శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ తుదిశ్వాస
నేడు అంతిమయాత్ర... మెడికల్ కాలేజీకి మృతదేహం అప్పగింత
డీవైఎఫ్‌ఐ కార్యకర్త నుంచి సీఎం స్థాయికి ఎదిగిన బుద్ధదేవ్
కోల్‌కతా: సీపీఎం సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూశారు. 80 ఏళ్ల బుద్ధదేవ్ గురువారం ఉదయం 8.20 గంటలకు మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. శ్వాసకోస వ్యాధితో దీర్ఘకాలంగా బాధపడుతున్న ఆయన కోల్‌కతాలోని పామ్ అవెన్యూలో ఉన్న తన ఫ్లాట్‌లో తుదిశ్వాస విడిచారు. గతేడాదే ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కోలుకున్నారు.
మళ్లీ ఇటీవల అనారోగ్యం పాలయ్యారు. ఆయనకు భార్య మీరా, కుమారుడు సుచేతన్ ఉన్నారు. ప్రజల సందర్శనార్థం భట్టాచార్య భౌతికకాయాన్ని శుక్రవారం తొలుత బెంగాల్ అసెంబ్లీ, తర్వాత సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి, డీవైఎఫ్‌ఐ కార్యాలయానికి తరలిస్తారు. అనంతరం అంతిమయాత్ర నిర్వహించి, మృతదేహాన్ని వైద్య కళాశాలకు అప్పగిస్తారు.
కార్యకర్త నుంచి ముఖ్యమంత్రిగా..
సీపీఎం అత్యున్నత నిర్ణాయక విభాగమైన పొలిట్ బ్యూరో మాజీ సభ్యుడు అయిన భట్టాచార్య 1944 మార్చి 1న కోల్‌కతాలో జన్మించారు. కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కళాశాల నుండి బెంగాలీలో బీఏ ఆనర్స్ చేశారు. 1966లో పారీ్టలో చేరారు. సీపీఎం యువజన విభాగమైన డీవైఎఫ్‌ఐలో చేరారు. రాజకీయాల్లోకి రాకముందు పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేశారు.
ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా సేవలందించిన ఆయన 2000లో జ్యోతిబసు సీఎం పదవి నుంచి వైదొలగక ముందు ఉపముఖ్యమంత్రిగా పదోన్నతి పొందారు. జ్యోతిబసు తరువాత సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2000 నుంచి 2011 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. జ్యోతిబసు పాలనతో పోలిస్తే భట్టాచార్య హయాంలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం పారిశ్రామిక వర్గాల పట్ల సానుకూలంగా వ్యవహరించింది. విచిత్రమేమిటంటే పారిశ్రామికీకరణకు సంబంధించిన సీపీఎం విధానాలే 2011 ఎన్నికల్లో వామపక్షాల పరాజయానికి బాటలు వేశాయి.
‘పద్మభూషణ్’ తిరస్కరణ
కేంద్రం 2021లో బుద్ధదేవ్‌కు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. ఆ అవార్డును ఆయన తిరస్కరించారు.
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
బుద్ధదేవ్ మరణం పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. బెంగాల్ అభివృద్ధికి కృషి చేశారని, ప్రజలకు విశిష్టమైన సేవలు అందించారని బుద్ధదేవ్‌ను మోదీ కొనియాడారు. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment