బ్రిటన్‌ రాజకీయాలు నేర్పుతున్న పాఠాలు | Sakshi Guest Column On Lessons taught by British politics | Sakshi
Sakshi News home page

బ్రిటన్‌ రాజకీయాలు నేర్పుతున్న పాఠాలు

Published Sun, Jul 14 2024 12:31 AM | Last Updated on Sun, Jul 14 2024 12:31 AM

Sakshi Guest Column On Lessons taught by British politics

కామెంట్‌

దాదాపు ఒక దశాబ్దకాలంగా మనం బలహీనమైన ఆర్థిక వ్యవస్థ, విశ్వసనీయత లేని రాజకీయ నాయకులు, నాణ్యమైనవి కాని మౌలిక సదుపాయాలు, క్రమంగా క్షీణిస్తున్న పాలనా ప్రతిష్ఠ... వంటివాటిని మాత్రమే బ్రిటన్‌ గురించి చూడడానికి అలవాటు పడుతూ వచ్చాము. అది మన తప్పు కాదు. కానీ ఇప్పుడు బ్రిటన్‌ను భిన్నంగా చూసే అవకాశం వచ్చింది. అలాగే ఇండియాలో మనం కూడా ఈసారి కొన్ని అమూల్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు. 

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ బహుశా ప్రపంచంలోనే అత్యంత బహుళ సాంస్కృతిక సమాజం. భారత సంతతికి చెందిన వ్యక్తి ఆ దేశానికి ప్రధానిగా పని చేశారు. ఇంకా అనేకమంది నల్లజాతీయులు లేదా ఆసియాకు చెందినవారు చాన్స్‌లర్లుగా, విదేశీ కార్యదర్శులుగా, హోమ్‌ శాఖ కార్యదర్శులుగా; స్కాట్లాండ్, వేల్స్, లండన్‌ల అధినేతలుగా ఉన్నారు. మిగతా ఏ దేశమూ ఇంతగా అపూర్వమైన స్థాయిలో వైవిధ్యాన్ని కలిగి ఉంటుందని నేను అనుకోను. 

గత సభలోని 10 శాతంతో పోల్చి చూస్తే ఇటీవల హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌కు ఎంపికైన ఎంపీలలో 13 శాతం మంది నల్లజాతీయులు / ఆసియన్లు లేదా మైనారిటీ జాతుల మూలవాసులే. వీరిలో 29 మంది భారత సంతతి వారు కాగా, 15 మంది పాకిస్తాన్‌కు చెందినవారు. 12 మంది సిక్కులు. అయితే బ్రిటన్‌ జనాభాలో ఆసియన్లు 8 శాతం మాత్రమే కాగా, నల్లజాతీయులు 4 శాతం, భారత సంతతివారు 3.1 శాతం, పాక్‌కి చెందినవారు 2.7 శాతం మాత్రమే. 

హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌తో పోల్చి చూసినప్పుడు.. భారతదేశ జనాభాలో దాదాపు 15 శాతంగా ఉన్న ముస్లింలు దామాషా ప్రకారం మన లోక్‌సభలో 74 మంది ఉండాలి. కానీ ఉన్నది 24 మందే. 2019లో వారి సంఖ్య 26. ఆ ముందు 2014లో 23. దేశంలోని 28 రాష్ట్రాల్లో మనకు ఒక్క ముస్లిం ముఖ్యమంత్రి కూడా లేరు. 15 రాష్ట్రాలలో ఒక్క ముస్లిం మంత్రి కూడా లేరు. 10 రాష్ట్రాలలో ఒక ముస్లిం ఉన్నారు కానీ, ఆ ఒక్కరూ ఉన్నది అల్పసంఖ్యాక వ్యవహారాలకు ఇన్‌ఛార్జిగా మాత్రమే!

ఇంకా చెప్పాలంటే, అధికార బీజేపీ పార్టీకి లోక్‌సభలో ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేరు. 20 శాతం ముస్లింలు ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో ఆ పార్టీకి శాసన సభలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా లేరు. 2017లో కూడా అంతే. గుజరాత్‌లో బీజేపీ 1998 నుండి లోక్‌సభ ఎన్నికల్లో గానీ, విధాన సభ ఎన్నికల్లో కానీ ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు. రాష్ట్రంలో 9 శాతం మంది ముస్లింలే అయినప్పటికీ ఒక పావు శతాబ్దం నుంచీ ఆ పార్టీ ముస్లిములతో ఉద్దేశపూర్వకమైన దూరాన్ని పాటిస్తోంది.  

మనం నేర్చుకోవలసిన చాలా భిన్నమైన రెండో పాఠం కూడా ఉంది. మీరు మీ పార్టీని ఎన్నడూ లేనంతగా ఘోర పరాజయం వైపు నడిపించినప్పుడు మీ స్పందన ఎలా ఉండాలన్నది. 

బ్రిటన్‌లో అయితే రిషీ సునాక్‌ రాజీనామా చేశారు. 12 గంటలు గడవక ముందే ఆయన అలా చేశారు. నిజానికి ఫలితాలింకా పూర్తిగా వెల్లడవక ముందే కన్జర్వేటర్‌లు తాము తిరిగి అధికారంలోకి రావాలంటే తామెలాంటి పార్టీగా ఉండాలన్న దానిపై బహిరంగంగా చర్చించటం ప్రారంభించారు. రానున్న వారాల్లో, నెలల్లో ఆ చర్చ మరింత తీవ్రతరం అవుతుంది. మొత్తం దేశం అందులో పాల్గొంటుంది. మీడియా ప్రశ్నిస్తుంది. రెచ్చగొడుతుంది. ఎంపీలు తగాదా పడతారు. వాదోపవాదాలు జరుగుతాయి. ఆశావహులు ముందుకు వస్తారు. వెనక్కు తగ్గుతారు. అనేకమంది వ్యక్తిగత ప్రతిష్ఠలు దెబ్బతింటాయి. పార్టీకి అది ఇబ్బందికరమైన పరిస్థితిగా పరిణమిస్తుంది. అయితే చివరికి ఒక కొత్త పార్టీ ఆవిర్భవిస్తుంది. 

ఇప్పుడొకసారి, 2014లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయంతో కుప్పకూలి పోయాక ఏం జరిగిందో చూద్దాం. ఎవరూ రాజీనామా చేయలేదు. పార్టీ తన భవిష్యత్తు గురించి చర్చించలేదు. సోనియా గాంధీ మరో మూడు సంవత్సరాలు అధ్యక్షురాలిగా కొనసాగి, చివరికి తన కుమారుడికి మార్గం ఏర్పరిచారు. గాంధీల కుటుంబానికి వెలుపలి వ్యక్తిని అధ్యక్షుడిని చేసే ఎన్నిక 2022 వరకు జరగలేదు. 

అప్పుడు కూడా శశిథరూర్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. పదేళ్ల తర్వాత ఈ రోజుకు కూడా ఆ పార్టీ గాంధీల గట్టి నియంత్రణలోనే ఉంది. మల్లికార్జున్‌ ఖర్గే అధ్యక్షుడే కావచ్చు, కానీ రాహులే కీలకమైన వ్యక్తి. సోనియా గాంధీ వార్ధక్యంలో ఉన్నా, అస్వస్థతతో ఉంటున్నా, పార్లమెంటులో మాట్లాడేందుకు అనాసక్తతను కనబరుస్తున్నా కూడా సోనియానే పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. 

మూడో పాఠం కూడా ఉంది కానీ నేను దానిని క్లుప్తంగా మాత్రమే ప్రస్తావిస్తాను. సునాక్‌ రాజీనామా చేసేందుకు ప్రధాని అధికారిక వాహనంలో బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌కు వెళ్లారు. రాజీనామా అనంతరం ప్రైవేటు వాహనంలో ప్యాలెస్‌ పక్క ద్వారం నుండి బయటికి నిష్క్రమించారు. ఒక గంట తర్వాత కొత్తగా ఎన్నికైన ప్రధాని స్టార్మర్‌ ప్రతిపక్ష నాయకుడి కారులో అక్కడికి వచ్చారు. 

ప్రధాన మంత్రిగా తన నియామకం జరిగాక ప్రధాని అధికారిక వాహనం లిమజీన్‌ కారులో 10, డౌనింగ్‌ స్ట్రీట్‌కు వెళ్లారు. ఆయన అక్కడికి చేరుకునే సమయానికి సునాక్‌ కుటుంబానికి చెందిన వస్తువుల్ని ప్యాక్‌ చేసి, తరలించారు. 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ కొత్త ప్రభుత్వాధినేతకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంది. 

ఇదంతా కూడా ఫలితాలు స్పష్టమైన కొద్ది గంటల్లోనే జరిగింది. వైభవోపేతమైన ప్రమాణ స్వీకారోత్సవం కోసం రాజ్యాంగ ప్రక్రియకు వాళ్లేమీ ఐదు రోజుల విరామం ఏమీ ఇవ్వలేదు. ఎన్నికలు ముగియటంతోనే పాలన ప్రారంభమై పోయింది. ప్రపంచంలోని కొత్త ప్రధానులందరూ వెంటనే పని మొదలు పెడతామని చెప్పినా, వాస్తవానికి బ్రిటన్‌ మాత్రమే ఆ పని చేయగలిగింది. 


కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement