హేమంత్‌ సోరెన్‌కు బెయిల్‌ | Jharkhand High Court grants bail to Hemant Soren | Sakshi
Sakshi News home page

హేమంత్‌ సోరెన్‌కు బెయిల్‌

Published Sat, Jun 29 2024 4:58 AM | Last Updated on Sat, Jun 29 2024 4:58 AM

Jharkhand High Court grants bail to Hemant Soren

భూకుంభకోణం కేసులో జార్ఖండ్‌ హైకోర్టు ఉత్తర్వులు  

జైలు నుంచి విడుదలైన హేమంత్‌ సోరెన్‌

రాంచీ: భూకుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్‌ ముక్తిమోర్చా(జేఎంఎం) కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్‌ సోరెన్‌(48)కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో జార్ఖండ్‌ హైకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. తనకు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ హేమంత్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ రంగోన్‌ ముఖోపాధ్యాయ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. హేమంత్‌ సోరెన్‌కు బెయిల్‌ ఇస్తే మళ్లీ ఇదే తరహా అవినీతికి పాల్పడే అవకాశం ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తరఫు న్యాయవాది ఎస్‌.వి.రాజు పేర్కొన్నారు. ఆయనకు బెయిల్‌ ఇవ్వొద్దని కోరారు. 

ఈడీ వాదనను ధర్మాసనం తిరస్కరించింది. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే హేమంత్‌ ఏ నేరమూ చేయలేదని, బెయిల్‌పై బయట ఉన్నప్పుడు ఆయన నేరం చేసే అవకాశం లేదని, అందుకే బెయిల్‌ ఇస్తున్నామని స్పష్టంచేసింది. హేమంత్‌ రూ.50 వేల పూచీకత్తు సమరి్పంచాలని, ఆయనకు ష్యూరిటీ ఇస్తూ మరో ఇద్దరు రూ.50 వేల చొప్పున పూచీకత్తు సమరి్పంచాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని, ఈ బెయిల్‌ తీర్పుపై 48 గంటలపాటు స్టే విధించాలని ఈడీ తరఫున మరో న్యాయవాది జోహబ్‌ హుస్సేన్‌ విజ్ఞప్తి చేయగా ధర్మాసనం తిరస్కరించింది. జార్ఖండ్‌ రాజధాని రాంచీలో 8.86 ఎకరాల భూకుంభకోణం కేసులో హేమంత్‌ సోరెన్‌ను ఈ ఏడాది జనవరి 31న ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  

తప్పుడు కేసులో ఇరికించారు: హేమంత్‌  
తనను తప్పుడు కేసులో ఇరికించి, ఐదు నెలలపాటు జైల్లో పెట్టారని హేమంత్‌ సోరెన్‌ ఆరోపించారు. జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని అధికార బీజేపీపై నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేతలు, సామాజిక కార్యర్తలు, జర్నలిస్టుల గొంతులను ప్రభుత్వం అణచివేస్తోందని మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement