ప్రముఖ రాజకీయ నేత, సీపీఐఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూసిన విషయం తెలిసిందే. 72 ఏళ్ల ఏచూరి ఢిల్లీలోని ఏయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. విద్యార్థి దశనుంచే వామపక్ష భావాలను అలవరచుకున్న ఆయన.. తుదిశ్వాస విడిచే వరకు ప్రజా పోరాటాల్లో బతికారు. తన జీవితాన్నే కాదు.. చివరకు తన దేహాన్ని సైతం ప్రజాసేవకే అంకితమిచ్చారు.
ఆయన బతికి ఉన్నప్పుడే తాను మరణిస్తే పార్థీవ దేహాన్ని వైద్య విద్యార్థుల బోధన, పరిశోధనల కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన పార్థీవదేహాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి కుటుంబ సభ్యులు దానం చేయనున్నారు. మృతదేహాన్ని శుక్రవారం ఆస్పత్రికి తరలించనున్నారు. దీంతో ఏచూరి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించటం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
కాగా కమ్యూనిస్టు నేతలు తమ పార్థివదేహాలను పరిశోధనల కోసం ఇవ్వడం ఇదే తొలిసారికాదు.. గత కొన్నేళ్లుగా వామపక్ష నాయకులు ఇదే సంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. ఆగస్టు 2024లో మరణించిన పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య (80) భౌతికకాయాన్ని కూడా వైద్య పరిశోధనల కోసం దానం చేశారు. కోల్‌కతాలోని నీల్ రతన్ సిర్కార్ ఆసుపత్రిలోని అనాటమీ విభాగానికి పార్థివ దేహాన్ని అప్పగించారు. ఇందుకు సంబంధించి మార్చి 2006లోనే బుద్ధదేవ్ ఓ స్వచ్ఛంద సంస్థకు హామీ ఇచ్చారు.
ఆయనతోపాటు పశ్చిమ బెంగాల్‌కు 34 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కమ్యూనిస్టు దిగ్గజ నేత జ్యోతిబసు కూడా 2010లో ఆయన మరణాంతరం శరీరాన్ని వైద్య సేవలకే అప్పగించారు.ఆయన పార్థివ దేహాన్ని కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రికి దానం చేశారు. ఇందుకు సంబంధించి 2006లోనే ఆయన హామీ ఇచ్చారు.
మాజీ లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ 2000 సంవత్సరంలో తన శరీరాన్ని దానం చేస్తానని ప్రమాణం చేశాడు. 2018లో అతని మరణం తర్వాత అతని కుటుంబ సభ్యులు శరీరాన్ని దానం చేశారు. సీపీఎం కార్యదర్శి అనిల్ బిశ్వాస్‌తోపాటు పార్టీ సీనియర్ నేత బెనోయ్ చౌధురీల భౌతికకాయాలూ ఆస్పత్రులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment