నివాళి
బుద్ధదేవ్ భట్టాచార్య (1944–2024)
బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం అగ్రనాయకుడు బుద్ధదేవ్ భట్టాచార్య మృతి ప్రగతిశీల రాజకీయాలు, ప్రజా స్వామిక విలువలు కోరుకునేవారందరికీ విచారం కలిగించింది. రాజకీయ విభేదా లకు అతీతంగా ఆయనకు నేతలు నివాళు లర్పించారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన నిబద్ధత, నిజాయితీ, నిరాడంబరత్వం, నిష్కపటత్వం వంటి విశిష్టతలను వారు గుర్తు చేసు కుంటున్నారు.
దేశంలో కీలకమైన బెంగాల్ వంటి పెద్ద రాష్ట్రానికి పదకొండేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా సాదాసీదా అపార్ట్‌మెంట్‌లోనే ఆఖరి దాకా జీవితం గడిపిన ఆదర్శం ఆయనది. కమ్యూ నిస్టు ఉద్యమం సృష్టించిన త్యాగధనులలో మూడవ తరానికి చెందిన బుద్ధదేవ్ ప్రెసిడెన్సీ కాలేజీలో సాహిత్యం చదువుకుని విద్యార్థి సంఘాల ద్వారా 1966లో వామపక్ష ఉద్యమంలో ప్రవే శించారు.
1977లో తొలి వామపక్ష ప్రభుత్వంలో సమాచార, సాంస్కృతిక మంత్రిగా చేరిన ఆయన 1982లో ఓడిపోయినా 1987లో మళ్లీ గెలిచి బాధ్యతలు చేపట్టారు. 1996లో జ్యోతిబాసు అనా రోగ్యం తర్వాత కీలకమైన హోంశాఖ బాధ్యతలు నిర్వహించారు. 23 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగి దేశంలోనే కొత్తరికార్డు నెలకొల్పిన మహానాయకుడు జ్యోతిబాసు తర్వాత వామపక్ష కూటమి భవిష్యత్తు ఏమవుతుందనే సవాళ్లకు సమర్థమైన సమాధానంగా బుద్ధదేవ్ నిలిచారు.
2000 నుంచి పదకొండేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1985 నుంచి కేంద్ర కమిటీ, తర్వాత పొలిట్‌బ్యూరో సభ్యుడుగా సీపీఎంలో ముఖ్యపాత్ర పోషించారు. యువమంత్రిగా, డివైఎఫ్‌ఐ నాయకుడుగా 1979లో ఆయన వరంగల్‌లో ఉమ్మడి రాష్ట్ర తొలి మహాసభలకు రావడం ఈ రచయితకు గుర్తుంది.
పాతికేళ్ల తర్వాత 2005లో అదే వరంగల్‌లో సీపీఎం మహాసభలలో బుద్ధదేవ్ చేసిన కీలక ప్రసంగంలో అప్పటికి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ మత తత్వ రాజకీయాలపై నిశిత విమర్శలు అనువదించాను కూడా! ‘‘గుజరాత్‌లో జరిగిన దారుణాలకు సాటి ముఖ్యమంత్రిగా నేను సిగ్గుపడుతున్నాను’’ అని అప్పుడాయన అన్నారు. మృదుభాషిగా పేరొందిన బుద్ధదేవ్ రాజకీయ విషయాల్లో అంత నిక్కచ్చిగా ఉండేవారు.
బుద్ధదేవ్ భట్టాచార్య హయాంలో తొలి రెండు ఎన్నికల్లోనూ ఫ్రంట్ విజయాలు కొత్త చరిత్ర సృష్టించాయి. 2006 ఎన్నికలలో వామపక్షాలకు 294కు 235 స్థానాలు వచ్చాయి. దానికన్నా ముందు 2004 లోక్‌సభ ఎన్నికలలోనూ 35 స్థానాలు వచ్చాయి.
పార్లమెంటులో మొత్తం 60 స్థానాలతో వామపక్షాలు, అందులో 42 సీట్లతో సీపీఎం పాత్ర, ప్రభావాలు శిఖరాగ్రానికి చేరాయి. ఆ మద్దతే లేకపోతే కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వమే ఉండేది కాదు. కాంగ్రెస్ ఆ రాజకీయ సందేశాన్ని సవ్యంగా అర్థం చేసుకుని ఉంటే... అణు ఒప్పందం చిచ్చు పెట్టకపోతే చరిత్ర మరోలా ఉండేది.
బుద్ధదేవ్ సైద్ధాంతికంగా కొత్తపుంతలు తొక్కుతున్నారనీ, దార్శనికతతో పిడివాదాన్ని వదిలేశారనీ ఒక వైపున లేనిపోని పొగడ్తలు... మరోవైపున భూములు లాక్కొంటున్నారనే ప్రచారా లకు బడా మీడియా వేదికైంది. సరళీకరణ విధానాలను, భూ దోపిడీని వ్యతిరేకించినవే వామపక్షాలు కాగా ఆ ముద్రతో వాటిపైనే దాడి చేయడం బూర్జువా వర్గాల వ్యూహమైంది. వామపక్ష ఫ్రంట్ టార్గెట్‌గా సింగూరు, నందిగ్రావ్‌ు ఘటనలపై అదేపనిగా ప్రచారాలు జరిగాయి.
సింగూర్‌లో టాటా కార్ల ఫ్యాక్టరీ దాదాపు పూర్తవుతుంటే దాన్ని అడ్డుకోవడానికి ఆ రోజుల్లో మమతా బెనర్జీ చేసిన హడావిడి మర్చిపోరానిది. కాంగ్రెస్, మమతా బెనర్జీ బుద్ధదేవ్ ప్రభుత్వాన్ని ఓడించడమే పరమార్థంగా వ్యవహరించాయి. మావోయిస్టు పార్టీ కూడా గొంతు కలిపింది. వాటిలో కొన్ని తప్పొప్పులు లేవని కాదు గాని ప్రజలకు ఉపాధి పెంచాలన్నదే బుద్ధదేవ్ సంకల్పంగా ఉండేది. ఆ పరిణామాలపై చాలా సమీక్షలే జరిగాయి.
అనేక అధికారిక నివేదికలు కూడా వచ్చాయి. ఇప్పుడు వాటిని సాకల్యంగా చూస్తే ఎవరికైనా పూర్తి నిజాలు తెలుస్తాయి. ‘‘టాటాలే బెంగాల్ నుంచి తరలిపోవడం వల్ల రాష్ట్రానికి చెప్ప లేని నష్టం జరిగింది. నేను ఎక్కడ తప్పు చేశానా అని కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది. భూ సేకరణే తప్పా లేక భూ సేకరణ జరిగిన విధానమా? నేను ప్రతిపక్షాలపై మరీ మెతగ్గా వ్యవహరించానా? ఆ అనుభవాల నుంచి మనం పాఠాలు తీసు కోవాలి’’ అని ఆయన చెప్పారు.
బుద్ధదేవ్, జ్యోతిబాసు వంటివారు భద్రలోక్ అనీ, మమతా దీదీ ప్రజల మనిషని ప్రచారం చేసిన వారే ఇప్పుడు ఆమె నిరంకుశ పోకడలపై విరుచుకుపడుతున్నారు. మోదీ ఏకపక్షపాలన ముదిరాక ఆమె కూడా అనేక రాజకీయ విన్యాసాలతో ఉనికి కాపాడుకుంటున్నారు. బుద్ధదేవ్ మాత్రం ‘మోదీ హఠావో, మమతా హఠావో’ నినాదంతోనే రాజకీయ జీవితం ముగించారు.
34 ఏళ్ల పాటు పాలించిన వామపక్ష ప్రభుత్వం 2011లో ఓడి పోయాక నిర్బంధాలు తట్టుకుని బుద్ధదేవ్ గట్టిగా నిలబడ్డారు. ఆరోగ్యం సహకరించినంతవరకూ సమావేశాలలో, సభలలో పాల్గొంటూ, ఉద్యమాన్ని నిలబ్టెడంలో తన పాత్ర నిర్వహిసూ వచ్చారు. 2011లో ఓడిపోయిన తన నియోజకవర్గమైన జాదవ్ పూర్‌లో 2017లో పెద్ద మెజార్టీతో సీపీఎం అభ్యర్థినే గెలిపించు కోగలిగారు.
ఆయన భార్య మీరా భట్టాచార్య, కుమారుడు సుచేతన్ కూడా ఆశయాల బాటలో తోడుగా నిలిచారు. ఎవరు ఎంత చెప్పినా పావ్‌ు అవెన్యూలోని తన నిరాడంబర ‘టు బెడ్ రూవ్‌ు ఫ్లాట్‘ నివాసాన్ని మార్చుకోవడానికి బుద్ధదేవ్ ఒప్పు కోలేదు. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ పాత అంబాసిడర్ కారునే ఆఖరు వరకూ ఆయన వాడారు.
2023లో మోదీ ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటిస్తే తీసుకోవడానికి నిరాకరించారు. ఆనారోగ్యంలో పరా మర్శించే పేరిట మమతా బెనర్జీ లేదా అప్పటి గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్ వంటివారు రాజకీయాలు చేయబోతే సాగనివ్వలేదు. ఇవన్నీ ఆయన వ్యక్తిత్వ ఒరవడికి అద్దం పడతాయి. ఆయన మరణానంతరం అధికారిక గన్ సెల్యూట్‌ను కూడా కుటుంబ సభ్యులు నిరాకరించారు.
కళా, సాహిత్య రంగాల్లో బుద్ధదేవ్ భట్టాచార్య కృషిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన రచయిత, కవి, నాటకకర్త కూడా! ఇన్ని రాజకీయాల సిద్ధాంత ఘర్షణల మధ్యనా టాగోర్ కవితలను 500 దాకా కంఠోపాఠంగా చెప్పేవారట! సంక్లిష్టమైన ఆధునిక రచయితలు కాఫ్కా, మార్క్వెజ్ వంటి వారి రచనలను ఆయన బెంగాలీలోకి అనువదించారు.
సమాంతర చిత్రాలకు పేరెన్నికగన్న కొల్‌కతాలో నందన్ కానన్ కళాభవన్ పేరిట ఒక శాశ్వత వేదికను ఏర్పాటు చేయడానికి మంత్రిగా చొరవ తీసుకున్నారు. ప్రసిద్ధ బెంగాలీ రచయిత సుకాంత భట్టాచార్య ఆయన బాబాయి. తన ఆత్మకథను రెండు భాగాలుగా వెలువరించారు బుద్ధదేవ్.
‘ఫిర్‌దేఖా’, ‘ఫిర్‌దేఖా 2’ అనే ఆ రెండు సంపుటాల్లో జీవితాన్ని రాజకీయ పాలనానుభవాలను నెమరు వేసుకున్నారు. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా బెంగాలీలు ఆయనను ఎంత ప్రేమించారు, దేశం ఎంత గౌరవించింది అనడానికి అంతిమఘట్టంలో ప్రదర్శితమైన గౌరవాభిమా నాలే నిదర్శనం.
తెలకపల్లి రవి
వ్యాసకర్త సీనియర్ సంపాదకులు, విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment