kolkota
-
పాత ‘కలకత్తా’ మిగిలే ఉంది!
బెంగాలీ రాజధానిలో బ్రిటన్ రాచరికపు విశేషంగా కొన్ని చక్కటి అంశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ‘కలకత్తా’ నగరం నడిబొడ్డున, ఒకప్పుడు పార్క్ స్ట్రీట్‌గా వాడుకలో ఉన్న ప్రదేశానికి కొద్ది దూరాన... బ్రిటిష్ హయాంను గుర్తు చేసేలా ‘ద గ్లెన్‌బర్న్’ అనే ఒక ఆహ్లాదకరమైన చిన్న భోజనశాల ఉంది. బ్రిటన్ మారిపోయింది కానీ, కలకత్తాలోని ఈ ప్రదేశం ధిక్కారంగా నేటికీ అలానే ఉండిపోయింది. ఇటీవల ఆర్జీ కర్ ఆసుపత్రిలో జరిగిన విషాదం,ఆ వెంబడి సామూహిక నిరసనలు, ముఖ్యమంత్రి అనిశ్చిత భవిష్యత్తు... వీటన్నిటిపై చర్చలు, వాదనలు ఇక్కడ కూడా జరగకుండా లేవు. కానీ ఇక్కడి నుండి చూస్తే అవి వేరే ప్రపంచానికి చెందిన అంశాలుగా అనిపిస్తాయి.తొలి పరిచయంలోనే ఏర్పరచుకునే అభి ప్రాయాలు తప్పుదారి పట్టించేవిగా ఉండ వచ్చునని నేను అంగీకరిస్తాను. కానీ అవి చెరగని ముద్రలుగా కూడా నిలిచిపోగలవు. గత వారాంతపు నా ‘కలకత్తా’ పర్యటన విషయంలో ఇది నిశ్చయంగా వాస్తవం. నాకు ఆ నగరం గురించి ఏమంత తెలి యదు. కనీసం ఐదేళ్లుగా నేను ఆ నగరాన్ని సందర్శించిందే లేదు. అయితే, ఆ బెంగాలీ రాజధానిలో రాచరికపు విశేషంగా కొన్ని చక్కటి అంశాలు ఇంకా మిగిలే ఉన్నాయన్న ఒక కాదనలేని భావనకు నేను లోనయ్యాను. నేనక్కడ కలిసిన స్థానికులు కూడా ఇందుకు భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని అనుకోను. అందువల్లనే నేను ఆ నగరానికి ఉన్న ‘కలకత్తా’ అనే వలసరాజ్య నామాన్ని ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఉపయోగిస్తున్నాను. నగరం నడిబొడ్డున, ఒకప్పుడు పార్క్ స్ట్రీట్‌గా వాడుకలో ఉన్న ప్రదేశానికి కొద్ది దూరాన, అనాకమైనదిగా తప్ప మీరు గుర్తించని ఒక భవంతి... బ్రిటిష్ హయాంను గుర్తు చేసేలా ‘ద గ్లెన్‌బర్న్’ అనే ఒక ఆహ్లాదకరమైన చిన్న భోజనశాలను తనలో పొదవుకుని ఉంటుంది. ఒకసారి మీరు ఆ అసహ్యకరమైన పరిసరాలను, జీర్ణావస్థలో ఉన్న ప్రవేశ ద్వారాన్ని దాటుకుని లోపలికి వెళ్లారా... 7, 8 అంతస్థులలోని గతకాలపు విస్మృత ప్రపంచంలోకి అడుగు పెడతారు. గ్లెన్బర్న్లోని తొమ్మిది గదులలో రేఖాగణితం నమూనాలో డిజైన్ చేసిన చెక్క పలకల ఫ్లోరింగ్, షాండ్లియర్లు, కలపను మలిచి తీర్చిన సోఫాలు, వార్నిష్ పట్టిన ఒంపుకాళ్ల బల్లలు, వర్ణాలంకరణలను అచ్చు గుద్దిన పత్తి వస్త్రాల పరుపులు, ఇత్తడితో పటం కట్టిన పురాతన పూల కళాకృతులు ఉన్నాయి. అక్కడి విశాలమైన స్నానపు గదులు పాతకాలపు నాటి ఆధునిక శైలిలో రూపొందిన గాజు లోహపు తొట్టెలను కలిగి ఉన్నాయి. వాటిల్లో మీరు మునిగిపోవచ్చు. దేహాన్ని సాధ్యమైనంతగా సాగదీసుకోనూవచ్చు. సూర్యోదయపు తొలి కిరణాలు తొంగి చూసే అక్కడి ఒక గదిలో నేను మూడు రోజుల పాతదైన లండన్ టైమ్స్ దిన పత్రికను చదు వుతూ అల్పాహారం తీసుకున్నాను. అది మన ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ సమకాలీన సంచిక కన్నా మరింత సందర్భోచితంగా ఉన్నట్లు అనిపించింది. ‘లండన్ టైమ్స్’లోని కోర్ట్ సర్క్యులర్ శీర్షికలో ఆనాటి రాచ కార్యాల వివరాలు ప్రచురించి ఉన్నాయి. రాజు గారు బల్మోరల్ విహారంలో ఉన్నారు, బహుశా గ్రౌస్ పక్షుల్ని వేటాడటం కోసం. పేపర్ నుంచి తలెత్తి చూసినప్పుడు బయట విక్టోరియా మెమోరియల్ నా వైపు తదేకంగా చూస్తూ ఉండటాన్ని గమనించాను. (దాని నిర్మాణ స్ఫూర్తి సారథి) లార్డ్ కర్జన్ తన ప్రాతఃకాల కాఫీ సేవిస్తూ, ఇంతకంటే మెరుగైన దృశ్యాన్ని ఆశించివుండరు!ఇంకో వైపు నుంచి కలకత్తా మైదానం కనిపిస్తోంది. గత ఆదివారం అది హరితపత్రంలా, ఆహ్వానిస్తున్నట్లుగా దర్శనమిచ్చింది. దూరంగా వర్షాకాలపు శీతల ఉషోదయంలో కొంతమంది పురుషులు ఉల్లాసంగా గుర్రాలను దౌడు తీయించటం గమనించాను. గొడుగులు పట్టుకొని ఉన్న మహిళలు, చిన్న పిల్లలు, వారి పెంపుడు కుక్కపిల్లలు అక్కడి పచ్చికలో ఆడుకుంటున్నట్లుగా కనిపిస్తున్నారు. ఆ తర్వాత వాళ్లు టిఫిన్ చేయటం కోసం గ్లెన్బర్న్కు వస్తారా? వస్తే కనుక వారి విహార యాత్రను ముగించటానికి పింక్ జిన్లు కచ్చితంగా ఒక అత్యంత సముచితమైన మార్గంగా ఉంటాయి. బెంగాల్ క్లబ్బు సభ్యులతో మాట్లాడటానికి నాకు ఆహ్వానం లభించింది. పంజాబీ ధాబాలా మారిపోయిన ఢిల్లీ జింఖానా క్లబ్‌కు భిన్నమైన ప్రపంచం అది. ఇక్కడి బ్రిటిష్ వాసనల్లోని గొప్ప ఆపేక్ష, అమితమైన శ్రద్ధ... ఆహ్లాదాన్ని కలిగి ఉన్నాయి.క్లబ్బుకు వచ్చిన వారిలో షిఫాన్ చీరలు, ముత్యాల కంఠ హారాలు ధరించిన స్త్రీలు; చక్కగా ఇస్త్రీ చేసిన ప్యాంట్లు, హుందాగా ఉండే చొక్కాలు ధరించిన పురుషులు ఉన్నారు. ఎక్కడా కుర్తా–పైజమా కానీ, భద్రలోక్ ధోతీ కానీ కనిపించలేదు. వారికి బెంగాలీ భాష తెలుస నటంలో సందేహం లేదు కానీ, నాకు ఇంగ్లిష్ మాత్రమే విని పించింది... అచ్చంగా నైట్స్‌బ్రిడ్జ్ (లండన్)లో మాట్లాడిన విధంగా. మేము జనరల్ అవుట్రామ్ నిలువెత్తు తైలవర్ణ చిత్తరు వులోని ఆయన చురుకైన చూపుల కింద భోజనం చేశాం. క్లబ్బు పూర్వపు అధ్యక్షుడు ఆయన. ఇప్పుడైతే నిస్సందేహంగా కొత్త సభ్యత్వంపై ఒక కన్నేసి ఉంచేవారు. మెనూలోని ఆహార పదార్థాలు తప్పక ఆయన సమ్మతిని కలిగి ఉండేవి. అది రెండు వైన్లతో కూడిన నాలుగు వంటకాల భోజనం. తళతళ మెరుస్తున్న తెల్లటి చైనా ప్లేట్లకు రెండు వైపులా వెండితో చేసిన స్పూన్లు, ఫోర్కులు అందంగా అమర్చి ఉన్నాయి. క్యారెట్, సెలెరీ కాడల చారు, రాతి పీతలు, క్రాన్బెర్రీ జెల్లీలో మిగుల వేయించిన మాంసం ముక్కలు, చుట్టూతా పుదీనా సాస్ పోసి ఉన్న మృదువైన బ్రాందీ స్నాప్ గొట్టాలు భోజనం బల్లపై ఉన్నాయి. గాజు స్ఫటికాల లోటాలలో వచ్చిన జివ్వనిపించే చల్లని మద్యం, దానికి జతగా ఉన్న సన్నని ఆకుకూరల కాండాలతో మా సాయంత్రం ముగిసింది. ‘‘నేను వారానికి ఒకసారి బ్లెన్హైమ్(బ్రిటన్ రాజప్రాసాదం)లో భోజనం చేస్తాను’’ అని కర్జన్ గొప్పగా చెప్పుకున్న మాటను ఇది నాకు గుర్తు చేసింది. బ్రిటన్ మారిపోయింది కానీ, కలకత్తాలోని ఒక భాగం ధిక్కారంగా అలానే ఉండిపోయింది. ఆర్జీ కర్ ఆసుపత్రిలో జరిగిన విషాదం, ఆ వెంబడి సామూహిక నిరసనలు, ముఖ్యమంత్రి అనిశ్చిత భవి ష్యత్తు... వీట న్నిటిపై చర్చలు, వాదాలు జరగటం అన్నది నిస్సందే హమే! అయినా, ఈ పరమ పావన గ్లెన్‌బర్న్, బెంగాల్ క్లబ్బు ఆవర ణల నుంచి చూస్తే అవి వేరే ప్రపంచానికి చెందినవిగా అనిపిస్తాయి. కాబట్టి, మీరు కనుక పొగలు కక్కుతున్న ఉడుకుడుకు తృణధాన్య ఆహారం, ఆ తర్వాత గిలకొట్టి వేయించిన గుడ్లు, ఊరబెట్టిన పంది మాంసంతో ఆదివారాలను ప్రారంభించేందుకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి అయుండి, ‘అమృత్ కాల్’తో నాకొచ్చేదేమిటని అనుకుంటూ ఉంటే నేను మీకు గ్లెన్బర్న్ను, బెంగాల్ క్లబ్బును సిఫారసు చేస్తాను. అక్కడ ఎల్లప్పుడూ సమయం నిశ్చలంగా ఉంటుందని మీరు దృఢంగా విశ్వసించవచ్చు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
లక్షమంది సామూహిక గీతా పఠనం..ప్రధాని అభినందనలు!
కోల్‌కతాలోని పరేడ్ గ్రౌండ్లో ఈరోజు(ఆదివారం, డిసెంబరు 24) లక్ష మంది సామూహిక గీతా పఠనం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని అఖిల భారతీయ సంస్కృత పరిషత్, మతిలాల్ భారత్ తీర్థ సేవా మిషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొంటారని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ప్రధాని ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదని సమాచారం. ఈ కార్యక్రమం నిర్వహించడంపై ప్రధాని ప్రత్యేక సందేశం ద్వారా ప్రశంసించారు. కోల్‌కతాలోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ‘లోఖో కాంఠే గీతార్ పాఠ్’ కార్యక్రమం అభినందనీయమని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. మన సాంస్కృతిక వారసత్వం సంప్రదాయాలు, జ్ఞానం, తత్వశాస్త్రం, ఆధ్యాత్మిక మేధస్సు, సాంస్కృతిక వైవిధ్యం, సామరస్య సమ్మేళనాల మేళవింపు ఈ కార్యక్రమం అని ప్రధాని మోదీ కొనియాడారు. శ్రీమద్ భగవత్ గీత మహాభారత కాలం మొదలుకొని నేటి కాలం వరకూ మనందరికీ స్ఫూర్తినిస్తోంది. అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి గీత మనకు దిశానిర్దేశం చేస్తుందని, జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడాన్ని నేర్పుతుందని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. కాగా కోల్‌కతాలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి 300 మందికి పైగా సాధువులు కోల్‌కతా చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారంతా ముందుగా ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. కార్యక్రమ నిర్వహణకు 20 బ్లాకులను రూపొందించినట్లు నిర్వాహకుల్లో ఒకరైన స్వామి నిర్గుణానంద్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ రికార్డు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఎంపీలు, ఎమ్మెల్యేలకు నిర్వాహకులు ఆహ్వానాలు పంపారు. -
దేశంలోని తొలి సినిమాహాలు ఏది? ఏ సినిమాలు ఆడేవి?
‘ఈమధ్య మీరు ఏ సినిమా చూశారు?’ ఈ ప్రశ్నకు ప్రతి ఒక్కరి దగ్గరా సమాధానం ఉంటుంది. ఇందులో తేడా ఏమిటంటే ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెబుతారు. మరికొందరు తమ జ్ఞాపకాలను రిఫ్రెష్ చేసుకోవడానికి పాత సినిమాల గురించి ప్రస్తావిస్తారు. మొత్తం మీద దీనికి మంచి సమాధానమే దొరుకుతుంది. అయితే ఇదే సమయంలో దేశంలోనే మొదటి సినిమా థియేటర్ గురించిన వివరాలు తెలిస్తే ఎవరైనా కాసేపు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మనం భారతదేశంలోని మొట్టమొదటి సినిమా థియేటర్ గురించి తెలుసుకోబోతున్నాం. భారతదేశంలో నిర్మితమైన మొదటి సినిమా థియేటర్ చాప్లిన్ సినిమా. దీనిని ఎల్ఫిన్‌స్టోన్ పిక్చర్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ‘చాప్లిన్ సినిమా’ను 1907లో జమ్షెడ్జీ రామ్‌జీ మదన్ నిర్మించారు. ఆయన మదన్ థియేటర్స్ పేరుతో భారతదేశంలో మొదటి థియేటర్ చైన్ స్థాపించారు. ‘చాప్లిన్ సినిమా’.. 5/1, చౌరింగ్గీ ప్లేస్, కోల్‌కతా చిరునామాలో ఉండేది. జమ్షెడ్జీ రామ్‌జీ మదన్‌ను భారతదేశంలో చిత్ర నిర్మాణ పితామహునిగా పిలుస్తారు. మదన్ ఎల్ఫిన్‌స్టోన్ డ్రామా క్లబ్లో అసిస్టెంట్ బాయ్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఈ క్లబ్ ఎంతో విజయవంతమైంది. ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు సాగించింది. జమ్షెడ్జీ కలకత్తాలో స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో ప్రసిద్ధ నాటక థియేటర్ అయిన కొరింథియన్ హాల్‌ను కొనుగోలు చేశారు. 1902లో మైదాన్ చుట్టూ బయోస్కోప్ షోలను ఏర్పాటు చేశారు. చివరికి అతని ఆసక్తి సినిమా ప్రదర్శన వైపు మళ్లింది. 1907లో ఎల్ఫిన్‌స్టోన్ పిక్చర్ ప్యాలెస్‌ను ప్రారంభించారు. ఈ ప్యాలెస్‌కు తరువాతి కాలంలో మినర్వా అనే పేరు పెట్టారు ఇది హాలీవుడ్ చిత్రాలను ప్రదర్శించే ప్రసిద్ధ థియేటర్‌గా మారింది. థియేటర్ లాభాలను కాపాడుకునే ప్రయత్నంలో దీనిని చార్లీ చాప్లిన్ పేరు మీద ‘చాప్లిన్ సినిమా’ అనే పేరు పెట్టారు. అయితే ఈ థియేటర్‌ను పలు కారణాలతో 2003లో కూల్చివేశారు. ఇది కూడా చదవండి: ఫ్రాన్స్‌లో నల్లుల నకరాలు.. జనం పరేషాన్! -
నేతాజీకి అండగా నిలిచిన మహిళా సేనాని ఎవరు? ఆమె సేవలకు గుర్తుగా రైల్వే ఏం చేసింది?
ఒక వీధికి లేదా రహదారికి లేదా ఏదైనా ప్రదేశానికి ప్రముఖుల పేర్లు పెట్టడాన్ని మనం చూసేవుంటాం. ఇటువంటి గౌరవం అధికంగా మహనీయులైన పురుషులకే దక్కింది. భారతదేశంలోని దాదాపు ప్రతి ప్రాంతంలో మహాత్మా గాంధీ పేరు మీద ఏదో ఒక రహదారి తప్పకుండా ఉంటుంది. ఈ విషయంలో మహనీయులైన మహిళామణులకు అటువంటి గౌరవం దక్కడం తక్కువేనని చెప్పవచ్చు. తూర్పు రైల్వే కూడా చాలా కాలం పాటు ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చింది. అయితే, 1958లో ఈ విధానంలో మార్పును తీసుకువచ్చింది. భారతీయ రైల్వేలు దేశానికి చెందిన ఒక మహనీయురాలికి ఘన నివాళులర్పించాలని నిర్ణయించాయి. ఆ మహనీయురాలి పేరు మీద పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో ఒక స్టేషన్‌కు ‘బేలా నగర్ రైల్వే స్టేషన్’ అనే పేరు పెట్టారు. భారత చరిత్రలో ఇలాంటి గౌరవం పొందిన తొలి మహిళగా బేలా మిత్ర నిలిచారు. పశ్చిమ బెంగాల్‌లోని కొడలియాలోని సంపన్న కుటుంబంలో 1920లో జన్మించిన బేలా మిత్రను అమిత లేదా బేలా బోస్ అని కూడా పిలుస్తారు. ఆమె తండ్రి సురేంద్ర చంద్రబోస్. ఈయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్నయ్య. అంటే బేలా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ‘నేతాజీ’కి మేనకోడలు. 1941లో స్వాతంత్ర్య సంగ్రామ పోరాటం జరుగుతున్న సమయంలో నేతాజీని గృహనిర్బంధంలో ఉంచినప్పుడు, అక్కడి నుంచి ఆయన తప్పించుకునేందుకు బేలా ప్రధాన పాత్ర పోషించారు. చాలా చిన్న వయస్సులోనే బేలా స్వాతంత్ర్య పోరాటానికి అంకితమయ్యారు. ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఏ) ఏర్పడినప్పుడు ఆమె ‘ఝాన్సీ రాణి’ బ్రిగేడ్‌కు నాయకత్వం వహించారు. ఆమె భర్త హరిదాస్ మిశ్రా కూడా ఆమె మాదిరిగానే విప్లవకారుడు. ఐఎన్ఏ ప్రత్యేక కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు బేలాను అధికారులు కలకత్తాకు పంపారు. అక్కడ ఉంటూనే ఆమె స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, బేలా భర్త జైలు నుండి విడుదలయ్యారు. అతనితో పాటు అనేక మంది విప్లవకారులు విడుదలయ్యారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అయ్యారు. అదే సమయంలో రాజకీయాలకు దూరంగా ఉండాలని బేలా నిర్ణయించుకున్నారు. విభజన వల్ల జరిగిన హింసాకాండలో నష్టపోయిన వారికి సహాయం చేయాలని బేలా నిర్ణయించుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని శరణార్థులకు సహాయం చేయడానికి ఆమె 1947లో ‘ఝాన్సీ రాణి రిలీఫ్ టీమ్’ అనే సామాజిక సంస్థను ఏర్పాటు చేసి, బాధితులకు సేవలు అందించారు. 1952, జూలైలో ఆమె తన చివరి శ్వాస వరకు బాధితులకు సేవ చేస్తూనే ఉన్నారు. స్వాతంత్య్రోద్యమంలో విశేష సేవలు అందించినప్పటికీ బేలా పేరు చరిత్ర పుటలలో అంతగా కనిపించకపోవడం శోచనీయం. ఇది కూడా చదవండి: ఊహించని పరిస్థితుల్లో నాగసాకిపై అణుబాంబు? అమెరికా అసలు ప్లాన్ ఏమిటి? -
‘బాంబు.. బాంబు’ విమానంలో యువకుని కేకలు.. తరువాత జరిగిందిదే!
కోల్‌కతా నుంచి దోహా వెళుతున్న కతర్ ఎయిర్వేస్లో ఆ సమయంలో ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. విమానంలో ఉన్న ఒక యువకుడు ‘బాంబు.. బాంబు’ అంటూ పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. దీంతో క్రూ మెంబర్స్ ఈ విషయాన్ని సీఐఎస్ఎఫ్కు తెలియజేశారు. వెంటనే విమానంలో తనిఖీ చేపట్టారు. అయితే ఆ యవకుని తండ్రి అధికారులతో మాట్లాడుతూ తన కుమారుని మానసిక పరిస్థితి సరిగా లేదని తెలిపారు. వివరాల్లోకి వెళితే కతర్ ఎయిర్వేస్కు చెందిన క్యూఆర్541, విమానం కోల్‌కతా నుంచి దోహాకు బయలుదేరడంలో ఆలస్యం జరిగింది. ఒక యువకుడు విమానంలో బాంబు ఉందంటూ పెద్దగా కేకలుపెట్టాడు. విమానంలోని క్రూ మెంబర్స్ వెంటనే ఈ విషయాన్ని సీఐఎస్ఎఫ్కు చేరవేశారు. వెంటనే భద్రతా దళాలు పరుగుపరుగున వచ్చి, విమానంలోని ప్రయాణికులందరినీ కిందకు దించేశారు. వారు ఆ యువకుడిని ప్రశ్నించగా... ఎవరో తనతో విమానంలో బాంబు ఉందని చెప్పారని అన్నాడు. కాగా సీఐఎస్ఎఫ్ బృందం ఎయిర్‌క్రాఫ్ట్‌ను స్నిఫర్ డాగ్స్ సాయంతో తనిఖీ చేయించారు. ఇంతలో ఆ యువకుని తండ్రి అధికారులతో మాట్లాడుతూ తన కుమారుని మానసిక పరిస్థితి బాగోలేదని చెబుతూ, అందుకు సంబంధించిన ధృవపత్రాలను కూడా చూపించాడు. ఈ ఘటన కారణంగా విమానం బయలుదేరడంలో ఆలస్యం జరిగింది. బాంబు లేదని నిర్థారించాక ప్రయాణికులను తిరిగి విమానంలోకి అనుమతించారు. కాగా దీనికిముందు గత ఫిబ్రవరిలో హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్న విమానంలో బాంబు ఉందంటూ సూచన అందించింది. దీంతో ఆ విమానాన్ని లక్నోలోని చౌదరి చరణ్‌సింగ్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. తరువాత విమానంలో తనిఖీలు జరిపారు. అయితే విమానంలో ఎటువంటి బాంబు లభ్యంకాలేదు. ఈ ఘటనలో బాంబు ఉందంటూ వదంతులు వ్యాపింపజేసిన హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: ఆమె 18 ఏళ్ల తరువాత తన ఎల్కేజీ ఫ్రెండ్‌ను కనిపెట్టిందిలా.. -
పశ్చిమ బెంగాల్లో విషాదం, 11 మంది మృతి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రలోని మూడు జిల్లాల్లో సోమవారం పిడుగులు పడటంతో 11 మంది మృతి చెందారు, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పిడుగుపాటుకు బంకురా, పూర్బా బర్ధమాన్ జిల్లాల్లో ఐదుగురు మృతిచెందగా, హౌరా జిల్లాలో ఒకరు మరణించినట్లు అధికారులు తెలిపారు. వ్యవపాయ పనులు చేస్తుండగా పిడుగు పడటంతో మృతి చెందినట్లు తెలిపారు. హౌరా జిల్లాలోని బాగ్నన్ ప్రాంతంలో ఉరుములలో కూడిన పడుగుపాటుకు చెట్టు కింద ఉన్న ఓ రైతు మృతి చెందాడు. దక్షిణ బెంగాల్‌లోని కొన్ని చోట్ల మంగళవారం ఉరుములతో కూడిన వర్షం పడునుందని వాతావరణశాఖ తెలిపింది. -
ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మృతి
కోల్‌కతా: బెంగాలీ ప్రముఖ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ తపస్‌పాల్ (61) గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మంగళవారం ఉదయం నాలుగు గంటలకు కన్నుమూసినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. తపస్‌పాల్ తన కుమార్తెను చూడటానికి ముంబై వెళ్లి తిరిగి విమానంలో కొల్‌కతాకు వచ్చేటప్పుడు.. విమానాశ్రయంలో ఛాతిలో నొప్పి వస్తోందని సిబ్బందికి తెలిపారు. దీంతో ఆయనను జుహులోని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ.. తపస్‌పాల్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. గతంలో కూడా తపస్‌పాల్ గుండె జబ్బుల కారణంగా పలుమార్లు ఆస్పత్రి పాలయ్యారు. తపస్పాల్‌కు భార్య నందిని, కుమార్తె సోహిని పాల్ ఉన్నారు. కాగా తపస్‌పాల్ పశ్చిమ బెంగాల్‌లోని చందన్నగర్లో జన్మించారు. హూగ్లీ మొహ్సిన్ కాలేజీలో బయోసైన్స్ చదివారు. సినిమాల మీద మక్కువతో ..1980లో దర్శకుడు తరుణ్ మజుందార్ దర్శకత్వంలో తెరకెక్కిన దాదర్ కీర్తి సినిమాతో బెంగాలీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. పలు విజయవంతమైన సినిమాల్లో నటించారు. 1984లో తపస్‌పాల్.. మాధురీ దీక్షిత్‌తో కలిసి అబోద్ చిత్రంలో నటించారు. హిరెన్ నాగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా గుర్తింపు పొందారు. సినిమాల్లోనే కాకుండా తపస్‌పాల్ రాజకీయాల్లో కూడా రాణించారు. ఆయన తృణముల్ కాంగ్రెస్‌లో ఎంపీగా గెలిచి సేవలందించారు. -
కోల్‌కతాలో బాంబు పేలుడు
పశ్చిమబెంగాల్ : కోల్‌కతాలో బాంబు పేలుడు సోమవారం కలకలం రేపింది. కోల్‌కతాలోని కంటోన్మెంట్ రైల్వే లైన్ ఏరియాలో జరిగిన బాంబు పేలుడుతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనా స్థలంలో మరో 10 నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క సారిగా బాంబు పేలడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాగా బాంబు పేలుడుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్ బుర్రాబజార్‌లో అంటుకున్న మంటలు చూస్తుండగానే భారీగా విస్తరించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 30 ఫైరింజన్లతో ఏడెనిమిది గంటలపాటు శ్రమించి మంటలు ఆర్పివేశారు. రాత్రి వేళ మార్కెట్ ప్రాంతంలో జనం లేకపోవడం, సహాయక బలగాలు అప్రమత్తమై చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయించడంతో భారీ ప్రాణనష్టం తప్పినట్లు తెలుస్తోంది. విపత్తు నిర్వహణ బలగాలు సహాయక కార్యక్రమాలు చేపట్టాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.