buddhadeb bhattacharjee
-
Sitaram Yechury: జీవితమే కాదు.. దేహమూ ప్రజాసేవకే అంకితం
ప్రముఖ రాజకీయ నేత, సీపీఐఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూసిన విషయం తెలిసిందే. 72 ఏళ్ల ఏచూరి ఢిల్లీలోని ఏయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. విద్యార్థి దశనుంచే వామపక్ష భావాలను అలవరచుకున్న ఆయన.. తుదిశ్వాస విడిచే వరకు ప్రజా పోరాటాల్లో బతికారు. తన జీవితాన్నే కాదు.. చివరకు తన దేహాన్ని సైతం ప్రజాసేవకే అంకితమిచ్చారు.ఆయన బతికి ఉన్నప్పుడే తాను మరణిస్తే పార్థీవ దేహాన్ని వైద్య విద్యార్థుల బోధన, పరిశోధనల కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన పార్థీవదేహాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి కుటుంబ సభ్యులు దానం చేయనున్నారు. మృతదేహాన్ని శుక్రవారం ఆస్పత్రికి తరలించనున్నారు. దీంతో ఏచూరి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించటం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.కాగా కమ్యూనిస్టు నేతలు తమ పార్థివదేహాలను పరిశోధనల కోసం ఇవ్వడం ఇదే తొలిసారికాదు.. గత కొన్నేళ్లుగా వామపక్ష నాయకులు ఇదే సంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. ఆగస్టు 2024లో మరణించిన పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య (80) భౌతికకాయాన్ని కూడా వైద్య పరిశోధనల కోసం దానం చేశారు. కోల్‌కతాలోని నీల్ రతన్ సిర్కార్ ఆసుపత్రిలోని అనాటమీ విభాగానికి పార్థివ దేహాన్ని అప్పగించారు. ఇందుకు సంబంధించి మార్చి 2006లోనే బుద్ధదేవ్ ఓ స్వచ్ఛంద సంస్థకు హామీ ఇచ్చారు.ఆయనతోపాటు పశ్చిమ బెంగాల్‌కు 34 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కమ్యూనిస్టు దిగ్గజ నేత జ్యోతిబసు కూడా 2010లో ఆయన మరణాంతరం శరీరాన్ని వైద్య సేవలకే అప్పగించారు.ఆయన పార్థివ దేహాన్ని కోల్‌కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి దానం చేశారు. ఇందుకు సంబంధించి 2006లోనే ఆయన హామీ ఇచ్చారు. మాజీ లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ 2000 సంవత్సరంలో తన శరీరాన్ని దానం చేస్తానని ప్రమాణం చేశాడు. 2018లో అతని మరణం తర్వాత అతని కుటుంబ సభ్యులు శరీరాన్ని దానం చేశారు. సీపీఎం కార్యదర్శి అనిల్ బిశ్వాస్‌తోపాటు పార్టీ సీనియర్ నేత బెనోయ్ చౌధురీల భౌతికకాయాలూ ఆస్పత్రులకు అప్పగించారు. -
అరుణాశయ బుద్ధమూర్తి
బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం అగ్రనాయకుడు బుద్ధదేవ్ భట్టాచార్య మృతి ప్రగతిశీల రాజకీయాలు, ప్రజా స్వామిక విలువలు కోరుకునేవారందరికీ విచారం కలిగించింది. రాజకీయ విభేదా లకు అతీతంగా ఆయనకు నేతలు నివాళు లర్పించారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన నిబద్ధత, నిజాయితీ, నిరాడంబరత్వం, నిష్కపటత్వం వంటి విశిష్టతలను వారు గుర్తు చేసు కుంటున్నారు. దేశంలో కీలకమైన బెంగాల్ వంటి పెద్ద రాష్ట్రానికి పదకొండేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా సాదాసీదా అపార్ట్మెంట్లోనే ఆఖరి దాకా జీవితం గడిపిన ఆదర్శం ఆయనది. కమ్యూ నిస్టు ఉద్యమం సృష్టించిన త్యాగధనులలో మూడవ తరానికి చెందిన బుద్ధదేవ్ ప్రెసిడెన్సీ కాలేజీలో సాహిత్యం చదువుకుని విద్యార్థి సంఘాల ద్వారా 1966లో వామపక్ష ఉద్యమంలో ప్రవే శించారు. 1977లో తొలి వామపక్ష ప్రభుత్వంలో సమాచార, సాంస్కృతిక మంత్రిగా చేరిన ఆయన 1982లో ఓడిపోయినా 1987లో మళ్లీ గెలిచి బాధ్యతలు చేపట్టారు. 1996లో జ్యోతిబాసు అనా రోగ్యం తర్వాత కీలకమైన హోంశాఖ బాధ్యతలు నిర్వహించారు. 23 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగి దేశంలోనే కొత్తరికార్డు నెలకొల్పిన మహానాయకుడు జ్యోతిబాసు తర్వాత వామపక్ష కూటమి భవిష్యత్తు ఏమవుతుందనే సవాళ్లకు సమర్థమైన సమాధానంగా బుద్ధదేవ్ నిలిచారు. 2000 నుంచి పదకొండేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1985 నుంచి కేంద్ర కమిటీ, తర్వాత పొలిట్‌బ్యూరో సభ్యుడుగా సీపీఎంలో ముఖ్యపాత్ర పోషించారు. యువమంత్రిగా, డివైఎఫ్ఐ నాయకుడుగా 1979లో ఆయన వరంగల్‌లో ఉమ్మడి రాష్ట్ర తొలి మహాసభలకు రావడం ఈ రచయితకు గుర్తుంది. పాతికేళ్ల తర్వాత 2005లో అదే వరంగల్‌లో సీపీఎం మహాసభలలో బుద్ధదేవ్ చేసిన కీలక ప్రసంగంలో అప్పటికి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ మత తత్వ రాజకీయాలపై నిశిత విమర్శలు అనువదించాను కూడా! ‘‘గుజరాత్లో జరిగిన దారుణాలకు సాటి ముఖ్యమంత్రిగా నేను సిగ్గుపడుతున్నాను’’ అని అప్పుడాయన అన్నారు. మృదుభాషిగా పేరొందిన బుద్ధదేవ్ రాజకీయ విషయాల్లో అంత నిక్కచ్చిగా ఉండేవారు. బుద్ధదేవ్ భట్టాచార్య హయాంలో తొలి రెండు ఎన్నికల్లోనూ ఫ్రంట్ విజయాలు కొత్త చరిత్ర సృష్టించాయి. 2006 ఎన్నికలలో వామపక్షాలకు 294కు 235 స్థానాలు వచ్చాయి. దానికన్నా ముందు 2004 లోక్‌సభ ఎన్నికలలోనూ 35 స్థానాలు వచ్చాయి. పార్లమెంటులో మొత్తం 60 స్థానాలతో వామపక్షాలు, అందులో 42 సీట్లతో సీపీఎం పాత్ర, ప్రభావాలు శిఖరాగ్రానికి చేరాయి. ఆ మద్దతే లేకపోతే కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వమే ఉండేది కాదు. కాంగ్రెస్ ఆ రాజకీయ సందేశాన్ని సవ్యంగా అర్థం చేసుకుని ఉంటే... అణు ఒప్పందం చిచ్చు పెట్టకపోతే చరిత్ర మరోలా ఉండేది. బుద్ధదేవ్ సైద్ధాంతికంగా కొత్తపుంతలు తొక్కుతున్నారనీ, దార్శనికతతో పిడివాదాన్ని వదిలేశారనీ ఒక వైపున లేనిపోని పొగడ్తలు... మరోవైపున భూములు లాక్కొంటున్నారనే ప్రచారా లకు బడా మీడియా వేదికైంది. సరళీకరణ విధానాలను, భూ దోపిడీని వ్యతిరేకించినవే వామపక్షాలు కాగా ఆ ముద్రతో వాటిపైనే దాడి చేయడం బూర్జువా వర్గాల వ్యూహమైంది. వామపక్ష ఫ్రంట్ టార్గెట్‌గా సింగూరు, నందిగ్రావ్ు ఘటనలపై అదేపనిగా ప్రచారాలు జరిగాయి. సింగూర్‌లో టాటా కార్ల ఫ్యాక్టరీ దాదాపు పూర్తవుతుంటే దాన్ని అడ్డుకోవడానికి ఆ రోజుల్లో మమతా బెనర్జీ చేసిన హడావిడి మర్చిపోరానిది. కాంగ్రెస్, మమతా బెనర్జీ బుద్ధదేవ్ ప్రభుత్వాన్ని ఓడించడమే పరమార్థంగా వ్యవహరించాయి. మావోయిస్టు పార్టీ కూడా గొంతు కలిపింది. వాటిలో కొన్ని తప్పొప్పులు లేవని కాదు గాని ప్రజలకు ఉపాధి పెంచాలన్నదే బుద్ధదేవ్ సంకల్పంగా ఉండేది. ఆ పరిణామాలపై చాలా సమీక్షలే జరిగాయి. అనేక అధికారిక నివేదికలు కూడా వచ్చాయి. ఇప్పుడు వాటిని సాకల్యంగా చూస్తే ఎవరికైనా పూర్తి నిజాలు తెలుస్తాయి. ‘‘టాటాలే బెంగాల్ నుంచి తరలిపోవడం వల్ల రాష్ట్రానికి చెప్ప లేని నష్టం జరిగింది. నేను ఎక్కడ తప్పు చేశానా అని కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది. భూ సేకరణే తప్పా లేక భూ సేకరణ జరిగిన విధానమా? నేను ప్రతిపక్షాలపై మరీ మెతగ్గా వ్యవహరించానా? ఆ అనుభవాల నుంచి మనం పాఠాలు తీసు కోవాలి’’ అని ఆయన చెప్పారు. బుద్ధదేవ్, జ్యోతిబాసు వంటివారు భద్రలోక్ అనీ, మమతా దీదీ ప్రజల మనిషని ప్రచారం చేసిన వారే ఇప్పుడు ఆమె నిరంకుశ పోకడలపై విరుచుకుపడుతున్నారు. మోదీ ఏకపక్షపాలన ముదిరాక ఆమె కూడా అనేక రాజకీయ విన్యాసాలతో ఉనికి కాపాడుకుంటున్నారు. బుద్ధదేవ్ మాత్రం ‘మోదీ హఠావో, మమతా హఠావో’ నినాదంతోనే రాజకీయ జీవితం ముగించారు. 34 ఏళ్ల పాటు పాలించిన వామపక్ష ప్రభుత్వం 2011లో ఓడి పోయాక నిర్బంధాలు తట్టుకుని బుద్ధదేవ్ గట్టిగా నిలబడ్డారు. ఆరోగ్యం సహకరించినంతవరకూ సమావేశాలలో, సభలలో పాల్గొంటూ, ఉద్యమాన్ని నిలబ్టెడంలో తన పాత్ర నిర్వహిసూ వచ్చారు. 2011లో ఓడిపోయిన తన నియోజకవర్గమైన జాదవ్ పూర్లో 2017లో పెద్ద మెజార్టీతో సీపీఎం అభ్యర్థినే గెలిపించు కోగలిగారు. ఆయన భార్య మీరా భట్టాచార్య, కుమారుడు సుచేతన్ కూడా ఆశయాల బాటలో తోడుగా నిలిచారు. ఎవరు ఎంత చెప్పినా పావ్‌ు అవెన్యూలోని తన నిరాడంబర ‘టు బెడ్ రూవ్‌ు ఫ్లాట్‘ నివాసాన్ని మార్చుకోవడానికి బుద్ధదేవ్ ఒప్పు కోలేదు. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ పాత అంబాసిడర్ కారునే ఆఖరు వరకూ ఆయన వాడారు.2023లో మోదీ ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటిస్తే తీసుకోవడానికి నిరాకరించారు. ఆనారోగ్యంలో పరా మర్శించే పేరిట మమతా బెనర్జీ లేదా అప్పటి గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్ వంటివారు రాజకీయాలు చేయబోతే సాగనివ్వలేదు. ఇవన్నీ ఆయన వ్యక్తిత్వ ఒరవడికి అద్దం పడతాయి. ఆయన మరణానంతరం అధికారిక గన్ సెల్యూట్‌ను కూడా కుటుంబ సభ్యులు నిరాకరించారు.కళా, సాహిత్య రంగాల్లో బుద్ధదేవ్ భట్టాచార్య కృషిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన రచయిత, కవి, నాటకకర్త కూడా! ఇన్ని రాజకీయాల సిద్ధాంత ఘర్షణల మధ్యనా టాగోర్ కవితలను 500 దాకా కంఠోపాఠంగా చెప్పేవారట! సంక్లిష్టమైన ఆధునిక రచయితలు కాఫ్కా, మార్క్వెజ్ వంటి వారి రచనలను ఆయన బెంగాలీలోకి అనువదించారు. సమాంతర చిత్రాలకు పేరెన్నికగన్న కొల్కతాలో నందన్ కానన్ కళాభవన్ పేరిట ఒక శాశ్వత వేదికను ఏర్పాటు చేయడానికి మంత్రిగా చొరవ తీసుకున్నారు. ప్రసిద్ధ బెంగాలీ రచయిత సుకాంత భట్టాచార్య ఆయన బాబాయి. తన ఆత్మకథను రెండు భాగాలుగా వెలువరించారు బుద్ధదేవ్. ‘ఫిర్దేఖా’, ‘ఫిర్దేఖా 2’ అనే ఆ రెండు సంపుటాల్లో జీవితాన్ని రాజకీయ పాలనానుభవాలను నెమరు వేసుకున్నారు. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా బెంగాలీలు ఆయనను ఎంత ప్రేమించారు, దేశం ఎంత గౌరవించింది అనడానికి అంతిమఘట్టంలో ప్రదర్శితమైన గౌరవాభిమా నాలే నిదర్శనం. తెలకపల్లి రవి వ్యాసకర్త సీనియర్ సంపాదకులు, విశ్లేషకులు -
