పాత ‘కలకత్తా’ మిగిలే ఉంది! | Sakshi Guest Column On Old Kolkata | Sakshi
Sakshi News home page

పాత ‘కలకత్తా’ మిగిలే ఉంది!

Published Mon, Sep 9 2024 12:30 AM | Last Updated on Mon, Sep 9 2024 12:30 AM

Sakshi Guest Column On Old Kolkata

కామెంట్‌

బెంగాలీ రాజధానిలో బ్రిటన్‌ రాచరికపు విశేషంగా కొన్ని చక్కటి అంశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ‘కలకత్తా’ నగరం నడిబొడ్డున, ఒకప్పుడు పార్క్‌ స్ట్రీట్‌గా వాడుకలో ఉన్న ప్రదేశానికి కొద్ది దూరాన... బ్రిటిష్‌ హయాంను గుర్తు చేసేలా ‘ద గ్లెన్‌బర్న్‌’ అనే ఒక ఆహ్లాదకరమైన చిన్న భోజనశాల ఉంది. బ్రిటన్‌ మారిపోయింది కానీ, కలకత్తాలోని ఈ ప్రదేశం ధిక్కారంగా నేటికీ అలానే ఉండిపోయింది. ఇటీవల ఆర్జీ కర్‌ ఆసుపత్రిలో జరిగిన విషాదం,ఆ వెంబడి సామూహిక నిరసనలు, ముఖ్యమంత్రి అనిశ్చిత భవిష్యత్తు... వీటన్నిటిపై చర్చలు, వాదనలు ఇక్కడ కూడా జరగకుండా లేవు. కానీ ఇక్కడి నుండి చూస్తే అవి వేరే ప్రపంచానికి చెందిన అంశాలుగా అనిపిస్తాయి.

తొలి పరిచయంలోనే ఏర్పరచుకునే అభి ప్రాయాలు తప్పుదారి పట్టించేవిగా ఉండ వచ్చునని నేను అంగీకరిస్తాను. కానీ అవి చెరగని ముద్రలుగా కూడా నిలిచిపోగలవు. గత వారాంతపు నా ‘కలకత్తా’ పర్యటన విషయంలో ఇది నిశ్చయంగా వాస్తవం. నాకు ఆ నగరం గురించి ఏమంత తెలి యదు. కనీసం ఐదేళ్లుగా నేను ఆ నగరాన్ని సందర్శించిందే లేదు. అయితే, ఆ బెంగాలీ రాజధానిలో రాచరికపు విశేషంగా కొన్ని చక్కటి అంశాలు ఇంకా మిగిలే ఉన్నాయన్న ఒక కాదనలేని భావనకు నేను లోనయ్యాను. నేనక్కడ కలిసిన స్థానికులు కూడా ఇందుకు భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని అనుకోను. అందువల్లనే నేను ఆ నగరానికి ఉన్న ‘కలకత్తా’ అనే వలసరాజ్య నామాన్ని ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఉపయోగిస్తున్నాను. 

నగరం నడిబొడ్డున, ఒకప్పుడు పార్క్‌ స్ట్రీట్‌గా వాడుకలో ఉన్న ప్రదేశానికి కొద్ది దూరాన, అనాకమైనదిగా తప్ప మీరు గుర్తించని ఒక భవంతి... బ్రిటిష్‌ హయాంను గుర్తు చేసేలా ‘ద గ్లెన్‌బర్న్‌’ అనే ఒక ఆహ్లాదకరమైన చిన్న భోజనశాలను తనలో పొదవుకుని ఉంటుంది. ఒకసారి మీరు ఆ అసహ్యకరమైన పరిసరాలను, జీర్ణావస్థలో ఉన్న ప్రవేశ ద్వారాన్ని దాటుకుని లోపలికి వెళ్లారా... 7, 8 అంతస్థులలోని గతకాలపు విస్మృత ప్రపంచంలోకి అడుగు పెడతారు. 

గ్లెన్‌బర్న్‌లోని తొమ్మిది గదులలో రేఖాగణితం నమూనాలో డిజైన్‌ చేసిన చెక్క పలకల ఫ్లోరింగ్, షాండ్లియర్లు, కలపను మలిచి తీర్చిన సోఫాలు, వార్నిష్‌ పట్టిన ఒంపుకాళ్ల బల్లలు, వర్ణాలంకరణలను అచ్చు గుద్దిన పత్తి వస్త్రాల పరుపులు, ఇత్తడితో పటం కట్టిన పురాతన పూల కళాకృతులు ఉన్నాయి. అక్కడి విశాలమైన స్నానపు గదులు పాతకాలపు నాటి ఆధునిక శైలిలో రూపొందిన గాజు లోహపు తొట్టెలను కలిగి ఉన్నాయి. వాటిల్లో మీరు మునిగిపోవచ్చు. దేహాన్ని సాధ్యమైనంతగా సాగదీసుకోనూవచ్చు.   

సూర్యోదయపు తొలి కిరణాలు తొంగి చూసే అక్కడి ఒక గదిలో నేను మూడు రోజుల పాతదైన లండన్‌ టైమ్స్‌ దిన పత్రికను చదు వుతూ అల్పాహారం తీసుకున్నాను. అది మన ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ సమకాలీన సంచిక కన్నా మరింత సందర్భోచితంగా ఉన్నట్లు అనిపించింది. ‘లండన్‌ టైమ్స్‌’లోని కోర్ట్‌ సర్క్యులర్‌ శీర్షికలో ఆనాటి రాచ కార్యాల వివరాలు ప్రచురించి ఉన్నాయి. 

రాజు గారు బల్మోరల్‌ విహారంలో ఉన్నారు, బహుశా గ్రౌస్‌ పక్షుల్ని వేటాడటం కోసం. పేపర్‌ నుంచి తలెత్తి చూసినప్పుడు బయట విక్టోరియా మెమోరియల్‌ నా వైపు తదేకంగా చూస్తూ ఉండటాన్ని గమనించాను. (దాని నిర్మాణ స్ఫూర్తి సారథి) లార్డ్‌ కర్జన్‌ తన ప్రాతఃకాల కాఫీ సేవిస్తూ, ఇంతకంటే మెరుగైన దృశ్యాన్ని ఆశించివుండరు!

ఇంకో వైపు నుంచి కలకత్తా మైదానం కనిపిస్తోంది. గత ఆదివారం అది హరితపత్రంలా, ఆహ్వానిస్తున్నట్లుగా దర్శనమిచ్చింది. దూరంగా వర్షాకాలపు శీతల ఉషోదయంలో కొంతమంది పురుషులు ఉల్లాసంగా గుర్రాలను దౌడు తీయించటం గమనించాను. గొడుగులు పట్టుకొని ఉన్న మహిళలు, చిన్న పిల్లలు, వారి పెంపుడు కుక్కపిల్లలు అక్కడి పచ్చికలో ఆడుకుంటున్నట్లుగా కనిపిస్తున్నారు. ఆ తర్వాత వాళ్లు టిఫిన్‌ చేయటం కోసం గ్లెన్‌బర్న్‌కు వస్తారా? వస్తే కనుక వారి విహార యాత్రను ముగించటానికి పింక్‌ జిన్‌లు కచ్చితంగా ఒక అత్యంత సముచితమైన మార్గంగా ఉంటాయి. 

బెంగాల్‌ క్లబ్బు సభ్యులతో మాట్లాడటానికి నాకు ఆహ్వానం లభించింది. పంజాబీ ధాబాలా మారిపోయిన ఢిల్లీ జింఖానా క్లబ్‌కు భిన్నమైన ప్రపంచం అది. ఇక్కడి బ్రిటిష్‌ వాసనల్లోని గొప్ప ఆపేక్ష, అమితమైన శ్రద్ధ... ఆహ్లాదాన్ని కలిగి ఉన్నాయి.
క్లబ్బుకు వచ్చిన వారిలో షిఫాన్‌ చీరలు, ముత్యాల కంఠ హారాలు ధరించిన స్త్రీలు; చక్కగా ఇస్త్రీ చేసిన ప్యాంట్లు, హుందాగా ఉండే చొక్కాలు ధరించిన పురుషులు ఉన్నారు. ఎక్కడా కుర్తా–పైజమా కానీ, భద్రలోక్‌ ధోతీ కానీ కనిపించలేదు. వారికి బెంగాలీ భాష తెలుస నటంలో సందేహం లేదు కానీ, నాకు ఇంగ్లిష్‌ మాత్రమే విని పించింది... అచ్చంగా నైట్స్‌బ్రిడ్జ్‌ (లండన్‌)లో మాట్లాడిన విధంగా. 

మేము జనరల్‌ అవుట్రామ్‌ నిలువెత్తు తైలవర్ణ చిత్తరు వులోని ఆయన చురుకైన చూపుల కింద భోజనం చేశాం. క్లబ్బు పూర్వపు అధ్యక్షుడు ఆయన. ఇప్పుడైతే నిస్సందేహంగా కొత్త సభ్యత్వంపై ఒక కన్నేసి ఉంచేవారు. మెనూలోని ఆహార పదార్థాలు తప్పక ఆయన సమ్మతిని కలిగి ఉండేవి.  

అది రెండు వైన్‌లతో కూడిన నాలుగు వంటకాల భోజనం. తళతళ మెరుస్తున్న తెల్లటి చైనా ప్లేట్లకు రెండు వైపులా వెండితో చేసిన స్పూన్లు, ఫోర్కులు అందంగా అమర్చి ఉన్నాయి. క్యారెట్, సెలెరీ కాడల చారు, రాతి పీతలు, క్రాన్‌బెర్రీ జెల్లీలో మిగుల వేయించిన మాంసం ముక్కలు, చుట్టూతా పుదీనా సాస్‌ పోసి ఉన్న మృదువైన బ్రాందీ స్నాప్‌ గొట్టాలు భోజనం బల్లపై ఉన్నాయి. 

గాజు స్ఫటికాల లోటాలలో వచ్చిన జివ్వనిపించే చల్లని మద్యం, దానికి జతగా ఉన్న సన్నని ఆకుకూరల కాండాలతో మా సాయంత్రం ముగిసింది. ‘‘నేను వారానికి ఒకసారి బ్లెన్‌హైమ్‌(బ్రిటన్‌ రాజప్రాసాదం)లో భోజనం చేస్తాను’’ అని కర్జన్‌ గొప్పగా చెప్పుకున్న మాటను ఇది నాకు గుర్తు చేసింది. 

బ్రిటన్‌ మారిపోయింది కానీ, కలకత్తాలోని ఒక భాగం ధిక్కారంగా అలానే ఉండిపోయింది. ఆర్జీ కర్‌ ఆసుపత్రిలో జరిగిన విషా
దం, ఆ వెంబడి సామూహిక నిరసనలు, ముఖ్యమంత్రి అనిశ్చిత భవి ష్యత్తు... వీట న్నిటిపై చర్చలు, వాదాలు జరగటం అన్నది నిస్సందే హమే! అయినా, ఈ పరమ పావన గ్లెన్‌బర్న్, బెంగాల్‌ క్లబ్బు ఆవర ణల నుంచి చూస్తే అవి వేరే ప్రపంచానికి చెందినవిగా అనిపిస్తాయి.     

కాబట్టి, మీరు కనుక పొగలు కక్కుతున్న ఉడుకుడుకు తృణధాన్య ఆహారం, ఆ తర్వాత గిలకొట్టి వేయించిన గుడ్లు, ఊరబెట్టిన పంది మాంసంతో ఆదివారాలను ప్రారంభించేందుకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి అయుండి, ‘అమృత్‌ కాల్‌’తో నాకొచ్చేదేమిటని అనుకుంటూ ఉంటే నేను మీకు గ్లెన్‌బర్న్‌ను, బెంగాల్‌ క్లబ్బును సిఫారసు చేస్తాను. అక్కడ ఎల్లప్పుడూ సమయం నిశ్చలంగా ఉంటుందని మీరు దృఢంగా విశ్వసించవచ్చు. 

కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement