
ఫరూఖ్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీనగర్‌లోని హజరత్‌బాల్ మసీదులో ప్రార్థనలు చేస్తున్న సమ యంలో పలువురు నిరసనకారులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆగస్టు 20న దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సంస్మరణ సభ సందర్భంగా ఆయన ‘భారత్ మాతాకీ జై’అని నినా దాలు చేసిన రెండు రోజులకే ఈ ఘటన జరగడం గమనార్హం. ఆరోగ్యం సహకరించకపోవడంతో కుర్చీలోనే కూర్చుని అబ్దుల్లా ప్రార్థనలు చేస్తున్నారు.
అయితే ఘటన జరుగుతున్నా కూడా అబ్దుల్లా స్పందించకుండా అలాగే ప్రార్థనలను కొనసాగించారు. ‘ఫరూఖ్ అబ్దుల్లా తిరిగి వెళ్లిపోండి. మాకు కావాల్సింది స్వాతంత్య్రం’ అంటూ నిరసనకారుల గుంపు నినాదాలు చేసింది. అందులో కొందరు అబ్దుల్లాకు దగ్గరగా వచ్చే ప్రయత్నం చేశారు. అయితే అబ్దుల్లా అనుచరులు, రక్షక సిబ్బంది ఫరూఖ్‌కు అడ్డుగా నిలబడి వారిని నిలువరించారు. ‘కొందరు ఆందోళన చేశారు. ‘నేను ప్రార్థనా స్థలాన్ని విడిచి వెళ్లలేదు. ప్రార్థనలు పూర్తి చేసుకున్నాను. నిరసన వ్యక్తం చేసిన వారంతా నా మనుషులే. ఎవరో వారిని తప్పు దోవ పట్టించారు. వారి నాయకుడి బాధ్యతల నుంచి నేను తప్పించుకోను. ప్రతి ఒక్కరినీ సమైక్యంగా ఉంచే బాధ్యత నాపై ఉంది’ అని ఫరూఖ్ అబ్దుల్లా పేర్కొన్నారు.
కశ్మీర్‌లో ప్రశాంతంగా బక్రీద్
కశ్మీర్ లోయలో ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకొన్నారు. మసీదుల్లో ప్రశాంతంగా సామూహిక ప్రార్థనలు చేశారు. అయితే ప్రార్థనల తర్వాత శ్రీనగర్, అనంత్‌నాగ్‌లోని జంగ్‌లాట్ మండీ, బారాముల్లాలోని సోపోర్ ప్రాంతాల్లో ఈద్గాల వద్ద దుండగులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలు మినహా అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా బక్రీద్ పర్వదినాన్ని ప్రజలు జరుపుకొన్నారని పోలీసులు తెలిపారు.