బుద్ధదేవ్‌కు అంతిమ వీడ్కోలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు దిగ్గజం బుద్ధదేవ్ భట్టాచార్యకు సీపీఎం నేతలు, కార్యకర్తలు, అభిమానులు శుక్రవారం వీడ్కోలు పలికారు. కోల్‌కతాలో సీపీఎం ప్రధాన కార్యాలయంలో బుద్ధదేవ్ భౌతికాయాన్ని సందర్శించి నివాళులరి్పంచారు. అంతిమయాత్రలో పారీ్టలకు అతీతంగా వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. లాల్ సలామ్ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. సాయంత్రం బుద్ధదేవ్ పారి్థవ దేహాన్ని ఆయన కోరిక ప్రకారమే ఎన్ఆర్ఎస్ ప్రభుత్వ ఆసుపత్రికి అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న బుద్ధదేవ్ భట్టాచార్య గురువారం తన ఇంట్లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. -
West Bengal: బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూత
కోల్‌కతా: సీపీఎం సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూశారు. 80 ఏళ్ల బుద్ధదేవ్ గురువారం ఉదయం 8.20 గంటలకు మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. శ్వాసకోస వ్యాధితో దీర్ఘకాలంగా బాధపడుతున్న ఆయన కోల్‌కతాలోని పామ్ అవెన్యూలో ఉన్న తన ఫ్లాట్‌లో తుదిశ్వాస విడిచారు. గతేడాదే ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కోలుకున్నారు. మళ్లీ ఇటీవల అనారోగ్యం పాలయ్యారు. ఆయనకు భార్య మీరా, కుమారుడు సుచేతన్ ఉన్నారు. ప్రజల సందర్శనార్థం భట్టాచార్య భౌతికకాయాన్ని శుక్రవారం తొలుత బెంగాల్ అసెంబ్లీ, తర్వాత సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి, డీవైఎఫ్ఐ కార్యాలయానికి తరలిస్తారు. అనంతరం అంతిమయాత్ర నిర్వహించి, మృతదేహాన్ని వైద్య కళాశాలకు అప్పగిస్తారు. కార్యకర్త నుంచి ముఖ్యమంత్రిగా.. సీపీఎం అత్యున్నత నిర్ణాయక విభాగమైన పొలిట్ బ్యూరో మాజీ సభ్యుడు అయిన భట్టాచార్య 1944 మార్చి 1న కోల్‌కతాలో జన్మించారు. కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కళాశాల నుండి బెంగాలీలో బీఏ ఆనర్స్ చేశారు. 1966లో పారీ్టలో చేరారు. సీపీఎం యువజన విభాగమైన డీవైఎఫ్ఐలో చేరారు. రాజకీయాల్లోకి రాకముందు పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా సేవలందించిన ఆయన 2000లో జ్యోతిబసు సీఎం పదవి నుంచి వైదొలగక ముందు ఉపముఖ్యమంత్రిగా పదోన్నతి పొందారు. జ్యోతిబసు తరువాత సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2000 నుంచి 2011 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. జ్యోతిబసు పాలనతో పోలిస్తే భట్టాచార్య హయాంలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం పారిశ్రామిక వర్గాల పట్ల సానుకూలంగా వ్యవహరించింది. విచిత్రమేమిటంటే పారిశ్రామికీకరణకు సంబంధించిన సీపీఎం విధానాలే 2011 ఎన్నికల్లో వామపక్షాల పరాజయానికి బాటలు వేశాయి. ‘పద్మభూషణ్’ తిరస్కరణ కేంద్రం 2021లో బుద్ధదేవ్‌కు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. ఆ అవార్డును ఆయన తిరస్కరించారు. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి బుద్ధదేవ్ మరణం పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. బెంగాల్ అభివృద్ధికి కృషి చేశారని, ప్రజలకు విశిష్టమైన సేవలు అందించారని బుద్ధదేవ్‌ను మోదీ కొనియాడారు. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు సంతాపం తెలిపారు. -
మాజీ సీఎం బుద్ధదేవ్ జీవితం సాగిందిలా..
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ నేటి(గురువారం) ఉదయం కలకత్తాలో కన్నుమూశారు. ఆయన తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు.బుద్ధదేవ్ భట్టాచార్య 1944, మార్చి 9న జన్మించారు. 2000లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన ఆయన 2011 వరకు సీఎంగా కొనసాగారు. జాదవ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. వరుసగా 24 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగిన ఆయన తన ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి మనీష్ గుప్తా చేతిలో ఓడిపోయారు. సీనియర్ సీపీఐ(ఎం) నేత బుద్ధదేవ్ భట్టాచార్య జ్యోతిబసు క్యాబినెట్లో దాదాపు 18 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నారు. హోం మంత్రిత్వ శాఖతో సహా అనేక ముఖ్యమైన మంత్రిత్వ శాఖలలో పనిచేశారు.1977లో తొలిసారిగా కోసిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1982 ఎన్నికల్లో భట్టాచార్య ఓడిపోయినా పార్టీలో ఆయన స్థాయి పెరిగింది. 1987లో జాదవ్‌పూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. దీని తర్వాత అతను జాదవ్‌పూర్ నుండి ఎన్నికల్లో విజయపరంపర కొనసాగించారు.జ్యోతిబసు హయాంలో డిప్యూటీ సీఎంతో పాటు హోంశాఖ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత జ్యోతిబసు వారసునిగా నిలిచారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా బంగ్లా కొనేందుకు నిరాకరించారు. ఐదు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగి 18 ఏళ్లు మంత్రిగా, 11 ఏళ్లు సీఎంగా ఉన్నా ఆయనకు సొంత బంగ్లా, కారు లేదు. ఆయన తన జీతాన్ని కూడా పార్టీ ఫండ్‌కి అందజేసేవారు. బుద్ధదేవ్ భట్టాచార్య మంత్రిగా, సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన కుటుంబసభ్యులు ప్రజారవాణాలో మాత్రమే ప్రయాణించేవారు. -
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూత
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ భట్టాచార్య (80) గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈమేరకు సీపీఎం స్టేట్ సెక్రటరీ మహమ్మద్ సలీం వెల్లడించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన .. కొద్ది సేపటి క్రితమే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 2౦౦౦ నుంచి 2011 వరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. భట్టాచార్యకు భార్య మీరా, కుమార్తె సుచేతన ఉన్నారు.భట్టాచార్య మరణంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ‘భట్టాచార్య దశాబ్దాలుగా తెలుసు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న బట్టాచార్యను పలు మార్లు ఇంటికి వెళ్లి పరామర్శించాను. కానీ గురువారం ఆయన మరణ వార్త తెలిసింది. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. Shocked and saddened by the sudden demise of the former Chief Minister Sri Buddhadeb Bhattacharjee. I have been knowing him for last several decades, and visited him a few times when he was ill and effectively confined to home in the last few years.My very sincere condolences…— Mamata Banerjee (@MamataOfficial) August 8, 2024 -
బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ పరిస్థితి విషమం
లక్నో: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య(79) ఆరోగ్య పరిస్తితి ఇంకా విషమంగానే ఉంది. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ మేరకు వుడ్‌ల్యాండ్ హాస్పిటల్స్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశాయి. ఈ ఉదయం బుద్ధవేవ్ ఛాతీ భాగానికి సీటీ స్కాన్ తీసినట్లు వైద్యులు పేర్కొన్నారు. సీనియర్ వైద్య నిపుణల బృందం భట్టాచార్యకు చికిత్స అందిస్తుందని, ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తుందని వెల్లడించారు. అయితే మొత్తం మీద బుద్దదేవ్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ ప్రాణాపాయం నుంచి బయటపడలేదని వైద్యులు తెలిపారు. రక్తపోటు అదుపులోకి రావడంతో చికిత్సకు ఆయన సహకరిస్తున్నారని చెప్పారు. కాగా శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో శనివారం కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ హాస్పిటట్‌లో చేరని విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా 2000 నుంచి 2011 వరకు పశ్చిమ బెంగాల్ సీఎంగా భట్టాచార్య పనిచేశారు. చదవండి: పార్లమెంట్లో ఆరని మణిపూర్ మంటలు.. -
పద్మ పురస్కారాలు మాకొద్దు.. మేం తీసుకోం
న్యూఢిల్లీ: తమకు ప్రకటించిన పద్మ పురస్కారాలను పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ, ప్రముఖ నేపథ్య గాయని సంధ్యా ముఖర్జీ తిరస్కరించారు. పద్మభూషణ్ అవార్డు స్వీకరించేందుకు తాను సిద్ధంగా లేనని బుద్ధదేవ్ చెప్పినట్టు సీపీఎం తెలిపింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి పురస్కారాలు తీసుకోరాదన్నది తమ పార్టీ విధానమని స్పష్టం చేసింది. తాము ప్రజల కోసం పనిస్తామని, అవార్డుల కోసం కాదని ప్రకటించింది. గతంలో కేరళ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ నాయకుడు ఇఎంఎస్ నంబూద్రిపాద్‌కు ‘పద్మ’ పురస్కారాన్ని ప్రకటించగా.. ఆయన దానిని తిరస్కరించారని సీపీఎం వెల్లడించింది. 1992లో పీవీ నరసింహారావు ప్రభుత్వ హయాంలో తనకు ప్రకటించిన పద్మవిభూషణ్ అవార్డును నంబూద్రిపాద్ నిరాకరించారు. దేశాన్ని అవమానించడమే.. గులాం కావాలనుకోవడం లేదు పద్మభూషణ్‌ను తిరస్కరించడం ద్వారా భట్టాచార్జీ దేశాన్ని అవమానించారని, బీజేపీ నాయకురాలు ప్రీతి గాంధీ అన్నారు. పద్మ అవార్డులు ఏ ఒక్క పార్టీకి లేదా సిద్ధాంతానికి చెందినవి కాదని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పందిస్తూ.. ‘ఆయన ఆజాద్‌గా ఉండాలనుకుంటున్నారు. గులాం అవ్వాలను కోవడం లేద’ని వ్యాఖ్యానించారు. (చదవండి: కొందరు కావాలనే అలా చేశారు: గులాం నబీ ఆజాద్) అవమానంగా ఉంది.. అవార్డు వద్దు: సంధ్యా ముఖర్జీ నేపథ్య గాయని సంధ్యా ముఖర్జీ కూడా పద్మశ్రీ పురస్కారాన్ని నిరాకరించినట్లు పీటీఐ తెలిపింది. ఆలస్యంగా ఎంపిక చేసినందుకు ఆమె అవార్డును వద్దనుకున్నట్టు సమాచారం. ‘90 సంవత్సరాల వయస్సులో సుమారు ఎనిమిది దశాబ్దాల పాటు స్వర ప్రస్థానం సాగించిన సంధ్యా ముఖర్జీకి ఇంత ఆలస్యంగా పద్మశ్రీ పురస్కారం ప్రకటించడం ఆమెను కించపరచడమేన’ని ఆమె కుమార్తె సౌమీ సేన్‌గుప్తా అన్నారు. అవార్డును తిరస్కరించడం వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. ఆ దశను ఎప్పుడో దాటాను: అనింద్య ఛటర్జీ ప్రముఖ తబలా విద్వాంసుడు పండిట్ అనింద్య ఛటర్జీ కూడా పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించినట్టు వెల్లడించారు. అవార్డు కోసం తన సమ్మతిని కోరుతూ ఢిల్లీ నుండి తనకు ఫోన్ కాల్ వచ్చినప్పుడు ప్రతికూలంగా స్పందించినట్టు ‘పీటీఐ’కు తెలిపారు. ‘పద్మ పురస్కారాన్ని సున్నితంగా తిరస్కరించాను. నాకు అవార్డు ఇవ్వాలని అనుకున్నందుకు ధన్యవాదాలు చెప్పాను. నా కెరీర్లో ఈ దశలో పద్మశ్రీని అందుకోవడానికి సిద్ధంగా లేనని.. ఆ దశను ఎప్పుడో దాటాన’ని అన్నారు. కాగా, గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ‘పద్మ’ అవార్డులు ప్రకటించింది. నలుగురు పద్మవిభూషణ్, 17 మంది పద్మ భూషణ్, 107 మంది పద్మశ్రీకి ఎంపికయ్యారు. (చదవండి: బిపిన్, ఆజాద్‌లకు పద్మవిభూషణ్..) -
గులాం నబీ ఆజాద్‌కు పద్మ భూషణ్.. ‘ఆయన గులాంగా ఉండాలనుకోవడం లేదు’
న్యూఢిల్లీ: 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించింది. ఆ జాబితాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ చోటు దక్కించుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సహచరుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ మేరకు లోక్‌సభ ఎంపీ శశిథరూర్ మాత్రం అజాద్‌కు అభినందనలు తెలిపారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ మాత్రం బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య పద్మ అవార్డును తిరస్కరించారనే విషయాన్ని ప్రస్తావిస్తూ.. అతను అజాద్‌గా ఉండాలనుకుంటున్నాడు గులాం అవ్వాలను కోవట్లేదంటూ గులాం నబీ ఆజాద్‌పై పరోక్ష విమర్శలు గుప్పించారు. అంతేకాదు మాజీ బ్యూరోక్రాట్ పీఎన్ హస్కర్ పద్మ అవార్డును తిరస్కరించడం గురించి ఒక పుస్తకంలో వివరించిన భాగాన్ని కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ మేరకు 1973లో మన దేశంలోని అత్యంత శక్తివంతమైన ప్రభుత్వోద్యోగి హస్కర్ పీఎంఓ నుండి నిష్క్రమించినప్పుడు అతనికి పద్మవిభూషణ్‌ను అందజేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. దానిని ఆయన తిరస్కరించారు. హస్కర్ పుస్తకంలోని ఆ భాగం అత్యత్తుమమైనది, అనుకరణ అర్హమైనది అనే క్యాప్షన్ జోడించి మరీ జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. అయితే పద్మ అవార్డులను బహిరంగంగా తిరస్కరించడం చాలా అరుదు. ఎందుకంటే అవార్డు గ్రహీతలకు అవార్డు గురించి ముందుగానే తెలియజేయడమే కాక వారు అంగీకరించిన తర్వాత మాత్రమే జాబితాను ప్రకటిస్తారు. అయితే పద్మభూషణ్‌పై నిర్ణయాన్ని భట్టాచార్య భార్యకు తెలియజేసినట్లు హోం మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. కానీ, బుద్ధదేవ్ మాత్రం తనకు పద్మభూషణ్ గురించి ఏమి తెలియదని ఒకవేళ వారు పద్మభూషణ్ ఇచ్చినట్లయితే తిరస్కరిస్తున్నాను అని అన్నారు. In Jan 1973, the most powerful civil servant of our country was told he was being offered the Padma Vibhushan on his leaving the PMO. Here is PN Haksar's response to it. It is a classic, and worthy of emulation. pic.twitter.com/H1JVTvTyxe — Jairam Ramesh (@Jairam_Ramesh) January 25, 2022 (చదవండి: యువతను ఆకట్టుకునేలా హాలీవుడ్ సినిమా రేంజ్లో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్) -
ఆస్పత్రిలో చేరిన బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి
కోల్‌కతా: గత వారంలో కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టచార్జీ(77) మంగళవారం ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆక్సిజన్ స్థాయిల్ 90శాతం కంటే దిగువకు పడిపోయినట్లు అధికారులు తెలిపారు. బుద్ధదేవ్ ఇప్పటి వరకూ హోం ఐసోలేషన్‌లో బీపీఏపీ సపోర్టు మీద ఉన్నారన్నారు. బుద్ధదేవ్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి కారణంగా ఆయన తరచుగా ఆస్పత్రిని సందర్శించాల్సి ఉంటుంది. ఈ నెల 18న ఆయనకు కరోనా నిర్ధారణ అయింది. ఆయన భార్యకు కూడా కరోనా సోకింది. అయితే ఆమె కోలుకోవడంతో సోమవారం డిశ్చార్జ్ చేశారు. (చదవండి: బిడ్డకు ప్రాణం.. తల్లి మరణం..!) -
వెంటిలేటర్‌పై మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య
కోల్‌కతా: సీపీఎం సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య (76) అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో బుధవారం మధ్యాహ్నం ఆయనను కోల్‌కతాలోని ఉడ్‌ల్యాండ్ ఆస్పత్రికి తరలించారు. బుద్ధదేవ్‌కు కోవిడ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. కరోనా నెగెటివ్‌గా వచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని, వెంటిలేటర్‌పైనే చికిత్స కొనసాగుతోందని హెల్త్ బులిటెన్‌లో వైద్యులు వెల్లడించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో రక్తంలో ఆక్సిజన్, పీహెచ్ స్థాయిలు తగ్గి కార్బన్ డయాక్సైడ్ శాతం ఎక్కువయ్యిందన్నారు. న్యుమోనియా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని సీటీ స్కాన్‌లో తేలిందన్నారు. -
నిలకడగా మాజీ సీఎం ఆరోగ్యం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ మాజీ సీఎం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సీనియర్ నాయకుడు బుద్ధదేవ్ భట్టాచార్య ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. 2000 నుంచి 2011 మధ్య ముఖ్యమంత్రిగా పనిచేసిన భట్టాచార్జీ, తన భార్యతో కలిసి కోల్‌కతాలోని రెండు గదుల అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, లోబీపీ కారణంగా 75 ఏళ్ల బుద్ధదేవ్‌ను శుక్రవారం సాయంత్రం కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ కౌశిక్ బసు మాట్లాడుతూ.. బుద్ధదేవ్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఏడుగురు వైద్యుల బృందం నిత్యం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని చెప్పారు. -
'ముందు వాళ్లింట్లో బ్లాక్ మనీ వెతుక్కోవాలి'
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై సీపీఎం నిప్పులు చెరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయినప్పటి నుంచి తొలిసారి బహిరంగంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై మాజీ ముఖ్యమంత్రి, సీపీఏం సీనియర్ నేత బుద్ధదేవ్ భట్టాచార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లధనంపై మాట్లాడే నైతిక హక్కు అసలు టీఎంసీకి లేదని అన్నారు. ఆ పార్టీ మొత్తం సామాజిక వ్యతిరేక శక్తులతో నిండి ఉందని, వారిలో ఒకరే నేడు అరెస్టయ్యారని ఆయన టీఎంసీ నేత సుదీప్ అరెస్టుపై వ్యాఖ్యానించారు. 'టీఎంసీ టాప్ టూ బాటమ్ అవినీతే. మమతా ప్రభుత్వం నిండా సామాజిక వ్యతిరేక శక్తులే ఉన్నారు. వారిలో ఒకరు నేడు అరెస్టయ్యారు. అందుకే ఆ పార్టీకి నల్లధనం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. నల్లడబ్బు ఎక్కడో ఉందని చెప్పడం మానేసి ఆ పార్టీ నేతలు వాళ్లింట్లో ఉన్న నల్లడబ్బును వెతుక్కుంటే మంచిది. ఇద్దరు ఎంపీలను అరెస్టు చేసినంత మాత్రానా బెనర్జీ అంతగా అరవాల్సిన పనిలేదు. వారంతా కుంభకోణాల్లో ఉన్నవారని అందరికీ తెలుసు. సీబీఐ కూడా చిన్నవారిని వదిలేసి పెద్దవారిని అరెస్టు చేయాల్సింది' అంటూ పరోక్షంగా మమతనుద్దేశించి భట్టాచార్య వ్యాఖ్యానించారు. -
అమిత్ షాపై బుద్దదేవ్ విమర్శనాస్త్రాలు
కోల్‌కతా: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్య పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కారకుడైన వ్యక్తి ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారని అన్నారు. ఆయన నేతృత్వంలో ఆ పార్టీ ఉత్తరప్రదేశ్ లో అత్యధిక ఎంపీలు స్థానాలు గెల్చుకుందని చెప్పారు. అమిత్ షా పేరు ప్రస్తావించకుండా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని అన్నారు. మతతత్వ శక్తులకు కార్పొరేట్ సంస్థలు మద్దతు ఇస్తున్నాయని బుద్దదేవ్ అన్నారు. -
రాజకీయ లబ్ధి కోసమే ‘తెలంగాణ’: బుద్ధదేవ్ భట్టాచార్య
కోల్‌కతా: స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సానుకూలత ప్రకటించిందని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య సోమవారం ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు తాము తొలి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నామని అన్నారు. కోల్‌కతాలో జరిగిన ఒక ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ‘తెలంగాణపై కాంగ్రెస్ ఇవాళ పార్లమెంటులో సైతం తీవ్ర వ్యతిరేకత చవి చూసింది. దీనంతటికీ అంత అవసరమేమొచ్చిందన్నదే మా ప్రశ్న’ అని అన్నారు. తెలంగాణ కారణంగా డార్జిలింగ్ పర్వత ప్రాంతంలోనూ గూర్ఖాలాండ్ ఉద్యమం మళ్లీ భగ్గుమంటోందని, తెలంగాణ ఏర్పాటు నిర్ణయం అగ్నికి ఆజ్యం పోయడం లాంటిదేనని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం వచ్చాక భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సూత్రాన్నే పాటించామని, కాంగ్రెస్ అందుకు భిన్నంగా కొత్తగా రాష్ట్రాలను విభజిస్తోందని విమర్శించారు. పార్లమెంటులో ‘తెలంగాణ’ బిల్లు ప్రవేశపెట్టినట్లయితే తీవ్ర వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. దీనివల్ల దేశవ్యాప్తంగా విభజన ఉద్యమాలు జోరందుకుంటాయన్నారు. డార్జిలింగ్ ప్రస్తుత పరిస్థితికి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ సర్కారు బాధ్యత వహించాలన్నారు. కాగా, అవినీతిపరులకు, పెత్తందార్లకు తమ పార్టీలో ఎలాంటి చోటు లేదని బుద్ధదేవ్ అన్నారు.