కొచ్చిలో వరద ప్రాంతాల నుంచి ప్రజల తరలింపు
కేరళలో రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఇడుక్కి జిల్లాలో 14 మంది వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఎర్నాకుళం జిల్లాలో మరో ఇద్దరు మరణించారు. పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉండే ఇడుక్కి జిల్లాపై వర్షాల ప్రభావం ఎక్కువగా ఉందని రెవెన్యూ మంత్రి అదూర్ ప్రకాశ్ తెలిపారు. ఆయన స్వయంగా ఆ జిల్లాకు వెళ్లి ప్రభావిత ప్రాంతాలలో జరుగుతున్న సహాయ, పునరావాస కార్యకలాపాలను పరిశీలించారు.
మున్నార్ సమీపంలోని చీయపర ప్రాంతంలో భారీ కొండచరియ విరిగిపడింది. రోడ్డుపక్కనే వాహనాలు పార్కింగ్ చేసి ఉన్న సమయంలో ఇది పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీన్ని తీసిన తర్వాత గానీ కింద ఎన్ని వాహనాలున్నాయో చెప్పలేమన్నారు. భారత నావికా దళానికి చెందిన సిబ్బంది ఇప్పటికే సహాయ కార్యక్రమాల కోసం అక్కడకు చేరుకున్నారు.
మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం
పరిస్థితి తీవ్రత గురించి చర్చించేందుకు ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అత్యవసర కేబినెట్ సమావేశం ఏర్పాటుచేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఇడుక్కి ప్రాంతానికి ప్రత్యేక వైద్య బృందాలను పంపారు.
కొచ్చిలో 40 విమాన సర్వీసులు రద్దు
కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం పార్కింగ్ ప్రాంతంతో పాటు టాక్సీ మార్గంలోకి కూడా నీళ్లు ప్రవేశించడంతో దాదాపు 40 విమాన సర్వీసులు రద్దుచేశారు. ఈ విమానాశ్రయం 1999లో ప్రారంభం కాగా, అప్పటినుంచి ఇలా జరగడం ఇదే మొదటిసారని విమానాశ్రయ డైరెక్టర్ ఏసీకే నాయర్ తెలిపారు.
భారీ వర్షాల కారణంగా డ్యాం షట్టర్లు తెరవాల్సి రావడంతో విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరుకుందని, లోపలకు కూడా నీళ్లు రావడంతో ఉదయం పదిన్నర గంటలకు మొత్తం ఆపరేషన్లన్నింటినీ సస్పెండ్ చేశామని ఆయన తెలిపారు. సాయంత్రానికి మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని నాయర్ చెప్పారు. గడిచిన రెండు రోజులుగా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇడుక్కి, ఎర్నాకుళం జిల్లాలపై వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది.