former chief minister
-
బీజేపీలో చేరిన చంపయ్ సోరెన్
రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయ్ సోరెన్(67) బీజేపీలో చేరారు. జేఎంఎం ప్రస్తుత పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు పార్టీలో తనను అవమానించారని ఆరోపిస్తూ రెండు రోజుల క్రితం ఆయన ఆ పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం రాంచీలోలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చంపయ్ సోరెన్‌కు కండువా కప్పి, బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంపయ్ సోరెన్‌ను ‘టైగర్ జిందా హై’అంటూ చౌహాన్ అభివర్ణించారు. జార్ఖండ్ ఉద్యమంలో కొల్హన్ ప్రాంతంలో కీలకంగా ఉన్న చంపయ్‌ను అక్కడి వారు ‘కొల్హన్ టైగర్’గా పిలుచుకుంటారు. చంపయ్ మాట్లాడుతూ..ఢిల్లీ, కోల్‌కతాలలో ఉన్న సమయంలో తనపై హేమంత్ సోరెన్ ప్రభుత్వం నిఘా పెట్టిందని, దీన్ని జీర్ణించుకోలేకే ఆ పార్టీని వీడి బీజేపీలో చేరాల్సి వచ్చిందన్నారు. -
మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్‌కు కరోనా పాజిటివ్
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్‌కు కరోనా బారినపడ్డారు. కోవిడ్-19 లక్షణాలు కనిపించిన దరిమిలా ఆయన వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది.ఈ విషయాన్ని దిగ్విజయ్ సింగ్ స్వయంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో తెలిపారు. తన కోవిడ్ టెస్ట్ పాజిటివ్‌గా వచ్చిందని, వైద్యులు ఐదురోజుల పాటు తనను రెస్ట్ తీసుకోవాలని సూచించారని తెలిపారు. కోవిడ్ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తనను కలుసుకునేందుకు కొద్ది రోజులపాటు ఎవరూ రావద్దని దిగ్విజయ్ కోరారు. मेरा COVID test पॉजिटिव आया है। मुझे ५ दिनों के लिए आराम करने के लिये कहा गया है। इसलिए मैं कुछ समय के लिए नहीं मिल पाऊँगा। क्षमा करें। आप सभी भी COVID से बचने के लिए अपना ख़्याल रखें।— Digvijaya Singh (@digvijaya_28) August 20, 2024 -
నియంతృత్వంపై పోరాడదాం: సిసోడియా
న్యూఢిల్లీ: దేశంలో నియంతృత్వం కొనసాగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు. నియంతృత్వ పరిపాలనకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. నియంతృత్వాన్ని ప్రశి్నస్తూ ప్రతిపక్షాలన్నీ ఒక్కటై బిగ్గరగా గర్జిస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 24 గంటల్లో జైలు నుంచి బయటకు వస్తారని చెప్పారు. నిజాయతీకి ప్రతిరూపమైన కేజ్రీవాల్‌ను కుట్రపూరితంగా జైల్లో పెట్టారని మండిపడ్డారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తీహార్ జైలు నుంచి విడుదలైన సిసోడియా శనివారం ‘ఆప్’ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. 17 నెలల తర్వాత స్వతంత్రమైన సూర్యోదయం తన భార్యతో కలిసి తేనీరు సేవిస్తున్న ఫొటోను మనీష్ సిసోడియా శనివారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. 17 నెలల తర్వాత స్వతంత్రమైన సూర్యోదయాన మొదటి తేనీరు అని పేర్కొన్నారు. -
బుద్ధదేవ్‌కు అంతిమ వీడ్కోలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు దిగ్గజం బుద్ధదేవ్ భట్టాచార్యకు సీపీఎం నేతలు, కార్యకర్తలు, అభిమానులు శుక్రవారం వీడ్కోలు పలికారు. కోల్‌కతాలో సీపీఎం ప్రధాన కార్యాలయంలో బుద్ధదేవ్ భౌతికాయాన్ని సందర్శించి నివాళులరి్పంచారు. అంతిమయాత్రలో పారీ్టలకు అతీతంగా వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. లాల్ సలామ్ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. సాయంత్రం బుద్ధదేవ్ పారి్థవ దేహాన్ని ఆయన కోరిక ప్రకారమే ఎన్ఆర్ఎస్ ప్రభుత్వ ఆసుపత్రికి అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న బుద్ధదేవ్ భట్టాచార్య గురువారం తన ఇంట్లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. -
West Bengal: బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూత
కోల్‌కతా: సీపీఎం సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూశారు. 80 ఏళ్ల బుద్ధదేవ్ గురువారం ఉదయం 8.20 గంటలకు మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. శ్వాసకోస వ్యాధితో దీర్ఘకాలంగా బాధపడుతున్న ఆయన కోల్‌కతాలోని పామ్ అవెన్యూలో ఉన్న తన ఫ్లాట్‌లో తుదిశ్వాస విడిచారు. గతేడాదే ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కోలుకున్నారు. మళ్లీ ఇటీవల అనారోగ్యం పాలయ్యారు. ఆయనకు భార్య మీరా, కుమారుడు సుచేతన్ ఉన్నారు. ప్రజల సందర్శనార్థం భట్టాచార్య భౌతికకాయాన్ని శుక్రవారం తొలుత బెంగాల్ అసెంబ్లీ, తర్వాత సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి, డీవైఎఫ్ఐ కార్యాలయానికి తరలిస్తారు. అనంతరం అంతిమయాత్ర నిర్వహించి, మృతదేహాన్ని వైద్య కళాశాలకు అప్పగిస్తారు. కార్యకర్త నుంచి ముఖ్యమంత్రిగా.. సీపీఎం అత్యున్నత నిర్ణాయక విభాగమైన పొలిట్ బ్యూరో మాజీ సభ్యుడు అయిన భట్టాచార్య 1944 మార్చి 1న కోల్‌కతాలో జన్మించారు. కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కళాశాల నుండి బెంగాలీలో బీఏ ఆనర్స్ చేశారు. 1966లో పారీ్టలో చేరారు. సీపీఎం యువజన విభాగమైన డీవైఎఫ్ఐలో చేరారు. రాజకీయాల్లోకి రాకముందు పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా సేవలందించిన ఆయన 2000లో జ్యోతిబసు సీఎం పదవి నుంచి వైదొలగక ముందు ఉపముఖ్యమంత్రిగా పదోన్నతి పొందారు. జ్యోతిబసు తరువాత సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2000 నుంచి 2011 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. జ్యోతిబసు పాలనతో పోలిస్తే భట్టాచార్య హయాంలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం పారిశ్రామిక వర్గాల పట్ల సానుకూలంగా వ్యవహరించింది. విచిత్రమేమిటంటే పారిశ్రామికీకరణకు సంబంధించిన సీపీఎం విధానాలే 2011 ఎన్నికల్లో వామపక్షాల పరాజయానికి బాటలు వేశాయి. ‘పద్మభూషణ్’ తిరస్కరణ కేంద్రం 2021లో బుద్ధదేవ్‌కు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. ఆ అవార్డును ఆయన తిరస్కరించారు. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి బుద్ధదేవ్ మరణం పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. బెంగాల్ అభివృద్ధికి కృషి చేశారని, ప్రజలకు విశిష్టమైన సేవలు అందించారని బుద్ధదేవ్‌ను మోదీ కొనియాడారు. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు సంతాపం తెలిపారు. -
హేమంత్ సోరెన్‌కు బెయిల్
రాంచీ: భూకుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తిమోర్చా(జేఎంఎం) కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్(48)కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో జార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హేమంత్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ రంగోన్ ముఖోపాధ్యాయ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. హేమంత్ సోరెన్‌కు బెయిల్ ఇస్తే మళ్లీ ఇదే తరహా అవినీతికి పాల్పడే అవకాశం ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తరఫు న్యాయవాది ఎస్.వి.రాజు పేర్కొన్నారు. ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ఈడీ వాదనను ధర్మాసనం తిరస్కరించింది. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే హేమంత్ ఏ నేరమూ చేయలేదని, బెయిల్‌పై బయట ఉన్నప్పుడు ఆయన నేరం చేసే అవకాశం లేదని, అందుకే బెయిల్ ఇస్తున్నామని స్పష్టంచేసింది. హేమంత్ రూ.50 వేల పూచీకత్తు సమరి్పంచాలని, ఆయనకు ష్యూరిటీ ఇస్తూ మరో ఇద్దరు రూ.50 వేల చొప్పున పూచీకత్తు సమరి్పంచాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని, ఈ బెయిల్ తీర్పుపై 48 గంటలపాటు స్టే విధించాలని ఈడీ తరఫున మరో న్యాయవాది జోహబ్ హుస్సేన్ విజ్ఞప్తి చేయగా ధర్మాసనం తిరస్కరించింది. జార్ఖండ్ రాజధాని రాంచీలో 8.86 ఎకరాల భూకుంభకోణం కేసులో హేమంత్ సోరెన్‌ను ఈ ఏడాది జనవరి 31న ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తప్పుడు కేసులో ఇరికించారు: హేమంత్ తనను తప్పుడు కేసులో ఇరికించి, ఐదు నెలలపాటు జైల్లో పెట్టారని హేమంత్ సోరెన్ ఆరోపించారు. జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని అధికార బీజేపీపై నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేతలు, సామాజిక కార్యర్తలు, జర్నలిస్టుల గొంతులను ప్రభుత్వం అణచివేస్తోందని మండిపడ్డారు. -
Geetha Shivarajkumar: ‘గీత’ దాటినా... గీత మారేనా!
గీతా శివరాజ్‌కుమార్. కన్నడ ప్రజలకు చిరపరిచితమైన పేరు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ కోడలు. ప్రముఖ నటుడు శివరాజ్‌కుమార్ భార్య. అంతేనా...? కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కూతురు! రాజకీయ కుటుంబంలో పుట్టి కన్నడ సినీ పరిశ్రమకు దిగ్గజాల వంటి తారలను అందించిన ఇంటికి కోడలిగా వెళ్లారు. అయినా పుట్టింటి వారసత్వం ఆమెను చివరికి రాజకీయాల వైపు నడిపించింది. 2014లోనే రాజకీయ అరంగేట్రం చేసిన గీత ఇప్పుడు శివమొగ్గ లోక్‌సభ స్థానంలో బీజేపీ దిగ్గజం యడ్యూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్రతో పోటీ పడుతున్నారు...నిషేధాన్ని ఉల్లంఘించి.. గీతకు 1986లో శివరాజ్‌కుమార్‌తో పెళ్లయ్యింది. తర్వాత కుటుంబ బాధ్యతల్లో తలమునకలయ్యారు. తల్లి మరణానంతరం ఆమె నిర్వహించిన మైసూరులోని ‘శక్తిధామ్’ స్వచ్ఛంద సంస్థ బాధ్యతలు చూస్తున్నారు. చాలాకాలం భర్తకు స్టయిలిస్ట్‌గా కూడా చేశారు. కొన్ని సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి వెళ్లొద్దని రాజ్‌కుమార్ లక్ష్మణరేఖ గీశారు. దాంతో సినిమాల్లో ఎంత పాపులారిటీ సాధించినా ఆయన కొడుకులెవ్వరూ రాజకీయాల వైపే చూడలేదు. కానీ బాల్యం నుంచి ఇంట్లో పూర్తి రాజకీయ వాతావరణం చూసిన గీతకు రాజకీయాలంటే మహా ఆసక్తి. ఆమెకు రెండేళ్లప్పుడు తండ్రి బంగారప్ప ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ స్ఫూర్తితో 2014లో గీత రాజకీయ అరంగేట్రం చేశారు. ఈ నిర్ణయాన్ని రాజ్‌కుమార్ భార్య పార్వతమ్మ వ్యతిరేకించారంటారు. తటస్థంగా ఉన్న కుటుంబాన్ని శివ రాజ్‌కుమార్, గీత వారి ఆకాంక్షల కోసం రాజకీయాల్లోకి లాగుతున్నారంటూ ఆమె ఆవేదన చెందినట్టు వార్తలొచ్చాయి. అయినా గీత పట్టించుకోలేదు. శివమొగ్గ లోక్‌సభ స్థానంలో జేడీ(ఎస్) అభ్యరి్థగా యడ్యూరప్పపై పోటీచేశారు. ఆ ఎన్నికల్లో ఓటమితో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవలి కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. సోదరుడు మధు బంగారప్ప కోసం ప్రచారం చేశారు. ఇప్పుడు శివమొగ్గ నుంచి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అక్కడ రెండుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీ రాఘవేంద్రతో తలపడుతున్నారు. ఆయన విజయ పరంపరకు బ్రేకులు వేస్తానని ధీమాగా చెబుతున్నారు!నీటి సమస్య పరిష్కారం తొలి ప్రాధాన్యత.. శివమొగ్గలో నీటి కొరత తీర్చడమే తన మొదటి ప్రాథమ్యమని చెబుతున్నారు గీత. ‘‘నా సోదరుడు, ఇతర ఎమ్మెల్యేల సహకారంతో అనేక సమస్యలను పరిష్కరిస్తా. కాంగ్రెస్ పథకాలు నా విజయానికి దోహదపడతాయి. ‘‘గెలవగానే బెంగళూరు వెళ్లిపోతానన్న బీజేపీ ఆరోపణలు అబద్ధమని నిరూపిస్తా. శివమొగ్గలో నాకు ఇల్లుంది. ఇక్కడ ఉండకుండా ఎక్కడకు పోతాను? బీజేపీ ఇకనైనా ఇలాంటి చౌకబారు ఎత్తుగడలు మాని రైతులు, వెనకబడ్డ తరగతులు, ప్రజల కష్టాలపై మాట్లాడితే బాగుంటుంది. నేనెప్పుడూ నా బాధ్యతల నుంచి వెనక్కు తగ్గలేదు. శక్తిధామ్ సంస్థను చూసుకుంటున్నట్టుగానే శివమొగ్గ ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పని చేస్తా. క్షేత్రస్థాయిలో వారికి అందుబాటులో ఉంటా’’ అని చెబుతున్నారు. భర్త శివరాజ్‌కుమార్ ప్రతిష్ట, తండ్రి బంగారప్ప మంచితనం, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన శివమొగ్గలో తనను గెలిపిస్తాయని నమ్మకముందంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok sabha elections 2024: కుమారస్వామి ఆస్తులు రూ.217 కోట్లు
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, ఆయన భార్య అనిత మొత్తం రూ.217.21 కోట్ల ఆస్తులున్నాయి. మాండ్య లోక్‌సభ స్థానానికి గురువారం కుమారస్వామి నామినేషన్ వేశారు. ఎన్నికల అఫిడివిట్లో తన వ్యక్తిగత వివరాలను పొందుపరిచారు. తమకు రూ.82.17 కోట్ల అప్పులు కూడా ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. కుమారస్వామికి రూ.54.65 కోట్ల విలువైన ఆస్తులుండగా ఆయన భార్య అనితకు రూ.154.39 కోట్ల ఆస్తులున్నాయి. తమ ఉమ్మడి కుటుంబంలో తన పేరిట మరో రూ.8.17 కోట్ల ఆస్తులు కూడా ఉన్నట్లు మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ కుమారుడైన కుమారస్వామి వెల్లడించారు. -
సునీతా కేజ్రీవాల్‌తో కల్పనా సోరెన్ భేటీ
న్యూఢిల్లీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ శనివారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్‌ను కలిశారు. ఢిల్లీలోని ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులో ఉన్న సీఎం నివాసానికి ఆమె వెళ్లారు. సునీతా కేజ్రీవాల్, కల్పనా సోరెన్‌లు సుమారు 20 నిమిషాల సేపు మాట్లాడుకున్నారని అధికారులు తెలిపారు. అనంతరం కల్పన మీడియాతో మాట్లాడారు. ‘సునీతా జీతో ఆవేదన, బాధను పంచుకునేందుకు ఇక్కడికి వచ్చా. ఆమె తన పరిస్థితిని వివరించారు. తుది వరకు పోరాడాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం. యావత్తూ జార్ఖండ్ ప్రజలు కేజ్రీవాల్ వెన్నంటే ఉంటారు’అని చెప్పారు. ‘జార్ఖండ్‌లో రెండు నెలల క్రితం జరిగిందే ఢిల్లీలో పునరావృతమైంది. నా భర్త హేమంత్ జైలుకు వెళ్లారు. కేజ్రీవాల్ కస్టడీలో ఉన్నారు. జార్ఖండ్, ఢిల్లీల్లో పరిస్థితులు ఒకేలా ఉన్నాయి’అని చెప్పారు. కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీని కలిసి, పరిస్థితిని వివరిస్తానన్నారు. భూకుంభకోణం మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ జనవరిలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా, కల్పనా సోరెన్, జార్ఖడ్ సీఎం చంపాయి సోరెన్‌తోపాటు ఆదివారం ఢిల్లీలో జరిగే ఇండియా కూటమి ర్యాలీలో పాల్గొంటారని సమాచారం. సునీతా కేజ్రీవాల్ కూడా ర్యాలీలో పాలు పంచుకుంటారని ఆప్ నేతలు తెలిపారు. -
‘కమలం’ చెంతకు కమల్‌నాథ్?
న్యూఢిల్లీ/భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే అలాంటిదేమీ లేదని కమల్‌నాథ్ ఆ వార్తలను కొట్టిపారేశారు. అయితే శనివారం జరిగిన పరిణామాలు చూస్తుంటే ఆయన బీజేపీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషణలు వినవచ్చాయి. అసలేం జరిగింది? కమల్‌నాథ్‌కు మాజీ మీడియా సలహాదారు, ప్రస్తుత బీజేపీ అధికార ప్రతినిధి అయిన నరేంద్ర సలూజా.. కమల్‌నాథ్, ఆయన కుమారుడు, ఛింద్వారా కాంగ్రెస్ ఎంపీ నకుల్‌నాథ్‌లతో దిగిన భోపాల్‌లో దిగిన ఒక ఫొటోను ‘ఎక్స్’లో పోస్ట్‌చేసి దానికి ‘జై శ్రీరామ్’ అని ట్వీట్‌చేశారు. దీంతో తండ్రీకొడుకులు కమలం గూటికి చేరుకుంటున్నారని వార్తలు మొదలయ్యాయి. వీటికి బలం చేకూరుస్తూ నకుల్‌నాథ్ తన ‘ఎక్స్(పాత ట్విట్టర్)’ ఖాతా వివరాల్లో కాంగ్రెస్ పదాన్ని తొలగించారు. ముందస్తు షెడ్యూల్ లేకుండా హడావుడిగా ఇద్దరూ ఢిల్లీకి వచ్చారు. రాగానే మీడియా కమల్‌ను ప్రశ్నించింది. మీరు పార్టీ మారుతున్నారా? అన్న ప్రశ్నకు ‘‘ అలాంటిదేమైనా ఉంటే ముందు మీకే చెబుతా’ అని అన్నారుగానీ పార్టీని వీడట్లేదనే సమాధానం చెప్పలేదు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. రాజ్యసభ సీటు ఆశించి భంగపడినందుకే కమల్‌నాథ్ పార్టీని వీడుతున్నారని మరో విశ్లేషణ వినిపించింది. బీజేపీలోకి వస్తామంటే ఇప్పుడే మీకు స్వాగతం పలుకుతామని మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ వీడీ శర్మ శుక్రవారం వ్యాఖ్యానించడం తెల్సిందే. గత ఏడాది మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శనకు కమల్‌నాథ్ బాధ్యుడని రాహుల్ భావిస్తున్నారని, అందుకే కమల్‌ను తప్పించి జీతూ పట్వారీకి కాంగ్రెస్ మధ్యప్రదేశ్ చీఫ్ పదవి కట్టబెట్టారని వార్తలొచ్చాయి. అన్నీ అసత్యాలు : జీతూ పట్వారీ ఇలాంటి వార్తలను కాంగ్రెస్ మధ్యప్రదేశ్ అధ్యక్షుడు జీతూ పటా్వరీ తోసిపుచ్చారు. ‘‘ కాంగ్రెస్‌తో కమల్‌నాథ్ బంధం ఈనాటిది కాదు. ఇందిరాగాంధీ తనయుడు సంజయ్ గాంధీతో కలిసి డెహ్రాడూన్ డూన్ స్కూల్లో చదివారు. ఒకానొక సమయంలో కమల్ నా మూడో కుమారుడు అంటూ స్వయంగా ఇందిరగాం«దీనే వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్‌ను వీడుతారా?’’ అని మీడియానే పట్వారీ నిలదీశారు. ‘‘రాజ్యసభ సీటు ఇవ్వలేదన్నది అవాస్తం. నిజానికి ఆ స్థానం కోసం నామినేషన్ వేసిన పార్టీ కోశాధికారి అశోక్‌సింగ్ పేరును బలపరిచింది కమల్‌నాథే’’ అని పటా్వరీ వివరణ ఇచ్చారు. దశాబ్దాలుగా కాంగ్రెస్‌తో అనుబంధమున్న కమల్ ఛింద్వారా నుంచి తొమ్మిదిసార్లు ఎంపీగా గెలిచారు. 2019లో ఆ స్థానం నుంచి కమల్ కుమారుడు నకుల్ గెలిచారు. ఈ ఒక్కస్థానం తప్ప రాష్ట్రంలోని మిగతా 28 ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. -
కాంగ్రెస్ గూటికి ఒడిషా మాజీ సీఎం గమాంగ్
న్యూఢిల్లీ: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ తిరిగి హస్తం గూటికి చేరారు. తొమ్మిదేళ్ల కిందట పార్టీని వీడిన గమాంగ్ బుధవారం కుటుంబ సమేతంగా తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేత అజయ్ మాకెన్ సమక్షంలో పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ను వీడిన తర్వాత గమాంగ్ 2015లో బీజేపీలో చేరారు. అనంతరం 2023లో బీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత బీఆర్ఎస్కు కూడా గుడ్‌బై చెప్పారు. తాజాగా తన మాతృ పార్టీ కాంగ్రెస్ గూటికి చేరారు. గమాంగ్ 1999లో కొద్ది నెలల పాటు ఒడిషా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇదీచదవండి.. రామాయణ్.. అయోధ్యకు చేరుకున్న సీతారామలక్ష్మణులు -
ఎన్టీఆర్ స్మారక రూ.100 నాణేలకు భారీ డిమాండ్
లక్డీకాపూల్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు స్మారక రూ.100 నాణేలకు భారీ డిమాండ్ ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయన చిత్రంతో కూడిన రూ.100 నాణేన్ని ముద్రించింది. దీనిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొదటి విడతగా 1,2000 నాణేలను ప్రభుత్వం విడుదల చేయగా, వీటి కోసం ఎన్టీఆర్ అభిమానులు పోటీపడుతున్నారు. తెలంగాణ, ఏపీ నుంచి హైదరాబాద్‌కు భారీగా తరలివస్తున్నారు. మంగళవారం సైఫాబాద్‌లోని మింట్ కాంపౌండ్ వద్ద నాణేల అమ్మకాలు ప్రారంభం కాగా, గంటల తరబడి క్యూలో ఉండి ఎన్టీఆర్ నాణేలను చేజిక్కించుకుంటున్నారు. రూ.4,850, రూ.4,380, రూ.4,050గా ధరలు నిర్ణయించిన అధికారులు గిఫ్ట్ బాక్స్‌తోపాటు వంద నాణేన్ని అమ్ముతున్నారు. -
కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ కన్నుమూత
తిరువనంతపురం: కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ దిగ్గజ నేత ఊమెన్ చాందీ(79) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులో చికిత్స పొందుతూ మంగళవారం వేకువఝామున తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు చాందీ ఊమెన్ తన ఫేస్బుక్ ద్వారా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఊమెన్ చాందీ రెండుసార్లు కేరళకు సీఎంగా పని చేశారు. కేరళ అసెంబ్లీకి పన్నెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఏకైక రికార్డు సైతం ఈయన సొంతం. ఆయన పార్థీవ దేహాన్ని తిరువనంతపురానికి ప్రజా సందర్శనార్థం తరలించారు. స్వస్థలం కొట్టాయంలోనే ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. కేరళ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కే సుధాకరన్‌తో పాటు జాతీయ స్థాయిలోని కాంగ్రెస్ నేతలు పలువురు ఊమెన్ చాందీ మృతికి సంతాపం ప్రకటించారు. విపక్షాల భేటీ నేపథ్యంలో బెంగళూరులోనే ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలు ఉన్నారు. దీంతో అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశాలూ కనిపిస్తున్నాయి. ► 1943 అక్టోబర్ 31వ తేదీన ఊమెన్ చాందీ కొట్టాయం జిల్లా పుతుప్పల్లిలో జన్మించారు. ► విద్యార్థి దశ నుంచే ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టారు. కాంగ్రెస్ యువ విభాగం కేరళ స్టూడెంట్స్ యూనియన్‌లో క్రియాశీలక సభ్యుడిగా వ్యవహరించారు. ► కొట్టాయం, చంగనసెర్రీలో ఆయన ఉన్నత విద్యను అభ్యసించారు. ఎర్నాకులం ప్రభుత్వ న్యాయ కళాశాలలో న్యాయ విద్యను పూర్తి చేశారు. ► కేఎస్‌యూ ప్రెసిడెంట్‌గా పని చేసిన అనంతరం నేరుగా ఆయన ఎమ్మెల్యేగా పుతుప్పల్లి స్థానం నుంచి పోటీ చేసి నెగ్గారు. 1970 నుంచి పుతుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయనే ఎమ్మెల్యే. 1970, 1977, 1980, 1982, 1987, 1991, 1996, 2001, 2006, 2011, 2016, 2021లో 12సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. ► 2004-2006 మద్య, ఆపై 2011-16 మధ్య రెండు పర్యాయాలు ఆయన కేరళకు ముఖ్యమంత్రిగా పని చేశారు. 2006-11 మధ్య కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ► సీఎంగానే కాదు.. మంత్రిగా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గానూ ఆయన పని చేశారు. కరుణాకరణ్, ఏకే ఆంటోనీ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో.. లేబర్, హోం, ఆర్థిక శాఖ మంత్రిగా ఊమెన్ చాందీ పని చేశారు. ► కేరళ అసెంబ్లీకి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పని చేసిన వ్యక్తి మాత్రమే కాదు.. ఐక్యరాజ్య సమితి నుంచి ప్రజా సేవలకు గానూ అవార్డు అందుకున్న వ్యక్తి కూడా ఊమెన్ చాందీ కావడం గమనార్హం. ► ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు, అలాగే తిరువనంతపురాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే ప్రయత్నాలు.. ఇలా తన హయాంలో చెప్పుకోదగ్గ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారాయన. ► అయితే.. 2013 కేరళ సోలార్ ప్యానెల్ స్కామ్, విళింజమ్ పోర్ట్ అవినీతి ఆరోపణలు, పట్టూర్ భూముల కేసు, పల్మోలెయిన్ ఆయిల్ ఇంపోర్ట్ స్కామ్.. ఊమెచ్ చాందీ హయాంలో కుదిపేశాయి. ► 2018 జూన్ 6వ తేదీన అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఏఐసీసీ(ఆల్ ఇండియా కాంగ్రెస కమిటీ) ఇన్ఛార్జీగా ఆంధ్రప్రదేశ్ బాధ్యతలను ఊమెన్ చాందీకి అప్పగించారు. ► చివరి రోజుల్లో ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్‌గా ఉన్నారు. ► ఊమెన్ చాందీ భార్య పేరు మరియమ్మా, ముగ్గురు సంతానం వీళ్లకు. There Lived a Chief Minister once... 💔🙏🏻 Heartfelt Condolences 🌹 Sri Oomen Chandy 🤍#oomenchandy #ChiefMinister #Kerala #Trending #Condolences pic.twitter.com/mkm9gt15E9 — #Abu (@AbuThahir2044) July 18, 2023 -
మళ్లీ యెడ్డీ వైపే బీజేపీ మొగ్గు
బెంగళూరు: కర్ణాటకలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్పపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఎన్నికల ప్రచార బాధ్యతలను ప్రధాని మోదీతోపాటు యడియూరప్ప సారథ్యం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ ఇప్పటికే ప్రకటించిన యెడియూరప్పను మళ్లీ క్రియాశీలకంగా మార్చేందుకు కమలనాథులు ప్రయత్నాలు ప్రారంభించారు. అట్టడుగు స్థాయి నుంచి పార్టీని విస్తరించి, నాలుగు పర్యాయాలు సీఎం పీఠం అధిరోహించిన నేతగా ఆయనపై ఇప్పటికీ ప్రజాభిమానం చెక్కుచెదరలేదు. మరీ ముఖ్యంగా లింగాయత్ కులస్తుల్లో80 ఏళ్ల ఈ వృద్ధ నేతకున్న పలుకుబడి మరే ఇతర రాజకీయ పార్టీ నేతకూ లేదు. ఈ విషయాన్ని గ్రహించే ఆయన కేంద్ర నాయకత్వం రానున్న ఎన్నికల్లో ఆయన్ను ‘పోస్టర్ బాయ్’గా ఉంచి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో జరిగిన పలు బహిరంగ సభలు, సమావేశాల్లో ప్రధాని మోదీతోపాటు హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ యెడియూరప్పపై ప్రశంసలు కురిపించడం వెనుక కారణం ఇదే. ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడం, లింగాయత్ ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడంతోపాటు ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్‌ను కట్టడి చేసేందుకు సైతం యెడియూరప్ప అవసరం ఎంతో ఉందని రాజకీయ పరిశీలకులతోపాటు కాషాయ వర్గాలు సైతం అంటున్నాయి. రాష్ట్ర బీజేపీకి మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇష్టం లేకున్నా యెడియూరప్పనే ప్రచారంలో ముందుంచేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధమవుతోందని అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన రాజకీయ విశ్లేషకుడు ఎ.నారాయణ చెప్పారు. -
కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన మాజీ సీఎం
సాక్షి,హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో రాణించేందుకు భారత్ రాష్ట్ర సమితి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇవాళ ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమక్షంలో ఇతర రాష్ట్రాల నుంచి చేరికలు మొదలయ్యాయి. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్(79) బీఆర్ఎస్లో చేరారు. శుక్రవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. గిరిధర్ గమాంగ్‌కు కండువా కప్పి ఆహ్వానించారు కేసీఆర్. తాజాగా బీజేపీకి రాజీనామా చేసిన ఆయన.. బీఆర్ఎస్లో చేరడం విశేషం. గిరిధర్‌తో పాటు మరికొందరు ఒడిశా నేతలు బీఆర్ఎస్లో చేరారు. వీరిలో మాజీ ఎంపీ జయరామ్ పంఘి కూడా ఉన్నారు. ఈయన కూడా కిందటి ఏడాదే బీజేపీని వీడారు. ఈ సందర్భంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘అమెరికా, చైనా కంటే మన దేశంలోనే సంపద ఎక్కువగా ఉంది. కానీ ఆ రెండు దేశాలు అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉన్నాయి?. ఈ 75 ఏళ్లలో మనం ఏం సాధించాం?. దేశంలో ఇప్పటికీ పూర్తిస్థాయిలో సాగునీరూ అందడం లేదు. మంచి నీరు కూడా ఇవ్వలేకపోతున్నాం. అందుకే.. దేశ భవిష్యత్ కోసమే బీఆర్ఎస్. ఈ మహాసంగ్రామంలో మనతో గవాంగ్ కలిసి వస్తున్నారంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఒడిషాలో అన్ని నదులు ఉన్న తాగు నీరు అందడం లేదు. మహారాష్ట్రలో సంపద లేదా?. జాతి, ధర్మం పేరు చెప్పి ఓట్లు అడిగిన వాళ్లు గెలిచి ఏం చేస్తున్నారు?. కొందరికి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారింది. అసలు దేశంలో రైతులు ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?. రైతులు కూడా చట్ట సభల్లోకి రావాలి. అందుకే హర్ ఏక్‌బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ఎన్నికలకు వెళ్తున్నాం అని పేర్కొన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేవు. వలస వెళ్తున్న వాళ్లు తిరిగి వస్తున్నారు అని పేర్కొన్నారు. గిరిధర్ గమాంగ్ నేపథ్యం.. రాయ్‌ఘడ్ జిల్లాలో పుట్టి పెరిగిన గిరిధర్ గమాంగ్.. కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కోరాపూట్ లోక్‌సభ నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికైన గిరిధర్.. 1977 నుంచి వరుసగా లోక్‌సభకు ఎన్నికవుతూ సరికొత్త రికార్డు నెలకొల్పారు. అంతేకాదు.. 1999 ఫిబ్రవరి 17 నుంచి డిసెంబర్ 6 దాకా ఆయన ఒడిశాకు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఒక్క ఓటుతో ప్రభుత్వం కూలిపోవడంతో.. అక్కడ మళ్లీ ఎన్నికలు జరిగాయి. ఆపై కాంగ్రెస్ నేతగా ఉన్న ఆయన.. ఆ తర్వాత 2015లో బీజేపీలోకి చేరారు. ఈ నెల మొదట్లో ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. -
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి అమరీందర్‌సింగ్?
న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఎన్డీఏ తరఫున ఉపరాష్ట్రపతిగా బరిలో ఉంటారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఆయన స్థాపించిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ కూడా త్వరలోనే బీజేపీలో విలీనమవుతుందని చెబుతున్నాయి. ప్రస్తుతం వైద్య చికిత్స కోసం లండన్‌లో ఉన్న అమరీందర్ రెండు వారాల్లో తిరిగి వచ్చాక ఈ పరిణామాలు చోటుచేసుకుంటాయంటున్నారు. అమరీందర్ కార్యాలయం కూడా ఇదే విధమైన ప్రకటన చేసింది. వచ్చే వారంలో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అమరీందర్‌ను ప్రకటించాక.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలోకి విలీనం చేసే బాధ్యతను ఆయన భార్య, కేంద్ర మాజీ మంత్రి ప్రణీత్ కౌర్ తీసుకుంటారని సమాచారం. పటియాలా ఎంపీ అయిన ప్రణీత్ కౌర్ ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి పోలింగ్ ఆగస్ట్ 6వ తేదీన, అదే రోజు ఓట్ల లెక్కింపు జరగనుంది. 5న నోటిఫికేషన్ రానుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం ఆగస్ట్ 10వ తేదీతో ముగియనుంది. -
సోనియాతో కమల్‌నాథ్ భేటీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గురువారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. పార్టీలో కమల్‌నాథ్ మరింత కీలకం కానున్నా రంటూ ఊహాగానాలు వెల్లువెత్తు తున్న సమ యంలో జరిగిన ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీలో ప్రక్షాళన జరగా లంటూ సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది సీనియర్ నేతలు సహా అందరితోనూ కమల్‌నాథ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. కొందరు ప్రతిపక్ష పార్టీల నేతలతోనూ మంచి సంబంధాలున్న కమల్‌నాథ్‌తో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో సోనియా ప్రత్యేకంగా సమావేశం కావడం గమనార్హం. -
మాజీ ముఖ్యమంత్రి దంపతులకు సోకిన కరోనా
కోల్కత్తా: పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యకు కరోనా వైరస్ సోకింది. రాజకీయ దురంధరుడిగా పేరు పొందిన భట్టాచార్యకు కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. 77 ఏళ్ల బుద్ధదేవ్ సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆయన సతీమణి మీరా భట్టాచార్యకు కూడా కరోనా సోకింది. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే మీరా భట్టాచార్య మాత్రం ఆస్పత్రిలో చేరారు. ఆమెకు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. వారి సహాయకుడికి కరోనా సోకిందని సమాచారం. బుద్ధదేవ్ భట్టాచార్య పదకొండేళ్ల పాటు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. చదవండి: ఉత్తరప్రదేశ్ మంత్రి కన్నుమూత -
క్షీణించిన మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్యం
రాయగడ: ఒడిషా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ గిరిధర్ గొమాంగొ అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స నిమిత్తం భువనేశ్వర్ ఎయిమ్స్ హాస్పిటల్లో చేర్పించినట్లు ఆయన కుమారుడు, బీజేపీ నాయకుడు శిశిర్ గొమాంగొ ఓ ప్రకటనలో సోమవారం వెల్లడించారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన ఆరోగ్యం కోలుకుని ఇంటికి చేరుకోగా, ఇంటికి చేరిన కొన్నిరోజులకే ఇలా బాగాలేకపోవడం గమనార్హం. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు శిశిర్ గొమాంగొ తెలిపారు. చదవండి: రేపు పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు అంతలోనే.. చదవండి: కరోనాతో ప్రముఖ సంగీత దర్శకుడు మృతి -
కేశూభాయ్ పటేల్ కన్నుమూత
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అత్యంత సీనియర్ నేత కేశూభాయ్ పటేల్(92) కన్ను మూశారు. కోవిడ్–19 బారిన పడి ఇటీవలే కోలుకున్న పటేల్ గురువారం ఉదయం గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. గుజరాత్లో బీజేపీ ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహించిన కేశూభాయ్ 1995, 1998–2001 సంవత్సరాల్లో రాష్ట్ర సీఎంగా పనిచేశారు. ఆయన తర్వాత గుజరాత్లో నాడు సీఎంగా మోదీ పగ్గాలు చేపట్టారు. కేశూభాయ్ మృతికి రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్య క్రియలు జరుగుతాయని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తెలిపారు. కరోనా బారిన పడి కోలుకున్నప్పటికీ తన తండ్రి ఆరోగ్యం కొంతకాలంగా క్షీణిస్తోందని కేశూభాయ్ కుమారుడు భరత్ పటేల్ తెలిపారు. గురువారం ఉదయం రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు, పల్స్ రేటు పడిపోవడంతో ఆస్పత్రికి తరలించామన్నా రు. కేశూభాయ్ గుండెపోటుతో చనిపో యారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే రాష్ట్ర పర్యటనలో ఉన్న రూపానీ తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. గాంధీనగర్ చేరుకుని స్వగృహంలో ఉంచిన కేశూభాయ్ మృతదేహానికి నివాళుల ర్పించారు. జునాగఢ్ జిల్లా విసవదార్ పట్టణంలో 1928లో జన్మించిన కేశూభాయ్ 1945లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లో ప్రచారక్‌గా చేరారు. జన్‌సంఘ్‌లో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ప్రఖ్యాత సోమ్‌నాథ్ ఆలయ ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్నారు. రాష్ట్ర శాసనసభకు ఆయన 6 పర్యాయాలు ఎన్నికయ్యారు. 2012లో బీజేపీ నుంచి వైదొలిగి గుజరాత్ పరివర్తన్ పేరిట పార్టీని స్థాపించారు. 2014లో తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. -
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
ముంబై : మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావు పాటిల్ నీలాంగేకర్ (88) బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. అనారోగ్యంతో పూణేలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శివాజీరావు మరణించారు. శివాజీరావుకు ఇటీవల కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయడంతో ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా నుంచి కోలుకున్నా కిడ్నీ ఫెయిలవ్వడంతో బుధవారం తెల్లవారుజామున మరణించారని వైద్యులు చెప్పారు. శివాజీరావు మధుమేహం, బీపీ, కరోనాలతో బాధపడుతూ చికిత్స పొందుతూ మరణించారని వైద్యులు వివరించారు. కాగా 1985 జూన్ నుంచి 1986 మార్చి వరకు శివాజీరావ్ పాటిల్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎండీ పరీక్షలో తన కుమార్తెకు అక్రమంగా మార్కులు వేయించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అయితే పరీక్షల్లో అక్రమాలు జరిగినట్లు బాంబే హైకోర్టు తీర్పునివ్వడంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కాగా శివాజీరావు అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం స్వస్థలం నీలాంగాలో జరగనున్నాయి. -
అందుకే ఐరన్ లేడీ చేస్తున్నా!
దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా మూడు నాలుగు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో నిత్యా మీనన్ నటిస్తున్న ‘ఐరన్ లేడీ’ ఒకటి. జయలలిత జీవితంతో మూడు నాలుగు సినిమాలు రూపొందుతున్న నేపథ్యంలో మీరు నటిస్తున్న ‘ఐరన్ లేడీ’ ప్రత్యేకత ఏంటి? ఒకే వ్యక్తి గురించి ఇన్ని సినిమాలు వస్తున్నా మీరు నటించడానికి కారణం ఏంటి? అనే ప్రశ్నలు నిత్యా మీనన్ ముందుంచితే – ‘‘నిజమే... జయలలితగారి జీవితంపై సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తున్నాయని నాకు లె లుసు. అందుకే మనం ఎందుకు చేయాలి? అనే అనుమానం నాకూ వచ్చింది. నా సందేహాన్ని ‘ఐరన్ లేడీ’ దర్శకురాలు ప్రియదర్శిని ముందుంచాను. దానికి ఆమె చెప్పిన సమాధానం నాకు చాలా సంతృప్తినిచ్చింది. ‘జయలలితగారిపై ఎవరెన్ని సినిమాలు తీసినా తీయనివ్వండి. కానీ, మనం తీసే సినిమా ఎంత గొప్పగా ఉంటుందనేదే పాయింట్. నేను జయలలితగారిని వ్యక్తిగతంగా చాలాసార్లు కలిశాను. ఆమెను దగ్గరినుంచి గమనించాను, చాలా విషయాలు మాట్లాడాను’ అన్నారు ప్రియదర్శిని. ఆమె మాటల్లో చాలా కాన్ఫిడెన్స్ కనిపించింది. మనం మంచి సినిమా చేస్తున్నాం అనే నమ్మకం కలిగింది. అందుకే ధైర్యంగా ‘ఐరన్ లేడీ’లో నటిస్తున్నాను’’ అన్నారు. -
హస్తిన హ్యాట్రిక్ విజేత
ఢిల్లీ పీఠాన్ని వరసగా మూడు సార్లు దక్కించుకున్న విజేత ఆమె. పదిహేనేళ్లపాటు ఢిల్లీని పరిపాలించి ఢిల్లీ రూపురేఖలను మార్చి నగరం స్థాయిని పెంచిన నాయకురాలు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల్ని భాగస్వామ్యుల్ని చేసే భాగిదాని వ్యవస్థను ప్రవేశపెట్టి మంచి పరిపాలనా దక్షురాలిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.పెద్ద భవంతులు, ఫ్లై ఓవర్లు, ఢిల్లీ మెట్రో ఆమె హయాంలోనే వచ్చాయి. 81 ఏళ్ల వయసులోనూ అదే ఉత్సాహం వయసుతో రాజకీయాలకు పని లేదని నిరూపిస్తూ ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఈశాన్య ఢిల్లీ నుంచి పోటీ పడుతూ కాంగ్రెస్ ప్రచారాన్ని ముందుండి నడిపించారు. బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ చేతిలో ఓటమి పాలైనప్పటికీ 81 ఏళ్ల వయసులో ఆమెలో ఉన్న ఉరిమే ఉత్సాహం కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపింది. పంజాబ్‌లోని కపుర్తలాలో 1938, మార్చి 31వ తేదీన జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీలో డాక్టరేట్ సాధించారు. ఆమె భర్త దివంగత వినోద్ దీక్షిత్ ఐఏఎస్ అధికారి. వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు సందీప్ దీక్షిత్ కాంగ్రెస్ సభ్యుడే. కుమార్తె లతికా సయ్యద్. ఆసక్తికరం...షీలా ప్రేమాయణం! ఢిల్లీ విశ్వద్యాలయంలో చరిత్ర చదివే సమయంలో ïషీలా కపూర్‌కు వినోద్ దీక్షిత్‌తో పరిచయమైంది. వినోద్ దీక్షిత్ కాంగ్రెస్ నేత ఉమా శంకర్ కొడుకు. వినోద్ చురుకైన వాడు, మంచి క్రికెటర్ అని ïషీలా తన ఆత్మకథలో రాశారు. ఇద్దరు మిత్రుల మధ్య ప్రేమ వ్యవహారంలో ఏర్పడిన వివాదంలో మధ్యవర్తిత్వం వహించిన షీలా, వినోద్ ఆతర్వాత దగ్గరయ్యారు. అయితే, తాను బ్రాహ్మణ కులస్తురాలు కాకపోవడంతో వినోద్ తల్లిదండ్రులు పెళ్లికి గట్టిగా అభ్యంతరం చెప్పారని పంజాబీ ఖత్రీ అయిన షీలా తెలిపారు. ఆతర్వాత వినోద్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆలిండియా స్థాయిలో 9వ ర్యాంకు సాధించడంతో తమ పెళ్లికి అడ్డుచెప్పలేదని షీలా పేర్కొన్నారు. అనూహ్యంగా రాజకీయ ప్రవేశం షీలా మామ ఉమా శంకర్ స్వాతంత్య్ర పోరాటయోధుడు. తర్వాత ఆయన ఇందిర కేబినెట్లో మంత్రి అయ్యారు. ఆయన రాజకీయాల్లో ఎదగడానికి షీలా తెరవెనుక సహకారం అందించారు. ఇందిరాగాంధీని తరచూ కలిసేవారు. షీలాలోని పాలనా నైపుణ్యాన్ని గుర్తించిన ఇందిర ఆమెను ఐక్యరాజ్యసమితిలో మహిళా అంశంపై జరిగే సదస్సుకు భారత్ తరఫున ప్రతినిధిగా పంపారు. అదే షీలా రాజకీయ జీవితానికి పునాది వేసింది. 1984–89 సంవత్సరాల మధ్య ఐక్యరాజ్య సమితిలో భారత్ రాయబారిగా సేవలు అందించారు. రాజీవ్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1998 నుంచి వరసగా మూడు ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికై తిరుగులేని నేతగా ఎదిగారు. 2014లో కేరళ గవర్నర్‌గా అయిదు నెలలు కొనసాగారు. వివాదాలు, పురస్కారాలు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బెస్ట్ చీఫ్ మినిస్టర్ అవార్డు, 2009లో బెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎన్డీటీవీ పురస్కారం, అసోచామ్ సంస్థ నుంచి ఢిల్లీ వుమెన్ ఆఫ్ ది డికేడ్ అచీవర్స్ అవార్డు వంటివి అందుకున్నారు. రూ.3.5 కోట్ల కేంద్ర నిధుల్ని ఆమె తన సొంత రాజకీయ ప్రకటనల కోసం ఖర్చు చేశారని బీజేపీ కోర్టుకెక్కింది. 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడల్లో వీధి దీపాల సామగ్రి కొనుగోలులో అవకతవకలు జరిగాయని కాగ్ వేలెత్తి చూపించింది. -
షీలా దీక్షిత్ కన్నుమూత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సుదీర్ఘ కాలం ఢిల్లీ సీఎంగా పనిచేసిన షీలా దీక్షిత్(81) గుండెపోటుతో కన్నుమూశారు. ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో శనివారం మధ్యాహ్నం ఆమె తుదిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు. షీలా మృతికి రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్‌సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. షీలా భౌతిక కాయాన్ని ఈస్ట్ నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్న ఆమె నివాసంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. అంత్యక్రియలు నిగమ్‌బోధ్ ఘాట్‌లో ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఢిల్లీ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. షీలా దీక్షిత్ శనివారం ఉదయం తీవ్ర గుండెపోటుకు గురి కావడంతో కుటుంబసభ్యులు వెంటనే ఫోర్టిస్ ఇన్స్టిట్యూట్లో చేర్పించారు. ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ అశోక్ సేథ్ నేతృత్వంలోని వైద్య బృందం ఆమెకు అత్యాధునిక వైద్య చికిత్స అందించింది. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితి తాత్కాలికంగా కుదుటపడింది. కొద్ది సేపటి తర్వాత మరోసారి గుండెపోటు రావడంతో వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రముఖుల సంతాపం ఢిల్లీ సీఎంగా షీలా నగర రూపురేఖలనే మార్చేశారని, ఆమె ప్రజల మదిలో కలకాలం గుర్తుండిపోతారని రాష్ట్రపతి కోవింద్ తన సంతాపం సందేశంలో పేర్కొన్నారు. షీలా మంచి పరిపాలనాదక్షురాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య పేర్కొన్నారు. ఢిల్లీ అభివృద్ధిలో షీలా సేవలు శ్లాఘనీయమని ప్రధాని మోదీ అన్నారు. అనంతరం మోదీ షీలా నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించారు. షీలా మరణ వార్త తనను షాక్‌కు గురిచేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. షీలా దీక్షిత్‌ను ఆయన..అత్యంత ఆత్మీయురాలు, కాంగ్రెస్ పార్టీ అభిమాన పుత్రికగా పేర్కొన్నారు. అంకితభావం కలిగిన ప్రజా నేతలను కాంగ్రెస్ కోల్పోయిందని మాజీ ప్రధాని మన్మోహన్ తన సందేశంలో పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలకు ఆమె మరణం తీరని నష్టమని, ఆమె సేవలను ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. షీలా దీక్షిత్ కుమార్తె, కుమారుడికి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రాసిన లేఖను కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ట్విట్టర్లో ఉంచారు. ‘మీ తల్లికి నా హృదయంలో గొప్ప స్థానముంది. నా భర్త రాజీవ్‌తో షీలాజీకి మంచి అనుబంధం ఉండేది. ఈ క్రమంలో ఆమెతో నాకూ స్నేహం ఏర్పడింది. షీలాజీకి ఉన్న అనేక సుగుణాలను నేను అభిమానించడం ప్రారంభించాను. ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రిగా, డీపీసీసీ చీఫ్‌గా, ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్నకాలంలో ఎలాంటి అరమరికలు లేకుండా కలిసి పనిచేశాం’ అని సోనియా పేర్కొన్నారు. సమర్ధురాలైన పాలకురాలు: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: సీనియర్ రాజకీయవేత్త, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విషాదంలో మునిగి ఉన్న ఆమె కుటుంబీకులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియ జేశారు. ఆమె మరణంతో దేశం ఒక సమర్థురాలైన పాలకురాలిని కోల్పోయిందని జగన్ తన సందేశంలో పేర్కొన్నారు. షీలా దీక్షిత్ పోరాట పటిమకు, సాహసానికి, చురుకుదనానికి పెట్టింది పేరని జగన్ కొనియాడారు. షీలా చివరి ఆదేశాలు ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పర్యటనలో ప్రతిష్టంభన తొలగని పరిస్థితుల్లో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద శనివారం ఆందోళనకు దిగాలని పార్టీ కార్యకర్తలను షీలా దీక్షిత్ కోరినట్లు తెలుస్తోంది. యూపీలో పర్యటిస్తున్న ప్రియాంకను అక్కడి బీజేపీ ప్రభుత్వం నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. శనివారం కూడా ఆమె నిర్బంధం కొనసాగినట్లయితే బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన తెలపాల్సిందిగా ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ హోదాలో షీలా దీక్షిత్ కార్యకర్తలకు శుక్రవారం ఆదేశాలిచ్చినట్లు సీనియర్ నేత ఒకరు తెలిపారు. అవసరమైతే ఆదివారం కూడా నిరసన కొనసాగించాలని కూడా ఆమె చిట్టచివరి ఆదేశాలు జారీ చేశారని పార్టీ నేత కిరణ్ వాలియా వివరించారు. -
పుట్టినరోజు నాడే ఎన్డీ తివారి కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారి(93) గురువారం కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఢిల్లీ సాకేత్‌లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పుట్టినరోజే ఆయన మరణించడం విషాదకరం. ఆయన మరణం పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన తివారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా కూడా సేవలు అందించారు.బ్రెయిన్ స్ర్టోక్ రావడంతో గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఆయన మ్యాక్స్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. రాజకీయ ప్రస్ధానం 1925, అక్టోబర్ 18న నైనిటాల్ జిల్లాలోని బలూటి గ్రామంలో జన్మించిన నారాయణన్ దత్ తివారీ (ఎన్డీ తివారీ) తొలుత ప్రజా సోషలిస్ట్ పార్టీలో పనిచేసి అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. తివారీ మూడు సార్లు యూపీ ముఖ్యమంత్రిగా (1976-77, 1984-85, 1988-89) వ్యవహరించారు. 2002 నుంచి 2007 వరకూ ఉత్తరాఖండ్ సీఎంగా సేవలందించారు. రాజీవ్ గాంధీ కేబినెట్లో విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. దీర్ఘకాలంలో కాంగ్రెస్‌లో కొనసాగిన తివారీ ఆశీస్సులతోనే 2017, జనవరి 18న ఆయన కుమారుడు రోహిత్ శేఖర్ తివారీ బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. వెంటాడిన వివాదాలు ఎన్డీ తివారీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా వ్యవహరించిన సమయంలో ఆయనపై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజ్‌భవన్‌లోనే తివారీ మహిళలతో రాసలీలలు సాగించారన్న వార్తలు కలకలంరేపడంతో ఆయన పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇక 2008లో తివారీ తనకు జన్మనిచ్చిన తండ్రి అంటూ రోహిత్ శేఖర్ తివారీ పితృత్వ దావా దాఖలు చేశారు. కోర్టు డీఎన్ఏ పరీక్షలకు ఆదేశించగా రోహిత్ తివారీ కుమారుడేనని 2012 జులై 27న ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో 2014 మార్చి 3న రోహిత్ శేఖర్‌ను తన కుమారుడిగా తివారీ అంగీకరించారు. 2014 మే 14న శేఖర్ తల్లి ఉజ్వలా తివారీని వివాహం చేసుకున్నారు. ప్రముఖుల సంతాపం ఎన్డీ తివారి మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. కార్యదక్షత కలిగిన ఆయన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అభివృద్ధికి పాటు పడ్డారని ప్రశంసించారు. పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా సేవలు అందించిన తివారి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ సంతాపం ప్రకటించారు. తివారి మరణంతో దేశం ఒక గొప్ప రాజనీతిజ్ఞుడుని కోల్పోయిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశంలో రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత ఎన్డీ తివారికే దక్కిందని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తివారి మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు.