్నతాధికారులు ప్రకటించారు. చైనా నిధుల నిలిపివేతపై పాకిస్తాన్ అధికారులు మరోలా స్పందిస్తున్నారు. పాకిస్తాన్ అంటే గిట్టనివారు కొందరు సీపీఈసీ ప్రాజెక్ట్లో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నట్లు చైనాను తప్పుదోవ పట్టించారని పాకిస్తాన్ చెబుతోంది. సీపీఈసీలో అవినీతి జరుగుతోందన్న అనుమానాలతోనే చైనా నిధులను నిలిపేసిందని పాకిస్తాన్ భావిస్తోంది. చైనా చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని బలూచిస్తాన్ నుంచి చైనాలోని జింజియాంగ్ ప్రాంతాలను కలుపుతుంది. ప్రస్తుతం నిధుల నిలిపివేతతో ఈ ప్రాంతంలోని డేరా ఇస్మాయిల్ ఖాన్ నుంచి జహాబ్ మధ్యనున్న 214 కి.మీ. రహదారి పనులు నిలిచిపోతాయి. అలాగే ఖుజ్దార్ నుంచి బైసిమా మధ్య 110 కి.మీ, కారాకోరం హైవే మీద నిర్మించే రహదారి పనులు ఇబ్బందుల్లో పడతాయి. వాస్తవంగా ఈ ప్రాజెక్టులు పాకిస్తాన్ ప్రభుత్వ సొంత అభివృద్ధి కార్యక్రమంలోనివి కావడం గమనార్హం. ఈ రహదారులు కూడా సీపీఈసీ ప్రాజెక్ట్లోకి రావడంతో.. వీటికి కూడా చైనా నిధులు మంజూరు చేసింది. అయితే ప్రాజెక్టులో అవినీతి పెరిగిపోవడంతో.. చైనా నిధులు నిలిపేసింది. సీపీఈసీలో భాగంగా నిర్మిస్తున్న రహదారులపై చైనా నిధులు నిలిపేయడంపై పాకిస్తాన్ ఆశ్చర్యానికి, ఒకింత షాక్కు గురయినట్లు తెలుస్తోంది. -
లంచగొండి మంత్రిని వెనకేసుకొచ్చిన సీఎం
లంచాలు తీసుకున్నారంటూ ఆరోపణలు వచ్చిన కేరళ ఆర్థికమంత్రి కేఎం మణిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ వెనకేసుకొచ్చారు. హోటళ్లలో బార్లు కలిగి ఉన్న ఓ వ్యాపారవేత్త.. తనవద్దనుంచి ఆర్థికమంత్రి మణి లంచం తీసుకున్నారంటూ ఆరోపించారు. అయితే, అవి నిరాధార ఆరోపణలని, ఆయన తన వద్దకు కూడా ఈ ఆరోపణలతో వచ్చారని చాందీ అన్నారు. అసలు ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం లేదని, అసలు ఎప్పుడు, ఎక్కడ ఆయన్ను ఎలా కలిశారో చెప్పాల్సిందిగా కోరానని సీఎం చెప్పారు. కేరళలో తనకు చెందిన 418 బార్లు నడవాలంటే 5 కోట్ల రూపాయల లంచం ఇవ్వాల్సిందిగా ఆర్థికమంత్రి మణి డిమాండ్ చేసినట్లు బార్ యజమాని బిజు రమేష్ ఓ టీవీ ఛానల్ వద్ద ఆరోపించారు. తమ అసోసియేషన్ సభ్యులంతా కలిసి కోటి రూపాయలు రెండు వాయిదాల్లో ఇచ్చారని.. దాన్ని కొట్టాయంలోని మణి ఇంటివద్దే ఇచ్చామని ఆయన అన్నారు. తన ఆరోపణలు తప్పని రుజువైతే తన ఆస్తులన్నింటినీ కేరళ ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నానని, ఆత్మాహుతి చేసుకోడానికీ సిద్ధమేనని అన్నారు.