కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తిన విభేదాలు, రిటైర్మెంట్‌కు దగ్గరైన పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శిని ఇరకాటంలో పడేయటం మన దేశ పాలనా తీరును పట్టి చూపిస్తోంది. ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య రాజకీయ పెనుగులాటలో బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ్ పావులాగా మారారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారుల డెప్యుటేషన్‌లో పాటించాల్సిన విధానాలు ఆయన విషయంలో అమలు కాలేదు. మోదీ హయాంలో ఉన్నతోద్యోగుల స్థాయి దిగజారిపోయిందన్న భావన పెరుగుతోంది. బ్యూరోక్రసీ నియామకం ప్రక్రియలో చేపట్టే స్పల్ప మార్పులు సైతం దేశానికి ఉత్తమంగా సేవలందించడానికి సివిల్ సర్వీసును పూర్తిగా మార్చివేయడంలో దోహదపడతాయి.
పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన ఆలాపన్ బందోపాధ్యాయ్‌ని అంతకుముందు కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా బదిలీ చేయడం ద్వారా తలెత్తిన వివాదం కారణంగా దేశ ఉన్నతాధికార వర్గం రాజకీయాల ముందు మరోసారి తలవంచినట్లయింది. అలాపన్ మే 31న రాజీనామా చేయాల్సి ఉంది. కానీ ఆయన పదవీకాలాన్ని మరో మూడు నెలలపాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేసింది. గత వారం బెంగాల్‌లో తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టంపై సర్వేలో భాగంగా ప్రధాని బెంగాల్‌ని సందర్శించడానికి కొద్ది రోజుల ముందు ఈ నిర్ణయం జరిగింది. కానీ మే 31న ఆలాపన్ బందోపాధ్యాయను వెంటనే ఢిల్లీకి వచ్చి రిపోర్ట్ చేయాలంటూ సివిల్ సర్వీసుల వ్యవహారాలను చూసే సిబ్బంది, శిక్షణా విభాగం ఉన్నట్లుండి తాఖీదు పంపింది కానీ ఈ ముందస్తు, ఆకస్మిక ఆదేశానికి కారణం కూడా చెప్పలేకపోయింది.
ఒక రాష్ట్రంలో పనిచేస్తున్న సివిల్ సర్వీస్ అధికారిని కేంద్రానికి బదిలీ చేసే ప్రక్రియను పర్సనల్, ట్రెయినింగ్ విభాగం పాటించలేదు. ఏ అధికారినైనా రాష్ట్రం నుంచి కేంద్రానికి డెప్యుటేషన్‌పై తీసుకోవాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లాంఛనప్రాయంగా అభ్యర్థన పంపాలి. కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్రం తోసిపుచ్చవచ్చు కూడా. ఆ తర్వాత మాత్రమే తన అభ్యర్థనను అమలు చేసి తీరాలని కేంద్రం తన అధికారాన్ని ప్రయోగించే వీలుంది. అయితే ఎంతో సీనియర్ అయి ఉండి కూడా ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య రాజకీయ పెనుగులాటలో ఆలాపన్ బందోపాధ్యాయ్ పావులాగా మారిపోవడం గమనార్హం. ప్రధాని మోదీ హయాంలో ప్రభుత్వ ఉన్నతోద్యోగి పాత్ర, ప్రతి పత్తి పూర్తిగా దిగజారిపోయాయన్న భావన పెరుగుతోంది. గత కొన్నే ళ్లుగా రాష్ట్ర కేడర్‌లోని ప్రభుత్వ ఉన్నతోద్యోగులు కేంద్ర ప్రభుత్వంలో పదోన్నతిని కోరుకోకుండా తమ తమ రాష్ట్ర స్థాయిలో సర్వీసును పూర్తి చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన ప్రారంభ సంవత్సరాల్లో కేంద్రంలో పనిచేయడం గొప్ప అవకాశంగా సివిల్ సర్వీసు అధికారులు భావించేవారు. కానీ, ప్రస్తుతం కేంద్రంలో పనిచేయాలంటేనే ఉన్నతాధికారులు జడుసుకుంటున్నారు.
భారత గణతంత్ర ప్రజాస్వామ్యం ప్రారంభ దినాలనుంచే దేశంలో సివిల్ సర్వీసు పాత్ర వివాదాస్పదంగా ఉంటూ వచ్చింది. 1969లో ఇందిరాగాంధీ నిబద్ధత కలిగిన సివిల్ సర్వీసు కావాలంటూ పిలుపిచ్చారు. కానీ భారత రాజ్యాంగం, సర్వీసు నిబంధనలు మాత్రం ప్రతిభ ప్రాతిపదికన పనిచేసే సివిల్ సర్వీసు కావాలని పేర్కొన్నాయి. దీనికోసం జాతీయ స్థాయి పోటీ పరీక్షల ద్వారా ఉన్నతోద్యోగులను నియమించాలని, సంబంధిత విభాగంలో వృత్తిపరమైన శిక్షణను అందిస్తూ వారి పనితీరును అంచనా వేసే ప్రక్రియను కచ్చితంగా పాటించాల్సి ఉందని నిబంధనలు సూచించాయి. ఉద్యోగి పనితీరు మదింపు ప్రక్రియలో రాజకీయ ప్రభువులకు ఏ పాత్రా ఉండేది కాదు. 2016లో అఖిల భారత సర్వీసుల్లో తీసుకొచ్చిన కొత్త మదింపు ప్రక్రియలోనూ రాజకీయ పాత్రకు చోటివ్వలేదు. అంటే ఒక ఉన్నతాధికారి నాణ్యతను మదింపు చేసే అధికారం మంత్రికి కూడా ఉండదన్నమాట.
రాజ్యాంగ విలువలను ఎత్తిపెట్టడమే తమ లక్ష్యమైనందున అఖిల భారత సర్వీసు, ఇతర కేంద్ర సర్వీసుల్లో పనిచేసేవారికి రాజ్యాంగపరమైన రక్షణ ఉండేది. అయితే ఈ రాజ్యాంగ రక్షణ సైతం ఉన్నతాధికారుల పనితీరులో రాజకీయ జోక్యాన్ని నివారించేది కాదు. రాజకీయ నాయకులతో అధికారవర్గం కుమ్మక్కు కావడం ఉండేది కానీ దీనికి చాలా మినహాయింపులు మాత్రమే ఉండేవి. కానీ క్రమేణా రాజకీయ ప్రభువులు ఉన్నతాధికారుల నియామకం, బదిలీపై అధికారాన్ని పెంచుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఉన్నతాధికార వర్గం రాజకీయ పార్టీల ఇచ్ఛకు, అధికారంలో ఉన్న నాయకుల సంకల్పానికి లోబడుతూ వచ్చేవారు.
ఉన్నతాధికారుల్లో వృత్తిగత నైపుణ్యాలు, అనుభవం కంటే వారి విశ్వాçÜం, భావజాల పరమైన సారూప్యతలే విలువైనవిగా రాజకీయ నేతలు భావించడం కొనసాగేకొద్దీ బ్యూరోక్రసీలో రాజకీయాలు చోటుచేసుకోవడం పెరుగుతూ వచ్చింది. విజ్ఞానం, అనుభవం ప్రాతిపదికన ఉత్తమమైన సలహాలను అందించే ధోరణి తగ్గిపోయి రాజకీయ ప్రాధాన్యతలకు విలువ ఇచ్చేదిగా ప్రభుత్వంలోని ఉన్నతోద్యోగుల పాత్ర కుదించుకుపోయిందని నేను గతంలోనే సూచించాను. ఈ దురదృష్టకరమైన పక్షపాతం, ముందస్తు ఇష్టాల కారణంగానే కోవిడ్–19 మహమ్మారి సెకండ్ వేవ్‌తో సరిగా వ్యవహరించడంలో మన పాలనాయంత్రాంగంలో లొసుగులు చోటుచేసుకున్నాయని స్పష్టంగా తెలుస్తోంది.
మన ఉన్నతాధికారవర్గ పనితీరుపై రాజకీయ నాయకుల్లో కానీ సాధారణ ప్రజానీకంలోకానీ అసంతృప్తి పెరుగుతున్నప్పటికీ ఆధునిక రాజ్యంలో పరిపాలనా యంత్రాంగం పాత్ర అనివార్యమైందని అందరూ ఆమోదించాలి. ఈ నేపథ్యంలో ప్రతిభ, బాధ్యత, సమర్థత ప్రాతిపదికన సివిల్ సర్వీసును మెరుగుపర్చడానికి మనముందున్న మార్గాలేవీ అని ప్రశ్నించుకోవాలి.
ఒకటి. ఉన్నతాధికారుల నియామకం వయోపరిమితిని 21–24 సంవత్సరాల వయస్సుకే కుదించాలి. ఈ వయసులో ఉన్న వారు పరీ క్షలు రాసి ఉత్తీర్ణులయ్యేందుకు పలు ప్రయత్నాలు కల్పించాలి. ఇప్పుడు జనరల్ కేటగిరీలో 32 సంవత్సరాలు, రిజర్వుడ్ కేటగిరీలో 35 సంవత్సరాల వరకు గరిష్టంగా వయో పరిమితిని పెంచారు. ప్రభుత్వోద్యోగికి తగిన శిక్షణ ఇచ్చి, ప్రస్తుత కాలానికి తగిన పాలన అవసరాలకు అనుగుణంగా వారి నైపుణ్యాలను, వైఖరులను తీర్చిదిద్దాలంటే యుక్తవయసులోనే నియమించుకోవడానికి చాలా ప్రాధాన్యత ఉంది.
రెండు. ప్రభుత్వోద్యోగులు పదవీ విరమణ చేశాక, ప్రభుత్వ విచక్షణతో కూడిన నిర్ణయాలు, రాజకీయ జోక్యం ద్వారా వారికి కొత్త బాధ్యతలు ఇచ్చే పరిస్థితిని తొలగించాలి. ఉదాహరణకు కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో రిటైరైన వారిని చట్టబద్ధమైన కమిషన్లు, రెగ్యులేటరీ అధికారులు లేక తత్సమానమైన విభాగాలు మాత్రమే నియమించే స్థితి రావాలి. అర్హులైన వారి అప్లికేషన్లను స్వాగతించడం, బహిరంగ నియామకం ప్రక్రియ వంటి దశలను ప్రభుత్వేతర విభాగాల్లోని నిపుణుల విభాగం మాత్రమే చేపట్టాలి. అత్యంత సమర్థత, నిపుణతతో ఇతరులతో పోటీ పడగలిగే స్థాయి ఉన్న రిటైరైన ప్రభుత్వోద్యోగులను ఈ నియామకాల నుంచి మినహాయించాల్సిన పనిలేదు. ఇది జరిగినప్పుడు ప్రభుత్వ రాజకీయ ప్రాధాన్యతలకు లొంగకుండా ఉన్నతాధికార వర్గం ప్రజాప్రయోజనమే ప్రాతిపదికగా తన సేవలను అందించగలదు. మూడు. పని తీరుకు సంబంధించిన రివార్డులు, దండనల వ్యవస్థను మార్చాల్సి ఉంది. ఎంత చిన్న స్థాయిలోనైనా సరే కమీషన్లకు అలవాటు పడిన వారిపై మాత్రమే చర్యలు తీసుకునేలా ప్రస్తుత వ్యవస్థ ఉంది. కానీ ఉద్యోగుల కర్తవ్య ఉపేక్ష అనేది ప్రభుత్వ ఖజానాకు గణనీయంగా నష్టం కలిగిస్తుంది. ప్రజా సంక్షేమాన్ని దెబ్బతీస్తుంది. కానీ ఇలాంటి చర్యలకు పాల్పడేవారు ఇప్పుడు దండనల నుంచి దాదాపుగా తప్పించుకుంటున్నారు.
ఎంతో నమ్మకంతో నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ నిర్ణయం వల్ల తప్పిదాలు జరిగిన సందర్భంలో అలాంటి వారిపై ప్రస్తుత నిబంధనలు చర్యలు తీసుకోవడం లేదు. ఎవరూ తప్పులనుంచి బయటపడకూడదు. శిక్షణా ప్రక్రియ కాలంలోనే ఉద్యోగులు దీన్ని గుర్తించి, అంగీకరించాల్సి ఉంది. తేలికపాటి సంస్కరణల ద్వారానే పాలనలో మార్పులు చేసుకోవచ్చు. కానీ దేశానికి ఉత్తమంగా సేవలందించడానికి సివిల్ సర్వీసును పూర్తిగా మార్చివేయడంలో ఇవి తప్పకుండా దోహదపడతాయి. మన వద్ద ఉన్న అపరిమిత ప్రతిభా సంపన్నులు, అనుభవజ్ఞులను ఉత్తమంగా ఉపయోగించుకోవడం ఎంతో అవసరం.
వ్యాసకర్త: శ్యామ్ శరణ్
మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శి
(ట్రిబ్యూన్ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment