స్వైన్‌కృత అనారోగ్యం!!
స్వైన్‌ఫ్లూ వ్యాధిని సంక్రమింపజేసే వైరస్‌కూ, పందులలోని శ్వాసకోశ వ్యాధిని తెచ్చిపెట్టే వైరస్‌కు పోలికలు ఉన్నాయి కాబట్టి దీన్ని స్వైన్‌ఫ్లూ అన్నారు.ఇదీ సాధారణ ఫ్లూ లాంటిదే. కాకపోతే ఇది కాస్త తీవ్రమైనది కావడంతో డయాబెటిస్, హైబీపీ, ఆస్తమా, సీఓపీడీ వంటి మరికొన్ని వ్యాధులతో బాధపడుతూ రోగ నిరోధకత తగ్గినవారిలో మరింత తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు రుమాలు/ టిష్యూపేపర్ అడ్డుపెట్టుకోవడం, చేతులు అడ్డుపెట్టుకుని తుమ్మడం, దగ్గడం వంటివి చేశాక చేతులు శుభ్రంగా కడుక్కోవడం, లిఫ్ట్ వంటి క్లోజ్‌డ్ ప్రాంతాల్లో దగ్గు, తుమ్ములను ఆపుకోవడం, పరిశుభ్రతను పాటించడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని చాలా తేలిగ్గా నివారించవచ్చు. వీటిని పాటించకపోతే అది మన స్వయంకృతాపరాధమై అనారోగ్యాన్ని ఆహ్వానించినట్లు అవుతుంది. అలా స్వైన్‌ఫ్లూ బారిన పడకుండా ఉండటంతో పాటు దాని గురించి సమగ్ర అవగాహన కోసమే ఈ కథనం.
ఎందుకీ పేరు... ఏమిటా కథ?
స్వైన్ అంటే పంది. ఫ్లూ అంటే ఇన్‌ఫ్లుయెంజా విభాగానికి చెందిన వైరస్‌లతో వ్యాపించే జలుబు. తొలుత ఈ వైరస్‌ను పరిశీలించినప్పుడు అది పంది శ్వాసకోశవ్యాధికి కారణమయ్యే ఒక వైరస్‌లోని జన్యువులతో పోలి ఉంది. అందుకే దీనికి హాగ్ ఫ్లూ, పిగ్ ఫ్లూ అనే పేర్లు పెట్టారు. ఇన్‌ఫ్లుయెంజాకు కారణమయ్యే అనేక వైరస్‌లలో ఒకటి జన్యుమార్పులకు లోనైంది. సాధారణంగా వైరస్‌లు అన్నీ ఇలా తమ జన్యుస్వరూపాలను మార్చుకుంటుంటాయి. పందుల్లో ఉండే ఈ వైరస్ తన యాంటిజెనిక్ స్వరూపాన్ని మార్చుకొని మనుషుల్లోకి వ్యాప్తిచెందడం వల్ల స్వైన్ ఫ్లూగా పేరు పెట్టారు. ఆ తర్వాత దీనిపై మరిన్ని పరిశోధనలు జరిగాయి. ఫ్లూను సంక్రమింపజేసే వైరస్‌లలో అనేక రకాలు ఉంటాయి. అందులో ‘ఇన్‌ఫ్లుయెంజీ ఏ’, ‘ఇన్‌ఫ్లుయెంజా బీ’, ‘ఇన్‌ఫ్లుయెంజా సీ’ అనేవి ముఖ్యమైనవి. స్వైన్‌ఫ్లూ వైరస్ అన్నది ఇన్‌ఫ్లుయెంజా ఏ రకానికి చెందిన వైరస్‌తో దగ్గరి పోలికలు కలిగి ఉంది. ఈ వైరస్‌లోని జీన్స్ ఉత్తర అమెరికా ఖండానికి చెందిన పందుల్లోని వైరస్‌తోనూ, యూరప్‌కు చెందిన పందుల్లోని వైరస్‌లతోనూ, ఆసియా దేశాల్లోని మరికొన్ని పక్షుల్లోని వైరస్‌లతోనూ, మనుషుల్లో వచ్చే ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లతోనూ... ఇలా నాలుగు రకాల వైరస్‌లు కలగలసినట్లుగా ఉండటంతో సైంటిస్టులు దీన్ని ‘క్వాడ్రపుల్ రీ అసార్టెంట్’ వైరస్‌గా పిలుస్తారు. అంటే నాలుగు రకాల వైరస్‌లు రూపు మార్చుకుని ఏర్పడ్డ కొత్త (మ్యూటెంట్) రూపం అన్నమాట. అందుకే పేరుకు స్వైన్ ఫ్లూ అయినా పందుల వల్ల ఇది సంక్రమించదు. కేవలం మనుషుల నుంచి మనుషులకే సంక్రమిస్తుంటుంది. వ్యావహారిక భాషలో స్వైన్‌ఫ్లూ అని పిలుస్తున్నా వైద్యులు మాత్రం దీన్ని తమ పరిభాషలో ‘హెచ్1ఎన్1 ఫ్లూ’ అని అంటారు.
ఈ సమయంలోనే ఎందుకు?
సాధారణంగా చలికాలం జలుబు వైరస్‌లు సంక్రమించడానికి అవకాశాలు ఎక్కువ. అదే కోవకు చెందినది కావడంతో ఈ
‘హెచ్1ఎన్1’ ఫ్లూ సైతం చలికాలంలోనే ఎక్కువగా వ్యాపిస్తోంది. గతంలోనూ చలికాలంలోనే ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ వైరస్ ప్రస్తుతం ఈ చలికాలంలో మనదేశాన్ని గడగడలాడిస్తోంది. చలి వాతావరణం దీనికి అనుకూలం (హై విరులెంట్) కావడంతో ఇది ఈ సీజన్‌లో విస్తృతంగా వ్యాపిస్తోంది.
ఎలా వ్యాపిస్తుంది...?
ఇది మనిషి నుంచి మనిషికి వ్యాపించే ఫ్లూ. వ్యాధిగ్రస్తుడు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు గాల్లోకి వ్యాపించిన ఈ వైరస్... ఆరోగ్యవంతుడైన వ్యక్తికి చేరితే అతడూ ఈ వ్యాధి బారిన పడతాడు. ఒక్కోసారి వ్యాధిగ్రస్తుల ముక్కు స్రావాలు తమ చేతికి అంటిన వారు... అదే చేత్తో తలుపు గొళ్లెం తాకి వెళ్లాక... దాన్ని మరొకరు తాకితే... వారికి ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వైరస్ దాదాపు 2 -8 గంటల వరకు జీవించి ఉండి, వ్యాధిని వ్యాప్తి చేసేంత క్రియాశీలంగా ఉంటుంది. ఉదాహరణకు వ్యాధిగ్రస్తుడు తుమ్మినప్పుడు ఆ తుంపర్లు టేబుల్ మీద పడి, అక్కడ ఆరోగ్యవంతులెవరైనా చేతులు పెట్టి... వాటిని తమ ముక్కు, కళ్లు, నోటికి అంటించుకుంటే వ్యాధి వ్యాప్తి చెందుతుంది. తుమ్మే సమయంలో వ్యాధిగ్రస్తులు తమ చేతులు అడ్డుపెట్టుకుని, ఆ తర్వాత అదే చేత్తో వేరేవారికి షేక్‌హ్యాండ్ ఇస్తే... వైరస్ ఆరోగ్యవంతునికి వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తులు లిఫ్ట్ వంటి క్లోజ్‌డ్ ప్రదేశాల్లోనూ, క్రౌడెడ్‌ప్రదేశాల్లో ఉన్నప్పుడూ, పబ్లిక్ ప్లేసెస్‌లో ఒకే బాత్‌రూమ్ తలుపును, కొళాయినాబ్‌ను వ్యాధిగ్రస్తులు తాకిన తర్వాత... ఆరోగ్యవంతులు అదే తలుపు హ్యాండిల్‌గాని, కొళాయి నాబ్‌ను తాకడం వల్ల ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
నిర్ధారణ...
అది సాధారణ ఫ్లూనా లేక స్వైన్‌ఫ్లూ (హెచ్1ఎన్1)నా అన్న విషయం నిర్ధారణ చేసుకోడానికి రోగి గొంతు నుంచి, ముక్కు నుంచి స్రావాలను సేకరించి, వాటిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌కు పంపుతారు, అక్కడ పీసీఆర్ అనే పరీక్ష నిర్వహించి వ్యాధిని నిర్ధారణ చేస్తారు. అయితే ఫలితాలు వచ్చే వరకూ వేచి చూడాల్సిన అవసరం లేకుండానే లక్షణాలను బట్టే చికిత్స ప్రారంభిస్తారు. పరీక్షలో అది స్వైన్‌ఫ్లూ అని నిర్ధారణ అయితే వ్యాధి ఏ దేశంలో వ్యాపించినా, చికిత్సను అందించడానికి అంతర్జాతీయ సంస్థలు తమ వైద్యబృందాలతో ముందుకు వస్తాయి.
లక్షణాలివే...
సాధారణ ఫ్లూ జ్వరంలో ఉండే లక్షణాలే ఈ వ్యాధిలోనూ కనిపిస్తాయి. అంటే... జ్వరం, దగ్గు, గొంతులో ఇన్ఫెక్షన్, ముక్కు కారడం, ఒంటి నొప్పులు, తలనొప్పి, చలి, అలసట, నీరసం, కళ్లు-ముక్కు ఎర్రబారడం, కడుపులో నొప్పి... లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలకు తోడు వాంతులు, విరేచనాలు కూడా కనిపించినప్పుడు వైద్యులు దాన్ని స్వైన్‌ఫ్లూగా అనుమానిస్తారు. ఈ వ్యాధి సోకినప్పుడు పిల్లల్లో, పెద్దల్లో కనిపించే లక్షణాలు కాస్తంత వేరుగా ఉంటాయి. అవి... పిల్లల్లో... వేగంగా శ్వాసతీసుకోవడం, శ్వాసప్రక్రియలో ఇబ్బంది. కొందరిలో చర్మం నీలం రంగుకు మారడం. ఎక్కువగా నీళ్లు గానీ, ద్రవపదార్థాలుగానీ తాగకపోవడం.
► త్వరగా నిద్రలేవలేకపోవడం... ఎదుటివారితో సరిగా సంభాషించకపోవడం.
► కోపం, చిరాకు వంటి భావోద్వేగాలకు త్వరగా గురికావడం.
► ఫ్లూ వల్ల వచ్చిన జ్వరం తగ్గినా... దగ్గు ఒక పట్టాన త్వరగా తగ్గకపోవడం.
► కొందరిలో జ్వరంతో పాటు ఒంటిపై దద్దుర్లు (ర్యాష్) కనిపించడం.
పెద్దల్లో... శ్వాసకియలో ఇబ్బంది, విపరీతమైన ఆయాసం. ఛాతీలోపల లేదా పొట్టలో నొక్కేస్తున్నట్లుగా నొప్పిరావడం. అకస్మాత్తుగా నీరసపడిపోవడం అయోమయం ఒక్కోసారి ఆగకుండా అదేపనిగా వాంతులు ఫ్లూ కారణంగా వచ్చిన జ్వరం తగ్గినా... దగ్గు ఒక పట్టాన తగ్గకపోవడం.
హైరిస్క్ వ్యక్తులు...
65 ఏళ్లు పైబడినవారు, ఐదేళ్లలోపు పిల్లలు, గర్భిణులు, యుక్తవయస్కుల్లోనూ ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ వ్యాధి వ్యాపించడానికి అవకాశం ఉన్నవారిగా పరిగణిస్తారు. ఇక డయాబెటిస్, గుండెజబ్బులు, ఆస్తమా, సీఓపీడీ (క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్) లాంటి ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులున్నవారు, మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు, నరాల వ్యాధిగ్రస్తులు, ఎండోక్రైన్ వ్యవస్థలో లోపాలున్న వ్యాధిగ్రస్తులు, కాలేయ వ్యాధులు ఉన్నవారు, దీర్ఘకాలంగా ఆస్పిరిన్, స్టెరాయిడ్స్ వంటి మందులు తీసుకుంటున్న టీనేజర్స్, హెచ్‌ఐవీ వంటి వ్యాధులుండేవారు హైరిస్క్ గ్రూప్‌కి చెందినవారు.
వీరికి వచ్చే ఇతర వ్యాధులు...
స్వైన్‌ఫ్లూ వ్యాధిగ్రస్తులకు న్యుమోనియా, బ్రాంకైటిస్, సైనస్ ఇన్ఫెక్షన్, చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు తేలిగ్గా వస్తాయి. ఇలాంటివాళ్లు అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ఏఆర్‌డీఎస్) బారిన పడే అవకాశం ఉంది. అందుకే ఈ వ్యాధులను ఫ్లూ-రిలేటెడ్ కాంప్లికేషన్స్ అంటారు. ఉదాహరణకు ఆస్తమా ఉన్న వ్యక్తికిగానీ లేదా హార్ట్ ఫెయిల్యూర్ అయిన వ్యక్తికిగానీ స్వైన్ ఫ్లూ సోకితే అది మరింత ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది.
నివారణ ఇలా...
ప్రస్తుతం ఈ వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తున్నందున చికిత్స కంటే నివారణ చాలా ముఖ్యం. పైగా వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపించే గుణమున్న ఈ వైరస్‌తో వ్యవహరించడం అన్నది అటు రోగుల తోటివారికీ, వైద్యులు, పారామెడికల్ సిబ్బందికీ రిస్క్ కాబట్టి నివారణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం మేలు.
► దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు ఎదుటివారిపై తుంపర్లు పడకుండా చేతి రుమాలు అడ్డుపెట్టుకోవాలి. ఒకవేళ చేతి రుమాలు అందుబాటులో లేకపోతే... పొడవు చేతుల చొక్కా వేసుకొని, దాని మోచేతి మడతలో దగ్గడం, తుమ్మడం చేయడం వల్ల వైరస్ అక్కడికే పరిమితమవుతుంది.
► ఒకవేళ ఖాళీ చేతులు అడ్డు పెట్టుకొని దగ్గడమో, తుమ్మడమో చేస్తే ఆ తర్వాత ఆ చేతుల్ని శుభ్రంగా సబ్బుతో చాలాసేపు రుద్దుతూ కడుక్కోవాలి.
► ఒకవేళ రుద్ది కడుక్కునేందుకు సబ్బు లేదా నీరు అందుబాటులో లేకపోతే... ఆల్కహాల్ బేస్‌డ్ యాంటీ బ్యాక్టీరియల్ హ్యాండ్ రబ్స్‌తో చేతులను శుభ్రంగా రుద్దుకోవాలి.
► దగ్గు, తుమ్ము సమయంలో రుమాలును లేదా టిష్యూ పేపర్‌ను ఉపయోగించవచ్చు. అయితే ఆ రుమాలునుగానీ/టిష్యూ పేపర్‌నుగానీ వేరొకరు ఉపయోగించకుండా, జాగ్రత్తగా ఎవరూ అంటుకోని ప్రదేశంలో దాన్ని పడేయాలి.
► జలుబు లేదా ఫ్లూ ఉన్న వ్యక్తులనుంచి దూరంగా ఉండాలి. ఇలాంటి రోగులు కూడా తమ లక్షణాలు తగ్గిన 24 గంటల వరకు అందరి నుంచి దూరంగా ఉండటం మంచిది. జలుబు లక్షణాలు కనిపించినా... అది తగ్గేవరకు పదిమంది మసిలే ప్రదేశాలకూ, ఆఫీసుకు వెళ్లడం సరికాదు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలి.
పరిసరాల పరిశుభ్రతతో నివారణ సులభం
మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మిగతా వ్యాధులతో పాటు స్వైన్‌ఫ్లూ నుంచి కూడా రక్షణ పొందవచ్చు. ఉదాహరణకు... మనం పనిచేసే డెస్క్, టేబుల్ ఉపరితలాన్ని, మన ఇంటి గచ్చును, కిచెన్, బాత్‌రూమ్ గచ్చులను క్లోరిన్, ఆల్కహాల్స్, పెరాక్సిజెన్, డిటెర్జెంట్స్, అయిడోఫార్స్, క్వాటెర్నరీ అమోనియం, ఫీనాలిక్ కాంపౌండ్స్ వంటి డిస్-ఇన్ఫెక్టెంట్‌లతో శుభ్రపరచుకోవాలి.
అందుబాటులో వ్యాక్సిన్...
మునుపు ఈ వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు వ్యాక్సిన్ లేదు. కానీ తదుపరి పరిశోధనలతో స్వైన్‌ఫ్లూ వ్యాక్సిన్ రూపొందింది. ప్రస్తుతం అందుబాటులో ఉంది. స్వైన్ ఫ్లూ వచ్చేందుకు ఆస్కారం ఉన్న హైరిస్క్ గ్రూపునకు చెందిన వారంతా వ్యాక్సిన్ తీసుకోవాలని - సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ), అడ్వయిజరీ కమిటీ ఆన్ ఇమ్యూనైజేషన్ ప్రాక్టిసెస్ (ఏసీఐపీ) వంటి సంస్థలు సిఫార్సు చేస్తున్నాయి. అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) సిఫార్సుల మేరకు పదేళ్లు దాటిన వారంతా ఈ వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చు. 6 నెలల నుంచి తొమ్మిదేళ్ల వయసున్న వారు రెండు డోసులు తీసుకోవాలి. ఈ రెండుడోసులకు మధ్య కనీసం నాలుగువారాల వ్యవధి ఉండాలన్నది ఎఫ్‌డీఏ సిఫార్సు.
చికిత్స...
ఫ్లూకు సంబంధించిన లక్షణాలు కనిపించగానే దాన్ని స్వైన్‌ఫ్లూగా అనుమానించి ఇష్టం వచ్చినట్లుగా యాంటీవైరల్ మందులు, ఇందుకోసం ఉద్దేశించిన ఒసెల్టామివిర్ (టామీఫ్లూ) లేదా జనామివిర్ అనే మందు ఉపయోగించడం సరికాదు. తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. సాధారణ ఫ్లూ లక్షణాలు కనిపించగానే విచక్షణరహితంగా టామిఫ్లూ వంటి మందులు వాడటం వల్ల అంత ప్రయోజనం లేదు. నిర్దిష్టంగా టామిఫ్లూ మందునే ఉపయోగించాల్సిన పరిస్థితి వస్తే డాక్టర్లు తమ విచక్షణతో ఆ విషయాన్ని నిర్ధారణ చేస్తారు. ఆసుపత్రిలో చేరిన వారికీ, ఒకవేళ ఆ మందులు ఇవ్వకపోతే పరిస్థితి దిగజారిపోయే ప్రమాదం ఉన్నవారికి మాత్రమే డాక్టర్లు ఆ మందులను ఇస్తారు. అలాంటి అవసరం ఉన్నవారికి ఒసెల్టామివిర్ (టామిఫ్లూ), జనామివిర్ లాంటి మందులను కాప్సూల్స్ రూపంలో 5 రోజుల కోర్సుగా ఇస్తారు. పిల్లలకు ఇదే మందును చాక్లెట్‌సిరప్‌తో కలిపి ఇస్తారు. ఇక కొందరిలో రెలెంజా వంటి పీల్చే యాంటీవైరల్ మందునూ ఇస్తారు. అయితే శ్వాససంబంధిత వ్యాధులు ఉన్నవారికి, గుండెజబ్బులు ఉన్నవారికి మాత్రం ఈ రెలెంజా వంటి పీల్చే మందులను ఇవ్వరు. ఎందుకంటే... అలాంటి వారికి పీల్చే మందు అయిన రెలెంజా ఇచ్చినప్పుడు మగతగా ఉండటం, ముఖం ఎముకల్లో ఉండే ఖాళీ ప్రదేశాలైన సైనస్‌లలో ఇన్ఫెక్షన్స్ రావడం (సైనుసైటిస్), ముక్కు కారడం లేదా ముక్కుదిబ్బడ వేయడం, దగ్గురావడం, కొందరిలో వికారం, వాంతులు, తలనొప్పి వంటి సైడ్‌ఎఫెక్ట్స్ కనిపించవచ్చు.
గర్భిణులకు చికిత్స...
వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే గర్భిణులకూ యాంటీరిట్రోవైరల్ మందులు ఇస్తారు. దీనివల్ల కడుపులో ఉన్న పుట్టబోయే బిడ్డపై దుష్ర్పభావాలు కలిగినట్లు ఎలాంటి దాఖలాలూ లేవు.అయితే లక్షణాల తీవ్రత ఎక్కువగా లేకుండా, ఇంటిదగ్గరే వైద్యచికిత్స తీసుకుంటున్నవారు మాత్రం సాధారణ యాంటీబయాటిక్స్‌ను వాడుకోవచ్చు. వ్యాధినిరోధకశక్తి ఎక్కువగా ఉన్న కొంతమందికి వైరస్ సోకినప్పటికీ... కొద్దిపాటి లక్షణాలు కనిపించి, ఎలాంటి మందులు వాడకపోయినా అది తగ్గిపోయే అవకాశమూ ఉంది.
కాబట్టి ఈ సీజన్‌లో వ్యాధి సాధారణ జలుబులాగే అనిపించినప్పటికీ, డాక్టర్ సలహా మేరకు మందులు వాడటమే మంచిది.
చివరగా: సాధారణ జలుబు లక్షణాలే కలిగి ఉండే కొందరిలో అసాధారణమైన ప్రమాదాన్ని తెచ్చిపెట్టే ప్రభావం స్వైన్‌ఫ్లూ వైరస్‌కు ఉంది కాబట్టి... చికిత్స వరకూ తెచ్చుకోకుండా ముందునుంచే నివారణ చర్యలు చేపట్టడం అటు ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు ఇటు వ్యాప్తినీ నివారిస్తుందని గుర్తుంచుకోండి.
- నిర్వహణ: యాసీన్
డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి
కన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్
హైదరాబాద్.