Respiratory disease
-
West Bengal: బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూత
కోల్‌కతా: సీపీఎం సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూశారు. 80 ఏళ్ల బుద్ధదేవ్ గురువారం ఉదయం 8.20 గంటలకు మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. శ్వాసకోస వ్యాధితో దీర్ఘకాలంగా బాధపడుతున్న ఆయన కోల్‌కతాలోని పామ్ అవెన్యూలో ఉన్న తన ఫ్లాట్‌లో తుదిశ్వాస విడిచారు. గతేడాదే ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కోలుకున్నారు. మళ్లీ ఇటీవల అనారోగ్యం పాలయ్యారు. ఆయనకు భార్య మీరా, కుమారుడు సుచేతన్ ఉన్నారు. ప్రజల సందర్శనార్థం భట్టాచార్య భౌతికకాయాన్ని శుక్రవారం తొలుత బెంగాల్ అసెంబ్లీ, తర్వాత సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి, డీవైఎఫ్ఐ కార్యాలయానికి తరలిస్తారు. అనంతరం అంతిమయాత్ర నిర్వహించి, మృతదేహాన్ని వైద్య కళాశాలకు అప్పగిస్తారు. కార్యకర్త నుంచి ముఖ్యమంత్రిగా.. సీపీఎం అత్యున్నత నిర్ణాయక విభాగమైన పొలిట్ బ్యూరో మాజీ సభ్యుడు అయిన భట్టాచార్య 1944 మార్చి 1న కోల్‌కతాలో జన్మించారు. కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కళాశాల నుండి బెంగాలీలో బీఏ ఆనర్స్ చేశారు. 1966లో పారీ్టలో చేరారు. సీపీఎం యువజన విభాగమైన డీవైఎఫ్ఐలో చేరారు. రాజకీయాల్లోకి రాకముందు పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా సేవలందించిన ఆయన 2000లో జ్యోతిబసు సీఎం పదవి నుంచి వైదొలగక ముందు ఉపముఖ్యమంత్రిగా పదోన్నతి పొందారు. జ్యోతిబసు తరువాత సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2000 నుంచి 2011 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. జ్యోతిబసు పాలనతో పోలిస్తే భట్టాచార్య హయాంలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం పారిశ్రామిక వర్గాల పట్ల సానుకూలంగా వ్యవహరించింది. విచిత్రమేమిటంటే పారిశ్రామికీకరణకు సంబంధించిన సీపీఎం విధానాలే 2011 ఎన్నికల్లో వామపక్షాల పరాజయానికి బాటలు వేశాయి. ‘పద్మభూషణ్’ తిరస్కరణ కేంద్రం 2021లో బుద్ధదేవ్‌కు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. ఆ అవార్డును ఆయన తిరస్కరించారు. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి బుద్ధదేవ్ మరణం పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. బెంగాల్ అభివృద్ధికి కృషి చేశారని, ప్రజలకు విశిష్టమైన సేవలు అందించారని బుద్ధదేవ్‌ను మోదీ కొనియాడారు. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు సంతాపం తెలిపారు. -
6 వేల మందిపై ‘ఫిలిప్స్’ కంపెనీ వేటు...కారణం ఇదే
ప్రముఖ వైద్య పరికరాల సంస్థ ఫిలిప్స్ వరల్డ్ వైడ్‌గా వేల మంది ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్దమైంది. ఈ మేరకు ఆ కంపెనీ సీఈవో రాయ్ జాకబ్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. మూడు నెలల ముందు ఫిలిప్స్ సంస్థ 4వేల మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసింది. తాజాగా సిబ్బందికి పింక్ స్లిప్‌లు జారీ చేయనున్నట్లు జాకబ్స్ తెలిపారు. ఇది కష్టతరమైన సమయం, కానీ తప్పడం లేదంటూ ఈ సందర్భంగా విచారం వ్యక్తం చేశారు. 2025 నాటికి వర్క్ ఫోర్స్‌ను మరింత తగ్గించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాదిలో 3వేల మందిని, 2025 నాటికి మొత్తం 6వేల మందిని తొలగిస్తామని అన్నారు. ఫిలిప్స్ సంస్థ నిద్రలేమని సమస్యతో బాధపడే వారి కోసం స్లీప్ రెస్పిరేటర్లను చేసింది. వాటి వల్ల వినియోగదారులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయంటూ ఫిర్యాదులు వెలుగులోకి వచ్చాయి. ఫిర్యాదుతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తూ రెస్పిరేటర్లను రీకాల్ చేసింది. వెరసీ ఫిలిప్స్ కంపెనీ గత ఏడాది క్యూ4లో సుమారు 114 మిలియన్ల డాలర్ల నష్టాన్ని చవిచూసింది. గత ఏడాది మొత్తం ఆ కంపెనీ సుమారు 1.605 బిలియన్ల యూరోలు నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు. -
స్వాతంత్య్ర సమరయోధుడు సీవీ చారి ఇక లేరు
- శ్వాసకోశ వ్యాధితో కన్నుమూత - ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు, గాంధేయవాది, ఆలిండియా హిందీ నాగరిక లిపి అధ్యక్షుడు సీవీ చారి(86) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కొద్ది రోజులుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం విజయనగర్ కాలనీలోని శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో చారికి అంత్యక్రియలు నిర్వహించారు. రాజకీయ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధులు, సామాజికవేత్తలు హాజరై ఆయనకు ఘన నివాళులర్పించారు. చారికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. భూదానోద్యమంలో కీలక పాత్ర పోషించిన సీవీ చారి నల్లగొండ జిల్లా దేవరకొండ మునుగోడు గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 15 ఏళ్ల ప్రాయంలోనే భూదానయజ్ఞ ఉద్యమానికి ఆకర్షితులయ్యారు. వినోబాభావేతో కలసి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. తన భూములను పేదలకు పంచిపెట్టారు. నల్లగొండలో ప్రారంభమైన చారి ప్రస్థానం హైదరాబాద్ నగరంతో పెనవేసుకుంది. ఎలాంటి ఆర్భాటాలకూ తావు లేకుండా, రాజకీయ పదవులను ఆశించకుండా తన జీవితమంతా సామాజిక సేవకే అంకితం చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్ ట్రస్టుతో ఆయనకు 30 ఏళ్లకుపైగా అనుబంధం ఉంది. సుదీర్ఘకాలం పాటు భూదాన యజ్ఞ బోర్డు చైర్మన్‌గా పనిచేశారు. గాంధీ ప్రతిష్టాన్, గాంధీ స్మారక నిధికి చైర్మన్‌గా వ్యవహరించారు. వినోబాభావే, జయప్రకాష్‌నారాయణ్, నిర్మలాదేశ్‌పాండే, రామానందతీర్థ, ఇందిరాగాంధీ, పివీ నరసింహారావు, ప్రభాకర్జీ, మొరార్జీదేశాయ్ వంటి ప్రముఖుల తో కలసి నడిచారు. ప్రముఖుల నివాళి... అంతకుముందు సీవీ చారి పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం నాంపల్లిలోని గాంధీభవన్ ట్రస్టు కార్యాలయంలో ఉంచారు. వివిధ రంగాల ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకు నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హాజరై సీవీ చారి భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, గాంధీభవన్ ట్రస్ట్ చైర్మన్ జి.నారాయణరావు, అంత్యోదయ మండలి కార్యదర్శి సుబ్రహ్మణ్యం, హిందీ మహావిద్యాలయ చైర్మన్ సురేంద్ర లూనియా, ఎమ్మెల్సీ భాను, కాంగ్రెస్ నేత నిరంజన్, భూదానయజ్ఞ బోర్డు మాజీ చైర్మన్ సర్వర్షిణి రాజేందర్‌రెడ్డితో పాటు సీపీఐ, సీపీఎం, బీజేపీ, టీడీపీలకు చెందిన నాయకులు నివాళులర్పించారు. తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, తెలంగాణ, ఏపీ పీసీసీల అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రఘువీరారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేతలు మల్లు భట్టివిక్రమార్క తదితరులు చారి మృతిపట్ల తమ సంతాపాన్ని ప్రకటించారు. -
నాస్తికోద్యమ నేత లవణం అస్తమయం
* శ్వాసకోస వ్యాధితో బాధపడుతూ కన్నుమూత * అంతిమ కోరిక మేరకు నేత్రదానం * ప్రముఖుల సంతాపం సాక్షి, విజయవాడ/హైదరాబాద్: నాస్తికోద్యమ నేత, సంఘసంస్కర్త గోపరాజు లవణం (86) శుక్రవారం విజయవాడలో కన్నుమూశారు. కొద్ది రోజులుగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 9.50 గంటలకు తుది శ్వాస విడిచారు. ప్రముఖ సంఘసంస్కర్త, నాస్తికోద్యమ నిర్మాత గోపరాజు రామచంద్రరావు (గోరా), సరస్వతీ గోరాల ద్వితీయ కుమారుడైన లవణం తండ్రి నుంచి నాస్తికత్వం, సంఘసేవ అలవరుచుకున్నారు. చారిత్రాత్మక ఉప్పు సత్యాగ్రహం జరిగే సమయంలో జన్మించడంతో గోరా తన కుమారుడికి ‘లవణం’ అని పేరు పెట్టారు. చిన్ననాటి నుంచే సంఘసేవలో పాల్గొని అస్పృశ్యత, మూఢనమ్మకాలు, జోగిని దురాచార నిర్మూలనకు, నేరస్తులను సంస్కరించేందుకు అవిశ్రాంత పోరాటం చేశారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిన్నారు. ముప్పైకి పైగా దేశాల్లో పర్యటించి నాస్తికోద్యమాన్ని ప్రచారం చేశారు. నాస్తిక వారపత్రిక సంఘం, ఆర్థిక సమత, నాస్తికమార్గం, హిందీ పత్రిక ఇన్సాన్, ఇంగ్లిష్ మాసపత్రిక ఎథియిస్ట్ నిర్వహణలో లవణం ప్రముఖ పాత్ర వహించారు. భూదాన, సర్వోదయ ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1960లో మహాకవి జాషువా కుమార్తె హేమలతను వివాహం చేసుకున్నారు. 1962లో తలపెట్టిన ప్రపంచ శాంతియాత్రలో లవణం పాల్గొన్నారు. 1966-67లో అమెరికాలో శాంతి ఉద్యమంలోనూ, మార్టిన్ లూథర్ కింగ్ నాయకత్వాన పౌరహక్కుల ఉద్యమంలోనూ పాల్గొన్నారు. 1977 దివిసీమ ఉప్పెన సమయంలో సహాయ పునర్నిర్మాణ మహాసభలలో పాల్గొన్నారు. 2005లో నక్సలైట్ల సమస్య పరిష్కారానికి గట్టి కృషి సల్పారు. 2006లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్వర్ణో త్సవాల ముగింపు సభలో హింసలేని విప్లవం, అవినీతిలేని ప్రజాస్వామ్యం, ప్రజాప్రతినిధుల బాధ్యతపై ఆయన ప్రసంగించారు. ఆయన తన జీవితమంతా సమాజ పరివర్తనకు కృషి చేశారు. ఆయన కోరిక మేరకు కళ్లను స్వేచ్ఛా గోరా ఐ బ్యాంకుకు దానం చేశారు. భౌతికకాయాన్ని శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలకు అప్పగిస్తారు. లవణం భౌతికకాయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ వివరాలు గోరా తొమ్మిది మంది సంతానంలో లవణం రెండో వారు. లవణంకు సంతానం లేదు. సతీమణి హేమలత 2008లో కన్నుమూశారు. ప్రముఖ వైద్యుడు జి.సమరం, మాజీ ఎంపీ చెన్నుపాటి విద్యకు లవణం సోదరుడు. లవణం మృతికి సీఎంల సంతాపం గోపరాజు లవణం మృతికి తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. జోగినుల జీవితాలను మెరుగు పరిచేందుకు నిజామాబాద్ జిల్లాలో రెండు దశాబ్దాల క్రితం లవణం సతీమణి హేమలతతో కలసి పనిచేసిన అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలనకు సామాజిక కార్యకర్తగా లవణం చేసిన కృషిని ప్రస్తావించారు. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం కట్టుబడిన లవణం మృతి నాస్తికోద్యమానికే కాకుండా రాష్ట్రానికే తీరని లోటు అని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వైఎస్ జగన్ సంతాపం సంఘ సంస్కర్త డాక్టర్ లవణం మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. సమాజంలో బడుగుల అభ్యున్నతికీ, కుల వ్యవస్థ నిర్మూలనకూ లవణం చేసిన కృషిని కొనియాడారు. వర్నిలో విషాదం వర్ని(నిజామాబాద్): నాస్తికోద్యమ నేత గోపరాజు లవణం మృతితో నిజామాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలోని వర్ని ప్రాంతంతో ఆయనకు 30 ఏళ్ల అనుబంధం ఉంది. 1997లో వర్నికి చెందిన మార్ని రామకృష్ణారావు హేతువాద సభలకు వెళ్లినప్పుడు అక్కడ ఆయనకు లవణంతో పరిచయమైంది. వర్ని ప్రాంతంలో ప్రబలంగా ఉన్న చేతబడి, బాణామతి వంటి మూఢనమ్మకాల గురించి రామకృష్ణారావు ద్వారా తెలుసుకున్న లవణం దంపతులు ఈ ప్రాంతానికి వచ్చి ప్రజల్లో చైతన్యం కల్పించారు. లవణం స్ఫూర్తితో వర్నిలో 1980లో నాస్తిక మిత్ర మండలి ఏర్పాటు చేశారు. జిల్లాలో జోగిని వ్యవస్థ దురాచారానికి ఎందరో మహిళలు బలవుతున్నారని గమనించి నాటి గవర్నర్ కుముద్ బిన్ జోషి, జిల్లా కలెక్టర్ ఆశామూర్తితో చర్చించి ఆ వ్యవస్థ నిర్మూలనకు కృషి చేశారు. అభాగ్యులైన మహిళల కోసం 1985లో ఇక్కడ ‘చెల్లి నిలయం’ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా జోగినులకు వివాహాలు జరిపించారు. ప్రజల ఆరోగ్య అవసరాల దృష్ట్యా 1997లో ప్రకృతి చికిత్సాలయూన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలందించారు. ఆయనతో కలసి పనిచేసిన కొందరు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు విజయవాడ వెళ్లారు. -
మృత్యువుతో పోరాటం
పొద్దస్తమానం ఆటో తోలి రోజుకు రూ. 200లు సంపాదించే ఓ డ్రైవర్ ఉన్నదాంట్లోనే సర్దుకొని ఆనందంగా కుటుంబాన్ని పోషించేవాడు. ఆరునెలల కిందట అతనికి ఓ విషాదకరమైన వార్త వినాల్సి వచ్చింది. ఉన్న ఒక్కగానొక కుమారుడు శ్వాసకోశ వ్యాధిబారిన పడ్డాడు. దాచుకున్న డబ్బులతోపాటు సుమారు ఏడు లక్షలు అప్పులు చేసి కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ లాభం లేకుండా పోయింది. ఖరీదైన వైద్యం చేయించలేక ప్రస్తుతం ఆక్సిజన్‌పైనే ఆ చిన్నారిని బతికిస్తున్నాడు. ముద్గుగా కనిపించే బాలుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా ఏమీ చేయలేని దీనస్థితిలో ఉన్నాడు. దాతల సాయంకోసం ఎదురుచూస్తున్నాడు. - అర్వపల్లి అర్వపల్లి మండలం కొమ్మాల గ్రామానికి చెందిన సూరారపు ఉపేంద్ర, శ్రీనుల ఏకైక కుమారుడు లక్కి (15నెలలు) ఆరు నెలల కిందట పర్సిస్టెంట్ బ్రాంకో నిమోనియా, వైరల్ రియాక్టిట్ శ్వాసకోశ వ్యాధిబారిన పడ్డాడు. ప్రస్తుతం ఆక్సిజన్‌తో గాలి పీల్చుకుంటూ నరకం అనుభవిస్తున్నాడు. గుండెలో ఎడమ జఠరిక వాపుతో దీని పని విధానం తగ్గిపోయింది. బాలుడి రక్తంలోని ఎర్రరక్త కణాల్లో హిమోగ్లోబిన్, ఆక్సిజన్ సంతృప్తతా శాతం సాధారణ స్థాయిలో ఉండకుండా తగ్గాయి. ఊపిరితిత్తులతో రక్తకణాలు చేరి శ్వాస క్రియకు ఇబ్బందిగా మారాయి. దీంతో పూర్తిగా ఆయసం వచ్చి ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. లక్షల ఖర్చుచేసినా.. బాలుడిని సూర్యాపేట, ఖమ్మం, హైదరాబాద్‌లోని కార్పోరేట్ ఆసుపత్రుల్లో 6నెలల నుంచి చూయిస్తూ ఇప్పటివరకు రూ. 7లక్షలు ఖర్చు చేశారు. ఉన్న ఎకరం భూమి అమ్మడంతో పాటు బయట వడ్డీలకు రూ. 3లక్షల వరకు తెచ్చాడు. అయినా వ్యాధి తగ్గక పోగా ప్రస్తుతం ఆక్సిజన్ ఎక్కించకపోతే బతికే స్థితిలో లేడు. ఇదిలావుండగా రాజీవ్ ఆరోగ్యశ్రీలో శ్వాసకోశ వ్యాధి లేకపోవడంతో ఖరీదైన వైద్యం తప్పడంలేదు. ప్రస్తుతం రోజు ఆక్సిజన్ సిలిండర్‌కు రోజుకు రూ. 500 ఖర్చు చేస్తున్నార. ఆటో తోలగా వచ్చిన డబ్బులు సరిపోవడంలేదు. అయినప్పటికీ అప్పులు చేస్తూ ఆక్సిజన్ సిలిండర్లను సూర్యాపేట నుంచి తెచ్చి బతికించుకుంటున్నాడు. దాతల సాయం అవసరం ప్రస్తుతం బాలుడికి కార్పోరేట్ ఆసుపత్రిలో యాంటి బ్యాక్టీరియల్, యాంటి థెరఫి చికిత్స జరిపించాలి. దీని ద్వారా ఊపిరితిత్తులలోని మూసుకపోయిన గాలిగదులు తెరచుకొని శ్వాసలో ఇబ్బంది లేకుండా హిమోగ్లోబిన్, ఆక్సిజన్ సంతృప్తతా శాతం పెరుగుతుంది. అలాగే దీనికి తోడు రోగ నిరోదక శక్తి పెరుగుతుంది. ఈ చికిత్సకు సుమారు 3నెలలకు పైగానే వ్యవధి పట్టే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇందుకు సుమారు రూ. 7లక్షలకు పైగానే డబ్బు ఖర్చవుతుంది. దీనికి దాతలు సహకరిస్తే తప్ప తమ కొడుకు బతికే పరిస్థితి లేదని బాలుడి తల్లిదండ్రులు విలవిస్తున్నారు. ఎవైరె నా సాయం చేయాలనుకునేవారు ఎస్బీఐ అకౌంట్‌నంబర్ 34632819973లలో జమ చేయడంగాని, 9704883594 నెంబర్‌కు సంప్రదించడంగాని చేయవచ్చు. చేతిలో పైసాలేదు కుమారుని కోసం ఉన్న భూమి అమ్మేశాను. లక్షల్లో అప్పు చేశాను అయినా వ్యాధి నయంకాలే. ఇంకా లక్షల రూపాయలు కావాలంటున్నారు. మా పిల్లవాడిని బతికించడం కోసం తిరగని ఆసుపత్రిలేదు. రోజుకు రూ. 500 ఖర్చు చేసి ఆక్సిజన్ పెట్టించి బతికించుకుంటున్నా. - సూరారపు శ్రీను, తండ్రి దేవుడే దిక్కు బాలుడిని బతికించు కోవడం కోసం చేసేదంతా చేశాం. కట్టు బట్టలు తప్ప మాకు ఏమి మిగల లేదు. ఆక్సిజన్ తేవడానికి రోజు కొకరి కాళ్లుచేతులు పట్టుకొని అప్పుతెస్తున్నం. తిండికి డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా మనసున్న దాతలు సాయం చే సి పుణ్యం కట్టుకోవాలి. - సూరారపు ఉపేంద్ర, తల్లి -
ఫ్లూతో రెండేళ్ల బాలుడి మృతి
ఎంజీఎం(వరంగల్) : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో స్వైన్‌ప్లూతో మంగళవారం రాత్రి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా రామగుండానికి చెందిన అంజా (2) అనారోగ్యంతో ఈ నెల 25వ తేదీన ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. జ్వరం, జలుబు, శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న బాలుడిని అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. స్వైన్‌ఫ్లూ సోకినట్లుగా అనుమానించిన వైద్యులు 27వ తేదీన తెమడ నమూనాలు సేకరించి హైదరాబాద్‌లోని ప్రీవెంట్ ఆఫ్ మెడిసిన్‌కు పంపించారు. ఈ క్రమంలో 27వ తేదీ రాత్రి మృతి చెందాడు. సోమవారం పంపించిన బాలుడి నమూనాల ఫలితాలు బుధవారం రాత్రి అందినట్లు ఎంజీఎం ఆర్ఎంఓ హేమంత్, మెడిసిన్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు. కాగా, బాలుడి తల్లి 18వ తేదీన స్వైన్‌ప్లూ సోకి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. -
స్వైన్కృత అనారోగ్యం!!
స్వైన్‌ఫ్లూ వ్యాధిని సంక్రమింపజేసే వైరస్కూ, పందులలోని శ్వాసకోశ వ్యాధిని తెచ్చిపెట్టే వైరస్‌కు పోలికలు ఉన్నాయి కాబట్టి దీన్ని స్వైన్‌ఫ్లూ అన్నారు.ఇదీ సాధారణ ఫ్లూ లాంటిదే. కాకపోతే ఇది కాస్త తీవ్రమైనది కావడంతో డయాబెటిస్, హైబీపీ, ఆస్తమా, సీఓపీడీ వంటి మరికొన్ని వ్యాధులతో బాధపడుతూ రోగ నిరోధకత తగ్గినవారిలో మరింత తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు రుమాలు/ టిష్యూపేపర్ అడ్డుపెట్టుకోవడం, చేతులు అడ్డుపెట్టుకుని తుమ్మడం, దగ్గడం వంటివి చేశాక చేతులు శుభ్రంగా కడుక్కోవడం, లిఫ్ట్ వంటి క్లోజ్డ్ ప్రాంతాల్లో దగ్గు, తుమ్ములను ఆపుకోవడం, పరిశుభ్రతను పాటించడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని చాలా తేలిగ్గా నివారించవచ్చు. వీటిని పాటించకపోతే అది మన స్వయంకృతాపరాధమై అనారోగ్యాన్ని ఆహ్వానించినట్లు అవుతుంది. అలా స్వైన్‌ఫ్లూ బారిన పడకుండా ఉండటంతో పాటు దాని గురించి సమగ్ర అవగాహన కోసమే ఈ కథనం. ఎందుకీ పేరు... ఏమిటా కథ? స్వైన్ అంటే పంది. ఫ్లూ అంటే ఇన్ఫ్లుయెంజా విభాగానికి చెందిన వైరస్‌లతో వ్యాపించే జలుబు. తొలుత ఈ వైరస్‌ను పరిశీలించినప్పుడు అది పంది శ్వాసకోశవ్యాధికి కారణమయ్యే ఒక వైరస్‌లోని జన్యువులతో పోలి ఉంది. అందుకే దీనికి హాగ్ ఫ్లూ, పిగ్ ఫ్లూ అనే పేర్లు పెట్టారు. ఇన్ఫ్లుయెంజాకు కారణమయ్యే అనేక వైరస్లలో ఒకటి జన్యుమార్పులకు లోనైంది. సాధారణంగా వైరస్లు అన్నీ ఇలా తమ జన్యుస్వరూపాలను మార్చుకుంటుంటాయి. పందుల్లో ఉండే ఈ వైరస్ తన యాంటిజెనిక్ స్వరూపాన్ని మార్చుకొని మనుషుల్లోకి వ్యాప్తిచెందడం వల్ల స్వైన్ ఫ్లూగా పేరు పెట్టారు. ఆ తర్వాత దీనిపై మరిన్ని పరిశోధనలు జరిగాయి. ఫ్లూను సంక్రమింపజేసే వైరస్లలో అనేక రకాలు ఉంటాయి. అందులో ‘ఇన్ఫ్లుయెంజీ ఏ’, ‘ఇన్ఫ్లుయెంజా బీ’, ‘ఇన్ఫ్లుయెంజా సీ’ అనేవి ముఖ్యమైనవి. స్వైన్‌ఫ్లూ వైరస్ అన్నది ఇన్ఫ్లుయెంజా ఏ రకానికి చెందిన వైరస్‌తో దగ్గరి పోలికలు కలిగి ఉంది. ఈ వైరస్‌లోని జీన్స్ ఉత్తర అమెరికా ఖండానికి చెందిన పందుల్లోని వైరస్తోనూ, యూరప్‌కు చెందిన పందుల్లోని వైరస్లతోనూ, ఆసియా దేశాల్లోని మరికొన్ని పక్షుల్లోని వైరస్లతోనూ, మనుషుల్లో వచ్చే ఇన్ఫ్లుయెంజా వైరస్లతోనూ... ఇలా నాలుగు రకాల వైరస్లు కలగలసినట్లుగా ఉండటంతో సైంటిస్టులు దీన్ని ‘క్వాడ్రపుల్ రీ అసార్టెంట్’ వైరస్‌గా పిలుస్తారు. అంటే నాలుగు రకాల వైరస్లు రూపు మార్చుకుని ఏర్పడ్డ కొత్త (మ్యూటెంట్) రూపం అన్నమాట. అందుకే పేరుకు స్వైన్ ఫ్లూ అయినా పందుల వల్ల ఇది సంక్రమించదు. కేవలం మనుషుల నుంచి మనుషులకే సంక్రమిస్తుంటుంది. వ్యావహారిక భాషలో స్వైన్‌ఫ్లూ అని పిలుస్తున్నా వైద్యులు మాత్రం దీన్ని తమ పరిభాషలో ‘హెచ్1ఎన్1 ఫ్లూ’ అని అంటారు. ఈ సమయంలోనే ఎందుకు? సాధారణంగా చలికాలం జలుబు వైరస్లు సంక్రమించడానికి అవకాశాలు ఎక్కువ. అదే కోవకు చెందినది కావడంతో ఈ ‘హెచ్1ఎన్1’ ఫ్లూ సైతం చలికాలంలోనే ఎక్కువగా వ్యాపిస్తోంది. గతంలోనూ చలికాలంలోనే ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ వైరస్ ప్రస్తుతం ఈ చలికాలంలో మనదేశాన్ని గడగడలాడిస్తోంది. చలి వాతావరణం దీనికి అనుకూలం (హై విరులెంట్) కావడంతో ఇది ఈ సీజన్లో విస్తృతంగా వ్యాపిస్తోంది. ఎలా వ్యాపిస్తుంది...? ఇది మనిషి నుంచి మనిషికి వ్యాపించే ఫ్లూ. వ్యాధిగ్రస్తుడు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు గాల్లోకి వ్యాపించిన ఈ వైరస్... ఆరోగ్యవంతుడైన వ్యక్తికి చేరితే అతడూ ఈ వ్యాధి బారిన పడతాడు. ఒక్కోసారి వ్యాధిగ్రస్తుల ముక్కు స్రావాలు తమ చేతికి అంటిన వారు... అదే చేత్తో తలుపు గొళ్లెం తాకి వెళ్లాక... దాన్ని మరొకరు తాకితే... వారికి ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వైరస్ దాదాపు 2 -8 గంటల వరకు జీవించి ఉండి, వ్యాధిని వ్యాప్తి చేసేంత క్రియాశీలంగా ఉంటుంది. ఉదాహరణకు వ్యాధిగ్రస్తుడు తుమ్మినప్పుడు ఆ తుంపర్లు టేబుల్ మీద పడి, అక్కడ ఆరోగ్యవంతులెవరైనా చేతులు పెట్టి... వాటిని తమ ముక్కు, కళ్లు, నోటికి అంటించుకుంటే వ్యాధి వ్యాప్తి చెందుతుంది. తుమ్మే సమయంలో వ్యాధిగ్రస్తులు తమ చేతులు అడ్డుపెట్టుకుని, ఆ తర్వాత అదే చేత్తో వేరేవారికి షేక్‌హ్యాండ్ ఇస్తే... వైరస్ ఆరోగ్యవంతునికి వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తులు లిఫ్ట్ వంటి క్లోజ్డ్ ప్రదేశాల్లోనూ, క్రౌడెడ్ప్రదేశాల్లో ఉన్నప్పుడూ, పబ్లిక్ ప్లేసెస్‌లో ఒకే బాత్రూమ్ తలుపును, కొళాయినాబ్ను వ్యాధిగ్రస్తులు తాకిన తర్వాత... ఆరోగ్యవంతులు అదే తలుపు హ్యాండిల్గాని, కొళాయి నాబ్‌ను తాకడం వల్ల ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంది. నిర్ధారణ... అది సాధారణ ఫ్లూనా లేక స్వైన్‌ఫ్లూ (హెచ్1ఎన్1)నా అన్న విషయం నిర్ధారణ చేసుకోడానికి రోగి గొంతు నుంచి, ముక్కు నుంచి స్రావాలను సేకరించి, వాటిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌కు పంపుతారు, అక్కడ పీసీఆర్ అనే పరీక్ష నిర్వహించి వ్యాధిని నిర్ధారణ చేస్తారు. అయితే ఫలితాలు వచ్చే వరకూ వేచి చూడాల్సిన అవసరం లేకుండానే లక్షణాలను బట్టే చికిత్స ప్రారంభిస్తారు. పరీక్షలో అది స్వైన్‌ఫ్లూ అని నిర్ధారణ అయితే వ్యాధి ఏ దేశంలో వ్యాపించినా, చికిత్సను అందించడానికి అంతర్జాతీయ సంస్థలు తమ వైద్యబృందాలతో ముందుకు వస్తాయి. లక్షణాలివే... సాధారణ ఫ్లూ జ్వరంలో ఉండే లక్షణాలే ఈ వ్యాధిలోనూ కనిపిస్తాయి. అంటే... జ్వరం, దగ్గు, గొంతులో ఇన్ఫెక్షన్, ముక్కు కారడం, ఒంటి నొప్పులు, తలనొప్పి, చలి, అలసట, నీరసం, కళ్లు-ముక్కు ఎర్రబారడం, కడుపులో నొప్పి... లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలకు తోడు వాంతులు, విరేచనాలు కూడా కనిపించినప్పుడు వైద్యులు దాన్ని స్వైన్‌ఫ్లూగా అనుమానిస్తారు. ఈ వ్యాధి సోకినప్పుడు పిల్లల్లో, పెద్దల్లో కనిపించే లక్షణాలు కాస్తంత వేరుగా ఉంటాయి. అవి... పిల్లల్లో... వేగంగా శ్వాసతీసుకోవడం, శ్వాసప్రక్రియలో ఇబ్బంది. కొందరిలో చర్మం నీలం రంగుకు మారడం. ఎక్కువగా నీళ్లు గానీ, ద్రవపదార్థాలుగానీ తాగకపోవడం. ► త్వరగా నిద్రలేవలేకపోవడం... ఎదుటివారితో సరిగా సంభాషించకపోవడం. ► కోపం, చిరాకు వంటి భావోద్వేగాలకు త్వరగా గురికావడం. ► ఫ్లూ వల్ల వచ్చిన జ్వరం తగ్గినా... దగ్గు ఒక పట్టాన త్వరగా తగ్గకపోవడం. ► కొందరిలో జ్వరంతో పాటు ఒంటిపై దద్దుర్లు (ర్యాష్) కనిపించడం. పెద్దల్లో... శ్వాసకియలో ఇబ్బంది, విపరీతమైన ఆయాసం. ఛాతీలోపల లేదా పొట్టలో నొక్కేస్తున్నట్లుగా నొప్పిరావడం. అకస్మాత్తుగా నీరసపడిపోవడం అయోమయం ఒక్కోసారి ఆగకుండా అదేపనిగా వాంతులు ఫ్లూ కారణంగా వచ్చిన జ్వరం తగ్గినా... దగ్గు ఒక పట్టాన తగ్గకపోవడం. హైరిస్క్ వ్యక్తులు... 65 ఏళ్లు పైబడినవారు, ఐదేళ్లలోపు పిల్లలు, గర్భిణులు, యుక్తవయస్కుల్లోనూ ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ వ్యాధి వ్యాపించడానికి అవకాశం ఉన్నవారిగా పరిగణిస్తారు. ఇక డయాబెటిస్, గుండెజబ్బులు, ఆస్తమా, సీఓపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్) లాంటి ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులున్నవారు, మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు, నరాల వ్యాధిగ్రస్తులు, ఎండోక్రైన్ వ్యవస్థలో లోపాలున్న వ్యాధిగ్రస్తులు, కాలేయ వ్యాధులు ఉన్నవారు, దీర్ఘకాలంగా ఆస్పిరిన్, స్టెరాయిడ్స్ వంటి మందులు తీసుకుంటున్న టీనేజర్స్, హెచ్ఐవీ వంటి వ్యాధులుండేవారు హైరిస్క్ గ్రూప్‌కి చెందినవారు. వీరికి వచ్చే ఇతర వ్యాధులు... స్వైన్‌ఫ్లూ వ్యాధిగ్రస్తులకు న్యుమోనియా, బ్రాంకైటిస్, సైనస్ ఇన్ఫెక్షన్, చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు తేలిగ్గా వస్తాయి. ఇలాంటివాళ్లు అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ఏఆర్డీఎస్) బారిన పడే అవకాశం ఉంది. అందుకే ఈ వ్యాధులను ఫ్లూ-రిలేటెడ్ కాంప్లికేషన్స్ అంటారు. ఉదాహరణకు ఆస్తమా ఉన్న వ్యక్తికిగానీ లేదా హార్ట్ ఫెయిల్యూర్ అయిన వ్యక్తికిగానీ స్వైన్ ఫ్లూ సోకితే అది మరింత ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది. నివారణ ఇలా... ప్రస్తుతం ఈ వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తున్నందున చికిత్స కంటే నివారణ చాలా ముఖ్యం. పైగా వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపించే గుణమున్న ఈ వైరస్‌తో వ్యవహరించడం అన్నది అటు రోగుల తోటివారికీ, వైద్యులు, పారామెడికల్ సిబ్బందికీ రిస్క్ కాబట్టి నివారణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం మేలు. ► దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు ఎదుటివారిపై తుంపర్లు పడకుండా చేతి రుమాలు అడ్డుపెట్టుకోవాలి. ఒకవేళ చేతి రుమాలు అందుబాటులో లేకపోతే... పొడవు చేతుల చొక్కా వేసుకొని, దాని మోచేతి మడతలో దగ్గడం, తుమ్మడం చేయడం వల్ల వైరస్ అక్కడికే పరిమితమవుతుంది. ► ఒకవేళ ఖాళీ చేతులు అడ్డు పెట్టుకొని దగ్గడమో, తుమ్మడమో చేస్తే ఆ తర్వాత ఆ చేతుల్ని శుభ్రంగా సబ్బుతో చాలాసేపు రుద్దుతూ కడుక్కోవాలి. ► ఒకవేళ రుద్ది కడుక్కునేందుకు సబ్బు లేదా నీరు అందుబాటులో లేకపోతే... ఆల్కహాల్ బేస్డ్ యాంటీ బ్యాక్టీరియల్ హ్యాండ్ రబ్స్తో చేతులను శుభ్రంగా రుద్దుకోవాలి. ► దగ్గు, తుమ్ము సమయంలో రుమాలును లేదా టిష్యూ పేపర్‌ను ఉపయోగించవచ్చు. అయితే ఆ రుమాలునుగానీ/టిష్యూ పేపర్నుగానీ వేరొకరు ఉపయోగించకుండా, జాగ్రత్తగా ఎవరూ అంటుకోని ప్రదేశంలో దాన్ని పడేయాలి. ► జలుబు లేదా ఫ్లూ ఉన్న వ్యక్తులనుంచి దూరంగా ఉండాలి. ఇలాంటి రోగులు కూడా తమ లక్షణాలు తగ్గిన 24 గంటల వరకు అందరి నుంచి దూరంగా ఉండటం మంచిది. జలుబు లక్షణాలు కనిపించినా... అది తగ్గేవరకు పదిమంది మసిలే ప్రదేశాలకూ, ఆఫీసుకు వెళ్లడం సరికాదు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలి. పరిసరాల పరిశుభ్రతతో నివారణ సులభం మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మిగతా వ్యాధులతో పాటు స్వైన్‌ఫ్లూ నుంచి కూడా రక్షణ పొందవచ్చు. ఉదాహరణకు... మనం పనిచేసే డెస్క్, టేబుల్ ఉపరితలాన్ని, మన ఇంటి గచ్చును, కిచెన్, బాత్రూమ్ గచ్చులను క్లోరిన్, ఆల్కహాల్స్, పెరాక్సిజెన్, డిటెర్జెంట్స్, అయిడోఫార్స్, క్వాటెర్నరీ అమోనియం, ఫీనాలిక్ కాంపౌండ్స్ వంటి డిస్-ఇన్ఫెక్టెంట్లతో శుభ్రపరచుకోవాలి. అందుబాటులో వ్యాక్సిన్... మునుపు ఈ వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు వ్యాక్సిన్ లేదు. కానీ తదుపరి పరిశోధనలతో స్వైన్‌ఫ్లూ వ్యాక్సిన్ రూపొందింది. ప్రస్తుతం అందుబాటులో ఉంది. స్వైన్ ఫ్లూ వచ్చేందుకు ఆస్కారం ఉన్న హైరిస్క్ గ్రూపునకు చెందిన వారంతా వ్యాక్సిన్ తీసుకోవాలని - సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ), అడ్వయిజరీ కమిటీ ఆన్ ఇమ్యూనైజేషన్ ప్రాక్టిసెస్ (ఏసీఐపీ) వంటి సంస్థలు సిఫార్సు చేస్తున్నాయి. అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) సిఫార్సుల మేరకు పదేళ్లు దాటిన వారంతా ఈ వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చు. 6 నెలల నుంచి తొమ్మిదేళ్ల వయసున్న వారు రెండు డోసులు తీసుకోవాలి. ఈ రెండుడోసులకు మధ్య కనీసం నాలుగువారాల వ్యవధి ఉండాలన్నది ఎఫ్‌డీఏ సిఫార్సు. చికిత్స... ఫ్లూకు సంబంధించిన లక్షణాలు కనిపించగానే దాన్ని స్వైన్‌ఫ్లూగా అనుమానించి ఇష్టం వచ్చినట్లుగా యాంటీవైరల్ మందులు, ఇందుకోసం ఉద్దేశించిన ఒసెల్టామివిర్ (టామీఫ్లూ) లేదా జనామివిర్ అనే మందు ఉపయోగించడం సరికాదు. తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. సాధారణ ఫ్లూ లక్షణాలు కనిపించగానే విచక్షణరహితంగా టామిఫ్లూ వంటి మందులు వాడటం వల్ల అంత ప్రయోజనం లేదు. నిర్దిష్టంగా టామిఫ్లూ మందునే ఉపయోగించాల్సిన పరిస్థితి వస్తే డాక్టర్లు తమ విచక్షణతో ఆ విషయాన్ని నిర్ధారణ చేస్తారు. ఆసుపత్రిలో చేరిన వారికీ, ఒకవేళ ఆ మందులు ఇవ్వకపోతే పరిస్థితి దిగజారిపోయే ప్రమాదం ఉన్నవారికి మాత్రమే డాక్టర్లు ఆ మందులను ఇస్తారు. అలాంటి అవసరం ఉన్నవారికి ఒసెల్టామివిర్ (టామిఫ్లూ), జనామివిర్ లాంటి మందులను కాప్సూల్స్ రూపంలో 5 రోజుల కోర్సుగా ఇస్తారు. పిల్లలకు ఇదే మందును చాక్లెట్సిరప్తో కలిపి ఇస్తారు. ఇక కొందరిలో రెలెంజా వంటి పీల్చే యాంటీవైరల్ మందునూ ఇస్తారు. అయితే శ్వాససంబంధిత వ్యాధులు ఉన్నవారికి, గుండెజబ్బులు ఉన్నవారికి మాత్రం ఈ రెలెంజా వంటి పీల్చే మందులను ఇవ్వరు. ఎందుకంటే... అలాంటి వారికి పీల్చే మందు అయిన రెలెంజా ఇచ్చినప్పుడు మగతగా ఉండటం, ముఖం ఎముకల్లో ఉండే ఖాళీ ప్రదేశాలైన సైనస్లలో ఇన్ఫెక్షన్స్ రావడం (సైనుసైటిస్), ముక్కు కారడం లేదా ముక్కుదిబ్బడ వేయడం, దగ్గురావడం, కొందరిలో వికారం, వాంతులు, తలనొప్పి వంటి సైడ్ఎఫెక్ట్స్ కనిపించవచ్చు. గర్భిణులకు చికిత్స... వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే గర్భిణులకూ యాంటీరిట్రోవైరల్ మందులు ఇస్తారు. దీనివల్ల కడుపులో ఉన్న పుట్టబోయే బిడ్డపై దుష్ర్పభావాలు కలిగినట్లు ఎలాంటి దాఖలాలూ లేవు.అయితే లక్షణాల తీవ్రత ఎక్కువగా లేకుండా, ఇంటిదగ్గరే వైద్యచికిత్స తీసుకుంటున్నవారు మాత్రం సాధారణ యాంటీబయాటిక్స్‌ను వాడుకోవచ్చు. వ్యాధినిరోధకశక్తి ఎక్కువగా ఉన్న కొంతమందికి వైరస్ సోకినప్పటికీ... కొద్దిపాటి లక్షణాలు కనిపించి, ఎలాంటి మందులు వాడకపోయినా అది తగ్గిపోయే అవకాశమూ ఉంది. కాబట్టి ఈ సీజన్లో వ్యాధి సాధారణ జలుబులాగే అనిపించినప్పటికీ, డాక్టర్ సలహా మేరకు మందులు వాడటమే మంచిది. చివరగా: సాధారణ జలుబు లక్షణాలే కలిగి ఉండే కొందరిలో అసాధారణమైన ప్రమాదాన్ని తెచ్చిపెట్టే ప్రభావం స్వైన్‌ఫ్లూ వైరస్‌కు ఉంది కాబట్టి... చికిత్స వరకూ తెచ్చుకోకుండా ముందునుంచే నివారణ చర్యలు చేపట్టడం అటు ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు ఇటు వ్యాప్తినీ నివారిస్తుందని గుర్తుంచుకోండి. - నిర్వహణ: యాసీన్ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి కన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్ కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్ హైదరాబాద్.