పొద్దస్తమానం ఆటో తోలి రోజుకు రూ. 200లు సంపాదించే ఓ డ్రైవర్ ఉన్నదాంట్లోనే సర్దుకొని ఆనందంగా కుటుంబాన్ని పోషించేవాడు. ఆరునెలల కిందట అతనికి ఓ విషాదకరమైన వార్త వినాల్సి వచ్చింది. ఉన్న ఒక్కగానొక కుమారుడు శ్వాసకోశ వ్యాధిబారిన పడ్డాడు. దాచుకున్న డబ్బులతోపాటు సుమారు ఏడు లక్షలు అప్పులు చేసి కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ లాభం లేకుండా పోయింది. ఖరీదైన వైద్యం చేయించలేక ప్రస్తుతం ఆక్సిజన్‌పైనే ఆ చిన్నారిని బతికిస్తున్నాడు. ముద్గుగా కనిపించే బాలుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా ఏమీ చేయలేని దీనస్థితిలో ఉన్నాడు. దాతల సాయంకోసం ఎదురుచూస్తున్నాడు. - అర్వపల్లి
అర్వపల్లి మండలం కొమ్మాల గ్రామానికి చెందిన సూరారపు ఉపేంద్ర, శ్రీనుల ఏకైక కుమారుడు లక్కి (15నెలలు) ఆరు నెలల కిందట పర్‌సిస్టెంట్ బ్రాంకో నిమోనియా, వైరల్ రియాక్టిట్ శ్వాసకోశ వ్యాధిబారిన పడ్డాడు. ప్రస్తుతం ఆక్సిజన్‌తో గాలి పీల్చుకుంటూ నరకం అనుభవిస్తున్నాడు. గుండెలో ఎడమ జఠరిక వాపుతో దీని పని విధానం తగ్గిపోయింది. బాలుడి రక్తంలోని ఎర్రరక్త కణాల్లో హిమోగ్లోబిన్, ఆక్సిజన్ సంతృప్తతా శాతం సాధారణ స్థాయిలో ఉండకుండా తగ్గాయి. ఊపిరితిత్తులతో రక్తకణాలు చేరి శ్వాస క్రియకు ఇబ్బందిగా మారాయి. దీంతో పూర్తిగా ఆయసం వచ్చి ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది.
లక్షల ఖర్చుచేసినా..
బాలుడిని సూర్యాపేట, ఖమ్మం, హైదరాబాద్‌లోని కార్పోరేట్ ఆసుపత్రుల్లో 6నెలల నుంచి చూయిస్తూ ఇప్పటివరకు రూ. 7లక్షలు ఖర్చు చేశారు. ఉన్న ఎకరం భూమి అమ్మడంతో పాటు బయట వడ్డీలకు రూ. 3లక్షల వరకు తెచ్చాడు. అయినా వ్యాధి తగ్గక పోగా ప్రస్తుతం ఆక్సిజన్ ఎక్కించకపోతే బతికే స్థితిలో లేడు. ఇదిలావుండగా రాజీవ్ ఆరోగ్యశ్రీలో శ్వాసకోశ వ్యాధి లేకపోవడంతో ఖరీదైన వైద్యం తప్పడంలేదు. ప్రస్తుతం రోజు ఆక్సిజన్ సిలిండర్‌కు రోజుకు రూ. 500 ఖర్చు చేస్తున్నార. ఆటో తోలగా వచ్చిన డబ్బులు సరిపోవడంలేదు. అయినప్పటికీ అప్పులు చేస్తూ ఆక్సిజన్ సిలిండర్లను సూర్యాపేట నుంచి తెచ్చి బతికించుకుంటున్నాడు.
దాతల సాయం అవసరం
ప్రస్తుతం బాలుడికి కార్పోరేట్ ఆసుపత్రిలో యాంటి బ్యాక్టీరియల్, యాంటి థెరఫి చికిత్స జరిపించాలి. దీని ద్వారా ఊపిరితిత్తులలోని మూసుకపోయిన గాలిగదులు తెరచుకొని శ్వాసలో ఇబ్బంది లేకుండా హిమోగ్లోబిన్, ఆక్సిజన్ సంతృప్తతా శాతం పెరుగుతుంది. అలాగే దీనికి తోడు రోగ నిరోదక శక్తి పెరుగుతుంది. ఈ చికిత్సకు సుమారు 3నెలలకు పైగానే వ్యవధి పట్టే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇందుకు సుమారు రూ. 7లక్షలకు పైగానే డబ్బు ఖర్చవుతుంది. దీనికి దాతలు సహకరిస్తే తప్ప తమ కొడుకు బతికే పరిస్థితి లేదని బాలుడి తల్లిదండ్రులు విలవిస్తున్నారు. ఎవైరె నా సాయం చేయాలనుకునేవారు ఎస్‌బీఐ అకౌంట్‌నంబర్ 34632819973లలో జమ చేయడంగాని, 9704883594 నెంబర్‌కు సంప్రదించడంగాని చేయవచ్చు.
చేతిలో పైసాలేదు
కుమారుని కోసం ఉన్న భూమి అమ్మేశాను. లక్షల్లో అప్పు చేశాను అయినా వ్యాధి నయంకాలే. ఇంకా లక్షల రూపాయలు కావాలంటున్నారు. మా పిల్లవాడిని బతికించడం కోసం తిరగని ఆసుపత్రిలేదు. రోజుకు రూ. 500 ఖర్చు చేసి ఆక్సిజన్ పెట్టించి బతికించుకుంటున్నా. - సూరారపు శ్రీను, తండ్రి
దేవుడే దిక్కు
బాలుడిని బతికించు కోవడం కోసం చేసేదంతా చేశాం. కట్టు బట్టలు తప్ప మాకు ఏమి మిగల లేదు. ఆక్సిజన్ తేవడానికి రోజు కొకరి కాళ్లుచేతులు పట్టుకొని అప్పుతెస్తున్నం. తిండికి డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా మనసున్న దాతలు సాయం చే సి పుణ్యం కట్టుకోవాలి.
- సూరారపు ఉపేంద్ర, తల్లి
మృత్యువుతో పోరాటం
Published Thu, Aug 13 2015 11:23 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
Advertisement
Advertisement