Sakshi Guest Column Special Story On India China Relationship, Know In Details - Sakshi
Sakshi News home page

భారత – చైనా బంధం బలపడేనా?

Published Wed, Jul 26 2023 3:48 AM | Last Updated on Wed, Jul 26 2023 10:07 AM

Sakshi Guest Column On India China relationship

సరిహద్దు సమస్యను పూర్తి స్థాయి సంబంధాలలో ఒక అంశంగా మాత్రమే ఉంచాలనీ, అది సంబంధాల మొత్తం స్వభావాన్ని నిర్వచించకూడదనీ చైనీయులు పట్టుబట్టడం కొనసాగిస్తున్నారు. సరిహద్దులో పరిస్థితి ‘అసాధారణం’గా ఉందనీ, ఇది ద్వైపాక్షిక సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నదనే భారత వైఖరిని ఇది పరోక్షంగా తిరస్కరించడమే! అయితే గల్వాన్‌ ఘర్షణలు చైనా ప్రణాళికాబద్ధంగా జరిపినవన్న భారత్‌ అభిప్రాయం తప్పు అనీ, అది కేవలం ‘అనుకోని ఘటన’ అనీ పీఎల్‌ఏ అధికారి చెప్పిందే నిజమైతే, మరి యథాతథ స్థితిని ఎందుకు పునరుద్ధరించకూడదు? అయితే ఎల్‌ఏసీ అమరిక గురించి భారత్‌కు కచ్చితమైన ఆలోచన ఉంది. ఎల్‌ఏసీ గురించి సందేహం ఉందని మనం పరోక్షంగా కూడా సూచించకూడదు. 

వార్షిక వరల్డ్‌ పీస్‌ ఫోరమ్‌లో పాల్గొనడానికి నేను ఈ నెల ప్రారంభంలో బీజింగ్‌లో ఉన్నాను. ఆ సమావేశంలోనే అదనంగా భారత్‌–చైనా సరిహద్దు సమస్యపై ఒక ఆంతరంగిక చర్చ జరిగింది. దీనికి పలువురు చైనా విద్వాంసులు హాజరయ్యారు. ప్రస్తుత, మాజీ చైనా అధికారులు కొందరితో సంభాషణకు కూడా వీలు కలిగింది. ఇవి భారత్‌–చైనా సంబంధాలకు సంబంధించిన అవకాశాల గురించి చైనా అవగాహన విష యంలో ఒక కొత్త గవాక్షాన్ని అందించాయి.

సరిహద్దు సమస్యను పూర్తి స్థాయి సంబంధాలలో ఒక అంశంగా మాత్రమే ఉంచాలనీ, అది సంబంధాల మొత్తం స్వభావాన్ని నిర్వచించకూడదనీ చైనీయులు పట్టుబట్టడం కొనసాగిస్తున్నారు. సరిహద్దులో పరిస్థితి ‘అసాధారణం’గా ఉందనీ, ఇది ద్వైపాక్షిక సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నదనే భారత వైఖరిని ఇది పరోక్షంగా తిరస్కరించడమే.

చైనీయుల ప్రకారం, సరిహద్దు పరిస్థితి ‘స్థిరీకరించబడింది’. ఘర్షణకు సంబంధించిన కొన్ని అంశాలను పరిష్కరించడంలో పురోగతి సాధించామనీ, అయితే మరికొన్ని మిగిలి ఉన్నా యనీ భారతదేశం గుర్తిస్తోంది. 2020 జూన్‌లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణలకు ముందు ఉన్న యథాతథ స్థితికి తిరిగి రావడానికి చైనా సుముఖంగా ఉన్నట్లు ఎవరూ భావించడం లేదు.

భారత–చైనా సరిహద్దు ప్రశ్న (2005) పరిష్కారానికిగానూ రాజకీయ పారామితులు, మార్గదర్శక సూత్రంతో సహా – వాస్తవాధీన రేఖను (ఎల్‌ఏసీ) స్పష్టం చేయడం కోసం ఉమ్మడి కసరత్తును చేపట్టేందుకు – అనేక శాంతి భద్రతల ఒప్పందాలను ఇరుపక్షాలు అంగీకరించినప్పటికీ, చైనీయులు అలా చేయడానికి నిరాకరించారు.

భూభా గాన్ని ‘కొద్దికొద్దిగా కొరుక్కు తింటూ’ చైనాను భారతదేశం దూరంగా నెడుతోందని ఒక ఆరోపణ వచ్చినప్పుడు, భారత్‌ చేపట్టడానికి సిద్ధంగా ఉన్న ఎల్‌ఏసీ స్పష్టీకరణ ద్వారా అటువంటి కబళింపును కచ్చి తంగా నిరోధించవచ్చని ఎత్తి చూపడం ద్వారా ఒకరు దీనిని ప్రతిఘటించారు. దీనికి సమాధానం ఏమిటంటే, 2004లో జరిగిన సమా వేశంలో ఈ కసరత్తు ప్రారంభమైనప్పుడు, చైనా ప్రాదేశిక క్లెయిమ్‌లను బలహీనపర్చగల ‘అతిశయోక్తి’ క్లెయిమ్‌లను భారతదేశం పశ్చిమ సెక్టార్‌లో ముందుకు తెచ్చింది.

ఎల్‌ఏసీని సరిగా స్పష్టం చేయకపోవడం వల్ల భారత్‌ అధీనంలో ఉన్న భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి సందిగ్ధతలను ప్రదర్శించగల వీలు చైనాకు కలుగుతుంది. అయితే ఎల్‌ఏసీ అమరిక గురించి భారత్‌కు కచ్చితమైన ఆలోచన ఉంది. కొన్ని అంశాల్లో ఎల్‌ఏసీకి సంబంధించి ‘భిన్నమైన అవగాహనలు’ ఉన్నాయని మనం చెప్పు కోకూడదు. భారత్‌ పేర్కొన్నట్లుగా ఎల్‌ఏసీపై పోటీ పడటంలో చైనా పక్షానికి కొంత సమర్థన ఉందని ఇది పరోక్షంగా అంగీకరిస్తుంది. ఎల్‌ఏసీ అమరికలో మనం పరిగణించే వాటిపై చైనీస్‌ పక్షాన్ని పోటీ పడనివ్వండి.

ఎల్‌ఏసీ ఎక్కడ ఉందనే దాని గురించి మనకు సందేహం ఉందని మనం పరోక్షంగా కూడా సూచించకూడదు. మొత్తంమీద, సరిహద్దు వద్ద ప్రతిష్టంభన కొనసాగే అవకాశం ఉంది. అయితే రెండు వైపులా భారీ సైన్యాన్ని మోహరించే అవకాశం లేదు. ఎల్‌ఏసీ వైపు చైనా నిర్మించిన తాజా శాశ్వత, పాక్షిక–శాశ్వత నిర్మాణాలను కూల్చి వేయడం, తొలగించడం కూడా అసంభవం. భారత్‌ అలవర్చుకోవా ల్సిన మెరుగైన సామర్థ్యానికి ఇవి సూచికలా పనిచేస్తాయి.

భవిష్యత్‌లో ఏం జరగవచ్చో సూచించే రెండు ఘటనలు కూడా ఉన్నాయి. సరిహద్దు సమస్యపై తరచూ వ్యాఖ్యానించే చైనా మాజీ పీఎల్‌ఏ అధికారి ఒకరు, గల్వాన్‌ ఘర్షణలు చైనా బలగాలు ముంద స్తుగా, ప్రణాళికాబద్ధంగా జరిపిన ఆపరేషన్‌ అని భారత్‌ భావిస్తున్న అభిప్రాయం తప్పు అనీ, అది కేవలం ‘అనుకోని ఘటన’ అనీ నాతో అన్నారు. నేను ఇంతకు ముందు ఇది వినలేదు. పీఎల్‌ఏ అధికారి చెప్పిందే నిజమైతే, మరి యథాతథ స్థితిని ఎందుకు పునరుద్ధరించకూడదు?

ప్రస్తుతం చైనీస్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ కమిషన్‌ ఫర్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ ఆఫీస్‌ డైరెక్టర్‌గా ఉన్న వాంగ్‌ యీ(జూలై 25నే తిరిగి విదేశాంగ మంత్రి అయ్యారు) ఇటీవల జకార్తాలో భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌తో జరిపిన భేటీలో, ‘నిర్దిష్ట సమస్యలు మొత్తం సంబంధాన్ని నిర్వచించనివ్వకుండా, సరిహద్దు సమస్యకు ఇరు పక్షాలు పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలి’ అన్నారు. ఇది చైనా వైఖరికి పునఃప్రకటన. అయితే, ‘భారత పక్షం చైనాతో సంబంధాలు మెరుగుపర్చుకునేలా, సరిహద్దు సమస్యకు ఇరుపక్షాలకు ఆమోద యోగ్యమైన పరిష్కారాన్ని కనుగొంటుందని ఆశిస్తున్నట్లు’ ఆయన కొనసాగించారు.

ఆ ప్రాంతం చైనా సార్వభౌమ భూభాగమనీ, దానిని కాపాడు కుంటామనీ చైనా ప్రకటనలు పేర్కొంటున్నాయి కాబట్టి గల్వాన్‌ సంఘటన నేపథ్యంలో, ఇది సాపేక్షంగా సామరస్యపూర్వకమైన భాషగా కనిపిస్తోంది. దీంతో సంబంధాలు ‘మెరుగుపర్చుకునే’ అవ కాశం లేకుండా పోయింది. మారిన భాషను మనం అతిగా వ్యాఖ్యా నిస్తున్నామేమో! కాలమే దీన్ని తేల్చి చెబుతుంది.

ప్రధాని మోదీ వాషింగ్టన్‌ లో ఉన్నత స్థాయి అధికారిక పర్యటన విజయవంతంగా ముగించిన తర్వాత వెంటనే బీజింగ్‌లో నా సంభాషణలు జరిగాయి. భారత్‌–అమెరికా సంబంధాల్లో పురోగతిపై చైనా ఆందోళన స్పష్టంగా కనిపించింది. చైనాను నిలువరించే అమెరికా వ్యూహంలో భారత్‌ భాగమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆసియాలో ‘నాటో’ పాత్రకు భారతదేశం మద్దతు ఇస్తుందా అనేది నాకు వారు సంధించిన ఒక ప్రశ్న.

నా అభిప్రాయం ప్రకారం, నాటో అనేది యూరోపియన్‌ భద్రతకు సంబంధించినదనీ, ఆసియాన్‌ నేతృత్వంలోని యంత్రాంగాలతో సహా ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడుకోవడానికి ఆసియా అనేక యంత్రాంగాలను కలిగి ఉందనీ నేను చెప్పాను. గ్లోబల్‌ సౌత్‌ నుండి చైనాను మినహాయించాలని భారతదేశం ప్రయత్నిస్తున్నదా అనే ఆందోళన కూడా వారిలో ఉంది.

తాము గ్లోబల్‌ సౌత్‌లో భాగమా,  కాదా అనేది నిర్ణయించుకోవాల్సింది చైనాయేనని నేను చెప్పాను. త్వరలో జరగనున్న జీ20 సదస్సు సన్నాహాల్లో భాగంగా, గ్లోబల్‌ సౌత్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు మోదీ చొరవ తీసుకోవడం చైనాను ఆశ్చర్యానికి గురిచేసింది. 

ఆర్థికపరమైన చిక్కులను కలిగించవచ్చు కాబట్టి, చైనాకు ‘అభివృద్ధి చెందుతున్న దేశం’ హోదాను నిరాకరించే అమెరికా ప్రయత్నాల గురించి వారు ప్రస్తావించారు. 

చైనా చేసిన మరొక ఫిర్యాదు ఏమిటంటే, ‘షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌’ (ఎస్సీఓ) సమావేశాన్ని భారత్‌ వ్యక్తిగత స్థాయిలో కాకుండా, క్లుప్తంగా ఆన్‌ లైన్‌ సదస్సును నిర్వహించడం ద్వారా దాని ‘స్థాయిని తగ్గించింది’ అని. ఇది అమెరికా ప్రభావంతో జరిగిందనే అనుమానం చైనాకు ఉంది.

మొత్తంమీద, చైనా తన గురించి తాను అస్పష్టంగానే ఉందనే భావన కలుగుతుంది. అదే సమయంలో భారత్‌ తన ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడంలో ప్రావీణ్యతనూ, చురుకుదనాన్నీ ప్రదర్శించిందనే అభిప్రాయం ఉంది. పెట్టుబడి, సాంకేతికత ప్రవాహానికి భారతదేశం కొత్త గమ్యస్థానంగా మారినట్లు కనిపిస్తున్న నేపథ్యంలో, ఇది చైనా ఆర్థిక అవకాశాల గురించి గుర్తించిన ఒక నిర్దిష్ట నిరాశా వాదానికి సంబంధించినది కావచ్చు. ఇది భారతదేశం పట్ల చైనా వైఖరిలో మార్పును సూచిస్తుందా? ఇకపై సంఘటనలు ఎలా వెల్లడవుతాయో చూద్దాం.
శ్యామ్‌ శరణ్‌ 
వ్యాసకర్త విదేశాంగ మాజీ కార్యదర్శి,ఆనరరీ ఫెలో, సీపీఆర్‌
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement