మనం నేర్చుకోవలసిన పాఠం | Sakshi Guest Column On Rishi Sunak Britain Conservative Party | Sakshi
Sakshi News home page

మనం నేర్చుకోవలసిన పాఠం

Published Mon, Oct 31 2022 12:06 AM | Last Updated on Mon, Oct 31 2022 12:30 AM

Sakshi Guest Column On Rishi Sunak Britain Conservative Party

బ్రిటన్‌ కన్జర్వేటివ్‌ పార్టీ నాయకుడిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ ఏకగ్రీవంగా ఎన్నికవడం, ఆ దేశ నూతన ప్రధాని కావడం గర్వించాల్సిన విషయమే. మరోవైపు, ఇది మన సొంత దేశం గురించి ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. సునాక్‌ ఎదిగివచ్చిన తీరు అద్భుతమైన పరిణామమే కావచ్చు కానీ, మన దేశం విషయం ఏమిటి? మన జనాభాలో 14.3 శాతం మంది ముస్లింలు ఉన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే లోక్‌సభలో ముస్లింలకు 74 సీట్లు ఉండాలి. కానీ పార్లమెంటులో 27 మంది ముస్లిం ఎంపీలే ఉన్నారు. ఒక్క ముస్లిం ముఖ్యమంత్రి కూడా లేరు.

15 రాష్ట్రాల్లో ఒక్కరంటే ఒక్క ముస్లిం మంత్రి లేరు. గుజరాత్‌లో అయితే 1988 నుంచి లోక్‌సభకు గానీ, శాసన సభకు గానీ ఒక్క ముస్లింని కూడా బీజేపీ నిలబెట్టలేదు. దేశంలో 20 కోట్లమంది ముస్లింలు ఉన్నారు. కానీ వారిని ఎక్కడా కనిపించకుండా చేశాం. ఈరోజు సునాక్‌ సాధించిన అద్భుతమైన విజయాన్ని చూసి గర్వపడుతున్నప్పుడు, భారత్‌లో ఒక ముస్లిం ప్రధాని అయ్యే అవకాశం ఉందా అని ఎందుకు ప్రశ్నించుకోకూడదు?

చివరకు పట్టాభిషేకం జరిగిపోయింది. అది కూడా దీపావళి రోజు జరగటం 42 సంవత్సరాల హిందూ భక్తుడికి వ్యక్తిగతంగా ఎంతో విలువైన విషయం అయివుంటుంది. అయితే, నేను భిన్న మైన అంశాన్ని చెప్పాలనుకుంటున్నాను. బ్రిటన్‌ కన్జర్వేటివ్‌ పార్టీ నాయకుడిగా రిషి సునాక్‌ ఏక గ్రీవంగా ఎన్నికవడం, ఆ విధంగా దేశ నూతన ప్రధాని కావడం, అది కూడా 200 సంవత్సరాల చరిత్రలో అతి పిన్నవయస్కుడిగా ప్రధాని కావడం అనేది నా రెండో ప్రీతిపాత్రమైన దేశం గురించి నేను గర్వపడేలా చేస్తోంది. ఇది మన సొంత దేశం గురించి ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. బ్రిటన్‌ నుంచి భారత్‌ స్పష్టమైన పాఠం నేర్చు కుంటుందా?

బ్రిటన్‌ ఏం చేసిందో ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఆ దేశంలోని జనాభాలో 6.8 శాతం మంది వివిధ ఆసియన్‌ జాతులకు చెందిన ప్రజలు న్నారు. వీరిలో 2.3 శాతం జనాభా భారతీయ మూలాలు కలిగి ఉన్నారు. ఇది చాలా చాలా చిన్న మైనారిటీ. అయినప్పటికీ, 1960లలో మాత్రమే దేశానికి పలసవచ్చిన తొలి తరం భారత సంతతి కుటుంబానికి చెందిన ఒక కుమారుడిని బ్రిటన్‌ 57వ ప్రధానమంత్రిగా కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీలు ఎన్నుకున్నారు. మన సొంత దేశంలో ఈ ఘటనపై వచ్చిన స్పందన ఎలా ఉంది అంటే, ఇలా జరి గిందా అనే అపనమ్మకం, అవును ఇలా జరిగిందనే సంతోషం రెండింటికీ అది రుజువుగా నిలుస్తోంది.

సునాక్‌ ఎదిగివచ్చిన తీరు అత్యంత అద్భుత మైన పరిణామమే కావచ్చు కానీ అది మాత్రమే పూర్తి కథ అని చెప్పలేం. బోరిస్‌ జాన్సన్‌ తొలి మంత్రివర్గం ఇరవై శాతం వరకు నల్లవారు లేదా ఆసియన్‌ మూలాలు కలిగివున్న వారితో కూడి ఉండింది. మునుపటి ప్రభుత్వంలోని నలుగురు ఛాన్సలర్‌లు, గత ప్రభుత్వ మంత్రివర్గాల్లోని ఇద్దరు హోం సెక్రటరీలు, లిజ్‌ ట్రస్‌ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రి – వీరందరూ బ్రిటన్‌కి వలస వచ్చిన కుటుంబాలకు చెందినవారే. ఇవన్నీ కూడా ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవులు. బహుశా వీటన్నింటికంటే ముఖ్యమైంది ఏమి టంటే, కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన 357 మంది ఎంపీల్లో 200 మందికి పైగా ఎంపీలు సునాక్‌ని బలపర్చడమే. సునాక్‌తో పోలిస్తే ఆయనతో పోటీ పడిన శ్వేత జాతి అభ్యర్థులు ఆయన దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. 

ఇప్పుడు మనం భారత్‌ వైపు చూద్దాం. మన జనాభాలో 14.3 శాతం మంది ముస్లింలు ఉన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే లోక్‌ సభలో ముస్లింలకు 74 సీట్లు ఉండాలి. కానీ పార్ల మెంటులో 27 మంది ముస్లిం ఎంపీలే ఉన్నారు. భారత్‌లోని 28 రాష్ట్రాల్లో ఒక్క ముస్లిం ముఖ్య మంత్రి కూడా లేరు. 15 రాష్ట్రాల్లో ఒక్క రంటే ఒక్క ముస్లిం మంత్రి కూడా లేరు. మరో 10 రాష్ట్రాల్లో ఒకే ఒకే ముస్లిం మంత్రి ఉన్నారు.

అది కూడా మైనారిటీ వ్యవహారాల మంత్రిగా మాత్రమే. 2014లో గానీ, 2019లో గానీ లోక్‌సభకు ఒక్క ఎంపీని కూడా బీజేపీ ఎన్నుకోలేదు. ఉత్తరప్రదేశ్‌లో ఇరవై శాతం జనాభా కలిగివున్న ముస్లింలకు ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా లేరు. 2017వ సంవత్స రంలో కూడా ఇదే పరిస్థితి. గుజరాత్‌లో అయితే 1988 నుంచి లోక్‌సభకు గానీ, శాసనసభకు గానీ ఒక్క ముస్లింని కూడా ఆ పార్టీ నిలబెట్టలేదు. అంటే 9 శాతం జనాభా ఇస్లామిక్‌ విశ్వాసం పాటిస్తున్న రాష్ట్రంలో 24 సంవత్సరాలుగా ఉద్దేశపూర్వకంగా వారిని దూరం పెట్టారన్న మాట.

నేను చెబుతున్న వాస్తవాలన్నీ ఆకార్‌ పటేల్‌ రాసిన ‘అవర్‌ హిందూ రాష్ట్ర’ పుస్తకం నుంచి ఉల్లే ఖించినవే. ఇది మరింత కలవరపెట్టే విషయాలను వెల్లడిస్తోంది. దేశంలో 15 శాతం ముస్లిం జనాభా ఉంటున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 4.9 శాతం మంది మాత్రమే ముస్లింలున్నారు. పారా మిలటరీ బలగాల్లో 4.6 శాతం మంది, ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్‌ సర్వీసుల్లో 3.2 శాతం మంది ముస్లింలు మాత్రమే ఉంటున్నారు. ఇక భారత సైన్యంలో అయితే అత్యంత తక్కువగా 1 శాతం ముస్లింలు మాత్రమే ఉండటం గమనార్హం. ఇది మనలను కలవరపర్చాల్సిన విషయం మరి.

దీనికి సంబంధించి బ్రిటన్‌లో మీడియా ఎంత భిన్నంగా ఉంటోందో నన్ను చెప్పనివ్వండి. ‘బీబీసీ’ ఛానల్‌కేసి చూడండి. అక్కడ పనిచేసేవారిలో ఆసి యన్‌ ముఖాలు ఎంత ఎక్కువగా ఉంటాయో చూసి మీరు షాక్‌ తింటారు. వారిలో కొన్ని పేర్లను మీరు చూడాలి మరి. మాథ్యూ అమ్రోలివాలా, గీతా గురుమూర్తి, జేమ్స్‌ కుమారస్వామి, జార్జ్‌ అలిగియా, నోమియా ఇక్బాల్, సమీరా హుస్సేన్, అమోల్‌ రాజన్, రజనీ వైద్యనాథన్, యోగితా లిమాయే, సికిందర్‌ కిర్‌మానీ, కమల్‌ అహ్మద్, ఫైజల్‌ ఇస్లామ్, దర్శిని డేవిడ్‌.

కాబట్టి, ఇప్పుడు బ్రిటన్‌ నుంచి భారత్‌ స్పష్టమైన పాఠాలు నేర్వవలసి ఉందని నేనెందుకు భావిస్తున్నానో మీకు అర్థమై ఉంటుంది. భారత్‌లో 20 కోట్లమంది ముస్లింలు ఉన్నారు. కానీ వారిని ఎక్కడా కనిపించకుండా చేశాం. వాళ్లను మనం చెదపురుగులు అని పిలుస్తాం. బాబర్‌ సంతానం అంటాం. అబ్బా జాన్‌ అని పేర్కొంటూ వారిని ఎగతాళి చేస్తాం. శ్మశాన్‌ ఘాట్, కబర్‌స్తాన్‌ మధ్య పోలికలు తీసుకొస్తూ వారిని కించపరుస్తాం. పైగా పాకిస్తాన్‌ వెళ్లిపోవాలని వారికి పదేపదే చెబు తుంటాం. కాబట్టి, ఈరోజు సునాక్‌ సాధించిన అద్భుతమైన విజయానికి గానూ మనం గర్వపడు తున్నప్పుడు, మనకేసి మనం ఎందుకు చూసు కోకూడదు? భారత్‌లో ఒక ముస్లిం ప్రధాని అయ్యే అవకాశం ఉందా అని ఎందుకు ప్రశ్నించు కోకూడదు? 

పైగా చాలామంది గుర్తించలేని కొత్త విరోధా భాస కూడా ఇక్కడ ఉంది. బ్రిటన్‌ గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేని మనలోని కొందరు బ్రిటిష్‌ వారు జాత్యహంకారులు అని ప్రకటించ డంలో మాత్రం ముందుంటారు. సునాక్‌ ప్రధాని కావడానికి చాలా కాలం క్రితమే వారు ఘోరమైన తప్పుడు అవగాహనతో ఉన్నట్టు. ఎందుకంటే, దేశంలో ముస్లింల పట్ల మనం వ్యవహరిస్తున్న తీరును విమర్శించడం అటుండనీ, కనీసం దాన్ని గుర్తించడానికి కూడా ఒప్పుకోరు. దానికి బదు లుగా ముస్లింల బుజ్జగింపు అని మాట్లాడటానికి ఇష్టపడతారు. 

సునాక్‌ విజయగాథ మనకు స్ఫూర్తిగా ఉండా లని నేను ప్రార్థిస్తాను. కానీ ఈ విషయంలో కూడా నాది తప్పు అని రుజువవుతుందేమో అని భయ పడుతున్నాను.
కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement